జవాబుదారీతనం ఎక్కడ? | Where is the accountability? | Sakshi
Sakshi News home page

జవాబుదారీతనం ఎక్కడ?

Published Sun, Jun 18 2017 12:12 AM | Last Updated on Wed, Apr 3 2019 8:09 PM

జవాబుదారీతనం ఎక్కడ? - Sakshi

జవాబుదారీతనం ఎక్కడ?

అవినీతిని అంతం చేస్తానంటూ ప్రకటించని రాజకీయ నాయకుడు కనిపిం చడు. అత్యంత అవినీతిపరుడు సైతం నీతి గురించీ, విలువల గురించీ ఢంకా బజాయించి మరీ ఉపన్యాసం ఇస్తాడు. ఈ కపటత్వం మానవ స్వభావంలోనే ఉన్నది. రాజకీయవాదులు కానీ ఉన్నతాధికారులు కానీ ఇందుకు భిన్నంగా వ్యవ హరించాలని కోరుకోవడం అత్యాశ. మనిషి ఆలోచనే లోపభూయిష్టంగా ఉన్నది కనుక అవినీతిని అరికట్టడం అసాధ్యమని తీర్మానించుకొని చేతులు ముడుచు కొని కూర్చోనక్కరలేదు. రాజకీయ నాయకులూ, అధికారులూ నీతిమంతంగా ఉండాలంటే రాజ్యవ్యవస్థ కొన్ని షరతులకూ, నియమాలకూ లోబడి ఉండాలి.

ప్రవృద్ధ ప్రజాస్వామ్య దేశాలలో అటువంటి వ్యవస్థ కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడిని ప్రపంచంలో కెల్లా అత్యంత బలశాలి అంటాం. అటువంటి పదవిలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికలో రష్యా సహకారం ఉన్నదో లేదో తెలుసుకోవడా నికి పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది. ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) డెరెక్టర్‌ పదవి నుంచి జేమ్స్‌ కామేను ట్రంప్‌ తొలగించింది అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యంపైన ఆయన జరుపుతున్న దర్యాప్తును అడ్డుకోవడం కోసమేనని అమెరికన్లలో అధికసంఖ్యాకులు నమ్ముతున్నారు.

అమెరికా కాంగ్రెస్‌ ఎదుట వాగ్మూలం చెప్పే అవకాశం కామేకు అమెరికా రాజ్యాంగం ప్రసాదిం చింది. ట్రంప్‌ అబద్ధాలు చెబుతున్నారని కామే స్పష్టంగా చెప్పాడు.  జేమ్స్‌ కామేను బర్తరఫ్‌ చేసినందుకు నాపై దర్యాప్తు జరుగుతోంది ('I am being investigated over James Comey firing')  అంటూ ట్రంప్‌ ప్రకటిం చాడు. ‘ఎన్నికలలో రష్యా జోక్యం లేదని నేను చెబుతున్నాను. కనుక విచారణ అక్కరలేదు’ అని చెప్పే సాహసం ట్రంప్‌ చేయరు. ఒకవేళ చేసినా, అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆమోదించవు. అమెరికా అధ్యక్షుడు రాజ్యాంగాన్నీ, రాజ్యంగ సంస్థలనీ, విధివిధానాలనూ తప్పించుకోలేడు. వారు తప్పు చేయరని కాదు. తప్పు చేయడానికి జంకుతారు. తప్పు చేస్తే విధిగా విచారణ జరుగుతుంది. నిక్సన్, క్లింటన్‌ల విషయంలో నిజం నిగ్గు తేలేవరకూ వారిని దర్యాప్తు సంస్థలూ, కాంగ్రెస్‌ (పార్లమెంటు), న్యాయస్థానాలూ విడిచిపెట్ట లేదు. మనది ఏడుపదుల ప్రజాస్వామ్య వ్యవస్థ. పరిణతి చెందే క్రమంలో ఉంది. ఇక్కడ నాయకులు తమ తప్పులపైన దర్యాప్తు అవసరమో, కాదో వారే నిర్ణయి స్తారు. ఈ పరిస్థితి మారాలి.

రాజ్యాంగ సవరణలు అవసరం
మన రాజ్యాంగాన్ని మహామహులు నిర్మించారు. స్వాతంత్య్రం సాధించినవారి కంటే రాజ్యాంగం ప్రసాదించిన వారికే మనం పెద్దపీట వేస్తున్నాం. ప్రపంచం లోని అనేక రాజ్యాంగాలను కాచివడబోసి ఎంతో వివేకంతో, ముందుచూపుతో భారత రాజ్యాంగాన్ని సృష్టించారు. మారుతున్న  పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని వంద విడతలకుపైగా సవరించుకున్నాం. అయినప్పటికీ కొన్ని భయంకరమైన లోటుపాట్లు కనిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటూ ప్రమాణం చేసినవారే య«థేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఒకసారి ఎన్నికై అధికారం లోకి వచ్చిన ప్రధానులూ, ముఖ్యమంత్రులూ తమకు తోచిన విధంగా పరిపా లన చేస్తున్నారు. ప్రజాస్వామ్య సంస్థలకు తాము జవాబుదారీ అని వారు భావిం చడంలేదు.  వారు నీతి అంటే నీతి. అవినీతి అంటే అవినీతి.

వారు ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే సాహసం మంత్రిమండలిలో ఎవ్వరికీ ఉండదు. అటువంటివారిని మంత్రులుగా పెట్టుకోరు. చట్టసభలలో రచ్చ తప్ప చర్చ జర గదు. ఒకవేళ జరిగినప్పటికీ నిజానిజాలతో, ధర్మాధర్మాలతో నిమిత్తం లేకుండా అధికార పక్షం గుడ్డిగా సమర్థిస్తుంది. చర్చ లేకుండా, సవరణలు లేకుండా  ప్రతి పక్షం సభ నుంచి నిష్క్రమించాక ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అనుకున్న  చట్టాలు చేయడం పార్లమెంటులోనూ, శాసనసభలలోనూ ఆనవాయితీ.

సభ నుంచి నిష్క్రమించిన ప్రతిపక్షాలనూ ఇష్టం వచ్చినట్టు తిట్టడం కెమేరాల సాక్షిగా జరిగిపోతోంది. ఇది ఎన్నికల ద్వారా పాలకులకు ప్రజలు ప్రసాదించిన హక్కు కాదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు అసలే కాదు. ప్రస్తుతం పదవులలో ఉన్నవారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. గతంలో అధికారం నెరపినవారికీ, భవిష్యత్తులో అధికారంలోకి రాబోయేవారికి కూడా ఇవి వర్తిస్తాయి. అవినీతికి అధికంగా ఆస్కారం ఉన్న రంగాలలో నీటిపారుదల ఒకటి. ఒక ప్రాజెక్టు నిర్మాణానికి ఫలానా మొత్తం ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ప్రాజెక్టు డిజైన్‌ మార్పు పేరుతోనో, సిమెంటు, ఇసుక ధరలు పెరిగాయనో, మరే కారణంగానో ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని సవరిస్తారు.

ఉదాహరణకు రూ. 500 కోట్లు ఉన్నదాన్ని రూ.750 కోట్లు చేస్తారు. సాధారణంగా ముఖ్యమంత్రి, ముఖ్య మంత్రి అనుమతిస్తే ఇరిగేషన్‌ మంత్రి, ప్రాజెక్టు నిర్మించే కాంట్రాక్టరు కలిసి ఈ నిర్ణయం చేస్తారు. రూ. 750 కోట్లుగా ఎందుకు నిర్ణయించారో, రూ. 700 కోట్లు ఎందుకు కాదో, రూ. 800 కోట్లు ఎందుకు కారాదో వివరించే బాధ్యత తమకు ఉన్నదని ముఖ్యమంత్రులు అనుకోవడం లేదు. ఇది రాష్ట్ర వ్యవహారం కనుక కేంద్రం జోక్యం చేసుకోదు. ప్రాజెక్టు వ్యయం వాస్తవంగా ఎంత ఉండాలో, ఎంత ఎక్కువగా చూపిస్తున్నారో తెలుసుకునేది ఎట్లా? లోకాయక్త వ్యవస్థ ఉన్నా, తగిన అధికారాలు లేకపోవడం పెద్ద సమస్య.

