Banana exports
-
‘సిగటోక’ చిత్తవ్వాలిక.. నివారణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ
సాక్షి, అమరావతి: అరటి పంటలో నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (సీడీపీ)ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్బీకే స్థాయిలో ఆగస్టు 2వ తేదీ నుంచి రైతులకు అవగాహన ఉద్యమం చేపట్టబోతోంది. రాష్టంలో 2.45 లక్షల ఎకరాల్లో అరటి పంట సాగవుతుండగా, అందులో సగానికి పైగా విస్తీర్ణం వైఎస్సార్, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం జిల్లాల పరిధిలోనే ఉంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో గ్రాండ్ నైన్ (జీ–9 పొట్టి పచ్చ అరటి), టిష్యూ కల్చర్ రకాలు సాగవుతుంటే.. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కర్పూరం, చక్కరకేళి వంటి రకాలు సాగవుతుంటాయి. రాయలసీమలో సాగయ్యే రకాలకే విదేశాల్లో డిమాండ్ ఎక్కువ. ఈ ఏడాది కనీసం 65 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది 48 వేల టన్నులు ఎగుమతి చేయగా.. ఈ ఏడాది 55 వేల టన్నుల అరటిని ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆందోళన కలిగిస్తున్న సిగటోక తెగులు గతంలో గోదావరి, కృష్ణా జిల్లాల్లో సాగయ్యే అరటి రకాలకు సోకే సిగటోక (ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, పొగాకు తెగులు) ఇప్పుడు రాయలసీమలోనూ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్లుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ తెగులు వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం మొక్క దశలో ఉన్న జీ–9, టిష్యూ కల్చర్ అరటి రకాలకు ఈ తెగులు సోకుతోంది. వాతావరణంలో తేమ 90 శాతం కన్నా అధికంగా ఉండి, ఉష్ణోగ్రత 25 నుంచి 26 డిగ్రీలు వరకు ఉన్నప్పుడు, అరటి ఆకులు 6 నుంచి 10 గంటల పాటు తడిగా ఉన్నప్పుడు ఈ తెగులు సోకుతుంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల సోకే ఈ తెగులు వల్ల ఆకులపై తొలుత పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రోజుల్లోనే అవి బూడిద రంగులోకి.. ఆ తర్వాత క్రమేపీ పెరుగుతూ గోధుమ రంగులోకి మారి ఒక దానితో ఒకటి కలిసిపోవడం వల్ల ఆకులు ఎండిపోతాయి. ఇలా జరగడం వల్ల కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన పచ్చదనం లేక కాయసైజు, నాణ్యత తగ్గిపోవడంతోపాటు గెలలు పక్వానికి రాకముందే పండిపోతాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఆగస్టు 2వ తేదీ నుంచి రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో నెల రోజుల పాటు అరటి పండించే ప్రతి గ్రామంలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ తెగులు సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సోకితే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఆర్బీకే పరిధిలోని ప్రతి రైతుకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తారు. పాటించాల్సిన జాగ్రత్తలివీ.. అరటి తోటలో కలుపు లేకుండా.. నీరు నిలబడకుండా చూసుకోవాలి. సిఫార్సు చేసిన దూరంలో అంటే జీ–9 రకాన్ని 1.8 ఇన్‌టూ 1.8 మీటర్ల దూరంలోనూ, తెల్ల చక్కెరకేళి, అమృతపాణి, కర్పూర చక్కెరకేళి వంటి రకాలను 2 ఇన్‌టూ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. తల్లి మొక్క చుట్టూ వచ్చే పిలకలను, మొక్క చుట్టూ ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేయాలి. ట్రైకోడెర్మావిరిడి లేదా సూడోమోనాస్ లేదా బాసిల్లస్ వంటి జీవ శిలీంధ్రాలను వేపనూనెతో కలిపి పాదులు, చెట్టు ఆకులు మొత్తం తడిసేలా 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. నివారణా చర్యలు సిగటోక తెగులు వ్యాప్తి మొదలైనప్పుడు ప్రొపికోనజోల్ (1 ఎంఎల్), మినరల్ ఆయిల్ (10 ఎంఎల్)ను లీటర్ నీటిలో కలిపి ఆకులు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. ఈ మందును 25 రోజుల వ్యవధిలో మూడు సార్లు, ఉధృతి అధికంగా ఉంటే 5–7 సార్లు చేయాలి. గెలలు కోయడానికి 45 రోజుల ముందుగా ఎలాంటి మందులను పిచికారీ చేయకూడదు. మొదటి పిచికారీలో ప్రోపికోనజోల్ (1ఎంఎల్–లీటర్ నీటికి)ను, రెండో పిచికారీలో కార్బండిజమ్, మాంకోజబ్ (1 గ్రాము/లీటర్ నీటికి), మూడో పిచికారిలో ట్రైప్లోక్సిస్ట్రోబిన్, టేబ్యుకోనజోల్ మిశ్రమ మందు (1.4 గ్రా./లీటర్ నీటికి), నాలుగో పిచికారీలో డైపాన్కొనజోల్ (1ఎం.ఎల్/లీటర్ నీటికి) కలిపి పిచికారీ చేయాలి. ఇదీ చదవండి: నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి -
అరటి ఎగుమతుల్లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: అరటి ఎగుమతుల్లో అనూహ్య ప్రగతి సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు 2020వ సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. తమిళనాడు తిరుచిరాపల్లిలోని భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్) అనుబంధ అరటి పరిశోధన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కిసాన్ మేళాలో రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదురి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీని వెనుక రైతుల ఆసక్తి, ఉద్యాన శాఖ సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. వివరాలు చిరంజీవి చౌదురి మాటల్లోనే.. – అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఐదేళ్ల కిందట 79 వేల హెక్టార్లకే పరిమితమైన అరటి సాగు ఇప్పుడు 1.05 లక్షల హెక్టార్లకు చేరింది. – దిగుబడిలోనూ మన రైతులు గణనీయమైన పురోగతి సాధించారు. 2014–15లో హెక్టార్‌కు 44 టన్నులుగా ఉన్న దిగుబడి 2019 నాటికి 60 టన్నులకు చేరింది – టిష్యూ కల్చర్ ల్యాబ్స్, మైక్రో ఇరిగేషన్, ఫలదీకరణలో కొత్త పోకడలతో అరటి సాగుతో పాటు ఉత్పాదకత, ఉత్పత్తి రెండూ పెరిగాయి. టిష్యూ కల్చర్ వచ్చిన తర్వాత సుమారు 50 శాతం మేర సాగు విస్తీర్ణం పెరిగింది. – మరోవైపు ఉద్యాన శాఖ రైతులకు అనుకూల విధానాలను అమలు చేసింది. కాయ కోత, కోత అనంతర జాగ్రత్తలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవోల) ఏర్పాటు, ప్యాక్ హౌస్‌ల నిర్మాణం వంటి వాటితో రైతులకు మేలు చేకూర్చింది. – ఎఫ్‌పీవోలను క్రియాశీలకంగా మార్చి బనానా క్లస్టర్లను నెలకొల్పి ఎగుమతులకు అనువైన కాయల్ని ఎలా తీర్చిదిద్దాలో నేర్పించింది. – దీంతో మధ్య తూర్పు దేశాలైన ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, బహ్రెయిన్, యూఏఈ దేశాలు ఆంధ్రప్రదేశ్ అరటి పండ్లపై ఆసక్తి చూపడంతో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. – లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో ప్రస్తుతం ఎగుమతులు ఊపందుకున్నాయి. 75కి పైగా ఎఫ్‌పీవోలు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాయి. – 2016–17లో 246 టన్నులుగా ఉన్న ఎగుమతులు 2019–20 నాటికి 55 వేల టన్నులకు చేరాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టిన ప్రాజెక్టుల వల్ల రైతులకు హెక్టార్‌కు అదనంగా రూ.2.90 లక్షల ఆదాయం వస్తోంది. -
గల్ఫ్ దేశాలకు ‘అనంత’ అరటి ఎగుమతి
సాక్షి, అనంతపురం: నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లే అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండలం కడవకల్లులో అరబ్ దేశాలకు అరటి ఎగుమతి చేసే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం గురువారం శ్రీకారం చుట్టింది. ఈ ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటెయినర్ల ద్వారా విదేశాలకు అరటి సరఫరాను దేశంలోనే మొట్టమొదటి సారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. (అరబ్ దేశాలకు ‘అనంత’ అరటి) దీని వల్ల పండ్ల తోటల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది యాభై వేల టన్నుల అరటి ఎగుమతి చేస్తామని ఆయన వెల్లడించారు. అన్ని రకాల పండ్లకు దీన్ని విస్తరిస్తామని కన్నబాబు పేర్కొన్నారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మట్లాడుతూ.. కరవు జిల్లా అయిన అనంతపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పండ్ల తోటల రైతులంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పద్మావతి పిలునిచ్చారు. -
రూపు మార్చితేనే రూకలు!
వ్యవసాయ సంక్షోభ సాగరాన్ని రైతు సజావుగా దాటెయ్యాలంటే.. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడం ఒక్కటే చాలదు! పండించిన పండ్లను అయినకాడికి అమ్మితే రైతుకు గిట్టుబాటు కాదు. వాటిని ఎండబెట్టో, వివిధ రకాల ఉత్పత్తులుగా తయారుచేసో అమ్మితే ఆదాయం పెరుగుతుంది. స్థానిక మార్కెట్లకే పరిమితం కాకుండా.. ఇతర రాష్ట్రాలకో, విదేశాలకో ఎగుమతి చేయాలి. ఇవన్నీ నేర్చుకోవాలన్నా, ఆచరణలోకి తేవాలన్నా ఒంటరి రైతులకున్న శక్తి సామర్థ్యాలు చాలవు. ఆరుగాలం చమటోడ్చి ఆశల దిగుబడులు తీసే అన్నదాతలు సహకార సంఘాలుగా ఏర్పడితే అధికాదాయాన్నిచ్చే మెరుగైన ప్రత్యామ్నాయాలు వెతకడం అసాధ్యమేమీ కాదనడానికి రుజువులెన్నో... కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు అరటి రైతుల క్లబ్‌కు చెందిన 20 మంది సభ్యుల బృందం అటువంటి వెలుగుదారులనే వెతుకుతోంది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఇటీవల పర్యటించింది. అరటి ఆధారిత ఉత్పత్తుల తయారీ, విదేశాలకు ఎగుమతులపై ఈ బృందం అధ్యయనం చేసింది. ఈ రైతు విజ్ఞాన యాత్రలకు నాబార్డ్ ఆర్థిక సాయమందించింది. రైతు బృందాల యాత్రలు కొత్తకాకపోయినప్పటికీ.. చైతన్యవంతులైన ఈ అరటి రైతుల సంఘటిత మహాప్రయత్నం ఇతర ప్రాంతాల రైతులు, ఇతర పంటల రైతులకూ వెలుగుబాట కావాలని ‘సాక్షి’ ’సాగుబడి’ ఆశిస్తోంది. ఎండు (డ్రై) అరటి, సేంద్రియ అరటి పండ్ల ఎగుమతితో అధికాదాయం పొరుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ కొత్తదారులు వెతుకుతున్న రైతులు టమోటాలను పారబోసే బదులు.. ఒరుగులు, పొడిగా మార్చితే మేలంటున్న శాస్త్రవేత్తలు ఎండు అరటి ఎగుమతి మేలు అరటి తోటలో గెలలు కిందకు దించగానే మార్కెట్‌కు తరలించి విక్రయిస్తుంటారు. ఆలస్యమైతే కాయలపై మచ్చలు వచ్చి నాణ్యత పడిపోతుందనే బెంగ రైతును వెంటాడుతుంటుంది. అయితే, అరటి కాయలను ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెడితే ఆ బాధ ఉండదు. మంచి ధరకు అమ్ముకోవచ్చునని రుజువు చేస్తున్నారు తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తొట్టాయం రైతులు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు అరటి రైతుల క్లబ్ సభ్యుల బృందం ఇటీవల తొట్టాయం వెళ్లి సుబ్రహ్మణ్యన్ అనే రైతు సోలార్ డ్రయ్యర్‌తో అరటి కాయలను ఎండబెడుతున్న తీరును పరిశీలించింది. జర్మనీ అగ్రికల్చర్ బ్యాంక్ ఆర్ధిక సాయంతో సోలార్ డ్రయ్యర్‌ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. సౌర విద్యుత్‌తో నడిచే నీటిపంపు ద్వారా బిందు సేద్యం చేస్తుండడం సుబ్రహ్మణ్యన్ ప్రత్యేకత. నెలకు 2 టన్నుల డ్రై అరటి ఎగుమతి తొట్టాయం నుంచి నెలకు 2 టన్నుల ఎండు అరటిపండ్లు ఫిలిప్పీన్స్, శ్రీలంక, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. తిరుచ్చిలోని జాతీయ అరటి పరిశోధనా స్థానాన్ని కూడా రైతుల బృందం సందర్శించి శాస్త్రవేత్త డాక్టర్ కుమార్ ద్వారా అరటి సాగులో సరికొత్త విధానాలను రైతులు తెలుసుకున్నారు. అరటి నారతో చాపలు, మ్యాట్లు, అలంకరణ వస్తువుల తయారీని పరిశీలించారు. అరటి పండుతో డ్రింక్, బిస్కెట్లు, చాక్లెట్లు, వైన్, జామ్, జ్యూస్ తయారీ తీరును అధ్యయనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అనువైన కో-1, రసాలి, నైంద్రన్, కర్పూర అరటి రకాల సాగు వివరాలను ఆకళింపు చేసుకున్నారు. సేంద్రియ అరటి ఎగుమతితో 3 రెట్ల రాబడి గుజరాత్ నౌసారిక్ ప్రాంతంలో సేంద్రియ అరటి రైతులు సహకార సంఘంగా ఏర్పడి సంఘటిత శక్తిని చాటుతున్నారు. గ్రాండ్నైన్ రకం అరటి పండ్లను సేంద్రియ పద్ధతుల్లో పండించి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తూ అధిక లాభాలార్జిస్తున్నారు. అక్కడి విక్రమ్ దేశాయ్ అనే రైతు అరటితోటల్ని చాగంటిపాడు అరటి రైతుల క్లబ్ సభ్యుల బృందం ఇటీవల సందర్శించింది. నేస్తం స్వచ్ఛంద సంస్థ జిల్లా డెరైక్టర్ వీసం సురేష్ ఆధ్వర్యాన ఈ యాత్ర సాగింది. అరటి తోటలను రైతులు ఆర్నెల్లు పెంచిన తర్వాత ‘దేశాయి’ అనే ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారు. వారు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల మేరకు ప్రత్యేక శ్రద్ధతో తోటలను పెంచుతారు. అరటి కాయలకు మచ్చలు పడకుండా ఉండేందుకు రంధ్రాలున్న పాలిథిన్ సంచుల్ని గెలలకు తొడుగుతారు. గెలలను కాకుండా నైలాన్ దారంతో హస్తాలనే కోసి, సబ్బుతో రుద్ది కడిగి శుభ్రం చేస్తారు. పాలిథిన్ కవర్లలో పెట్టిప్రత్యేక అట్టపెట్టెల్లో ప్యాక్చే సి శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. దేశాయి సంస్థ నుంచి ఆన్లైన్ ద్వారా గల్ఫ్ దేశాలు అరటి కాయలను విరివిగా కొనుగోలు చేస్తున్నాయి. ఏడాదిలోఎకరానికి రూ. 60 వేలు ఖర్చవుతోందని, రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తున్నదని విక్రమ్ దేశాయ్ తెలుగు రైతు బృందానికి చెప్పారు. కిలో రూ.11.70 చొప్పున 40 కిలోల గెలను రూ.468లకు అమ్ముతున్నామన్నారు. తాము అమ్ముతున్న ధరకు ఇది మూడు రెట్లని రైతు బృంద సభ్యులు తెలిపారు. అధిక దిగుబడి సాధించడంతోపాటు రైతులు మార్కెటింగ్‌లోనూ ముందుండాలన్న లక్ష్యంతోనే ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి రైతులకు శిక్షణ ఇప్పిస్తున్నామని ‘నేస్తం’ స్వచ్ఛంద సంస్థ కృష్ణా జిల్లా డెరైక్టర్ వీసం సురేష్ తెలిపారు. అరటి ఉత్పత్తుల యూనిట్లు నెలకొల్పడానికి బ్యాంకు రుణాలిప్పించేందుకు నాబార్డ్ ఏజీఎం ఎన్.మధుమూర్తి సంసిద్ధత తెలిపారు. రెండు రాష్ట్రాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరిన రైతులు అరటి ఉత్పత్తుల తయారీ దిశగా కదులుతుండడం శుభసూచకం. - అయికా రాంబాబు, గుడ్లవల్లేరు, కృష్ణా జిల్లా అరటి నార తీసే యంత్రం కొన్నాం తిరుచ్చి(తమిళనాడు)లో అరటి నుంచి తయారయ్యే వివిధ ఉత్పత్తులను చూసిన తర్వాత అరటి పీచు తీసే యంత్రాన్ని కొన్నాం. ఉప ఉత్పత్తుల్ని తయారుచేస్తే మరింత లాభదాయకంగా ఉంటుందని తెలుసుకున్నాం. - చంద్రమోహనరెడ్డి (94915 85202) ముఖ్య సమన్వయకర్త, అరటి రైతుల క్లబ్, చాగంటిపాడు, కృష్ణా జిల్లా డ్రై అరటి లాభసాటి! అరటి కాయలను ఎండబెడితే.. కోరుకున్న ధర వచ్చేంత వరకూ నిల్వ ఉంచవచ్చు. ఇది రైతుకు లాభసాటిగా ఉంటుంది. రైతు సుబ్రహ్మణ్యన్ సౌర విద్యుత్తుతోనే డ్రయ్యర్‌ను, సాగు నీటి పంపును నడపడం ఒకెత్తయితే, విదేశాలకు ఎగుమతి చేయడం మరో ఎత్తు. - గుత్తా రాము (94901 79306) పీఏసీఎస్ అధ్యక్షుడు, తోట్లవల్లూరు సేంద్రియ అరటి పండ్ల ఎగుమతి బాగుంది! గుజరాత్లో అరటి రైతులు సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పండ్లు పండించి ఎగుమతి చేస్తుండడం నచ్చింది. గ్రాండ్నైన్ రకం మన దగ్గర కూడా బాగా పండుతుంది. - జె.రామ్మోహనరెడ్డి (94402 42205) మాజీ సర్పంచ్, దేవరపల్లి, తోట్లవల్లూరు మండలం అరటి ఉత్పత్తులు అమోఘం అరటి నారతో తయారు చేస్తున్న ఉత్పత్తులు అమోఘంగా ఉన్నాయి. అరటి పండుతో డ్రింక్, అరటి బిస్కెట్లు, చాక్లెట్లు, వైన్, జామ్, జ్యూస్ పరిశ్రమలపై శిక్షణ పొందడం ఉత్సాహాన్నిచ్చింది. - ఎ.శ్రీనివాసరెడ్డి (94924 88845) బద్రిరాజుపాలెం, తోట్లవల్లూరు మండలం, కృష్ణా జిల్లా