వ్యవసాయ సంక్షోభం పట్టని పాలకవర్గం
త్రికాలమ్
నేరాలు నమోదు చేసే జాతీయ సంస్థ (నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో) లెక్కల ప్రకారం 2014లో దేశవ్యాపితంగా 12,360 మంది రైతులు ఆత్మహత్య చేసు కున్నారు. వారిలో మూడో వంతు మహారాష్ట్రలోని విదర్భలోనే ప్రాణాలు తీసు కున్నారు. తర్వాత స్థానం 1,347 రైతు ఆత్మహత్యలతో తెలంగాణ రాష్ట్రానిది. పంజాబ్, హర్యానా వంటి సంపన్న రాష్ట్రాలలో సైతం అన్నదాతలు బతకలేక పోతున్నారు. 1998 నుంచి 2014 వరకూ దేశం మొత్తం మీద మూడు లక్షల మందికి పైగా రైతులు చావును ఆశ్రయించారు. ప్రతి 42 నిమిషాలకూ దేశంలో ఎక్కడో ఒక చోట ఒక రైతు ప్రాణత్యాగం చేస్తున్నాడు.
మొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురంలో పాద యాత్ర చేసి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబీకులను కలుసుకున్నారు. ఆయన ప్రసంగాలలో కానీ శరీర భాషలో కానీ వ్యవసాయరంగంలో నెలకొన్న సంక్షోభం పట్ల ఆందోళన కనిపించలేదు. ప్రతిపక్షంలో ఉన్నారు కనుక ప్రభుత్వా లను దుయ్యపట్టడానికి రైతు దైన్యం ఒక సాధనం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా యూపీఏ ప్రభుత్వం వాగ్దానం చేస్తే వాటిని సాధించడానికి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్‌సీపీ కానీ ఏమీ చేయలేదంటూ ఇందిరమ్మ మను మడు తప్పుపట్టాడు. యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి నిజా యితీగా వ్యవహరించి ఉంటే ఆ సంగతి ఏపీ రాష్ట్ర విభజన చట్టంలో పొందు పరచవలసింది. వైఎస్‌ఆర్‌సీపీ సంవత్సరకాలంగా ఉద్యమిస్తున్నదీ, ప్రభు త్వాలను నిలదీస్తున్నదీ రైతు రుణమాఫీ అమలుతో పాటు పోలవరం కాకుండా పట్టిసీమ ప్రాజెక్టు పట్టుకొని ఎందుక వేళ్లాడుతున్నారనీ, ప్రత్యేక హోదా ఎందుకు తేవడం లేదనీ ప్రశ్నిస్తూనే. ఏపీ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ రాహుల్ అనంతపురం వచ్చినప్పుడు కానీ ఈ వాస్తవాలు ఆయన చెవిన వేసి ఉండరు.
పంచ్ డైలాగ్‌లే రాజకీయం కాదు
రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే ప్రతిపక్ష నాయకుడిగా రాటు తేలుతున్నారు. పంచ్ డైలాగ్‌లు సంధించడం అభ్యాసం చేస్తున్నారు. కానీ రాజకీయం అంటే విమర్శనాస్త్రాలు సంధించడం ఒక్కటే కాదు. ప్రభుత్వం పరిష్కరించలేని సమస్యలకు పరిష్కారాలు సూచించగలగాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు సత్ఫలితాలు ఇవ్వనప్పడు ప్రత్యామ్నాయ విధానాలు ప్రతిపాదించ గలగాలి. అంతటి స్థాయికి రాహుల్ ఎదగలేదు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు సైతం ఆ దిశగా ఆలోచించడం లేదు. కంటికి కన్ను అన్నట్టు 2012 నుంచి ఎన్నికలు జరిగే వరకూ పార్లమెంటులో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సభాకార్యక్రమాలకు అడ్డుతగిలింది కనుక అదే విధానం ఇప్పుడు కాంగ్రెస్ అను సరిస్తోంది. బ్రిటన్‌లో కామన్స్ సభ ఒక్క రోజుకూడా అర్ధంతరంగా వాయిదా పడదు. అమెరికాలో చట్టసభలలో అధికార పార్టీ ప్రవేశ పెట్టిన బిల్లులను ప్రతి పక్ష సభ్యులు సైతం సమర్థిస్తారు. అధికార పార్టీ సభ్యులు విభేదించిన సంద ర్భాలూ అనేకం. మన రాజకీయ పార్టీల నాయకులు అహంకారపూరిత రాజ కీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
అన్నదాత ఆత్మహత్యకు ఒడిగట్టినప్పుడు అనాథలైన కుటుంబ సభ్యులను కలుసుకోకపోవడం, ఏమీ జరగనట్టు వ్యవహరించడం, వ్యవసాయం కార ణంగా ఆత్మహత్య చేసుకోలేదని నమోదు చేయాలంటూ రెవెన్యూ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం అథమం. గుండెకోతకు గురైన కుటుంబ సభ్యులను పరామర్శించి చేతనైనంత సాయం అందించడం మధ్యమం. రైతు ఆత్మహత్య చేసుకునే దుస్థితి కలగకుండా, వ్యవసాయం గిట్టుబాటు అయ్యే విధంగా, వీలైతే లాభసాటి వ్యాసంగంగా మారే విధంగా అనుసరించవలసిన విధానాలు ఏమిటో ఆలోచించడం, చర్చించడం, ఒక మార్గాన్ని క నుక్కోవడానికి యథాశక్తి ప్రయత్నించడం ఉత్తమం. వాస్తవానికి వ్యవసాయరంగంపైనా, నానాటికీ దిగజారుతున్న వ్యవసాయదారుల ఆదాయంపైనా చట్టసభలన్నీ ఏకాగ్రచిత్తంతో సమాలోచన చేయాలి. విశ్వవిద్యాలయాలలో అధ్యయనాలు సాగాలి. మీడియాలో చర్చోపచర్చలు జరగాలి. మేధోమథనం సాగాలి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న తమాషా ఏమిటి? మన ప్రజాప్రతినిధులూ, మన మేధావులూ, మన సామాజికవేత్తలూ ఏం చేస్తున్నారు? ఏయే అంశాలను చర్చిస్తున్నారు? ఎందుకోసం గొంతు చించుకుంటున్నారు? ఎవరికోసం గుండెలు బాదుకుంటున్నారు?
చర్చ జరగదు
ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో చర్చ జరగడం లేదు. ఒక వేళ చర్చ జరి గినా వ్యవసాయరంగంపైన జరగదు. పుష్కరాల పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం యావత్తూ భక్తిపారవశ్యంతో నిన్నటి వరకూ తరించిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గ సహచరులతో సహా గోదావరి హారతిని నిత్యం తిలకిస్తూ దాతాత్మ్యం చెందారు. ప్రపంచంలోకెల్లా అందమైన గొప్ప నగరంగా అమరావతిని నిర్మించడానికి సింగపూర్, జపాన్ ప్రభుత్వాల సహకారం కోసం ముఖ్యమంత్రి తాపత్రయపడుతుంటే, గోదావరి హారతినీ, పుష్కర జనసందోహాన్నీ చూపించి సింగపూర్ సర్కార్ ప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడానికి యాతన పడుతుంటే రైతులూ, రైతు కూలీలూ, వారి ప్రాణాలూ అంటూ సణగడంలో అర్థం ఉన్నదా? అమరావతి కల సాకారం కావడానికి ముందే హైదరాబాద్‌కి మరిన్ని హంగులు సమకూర్చి, ఆకాశమార్గాలు నిర్మించి ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చి దిద్దడానికి అహర్నిశలూ పరిశ్రమిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయ సంక్షోభం గురించి ఆలోచించే సమయం ఉన్నదా? ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసినట్టు రైతుల రుణాలు మాఫీ చేయడానికి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. కానీ విదర్భ తర్వాత రైతుల బలిపీఠంగా తెలంగాణ పేరుమోస్తున్నది. ఇది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వమే ఉన్న దుస్థితే. కానీ అధికార పార్టీగా తెరాస ఈ సమస్యపై దృష్టి సారించకపోవడం బాధ్యతారాహిత్యం.
భూసేకరణ చట్టం సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే రైతుల జీవితాలలో వెలుగు నిండిపోతుందంటూ ప్రధాని మోదీ ఉద్ఘోషిస్తున్నారు. అందులోని మర్మం ఏమిటో బోధపడటం లేదు. భూమి లేకపోతే వ్యవసాయానికి స్వస్తి చెప్పి నగరానికి వలస వెళ్లి కూలీనాలీ చేసుకొని బతుకుతారనీ, ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం రాదనీ మోదీ మనోగతం కావచ్చు. ప్రేమవ్యవహారమో, నపుంసకత్వమో రైతుల ఆత్మహత్యలకు కారణమంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ పార్లమెంటులో ప్రకటన చేసిన తర్వాత కూడా మంత్రిగా కొనసాగుతున్నారంటే రైతుల పట్ల ఎన్‌డీఏ సర్కార్‌కు ఎంత సానుభూతి ఉన్నదో, వ్యవసాయరంగం పట్ల ఎంతటి అవగాహన ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. రాధామోహన్‌సింగ్ వంటి మంత్రిమండలి సహచరులూ, సాక్షీ మహరాజ్ వంటి పార్టీ ఎంపీలూ ఉన్నప్పుడు మోదీకి వేరే శత్రువులు అక్కరలేదు.
మీడియా ఏం చేస్తున్నది? కేజ్రీవాల్‌కీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్‌కీ మధ్య జగడం, జంగ్ వెనుక మోదీ హస్తం ఇంగ్లీషు చానళ్ళకూ, పత్రికలకూ చాలా ముఖ్యమైన అంశాలు. సరిహద్దులో చిన్న ఘటన జరిగినా భారత్, పాకిస్తాన్‌ల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతున్నట్టు గావుకేకలు పెడుతూ, పాకిస్తాన్‌నూ, ఆ దేశం సైనిక వ్యవస్థనూ, రాజకీయ నాయకులనూ, దౌత్యవేత్తలనూ శాపనార్థాలు పెడుతూ తమ దేశభక్తిని చాటుకునే పనిలో ప్రఖ్యాత టీవీ జర్నలిస్టులు తలమునకలై ఉంటారు. సరిహద్దు నిశ్శబ్దంగా ఉంటే మమతా బెనర్జీ మేనల్లుడో, వసుంధరారాజే త నయుడో, సోనియాగాంధీ అల్లుడో, మేనకాగాంధీ కొడుకో ఏదో ఒక పిచ్చి పని చేసి చానళ్లకు దొరికిపోతారు. ఆ పిచ్చిపనిపైనా దృష్టి పెట్టి అరడజను మంది ప్రవీణులు పచ్చిపచ్చిగా తిట్టుకుంటూ, పరస్పరం అరచుకుంటూ సాగే రచ్చలను న్యూస్ అవర్లూ, ప్రైమ్‌షోల పేరుతో నిర్వహిస్తాయి. రైతుల గురించి చచ్చినా చర్చించరు. ఇంగ్లీషు పత్రికల ఎడిట్ పేజీలలో వస్తున్న వ్యాసాలను పరిశీలించినా వ్యవసాయరంగంపైన వచ్చే విశ్లేషణలు కనిపించవు. రైతు పత్రికా పాఠకుడు కాదు కనుక అతని గురించి పట్టించుకోవడం వ్యర్థం. వ్యవసాయ సంక్షోభంపైన తన అధ్యయన ఫలితాలను ప్రచురించే పత్రిక లేక పాలగుమ్మి సాయినాథ్ వంటి ప్రసిద్ధుడు స్వయంగా వెబ్‌సైట్ పెట్టుకోవలసి వచ్చింది. తెలుగు మీడియా రెండు రాష్ట్రాల రాజకీయాలతో సతమతం అవుతున్నది. రోజుకు ముగ్గురు రైతుల వంతున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మొదటి పేజీలోకి వార్త రావడంలేదు. చానళ్లు వివాదాలతో, వినోదంతో కాలక్షేపం చేస్తున్నాయి.