భూకబ్జా ఎడాపెడా
భూకబ్జాల సంగతీ అంతే. విశాఖపట్టణంలో వేలకోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములూ, ఎసైన్డ్‌ భూములూ కబ్జా అయినాయంటూ మీడియా కోడై కూస్తుంది. అయ్యన్నపాత్రుడనే మంత్రివర్యుడు స్వయంగా తమ పార్టీ నాయ కులే కబ్జా చేశారంటూ బహిరంగంగా ప్రకటిస్తారు. విద్యామంత్రి గంటా శ్రీని వాసరావుకు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నదంటూ మీడియా కథనాలు వెల్లడిస్తాయి. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్‌ స్వయంగా సూత్రధారి అంటూ వార్తలు వస్తాయి. సీబీఐ చేత కానీ న్యాయమూర్తి చేత కానీ దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష నాయకులే కాకుండా స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య మంత్రికి లేఖ రాసి మీడియాకు ఆ సంగతి తెలియజేస్తారు. ముఖ్యమంత్రి మాత్రం సీబీఐ దర్యాప్తు అవసరం లేదనీ, స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) తో దర్యాప్తు జరిపిస్తే సరిపోతుందనీ సెలవిస్తారు.

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో వందల ఎకరాల భూమి కబ్జా అయిం దంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏపీకి చెందిన దిలీప్‌రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడిని అరెస్టు చేశారు. రిజిస్ట్రార్‌ కార్యా లయంలో పనిచేస్తున్న అధికారుల ఇళ్ళపైనా, వారి బంధువుల ఇళ్ళపైనా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. కోట్ల రూపాయల అవినీతి బయటపడినట్టు వార్తలు వస్తాయి.  ఒక టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడి కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వ భూములను తమ పేర రిజిస్టర్‌ చేయించుకున్నారంటూ ఆరోపణలు వస్తాయి. సదరు ఎంపీ తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ వివాదస్ప దమైన ప్రాంతంలో ఒక్క సెంటు భూమి కూడా లేదని ప్రకటిస్తాడు. ఆ భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకుంటానంటూ ఆ మర్నాడే మరో ప్రకటన విడుదల చేస్తారు. మియాపూర్‌ భూమాయలో ముఖ్యమాయావి గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ అని చెబుతున్నారు.

రాజకీయ నాయకుల, న్యాయమూర్తుల, అధికారుల సహకారం లేకుండా ప్రసాద్‌ ఒక్కరే ఇంత అవినీతి చేయజాలరు. నిజాం వంశానికి చెంది నవారి పేరున ఉన్న భూములకు జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) తీసుకొని వాటిని తనకు కావలసినవారి పేరు మీద రిజిస్టర్‌ చే యించడంలో ప్రసాద్‌ సిద్ధహస్తుడని అందరికీ తెలుసు. ఇంత జరిగిన తర్వాత, భూకుంభకోణం అంటూ ఏమీలేదనీ, ఒక్క గజం భూమి అన్యాక్రాంతం కాలేదనీ, ప్రభుత్వానికి ఒక్క  రూపాయి నష్టం జరగలేదనీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తేల్చేస్తారు. ఆరోపణలపైన దర్యాప్తు జరిపించాలో, లేదో, జరిపిస్తే ఏ సంస్థతో జరిపించాలో నిర్ణయించే స్వేచ్ఛ ముఖ్యమంత్రులకు రాజ్యాంగం ప్రసాదించలేదు. ఇటువంటి ప్రకటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేయలేడు. ఈ విధమైన నిర్ణయాలు తీసు కుంటున్న ప్రధానులూ, ముఖ్యమంత్రుల విషయంలో ఏమి చేయాలో రాజ్యాంగం స్పష్టం చేయలేదు.

ముఖ్యమంత్రులు ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తారో ప్రధానమంత్రులు సైతం అంతే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోగలరని ఇందిరాగాంధీ నిరూపిం చారు (ఇది ఆమె శత జయంతివత్సరం). ఇప్పుడు నరేంద్ర మోదీ చేసి చూపి స్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ముందుగా తెలియదని వదంతులు వచ్చాయి. తనకు తెలుసునని జైట్లీ స్పష్టంగా చెప్పలేదు. ఇవన్నీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సాగుతున్న ధోరణులే. ఇవి ఇప్పుడే వచ్చినవి కావు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారితో పోయేవీ కాదు. అమెరికా రాజ్యాంగం అంత పకడ్బందీగా మన రాజ్యాంగం లేకపోవడం ఈ అక్రమా లకూ, అవకతవకలకూ కారణం.

చట్టం ముందు అందరూ సమానమే అన్న మాట రాతకే పరిమితమా? ప్రజాస్వామ్య సంస్థలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే ఏమి చేయాలి? రాజ్యాంగం చూపుతున్న పరిష్కారం ఏమిటి? రాజ్యాంగంలో ఉన్న లోపాలను రాజకీయ నాయకులూ, న్యాయమూర్తులూ, ఉన్నతాధికారులూ వినియోగించుకొని అక్రమాలు చేస్తూ అవినీతికి పాల్పడుతు న్నారా? అన్ని ప్రశ్నలకూ అవుననే సమాధానం. అవినీతిని నిర్మూలించాలంటే రాజ్యాంగంలో లొసుగులు లేకుండా చేయాలి. అడ్డదారి తొక్కే అవకాశం ఉన్న ప్పుడు ఎంతటివారైనా ఆ దారిలో నడవడానికే ప్రయత్నిస్తారు. దొంగదారి మూసివేయాలి. ఆ పని ఎట్లా చేయాలో నిర్ణయించాలి. అందుకోసం దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి.

శాసనకర్తలు ఊహించని పరిణామాలు సంభవించినప్పుడు ఏమి చేయాలి? ఉదాహరణకు శాసనసభాపతి అధికార పార్టీ ప్రయోజనాలకు అతీ తంగా, ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వ్యవహరించాలని ఊహించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 2003లో వాజపేయి హయాంలో సవరించినప్పుడు నిర్ణయాధికారం సభాపతికే వదిలి వేశారు. సభాపతులు ముఖ్యమంత్రి బంట్లుగా వ్యవహరిస్తున్నారని స్పష్టమైన అనంతరం దాన్ని సవరించకపోతే ఆశించిన లక్ష్యం నెరవేరదు. లోక్‌సభ స్పీకర్‌కు  కూడా ఇది వర్తిస్తుంది. అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే లేదా నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేసే స్పీకర్ల తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. అందువల్ల విచక్షణాధికారం స్పీకర్లకు లేకుండా చేయాలి.

అదేవిధంగా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం అంచనాలను సవరించి నప్పుడు అన్ని కోణాల నుంచీ సవరణలను పరిశీలించి ఆమోదించే లేదా తిరస్క రించే అధికారం ఏదైనా రాజ్యాంగబద్ధమైన ఉన్నతస్థాయి సంస్థకు ఉండాలి. భూకబ్జా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, ఓటుకు నోటు వ్యవహారం కావచ్చు... ఇటువంటి అవినీతి ఆరోపణలపైన మంత్రివర్గం కానీ, శాసనసభ కానీ నిర్ణయం తీసుకోనప్పుడు ఏమిచేయాలి? ఉదాహరణకు ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడికి నగదు ఇస్తూ విడియోలో చిక్కిన రేవంత్‌రెడ్డిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చంద్రబాబు ప్రమోషన్‌ ఇవ్వడం, రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిపైన ఒంటికాలిపై లేవడం చూసిన వారికి రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఎటు వంటి ఒప్పందం కుదిరిందోననే అనుమానం కలుగుతుంది. వాస్తవానికి ఈ వ్యవహారం ఇంత దూరం వచ్చాక, ప్రజలందరికీ తెలిశాక దర్యాప్తు నత్తనకడ నడిస్తే ఎవరిని నిందించాలి? ఈ ప్రశ్నలనూ, ఇటువంటి అనేక అంశాలనూ దేశ వ్యాప్తంగా చర్చించాలి. అందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకో వాలి. ప్రజాస్వామ్యానికి చెల్లించాల్సిన మూల్యం నిరంతర నిఘా. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలే పూనుకోవాలి.

    

   

         - కె. రామచంద్రమూర్తి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement