The farm crisis
-
చర్చిస్తామని చెప్పి పారిపోయారు: షబ్బీర్
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభంపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఏమీ మాట్లాడకుండానే పారిపోయిందని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ నిర్వహించకుంటే పదవులు పోతాయనే భయంతోనే సమావేశాలు నిర్వహించారని ఆరోపించారు. ప్రతిపక్షాలు లేకుండా సభను నడపడం, శాసనసభను ఏడాదికి కేవలం 23 రోజులే నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపహాస్యం చేస్తున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు. -
వ్యవసాయ సంక్షోభం పట్టని పాలకవర్గం
త్రికాలమ్ నేరాలు నమోదు చేసే జాతీయ సంస్థ (నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో) లెక్కల ప్రకారం 2014లో దేశవ్యాపితంగా 12,360 మంది రైతులు ఆత్మహత్య చేసు కున్నారు. వారిలో మూడో వంతు మహారాష్ట్రలోని విదర్భలోనే ప్రాణాలు తీసు కున్నారు. తర్వాత స్థానం 1,347 రైతు ఆత్మహత్యలతో తెలంగాణ రాష్ట్రానిది. పంజాబ్, హర్యానా వంటి సంపన్న రాష్ట్రాలలో సైతం అన్నదాతలు బతకలేక పోతున్నారు. 1998 నుంచి 2014 వరకూ దేశం మొత్తం మీద మూడు లక్షల మందికి పైగా రైతులు చావును ఆశ్రయించారు. ప్రతి 42 నిమిషాలకూ దేశంలో ఎక్కడో ఒక చోట ఒక రైతు ప్రాణత్యాగం చేస్తున్నాడు. మొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురంలో పాద యాత్ర చేసి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబీకులను కలుసుకున్నారు. ఆయన ప్రసంగాలలో కానీ శరీర భాషలో కానీ వ్యవసాయరంగంలో నెలకొన్న సంక్షోభం పట్ల ఆందోళన కనిపించలేదు. ప్రతిపక్షంలో ఉన్నారు కనుక ప్రభుత్వా లను దుయ్యపట్టడానికి రైతు దైన్యం ఒక సాధనం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా యూపీఏ ప్రభుత్వం వాగ్దానం చేస్తే వాటిని సాధించడానికి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ కానీ ఏమీ చేయలేదంటూ ఇందిరమ్మ మను మడు తప్పుపట్టాడు. యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి నిజా యితీగా వ్యవహరించి ఉంటే ఆ సంగతి ఏపీ రాష్ట్ర విభజన చట్టంలో పొందు పరచవలసింది. వైఎస్ఆర్సీపీ సంవత్సరకాలంగా ఉద్యమిస్తున్నదీ, ప్రభు త్వాలను నిలదీస్తున్నదీ రైతు రుణమాఫీ అమలుతో పాటు పోలవరం కాకుండా పట్టిసీమ ప్రాజెక్టు పట్టుకొని ఎందుక వేళ్లాడుతున్నారనీ, ప్రత్యేక హోదా ఎందుకు తేవడం లేదనీ ప్రశ్నిస్తూనే. ఏపీ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ రాహుల్ అనంతపురం వచ్చినప్పుడు కానీ ఈ వాస్తవాలు ఆయన చెవిన వేసి ఉండరు. పంచ్ డైలాగ్‌లే రాజకీయం కాదు రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే ప్రతిపక్ష నాయకుడిగా రాటు తేలుతున్నారు. పంచ్ డైలాగ్‌లు సంధించడం అభ్యాసం చేస్తున్నారు. కానీ రాజకీయం అంటే విమర్శనాస్త్రాలు సంధించడం ఒక్కటే కాదు. ప్రభుత్వం పరిష్కరించలేని సమస్యలకు పరిష్కారాలు సూచించగలగాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు సత్ఫలితాలు ఇవ్వనప్పడు ప్రత్యామ్నాయ విధానాలు ప్రతిపాదించ గలగాలి. అంతటి స్థాయికి రాహుల్ ఎదగలేదు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు సైతం ఆ దిశగా ఆలోచించడం లేదు. కంటికి కన్ను అన్నట్టు 2012 నుంచి ఎన్నికలు జరిగే వరకూ పార్లమెంటులో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సభాకార్యక్రమాలకు అడ్డుతగిలింది కనుక అదే విధానం ఇప్పుడు కాంగ్రెస్ అను సరిస్తోంది. బ్రిటన్‌లో కామన్స్ సభ ఒక్క రోజుకూడా అర్ధంతరంగా వాయిదా పడదు. అమెరికాలో చట్టసభలలో అధికార పార్టీ ప్రవేశ పెట్టిన బిల్లులను ప్రతి పక్ష సభ్యులు సైతం సమర్థిస్తారు. అధికార పార్టీ సభ్యులు విభేదించిన సంద ర్భాలూ అనేకం. మన రాజకీయ పార్టీల నాయకులు అహంకారపూరిత రాజ కీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్నదాత ఆత్మహత్యకు ఒడిగట్టినప్పుడు అనాథలైన కుటుంబ సభ్యులను కలుసుకోకపోవడం, ఏమీ జరగనట్టు వ్యవహరించడం, వ్యవసాయం కార ణంగా ఆత్మహత్య చేసుకోలేదని నమోదు చేయాలంటూ రెవెన్యూ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం అథమం. గుండెకోతకు గురైన కుటుంబ సభ్యులను పరామర్శించి చేతనైనంత సాయం అందించడం మధ్యమం. రైతు ఆత్మహత్య చేసుకునే దుస్థితి కలగకుండా, వ్యవసాయం గిట్టుబాటు అయ్యే విధంగా, వీలైతే లాభసాటి వ్యాసంగంగా మారే విధంగా అనుసరించవలసిన విధానాలు ఏమిటో ఆలోచించడం, చర్చించడం, ఒక మార్గాన్ని క నుక్కోవడానికి యథాశక్తి ప్రయత్నించడం ఉత్తమం. వాస్తవానికి వ్యవసాయరంగంపైనా, నానాటికీ దిగజారుతున్న వ్యవసాయదారుల ఆదాయంపైనా చట్టసభలన్నీ ఏకాగ్రచిత్తంతో సమాలోచన చేయాలి. విశ్వవిద్యాలయాలలో అధ్యయనాలు సాగాలి. మీడియాలో చర్చోపచర్చలు జరగాలి. మేధోమథనం సాగాలి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న తమాషా ఏమిటి? మన ప్రజాప్రతినిధులూ, మన మేధావులూ, మన సామాజికవేత్తలూ ఏం చేస్తున్నారు? ఏయే అంశాలను చర్చిస్తున్నారు? ఎందుకోసం గొంతు చించుకుంటున్నారు? ఎవరికోసం గుండెలు బాదుకుంటున్నారు? చర్చ జరగదు ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో చర్చ జరగడం లేదు. ఒక వేళ చర్చ జరి గినా వ్యవసాయరంగంపైన జరగదు. పుష్కరాల పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం యావత్తూ భక్తిపారవశ్యంతో నిన్నటి వరకూ తరించిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గ సహచరులతో సహా గోదావరి హారతిని నిత్యం తిలకిస్తూ దాతాత్మ్యం చెందారు. ప్రపంచంలోకెల్లా అందమైన గొప్ప నగరంగా అమరావతిని నిర్మించడానికి సింగపూర్, జపాన్ ప్రభుత్వాల సహకారం కోసం ముఖ్యమంత్రి తాపత్రయపడుతుంటే, గోదావరి హారతినీ, పుష్కర జనసందోహాన్నీ చూపించి సింగపూర్ సర్కార్ ప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడానికి యాతన పడుతుంటే రైతులూ, రైతు కూలీలూ, వారి ప్రాణాలూ అంటూ సణగడంలో అర్థం ఉన్నదా? అమరావతి కల సాకారం కావడానికి ముందే హైదరాబాద్‌కి మరిన్ని హంగులు సమకూర్చి, ఆకాశమార్గాలు నిర్మించి ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చి దిద్దడానికి అహర్నిశలూ పరిశ్రమిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయ సంక్షోభం గురించి ఆలోచించే సమయం ఉన్నదా? ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసినట్టు రైతుల రుణాలు మాఫీ చేయడానికి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. కానీ విదర్భ తర్వాత రైతుల బలిపీఠంగా తెలంగాణ పేరుమోస్తున్నది. ఇది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వమే ఉన్న దుస్థితే. కానీ అధికార పార్టీగా తెరాస ఈ సమస్యపై దృష్టి సారించకపోవడం బాధ్యతారాహిత్యం. భూసేకరణ చట్టం సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే రైతుల జీవితాలలో వెలుగు నిండిపోతుందంటూ ప్రధాని మోదీ ఉద్ఘోషిస్తున్నారు. అందులోని మర్మం ఏమిటో బోధపడటం లేదు. భూమి లేకపోతే వ్యవసాయానికి స్వస్తి చెప్పి నగరానికి వలస వెళ్లి కూలీనాలీ చేసుకొని బతుకుతారనీ, ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం రాదనీ మోదీ మనోగతం కావచ్చు. ప్రేమవ్యవహారమో, నపుంసకత్వమో రైతుల ఆత్మహత్యలకు కారణమంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ పార్లమెంటులో ప్రకటన చేసిన తర్వాత కూడా మంత్రిగా కొనసాగుతున్నారంటే రైతుల పట్ల ఎన్డీఏ సర్కార్‌కు ఎంత సానుభూతి ఉన్నదో, వ్యవసాయరంగం పట్ల ఎంతటి అవగాహన ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. రాధామోహన్‌సింగ్ వంటి మంత్రిమండలి సహచరులూ, సాక్షీ మహరాజ్ వంటి పార్టీ ఎంపీలూ ఉన్నప్పుడు మోదీకి వేరే శత్రువులు అక్కరలేదు. మీడియా ఏం చేస్తున్నది? కేజ్రీవాల్‌కీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్కీ మధ్య జగడం, జంగ్ వెనుక మోదీ హస్తం ఇంగ్లీషు చానళ్ళకూ, పత్రికలకూ చాలా ముఖ్యమైన అంశాలు. సరిహద్దులో చిన్న ఘటన జరిగినా భారత్, పాకిస్తాన్ల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతున్నట్టు గావుకేకలు పెడుతూ, పాకిస్తాన్‌నూ, ఆ దేశం సైనిక వ్యవస్థనూ, రాజకీయ నాయకులనూ, దౌత్యవేత్తలనూ శాపనార్థాలు పెడుతూ తమ దేశభక్తిని చాటుకునే పనిలో ప్రఖ్యాత టీవీ జర్నలిస్టులు తలమునకలై ఉంటారు. సరిహద్దు నిశ్శబ్దంగా ఉంటే మమతా బెనర్జీ మేనల్లుడో, వసుంధరారాజే త నయుడో, సోనియాగాంధీ అల్లుడో, మేనకాగాంధీ కొడుకో ఏదో ఒక పిచ్చి పని చేసి చానళ్లకు దొరికిపోతారు. ఆ పిచ్చిపనిపైనా దృష్టి పెట్టి అరడజను మంది ప్రవీణులు పచ్చిపచ్చిగా తిట్టుకుంటూ, పరస్పరం అరచుకుంటూ సాగే రచ్చలను న్యూస్ అవర్లూ, ప్రైమ్షోల పేరుతో నిర్వహిస్తాయి. రైతుల గురించి చచ్చినా చర్చించరు. ఇంగ్లీషు పత్రికల ఎడిట్ పేజీలలో వస్తున్న వ్యాసాలను పరిశీలించినా వ్యవసాయరంగంపైన వచ్చే విశ్లేషణలు కనిపించవు. రైతు పత్రికా పాఠకుడు కాదు కనుక అతని గురించి పట్టించుకోవడం వ్యర్థం. వ్యవసాయ సంక్షోభంపైన తన అధ్యయన ఫలితాలను ప్రచురించే పత్రిక లేక పాలగుమ్మి సాయినాథ్ వంటి ప్రసిద్ధుడు స్వయంగా వెబ్సైట్ పెట్టుకోవలసి వచ్చింది. తెలుగు మీడియా రెండు రాష్ట్రాల రాజకీయాలతో సతమతం అవుతున్నది. రోజుకు ముగ్గురు రైతుల వంతున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మొదటి పేజీలోకి వార్త రావడంలేదు. చానళ్లు వివాదాలతో, వినోదంతో కాలక్షేపం చేస్తున్నాయి. అగ్రతర ప్రాధాన్యం మోదీ, చంద్రబాబు నాయుడూ, కేసీఆర్ వంటి నాయకులు పట్టించు కోవడం లేదని నిందిస్తున్నాము కానీ వారంతా పట్టించుకున్నా వ్యవసాయరంగ సంక్షోభం సమసిపోతుందన్న నమ్మకం లేదు. వ్యవసాయాన్ని గిట్టుబాటు వ్యాసంగం చేయడం చైనా ప్రభుత్వం వల్ల కాలేదు. అయితే చైనా ప్రభుత్వం రైతులు పస్తు పడుకోకుండా చూడవలసిన బాధ్యతను గుర్తెరిగి వ్యవహరి స్తున్నది. మన దేశంలో 53 శాతం మంది రైతులు ఆకలితోనే నిద్రపోతారని సర్వేలు చెబుతున్నాయి. సంపన్న దేశాలు వ్యవసాయరంగానికి భారీగా సబ్సిడీలు ఇస్తున్నాయి. పరిశ్రమలూ, సేవారంగ సంస్థలూ విస్తరించినప్పుడు, ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు మెలకువలు నేర్పడం (స్కిల్ డెవలప్ మెంట్) ద్వారా వ్యవసాయరంగం నుంచి యువకులనూ, యువతులనూ ఇతర రంగాలకు మళ్లించవచ్చు. తప్పులేదు. కానీ ఇతర రంగాలలో ఉపాధి అవకాశాలు పెరగకుండా వ్యవసారంగానికి ఇస్తున్న సబ్సిడీలలో కోత విధించాలని వాదించడం దారుణం. వ్యవసాయం కోసం తీసుకున్న రుణాలను వ్యవసాయేతర కార్యక్రమాలపై ఖర్చు చేసినట్టు ఇటీవల రిజర్వ్‌బ్యాంకు చేయించిన అధ్యయనంలో వెల్లడైంది. వ్యవసాయ రుణాలపైన ఏడు శాతం వడ్డీనే వసూలు చేయాలనీ, గడువులోగా రుణం తిరిగి చెల్లించినవారికి ప్రోత్సాహకంగా మూడు శాతం వడ్డీ తగ్గించాలనీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కేవలం నాలుగు శాతానికే వ్యవసాయ రుణాలు అందుతాయి. రుణాలు అందుకునే భూమి యజమానులు నగరాలలో స్థిరపడి ఉద్యోగాలలోనో, వ్యాపారాలలోనో ఉన్నారు. క్షేత్రంలో వ్యవసాయం చేస్తున్నవారు కౌలు రైతులు. వారికి రుణసహాయం అందినప్పుడు కొంత ఊరట లభించవచ్చు. ఇది ఒక్కటే చాలదు. వ్యవసాయరంగానికి కాయకల్ప చికిత్స అవసరం. సమూలమైన మార్పులు తెచ్చే సంస్కరణలు ప్రవేశపెట్టాలి. మార్కెంటింగ్ సదుపాయాల కల్పన నుంచి పరిశోధన, అభివృద్ధి రంగం వరకూ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయవలసి ఉంటుంది. అసలు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో నిర్ణయించేందుకు కూలంకషంగా చర్చ జరగాలి. పార్లమెంటు ఉభయ సభలూ, రాష్ట్రాల శాసనసభలూ వ్యవసాయ సంక్షోభం పైన చర్చించడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా మంచిదే. రాజకీయ ప్రయోజనాలనూ, సిద్ధాంతరాద్దాంతాలనూ పక్కన పెట్టి వ్యవసాయరంగాన్ని ఆదుకోవడానికి సమష్టిగా ప్రయత్నించాలి. అప్పుల ఊబి నుంచి రైతులనూ, కౌలురైతులనూ బయటపడవేయాలి. ఇది జాతి యావత్తుకూ ప్రథమ ప్రాధమ్యం కావాలి. వేలమంది రైతులు నేలరాలి పోతుంటే స్పందించని సమాజానికి నిష్కృతి ఉంటుందా? కె రామచంద్రమూర్తి -
రైతు గోడు పట్టని ప్రభుత్వాలు!
వ్యవసాయ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో ఇటీవలి సర్వేలు మరోసారి దేశప్రజల కళ్లకు కట్టాయి. తెలంగాణలో 89%, నవ్యాంధ్రలో 93% రైతులు రుణగ్రస్థులై ఉన్నారు. సగం మంది రైతులకు కూడా సంస్థాగత రుణాలు అందదకపోవడం ఈ అప్పులకు ఒక ముఖ్య కారణం. సన్న, చిన్నకారు, కౌలు రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు రుణాలపై ఆధారపడుతున్నారన్నది నగ్నసత్యం. బ్యాంకులను జాతీయం చేసినా.. అవసరానికి అనుగుణంగా సకాలంలో రుణ పరపతి అందినప్పుడే రైతులు వ్యవసాయ పనులను సకాలంలో పూర్తిచేసి సత్ఫలితాలు పొందగలుగుతారు. కానీ, 1970వ దశకంలో బ్యాంకులను జాతీయం చేసినా ఇప్పటికీ చిన్న, సన్నకారు, కౌలు రైతులకు ఇప్పటికీ బ్యాంకులు పంట రుణాలను, భూమి మెరుగుదలకు దీర్ఘకాలిక రుణాలను తగినంతగా అందించడం లేదు. మెట్రో నగరాల్లో, పట్టణాల్లో వ్యవసాయాధార, ప్రోసెసింగ్ పరిశ్రమలకు అందించే రుణాలనూ వ్యవసాయ రుణాల లెక్కలో చేర్చి లక్ష్యాలు సాధించామని బ్యాంకులు ప్రకటించుకోవటం గమనిస్తూనే ఉన్నాం. రైతుమిత్ర గ్రూపులు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు ఏర్పాటు చేసినా.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చినా ప్రభుత్వం ఆశించిన దాంట్లో కనీసం 5వ వంతు కూడా బ్యాంకులు సహకరించడం లేదు. ఇందువల్లే రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు.. ఆత్మహత్యల పాలవుతున్నారు. ఇది అత్యంత దురదృష్టకరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి అనేకసార్లు రుణమాఫీ కార్యక్రమం చేపట్టినా రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అతలాకుతలం చేస్తున్నది సర్కారు విధానాలే వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతూ రైతుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నది ప్రభుత్వ విధానాలే. వీటిని మార్చుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయకపోవడం బాధాకరం. రైతులు అష్టకష్టాలు పడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వటానికి నిరాకరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ధరలను ఇష్టానుసారం పెంచుకోవడానికి కంపెనీలకు స్వేచ్ఛనిచ్చారు. ఫలితంగా ఫాస్పేట్, పొటాష్ ధరలు 3 నుంచి 4 రెట్లు పెరిగాయి. దిగుబడులు మాత్రం పెరగటం లేదు. ఫలితంగా వ్యవసాయం గిట్టుబాటు కాని వ్యాపకంగా మారింది. అనుసరణీయమైనది ప్రకృతి వ్యవసాయం ఈ పరిస్థితుల్లో వ్యవసాయ ఖర్చులు తగ్గించుకుంటూ, అధికోత్పత్తిని సాధించగలిగే వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉంటుంది. ప్రధానంగా భూసారాన్ని పెంపొందించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. రసాయనిక ఎరువుల వాడకాన్ని బాగా తగ్గించి.. పచ్చిరొట్ట ఎరువులు, చెరకు ఆకు, వరి గడ్డితోపాటు పత్తి, జొన్న, మొక్కజొన్న మొదలగు పంటల వ్యర్థాలను భూమిలో కలిపి దున్నటం ద్వారా భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించాలి. అప్పుడే భూముల్లో హ్యూమస్(జీవనద్రవ్యం) పెరిగి అధిక దిగుబడులు లభిస్తాయి. సుభాష్ పాలేకర్ బోధిస్తున్న పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానం ఎంతైనా అనుసరణీయం. ఒక్క దేశీ ఆవుతోనే దాదాపు 20 ఎకరాలకు ఎరువు అందించగలిగే వీలుంది. ఆవుమూత్రం, ఆవు పేడతో ఘన, ద్రవ జీవామృతాలను తయారు చేసుకొని వినియోగించుకోవచ్చు. పాలేకర్ చెప్పే బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, నీమాస్త్రం తదితర కషాయాలను ఉపయోగించి చీడపీడలను నివారించుకోవచ్చు. వ్యవసాయ సంక్షోభం పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన చర్యలివి: ► డా. ఎమ్మెస్ స్వామినాథన్ సారథ్యంలోని జాతీయ రైతు కమిషన్ చేసిన సిఫారసులను ఆమోదించినప్పుడే దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ► వ్యవసాయ ధరల కమిషన్‌ను పునర్వ్యవస్థీకరించి ‘టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్’ను పునఃసమీక్షించాలి. పంట ఉత్పత్తి వ్యయంపై 50 శాతాన్ని కలిపి మద్దతు ధర ప్రకటించాలి. అప్పుడే రైతు కుటుంబం సమాజంలోని ఇతర వర్గాల స్థాయిలో గౌరవప్రదంగా జీవించగలుగుతుంది. ► రైతు భరించగలిగిన స్థాయిలో ప్రీమియం నిర్ణయించి.. పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. జీ వ్యవసాయోత్పత్తుల మార్కెట్ ధరల్లో ఒడిదుడుకులు తట్టుకునేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. జీ వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల వల్ల మన రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండేందుకు ‘ఇండియన్ ట్రేడ్ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేయాలి. ► {పకృతి వైపరీత్యాల బారిన పడిన రైతులను ఆదుకొనేందుకు ‘వ్యవసాయ విపత్తు నిధి’ని ఏర్పాటు చేయాలి. ► రైతులకు, వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు ఉచిత జీవిత బీమా సదుపాయం కల్పించాలి. ► {V>Ò$×ులు, రైతులకు చైనాలోని ‘టౌన్ విలేజ్ ఎంటర్ప్రైజెస్’ మాదిరిగా నైపుణ్యాన్ని మెరుగుపరిచే శిక్షణ ఇవ్వాలి. ► వ్యవసాయ రంగం అభివృద్ధికి కొలమానం పంట ఎన్ని టన్నులు పండింది అని కాకుండా.. రైతు సంతోషంగా, ఆనందంగా ఉన్నాడా లేడన్నది ప్రామాణికం కావాలని స్వామినాథన్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్చించి 8 ఏళ్లు గడచింది. పార్లమెంటులో ఈ నివేదికపై చర్చించడం కానీ, ఆమోదించడం కానీ చెయ్యలేదు. 60 కోట్ల మంది రైతాంగం, గ్రామీణ ప్రజానీకం పట్ల కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యానికిది నిలువుటద్దం పడుతోంది. ► కోట్లాది మంది రైతులు, గ్రామీణ చేతివృత్తుల వారి ఆదాయం, కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగితేనే పారిశ్రామిక, సేవారంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిసీ.. చర్యలు చేపట్టకపోవటం రైతుల దౌర్భాగ్యం. (వ్యాసకర్త ఏపీ వ్యవసాయ శాఖ మాజీమంత్రిర్యులు) మొబైల్: 93929 59999) రెతుకు సక్రమంగా సంస్థాగత రుణాలివ్వడం.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం.. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు గిట్టుబాటు ధర కల్పించడం వంటి నిర్మాణాత్మక చర్యలు అమలు చేస్తే తప్ప వ్యవసాయ సంక్షోభాన్ని సమూలంగా పెకలించడం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు -
రూపు మార్చితేనే రూకలు!
వ్యవసాయ సంక్షోభ సాగరాన్ని రైతు సజావుగా దాటెయ్యాలంటే.. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడం ఒక్కటే చాలదు! పండించిన పండ్లను అయినకాడికి అమ్మితే రైతుకు గిట్టుబాటు కాదు. వాటిని ఎండబెట్టో, వివిధ రకాల ఉత్పత్తులుగా తయారుచేసో అమ్మితే ఆదాయం పెరుగుతుంది. స్థానిక మార్కెట్లకే పరిమితం కాకుండా.. ఇతర రాష్ట్రాలకో, విదేశాలకో ఎగుమతి చేయాలి. ఇవన్నీ నేర్చుకోవాలన్నా, ఆచరణలోకి తేవాలన్నా ఒంటరి రైతులకున్న శక్తి సామర్థ్యాలు చాలవు. ఆరుగాలం చమటోడ్చి ఆశల దిగుబడులు తీసే అన్నదాతలు సహకార సంఘాలుగా ఏర్పడితే అధికాదాయాన్నిచ్చే మెరుగైన ప్రత్యామ్నాయాలు వెతకడం అసాధ్యమేమీ కాదనడానికి రుజువులెన్నో... కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు అరటి రైతుల క్లబ్‌కు చెందిన 20 మంది సభ్యుల బృందం అటువంటి వెలుగుదారులనే వెతుకుతోంది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఇటీవల పర్యటించింది. అరటి ఆధారిత ఉత్పత్తుల తయారీ, విదేశాలకు ఎగుమతులపై ఈ బృందం అధ్యయనం చేసింది. ఈ రైతు విజ్ఞాన యాత్రలకు నాబార్డ్ ఆర్థిక సాయమందించింది. రైతు బృందాల యాత్రలు కొత్తకాకపోయినప్పటికీ.. చైతన్యవంతులైన ఈ అరటి రైతుల సంఘటిత మహాప్రయత్నం ఇతర ప్రాంతాల రైతులు, ఇతర పంటల రైతులకూ వెలుగుబాట కావాలని ‘సాక్షి’ ’సాగుబడి’ ఆశిస్తోంది. ఎండు (డ్రై) అరటి, సేంద్రియ అరటి పండ్ల ఎగుమతితో అధికాదాయం పొరుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ కొత్తదారులు వెతుకుతున్న రైతులు టమోటాలను పారబోసే బదులు.. ఒరుగులు, పొడిగా మార్చితే మేలంటున్న శాస్త్రవేత్తలు ఎండు అరటి ఎగుమతి మేలు అరటి తోటలో గెలలు కిందకు దించగానే మార్కెట్‌కు తరలించి విక్రయిస్తుంటారు. ఆలస్యమైతే కాయలపై మచ్చలు వచ్చి నాణ్యత పడిపోతుందనే బెంగ రైతును వెంటాడుతుంటుంది. అయితే, అరటి కాయలను ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెడితే ఆ బాధ ఉండదు. మంచి ధరకు అమ్ముకోవచ్చునని రుజువు చేస్తున్నారు తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తొట్టాయం రైతులు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు అరటి రైతుల క్లబ్ సభ్యుల బృందం ఇటీవల తొట్టాయం వెళ్లి సుబ్రహ్మణ్యన్ అనే రైతు సోలార్ డ్రయ్యర్‌తో అరటి కాయలను ఎండబెడుతున్న తీరును పరిశీలించింది. జర్మనీ అగ్రికల్చర్ బ్యాంక్ ఆర్ధిక సాయంతో సోలార్ డ్రయ్యర్‌ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. సౌర విద్యుత్‌తో నడిచే నీటిపంపు ద్వారా బిందు సేద్యం చేస్తుండడం సుబ్రహ్మణ్యన్ ప్రత్యేకత. నెలకు 2 టన్నుల డ్రై అరటి ఎగుమతి తొట్టాయం నుంచి నెలకు 2 టన్నుల ఎండు అరటిపండ్లు ఫిలిప్పీన్స్, శ్రీలంక, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. తిరుచ్చిలోని జాతీయ అరటి పరిశోధనా స్థానాన్ని కూడా రైతుల బృందం సందర్శించి శాస్త్రవేత్త డాక్టర్ కుమార్ ద్వారా అరటి సాగులో సరికొత్త విధానాలను రైతులు తెలుసుకున్నారు. అరటి నారతో చాపలు, మ్యాట్లు, అలంకరణ వస్తువుల తయారీని పరిశీలించారు. అరటి పండుతో డ్రింక్, బిస్కెట్లు, చాక్లెట్లు, వైన్, జామ్, జ్యూస్ తయారీ తీరును అధ్యయనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అనువైన కో-1, రసాలి, నైంద్రన్, కర్పూర అరటి రకాల సాగు వివరాలను ఆకళింపు చేసుకున్నారు. సేంద్రియ అరటి ఎగుమతితో 3 రెట్ల రాబడి గుజరాత్ నౌసారిక్ ప్రాంతంలో సేంద్రియ అరటి రైతులు సహకార సంఘంగా ఏర్పడి సంఘటిత శక్తిని చాటుతున్నారు. గ్రాండ్నైన్ రకం అరటి పండ్లను సేంద్రియ పద్ధతుల్లో పండించి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తూ అధిక లాభాలార్జిస్తున్నారు. అక్కడి విక్రమ్ దేశాయ్ అనే రైతు అరటితోటల్ని చాగంటిపాడు అరటి రైతుల క్లబ్ సభ్యుల బృందం ఇటీవల సందర్శించింది. నేస్తం స్వచ్ఛంద సంస్థ జిల్లా డెరైక్టర్ వీసం సురేష్ ఆధ్వర్యాన ఈ యాత్ర సాగింది. అరటి తోటలను రైతులు ఆర్నెల్లు పెంచిన తర్వాత ‘దేశాయి’ అనే ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారు. వారు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల మేరకు ప్రత్యేక శ్రద్ధతో తోటలను పెంచుతారు. అరటి కాయలకు మచ్చలు పడకుండా ఉండేందుకు రంధ్రాలున్న పాలిథిన్ సంచుల్ని గెలలకు తొడుగుతారు. గెలలను కాకుండా నైలాన్ దారంతో హస్తాలనే కోసి, సబ్బుతో రుద్ది కడిగి శుభ్రం చేస్తారు. పాలిథిన్ కవర్లలో పెట్టిప్రత్యేక అట్టపెట్టెల్లో ప్యాక్చే సి శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. దేశాయి సంస్థ నుంచి ఆన్లైన్ ద్వారా గల్ఫ్ దేశాలు అరటి కాయలను విరివిగా కొనుగోలు చేస్తున్నాయి. ఏడాదిలోఎకరానికి రూ. 60 వేలు ఖర్చవుతోందని, రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తున్నదని విక్రమ్ దేశాయ్ తెలుగు రైతు బృందానికి చెప్పారు. కిలో రూ.11.70 చొప్పున 40 కిలోల గెలను రూ.468లకు అమ్ముతున్నామన్నారు. తాము అమ్ముతున్న ధరకు ఇది మూడు రెట్లని రైతు బృంద సభ్యులు తెలిపారు. అధిక దిగుబడి సాధించడంతోపాటు రైతులు మార్కెటింగ్‌లోనూ ముందుండాలన్న లక్ష్యంతోనే ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి రైతులకు శిక్షణ ఇప్పిస్తున్నామని ‘నేస్తం’ స్వచ్ఛంద సంస్థ కృష్ణా జిల్లా డెరైక్టర్ వీసం సురేష్ తెలిపారు. అరటి ఉత్పత్తుల యూనిట్లు నెలకొల్పడానికి బ్యాంకు రుణాలిప్పించేందుకు నాబార్డ్ ఏజీఎం ఎన్.మధుమూర్తి సంసిద్ధత తెలిపారు. రెండు రాష్ట్రాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరిన రైతులు అరటి ఉత్పత్తుల తయారీ దిశగా కదులుతుండడం శుభసూచకం. - అయికా రాంబాబు, గుడ్లవల్లేరు, కృష్ణా జిల్లా అరటి నార తీసే యంత్రం కొన్నాం తిరుచ్చి(తమిళనాడు)లో అరటి నుంచి తయారయ్యే వివిధ ఉత్పత్తులను చూసిన తర్వాత అరటి పీచు తీసే యంత్రాన్ని కొన్నాం. ఉప ఉత్పత్తుల్ని తయారుచేస్తే మరింత లాభదాయకంగా ఉంటుందని తెలుసుకున్నాం. - చంద్రమోహనరెడ్డి (94915 85202) ముఖ్య సమన్వయకర్త, అరటి రైతుల క్లబ్, చాగంటిపాడు, కృష్ణా జిల్లా డ్రై అరటి లాభసాటి! అరటి కాయలను ఎండబెడితే.. కోరుకున్న ధర వచ్చేంత వరకూ నిల్వ ఉంచవచ్చు. ఇది రైతుకు లాభసాటిగా ఉంటుంది. రైతు సుబ్రహ్మణ్యన్ సౌర విద్యుత్తుతోనే డ్రయ్యర్‌ను, సాగు నీటి పంపును నడపడం ఒకెత్తయితే, విదేశాలకు ఎగుమతి చేయడం మరో ఎత్తు. - గుత్తా రాము (94901 79306) పీఏసీఎస్ అధ్యక్షుడు, తోట్లవల్లూరు సేంద్రియ అరటి పండ్ల ఎగుమతి బాగుంది! గుజరాత్లో అరటి రైతులు సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పండ్లు పండించి ఎగుమతి చేస్తుండడం నచ్చింది. గ్రాండ్నైన్ రకం మన దగ్గర కూడా బాగా పండుతుంది. - జె.రామ్మోహనరెడ్డి (94402 42205) మాజీ సర్పంచ్, దేవరపల్లి, తోట్లవల్లూరు మండలం అరటి ఉత్పత్తులు అమోఘం అరటి నారతో తయారు చేస్తున్న ఉత్పత్తులు అమోఘంగా ఉన్నాయి. అరటి పండుతో డ్రింక్, అరటి బిస్కెట్లు, చాక్లెట్లు, వైన్, జామ్, జ్యూస్ పరిశ్రమలపై శిక్షణ పొందడం ఉత్సాహాన్నిచ్చింది. - ఎ.శ్రీనివాసరెడ్డి (94924 88845) బద్రిరాజుపాలెం, తోట్లవల్లూరు మండలం, కృష్ణా జిల్లా -
ఉరిపేనుతున్నది విధానాలే!
విశ్లేషణ తెలంగాణలో రైతుల ఆత్మహత్యల తీరు వ్యవసాయ సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది. కరువు నేపథ్యంలో పత్తి రైతులతోపాటు కూరగాయ పంటలు పండించే రైతులూ నిస్సహాయంగా ఆత్మహత్యల పాలవుతున్నారు. ఖర్చు తగ్గించే సాగు పద్ధతులతోపాటు.. రైతుకు భద్రతనిచ్చే దిశగా విధానాల్లో మౌలిక మార్పు తేవడం తక్షణావసరంగా పాలకులు గుర్తించాలి. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు చేజేతులా తమ ప్రాణాలనే తీసుకోవడం అనేక సంవత్సరాలుగా జరుగుతున్నవే అయినా.. గత కొద్ది నెలలుగా ఉధృతమయ్యాయి. రోజుకు ఐదు లేక ఆరుగురు ఆత్మహత్య చేసుకుంటున్నారు. లెక్కకు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారన్న దానికన్నా.. ఈ దుర్భర స్థితి ఎందుకు దాపురించింది? పరిష్కారం ఏమిటన్నది చర్చించాల్సిన ప్రధానాంశం. బలవన్మరణాల నుంచి రైతులను రక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చెయ్యాలన్న చర్చే ఉపయోగకరం. మహిళా రైతులు, యువ రైతులు సైతం.. గతంలో పత్తి వంటి పంటలు సాగు చేసిన రైతులే ఆత్మహత్యల పాలయ్యేవారు. కానీ, ప్రస్తుతం ఇతరత్రా పంటలు సాగు చేసే రైతులు కూడా ఆత్మహత్య చేసుకోవడం వ్యవసాయ సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నది. తీవ్ర కరువు పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. పత్తి రైతులతోపాటు వరి, మొక్కజొన్న, చివరకు కూరగాయల రైతులు కూడా ఆత్మహత్యల పాలవుతున్నారు. వీరిలో మహిళా రైతులు, యువ రైతులు కూడా ఉండడం అత్యంత విషాదకర వాస్తవం. ఆత్మహత్యలకు సాధారణంగా కనపడే కారణాలు: పంటల సాగు ఖర్చులు పెరిగిపోవడం, ఖర్చుకు తగిన ధర మార్కెట్లో రాకపోవడం. ఖర్చు పెట్టే డబ్బు కన్నా తిరిగొచ్చే డబ్బు తగ్గిపోవడంతో అప్పులు, వాటికి వడ్డీలు తోడవుతున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడే దారి కనపడక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తడిసి మోపెడవుతున్న ఖర్చు సాగు వ్యయం పెరగడానికి అనేక కారణాలున్నాయి. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పరికరాలు, సాధనాలు స్వతహాగా రైతు దగ్గరే ఉండేవి. ఇప్పుడు అన్నిటినీ డబ్బు చెల్లించి కొనుక్కోవాల్సి వస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు రైతుకు భారమయ్యాయి. ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో పడక రైతులు విత్తనాలు రెండు, మూడు సార్లు వేయాల్సి వచ్చింది. బీటీ పత్తి విత్తనాల ధర అయితే అన్నింటికంటే ఎక్కువగా పెరిగింది. నాణ్యత లేకపోయినా దుకాణంలో ఉన్న విత్తనాలనే కొనకతప్పని స్థితి నెలకొంది. విత్తనాలు మొలకెత్తకపోయినా, పూత/కాత సరిగ్గా లేకపోయినా నష్టపోయేది రైతే. ట్రాక్టర్లు, టిల్లర్లు, ఇతర యంత్ర పరికరాలు అద్దెకు తెచ్చుకోవడం, వీటికి తోడు కూలి పెరిగిపోవడం వల్ల రైతు మీద ఆర్థిక భారం పెరిగింది. మోటారు చెడిపోతే ఎంత ఖర్చయినా ఆఘమేఘాల మీద మరమ్మతులు చేయిస్తే కానీ పంటకు నీళ్లు అందవు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చెడిపోతే, దాని మరమ్మతు ఖర్చు కూడా రైతులే భరించాల్సిన దుస్థితి ఉంది. ప్రైవేటు అప్పులే దిక్కు బ్యాంకులు రుణాలివ్వకపోవడం, ఇచ్చినా చాలా తక్కువ ఇవ్వడం, అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల రైతులు అధిక వడ్డీకిచ్చే ప్రైవేటు అప్పుల మీద ఆధారపడుతున్నారు. రైతులు ఎక్కువగా దుకాణదారుల అప్పుల మీదే ఆధారపడతారు. కుటుంబ ఖర్చులకు, పిల్లల చదువు, వైద్య ఖర్చులు, శుభకార్యాలు, బట్టలు.. ఇవన్నీ పంటల ద్వారా అయినా రావాలి. లేదా అప్పు తెచ్చిన డబ్బులో నుంచైనా చెల్లించాల్సిందే. మార్కెట్ సంస్కరణలు.. 1995లో వచ్చిన ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో అనేక మార్పులు వచ్చాయి. అన్ని దేశాల వ్యవసాయ మార్కెట్లలో కూడా పెనుమార్పులు వచ్చాయి. అనేక దేశాలు తమ రైతులను కాపాడుకోవడానికి అనేక విధాన మార్పులు తీసుకువచ్చాయి. భారతదేశంలో కూడా విధానాల మార్పులు, మార్కెట్ విధానాల పరంపర, విధానాల ‘సంస్కరణ’ అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా, పాలక పార్టీలు మారినా ఆర్థిక, మార్కెట్ విధానాల సరళీకరణ కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ దిగుమతులతో దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరల మీద వ్యతిరేక ప్రభావం పెరిగింది. ఫార్వార్డ్ మార్కెట్లు, కాంట్రాక్టులు, విదేశీ కంపెనీల లాభాపేక్ష వల్ల కూడా రైతుకు గిట్టుబాటు ధర రావడంలేదు. చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ వ్యత్యాసాల నుంచి రైతును కాపాడే ప్రయత్నాలు చేయడం లేదు. కనీస మద్దతు ధరలు నిర్ణయించేటప్పుడు వాస్తవ ఉత్పత్తి ఖర్చును పరిగణనలోకి తీసుకోలేకపోతున్నాయి. మద్దతు ధరల అమలు అంతకన్నా శూన్యం. ప్రభుత్వం చేష్టలుడిగి చూడడం కంటే విధానాల సమీక్ష జరిపి, రైతుల క్షేమమే ధ్యేయంగా, రైతు అనుకూల విధానాలు తీసుకురావాలి. రైతులకు భరోసా ఇవ్వాల్సిన సమయంలో, ఆత్మహత్యల నివారణ యుద్ధప్రాతిపదికన నివారించాల్సిన సమయంలో రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలతో కాలయాపన చేయడం తగదు. నిధుల కేటాయింపు అత్యంత ఆవశ్యమైనదైనా.. విధానాల్లో మార్పు తేవాలి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విత్తనాల నియంత్రణ, పథకాల అమలు వంటి అంశాల మీద దృష్టిపెట్టి, కేంద్ర ప్రభుత్వ విధానాల మార్పునకు అందరూ కృష్టి చేయాలి. ఉత్పత్తి ఖర్చు, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం, రైతు మీద భారం పెంచగా, వాతావరణంలో విపరీత మార్పులు ఉత్పత్తి మీద, దిగుబడి మీద దుష్ట్రభావం చూపుతున్నాయి. అకాల వర్షాలు, తక్కువ లేదా అధిక వర్షాలు, గాలి దుమారాలు, వడగళ్ల వానలతో రైతులు గత ఏడాది విపరీతంగా నష్టపోయారు. రైతులను ఆదుకోవడానికి ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేయాలి. వాతావరణ బీమా సౌకర్యం కల్పించాలి. త్వరగా పరిహారం అందించే ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తే, వారికి ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుంది. (వ్యాసకర్త వ్యవసాయ విధాన విశ్లేషకులు) డా. దొంతి నరసింహారెడ్డి