అగ్రతర ప్రాధాన్యం
మోదీ, చంద్రబాబు నాయుడూ, కేసీఆర్ వంటి నాయకులు పట్టించు కోవడం లేదని నిందిస్తున్నాము కానీ వారంతా పట్టించుకున్నా వ్యవసాయరంగ సంక్షోభం సమసిపోతుందన్న నమ్మకం లేదు. వ్యవసాయాన్ని గిట్టుబాటు వ్యాసంగం చేయడం చైనా ప్రభుత్వం వల్ల కాలేదు. అయితే చైనా ప్రభుత్వం రైతులు పస్తు పడుకోకుండా చూడవలసిన బాధ్యతను గుర్తెరిగి వ్యవహరి స్తున్నది. మన దేశంలో 53 శాతం మంది రైతులు ఆకలితోనే నిద్రపోతారని సర్వేలు చెబుతున్నాయి. సంపన్న దేశాలు వ్యవసాయరంగానికి భారీగా సబ్సిడీలు ఇస్తున్నాయి. పరిశ్రమలూ, సేవారంగ సంస్థలూ విస్తరించినప్పుడు, ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు మెలకువలు నేర్పడం (స్కిల్ డెవలప్ మెంట్) ద్వారా వ్యవసాయరంగం నుంచి యువకులనూ, యువతులనూ ఇతర రంగాలకు మళ్లించవచ్చు. తప్పులేదు. కానీ ఇతర రంగాలలో ఉపాధి అవకాశాలు పెరగకుండా వ్యవసారంగానికి ఇస్తున్న సబ్సిడీలలో కోత విధించాలని వాదించడం దారుణం. వ్యవసాయం కోసం తీసుకున్న రుణాలను వ్యవసాయేతర కార్యక్రమాలపై ఖర్చు చేసినట్టు ఇటీవల రిజర్వ్‌బ్యాంకు చేయించిన అధ్యయనంలో వెల్లడైంది. వ్యవసాయ రుణాలపైన ఏడు శాతం వడ్డీనే వసూలు చేయాలనీ, గడువులోగా రుణం తిరిగి చెల్లించినవారికి ప్రోత్సాహకంగా మూడు శాతం వడ్డీ తగ్గించాలనీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కేవలం నాలుగు శాతానికే వ్యవసాయ రుణాలు అందుతాయి. రుణాలు అందుకునే భూమి యజమానులు నగరాలలో స్థిరపడి ఉద్యోగాలలోనో, వ్యాపారాలలోనో ఉన్నారు. క్షేత్రంలో వ్యవసాయం చేస్తున్నవారు కౌలు రైతులు. వారికి రుణసహాయం అందినప్పుడు కొంత ఊరట లభించవచ్చు. ఇది ఒక్కటే చాలదు. వ్యవసాయరంగానికి కాయకల్ప చికిత్స అవసరం. సమూలమైన మార్పులు తెచ్చే సంస్కరణలు ప్రవేశపెట్టాలి.
మార్కెంటింగ్ సదుపాయాల కల్పన నుంచి పరిశోధన, అభివృద్ధి రంగం వరకూ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయవలసి ఉంటుంది. అసలు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో నిర్ణయించేందుకు కూలంకషంగా చర్చ జరగాలి. పార్లమెంటు ఉభయ సభలూ, రాష్ట్రాల శాసనసభలూ వ్యవసాయ సంక్షోభం పైన చర్చించడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా మంచిదే. రాజకీయ ప్రయోజనాలనూ, సిద్ధాంతరాద్దాంతాలనూ పక్కన పెట్టి వ్యవసాయరంగాన్ని ఆదుకోవడానికి సమష్టిగా ప్రయత్నించాలి. అప్పుల ఊబి నుంచి రైతులనూ, కౌలురైతులనూ బయటపడవేయాలి. ఇది జాతి యావత్తుకూ ప్రథమ ప్రాధమ్యం కావాలి. వేలమంది రైతులు నేలరాలి పోతుంటే స్పందించని సమాజానికి నిష్కృతి ఉంటుందా?
కె రామచంద్రమూర్తి