రూపు మార్చితేనే రూకలు! | Dried banana export benefit | Sakshi
Sakshi News home page

రూపు మార్చితేనే రూకలు!

Published Wed, Nov 26 2014 11:18 PM | Last Updated on Fri, Oct 19 2018 7:14 PM

రూపు  మార్చితేనే  రూకలు! - Sakshi

రూపు మార్చితేనే రూకలు!

వ్యవసాయ సంక్షోభ సాగరాన్ని రైతు సజావుగా దాటెయ్యాలంటే.. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడం ఒక్కటే చాలదు! పండించిన పండ్లను అయినకాడికి అమ్మితే రైతుకు గిట్టుబాటు కాదు. వాటిని ఎండబెట్టో, వివిధ రకాల ఉత్పత్తులుగా తయారుచేసో అమ్మితే ఆదాయం పెరుగుతుంది. స్థానిక మార్కెట్లకే పరిమితం కాకుండా.. ఇతర రాష్ట్రాలకో, విదేశాలకో ఎగుమతి చేయాలి. ఇవన్నీ నేర్చుకోవాలన్నా, ఆచరణలోకి తేవాలన్నా ఒంటరి రైతులకున్న శక్తి సామర్థ్యాలు చాలవు. ఆరుగాలం చమటోడ్చి ఆశల దిగుబడులు తీసే అన్నదాతలు సహకార సంఘాలుగా ఏర్పడితే అధికాదాయాన్నిచ్చే మెరుగైన ప్రత్యామ్నాయాలు వెతకడం అసాధ్యమేమీ కాదనడానికి రుజువులెన్నో... కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు అరటి రైతుల క్లబ్‌కు చెందిన 20 మంది సభ్యుల బృందం అటువంటి వెలుగుదారులనే వెతుకుతోంది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఇటీవల పర్యటించింది. అరటి ఆధారిత ఉత్పత్తుల తయారీ, విదేశాలకు ఎగుమతులపై ఈ బృందం అధ్యయనం చేసింది. ఈ రైతు విజ్ఞాన యాత్రలకు నాబార్డ్ ఆర్థిక సాయమందించింది. రైతు బృందాల యాత్రలు కొత్తకాకపోయినప్పటికీ.. చైతన్యవంతులైన ఈ అరటి రైతుల సంఘటిత మహాప్రయత్నం ఇతర ప్రాంతాల రైతులు, ఇతర పంటల రైతులకూ వెలుగుబాట కావాలని ‘సాక్షి’ ’సాగుబడి’ ఆశిస్తోంది.
 
ఎండు (డ్రై) అరటి, సేంద్రియ అరటి పండ్ల ఎగుమతితో అధికాదాయం
 
పొరుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ కొత్తదారులు వెతుకుతున్న రైతులు
 
టమోటాలను పారబోసే బదులు.. ఒరుగులు, పొడిగా మార్చితే మేలంటున్న శాస్త్రవేత్తలు
 
ఎండు అరటి ఎగుమతి మేలు
 
అరటి తోటలో గెలలు కిందకు దించగానే మార్కెట్‌కు తరలించి విక్రయిస్తుంటారు. ఆలస్యమైతే కాయలపై మచ్చలు వచ్చి నాణ్యత పడిపోతుందనే బెంగ రైతును వెంటాడుతుంటుంది. అయితే, అరటి కాయలను ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెడితే ఆ బాధ ఉండదు. మంచి ధరకు అమ్ముకోవచ్చునని రుజువు చేస్తున్నారు తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తొట్టాయం రైతులు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు అరటి రైతుల క్లబ్ సభ్యుల బృందం ఇటీవల తొట్టాయం వెళ్లి సుబ్రహ్మణ్యన్ అనే రైతు సోలార్ డ్రయ్యర్‌తో అరటి కాయలను ఎండబెడుతున్న తీరును పరిశీలించింది. జర్మనీ అగ్రికల్చర్ బ్యాంక్ ఆర్ధిక సాయంతో సోలార్ డ్రయ్యర్‌ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. సౌర విద్యుత్‌తో నడిచే నీటిపంపు ద్వారా బిందు సేద్యం చేస్తుండడం సుబ్రహ్మణ్యన్ ప్రత్యేకత.

నెలకు 2 టన్నుల డ్రై అరటి ఎగుమతి

తొట్టాయం నుంచి నెలకు 2 టన్నుల ఎండు అరటిపండ్లు ఫిలిప్పీన్స్, శ్రీలంక, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. తిరుచ్చిలోని జాతీయ అరటి పరిశోధనా స్థానాన్ని కూడా రైతుల బృందం సందర్శించి శాస్త్రవేత్త డాక్టర్ కుమార్ ద్వారా అరటి సాగులో సరికొత్త విధానాలను రైతులు తెలుసుకున్నారు. అరటి నారతో చాపలు, మ్యాట్‌లు, అలంకరణ వస్తువుల తయారీని పరిశీలించారు. అరటి పండుతో డ్రింక్, బిస్కెట్లు, చాక్లెట్లు, వైన్, జామ్, జ్యూస్ తయారీ తీరును అధ్యయనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అనువైన కో-1, రసాలి, నైంద్రన్, కర్పూర అరటి రకాల సాగు వివరాలను ఆకళింపు చేసుకున్నారు.

సేంద్రియ అరటి ఎగుమతితో 3 రెట్ల రాబడి

గుజరాత్ నౌసారిక్ ప్రాంతంలో సేంద్రియ అరటి రైతులు సహకార సంఘంగా ఏర్పడి సంఘటిత శక్తిని చాటుతున్నారు. గ్రాండ్‌నైన్ రకం అరటి పండ్లను సేంద్రియ పద్ధతుల్లో పండించి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తూ అధిక లాభాలార్జిస్తున్నారు. అక్కడి విక్రమ్ దేశాయ్ అనే రైతు అరటితోటల్ని చాగంటిపాడు అరటి రైతుల క్లబ్ సభ్యుల బృందం ఇటీవల సందర్శించింది. నేస్తం స్వచ్ఛంద సంస్థ జిల్లా డెరైక్టర్ వీసం సురేష్ ఆధ్వర్యాన ఈ యాత్ర సాగింది. అరటి తోటలను రైతులు ఆర్నెల్లు పెంచిన తర్వాత ‘దేశాయి’ అనే ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారు. వారు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల మేరకు ప్రత్యేక శ్రద్ధతో తోటలను పెంచుతారు. అరటి కాయలకు మచ్చలు పడకుండా ఉండేందుకు రంధ్రాలున్న పాలిథిన్ సంచుల్ని గెలలకు తొడుగుతారు. గెలలను కాకుండా నైలాన్ దారంతో హస్తాలనే కోసి, సబ్బుతో రుద్ది కడిగి శుభ్రం చేస్తారు. పాలిథిన్ కవర్లలో పెట్టిప్రత్యేక అట్టపెట్టెల్లో ప్యాక్‌చే సి శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. దేశాయి సంస్థ నుంచి ఆన్‌లైన్ ద్వారా గల్ఫ్ దేశాలు అరటి కాయలను విరివిగా కొనుగోలు చేస్తున్నాయి. ఏడాదిలోఎకరానికి రూ. 60 వేలు ఖర్చవుతోందని, రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తున్నదని విక్రమ్ దేశాయ్ తెలుగు రైతు బృందానికి చెప్పారు. కిలో రూ.11.70 చొప్పున 40 కిలోల గెలను రూ.468లకు అమ్ముతున్నామన్నారు. తాము అమ్ముతున్న ధరకు ఇది మూడు రెట్లని రైతు బృంద సభ్యులు తెలిపారు.

అధిక దిగుబడి సాధించడంతోపాటు రైతులు మార్కెటింగ్‌లోనూ ముందుండాలన్న లక్ష్యంతోనే ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి రైతులకు శిక్షణ ఇప్పిస్తున్నామని ‘నేస్తం’ స్వచ్ఛంద సంస్థ కృష్ణా జిల్లా డెరైక్టర్ వీసం సురేష్ తెలిపారు. అరటి ఉత్పత్తుల యూనిట్లు నెలకొల్పడానికి బ్యాంకు రుణాలిప్పించేందుకు నాబార్డ్ ఏజీఎం ఎన్.మధుమూర్తి సంసిద్ధత తెలిపారు. రెండు రాష్ట్రాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరిన రైతులు అరటి ఉత్పత్తుల తయారీ దిశగా కదులుతుండడం శుభసూచకం.
 - అయికా రాంబాబు, గుడ్లవల్లేరు, కృష్ణా జిల్లా
 
అరటి నార తీసే యంత్రం కొన్నాం

 తిరుచ్చి(తమిళనాడు)లో అరటి నుంచి తయారయ్యే వివిధ ఉత్పత్తులను చూసిన తర్వాత అరటి పీచు తీసే యంత్రాన్ని కొన్నాం. ఉప ఉత్పత్తుల్ని తయారుచేస్తే మరింత లాభదాయకంగా ఉంటుందని తెలుసుకున్నాం.
 - చంద్రమోహనరెడ్డి (94915 85202) ముఖ్య సమన్వయకర్త, అరటి రైతుల క్లబ్, చాగంటిపాడు, కృష్ణా జిల్లా
 
 డ్రై అరటి లాభసాటి!


అరటి కాయలను ఎండబెడితే.. కోరుకున్న ధర వచ్చేంత వరకూ నిల్వ ఉంచవచ్చు. ఇది రైతుకు లాభసాటిగా ఉంటుంది. రైతు సుబ్రహ్మణ్యన్ సౌర విద్యుత్తుతోనే డ్రయ్యర్‌ను, సాగు నీటి పంపును నడపడం ఒకెత్తయితే, విదేశాలకు ఎగుమతి చేయడం మరో ఎత్తు.
 - గుత్తా రాము (94901 79306)
 పీఏసీఎస్ అధ్యక్షుడు,
 తోట్లవల్లూరు
 
సేంద్రియ అరటి పండ్ల ఎగుమతి బాగుంది!

గుజరాత్‌లో అరటి రైతులు సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పండ్లు పండించి ఎగుమతి చేస్తుండడం నచ్చింది. గ్రాండ్‌నైన్ రకం మన దగ్గర కూడా బాగా పండుతుంది.
 
 - జె.రామ్మోహనరెడ్డి (94402 42205)
 మాజీ సర్పంచ్, దేవరపల్లి,
 తోట్లవల్లూరు మండలం
 
 అరటి ఉత్పత్తులు అమోఘం

 అరటి నారతో తయారు చేస్తున్న ఉత్పత్తులు అమోఘంగా ఉన్నాయి. అరటి పండుతో డ్రింక్, అరటి బిస్కెట్లు, చాక్లెట్లు, వైన్, జామ్, జ్యూస్  పరిశ్రమలపై శిక్షణ పొందడం ఉత్సాహాన్నిచ్చింది.
 
 - ఎ.శ్రీనివాసరెడ్డి (94924 88845) బద్రిరాజుపాలెం,
 తోట్లవల్లూరు మండలం, కృష్ణా జిల్లా
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement