రైతు గోడు పట్టని ప్రభుత్వాలు!
వ్యవసాయ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో ఇటీవలి సర్వేలు మరోసారి దేశప్రజల కళ్లకు కట్టాయి. తెలంగాణలో 89%, నవ్యాంధ్రలో 93% రైతులు రుణగ్రస్థులై ఉన్నారు. సగం మంది రైతులకు కూడా సంస్థాగత రుణాలు అందదకపోవడం ఈ అప్పులకు ఒక ముఖ్య కారణం. సన్న, చిన్నకారు, కౌలు రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు రుణాలపై ఆధారపడుతున్నారన్నది నగ్నసత్యం.
బ్యాంకులను జాతీయం చేసినా..
అవసరానికి అనుగుణంగా సకాలంలో రుణ పరపతి అందినప్పుడే రైతులు వ్యవసాయ పనులను సకాలంలో పూర్తిచేసి సత్ఫలితాలు పొందగలుగుతారు. కానీ, 1970వ దశకంలో బ్యాంకులను జాతీయం చేసినా ఇప్పటికీ చిన్న, సన్నకారు, కౌలు రైతులకు ఇప్పటికీ బ్యాంకులు పంట రుణాలను, భూమి మెరుగుదలకు దీర్ఘకాలిక రుణాలను తగినంతగా అందించడం లేదు. మెట్రో నగరాల్లో, పట్టణాల్లో వ్యవసాయాధార, ప్రోసెసింగ్ పరిశ్రమలకు అందించే రుణాలనూ వ్యవసాయ రుణాల లెక్కలో చేర్చి లక్ష్యాలు సాధించామని బ్యాంకులు ప్రకటించుకోవటం గమనిస్తూనే ఉన్నాం. రైతుమిత్ర గ్రూపులు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు ఏర్పాటు చేసినా.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చినా ప్రభుత్వం ఆశించిన దాంట్లో కనీసం 5వ వంతు కూడా బ్యాంకులు సహకరించడం లేదు. ఇందువల్లే రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు.. ఆత్మహత్యల పాలవుతున్నారు. ఇది అత్యంత దురదృష్టకరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి అనేకసార్లు రుణమాఫీ కార్యక్రమం చేపట్టినా రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది.
అతలాకుతలం చేస్తున్నది సర్కారు విధానాలే
వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతూ రైతుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నది ప్రభుత్వ విధానాలే. వీటిని మార్చుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయకపోవడం బాధాకరం. రైతులు అష్టకష్టాలు పడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వటానికి నిరాకరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ధరలను ఇష్టానుసారం పెంచుకోవడానికి కంపెనీలకు స్వేచ్ఛనిచ్చారు. ఫలితంగా ఫాస్పేట్, పొటాష్ ధరలు 3 నుంచి 4 రెట్లు పెరిగాయి. దిగుబడులు మాత్రం పెరగటం లేదు. ఫలితంగా వ్యవసాయం గిట్టుబాటు కాని వ్యాపకంగా మారింది.
అనుసరణీయమైనది ప్రకృతి వ్యవసాయం
ఈ పరిస్థితుల్లో వ్యవసాయ ఖర్చులు తగ్గించుకుంటూ, అధికోత్పత్తిని సాధించగలిగే వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉంటుంది. ప్రధానంగా భూసారాన్ని పెంపొందించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. రసాయనిక ఎరువుల వాడకాన్ని బాగా తగ్గించి.. పచ్చిరొట్ట ఎరువులు, చెరకు ఆకు, వరి గడ్డితోపాటు పత్తి, జొన్న, మొక్కజొన్న మొదలగు పంటల వ్యర్థాలను భూమిలో కలిపి దున్నటం ద్వారా భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించాలి. అప్పుడే భూముల్లో హ్యూమస్(జీవనద్రవ్యం) పెరిగి అధిక దిగుబడులు లభిస్తాయి.
సుభాష్ పాలేకర్ బోధిస్తున్న పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానం ఎంతైనా అనుసరణీయం. ఒక్క దేశీ ఆవుతోనే దాదాపు 20 ఎకరాలకు ఎరువు అందించగలిగే వీలుంది. ఆవుమూత్రం, ఆవు పేడతో ఘన, ద్రవ జీవామృతాలను తయారు చేసుకొని వినియోగించుకోవచ్చు. పాలేకర్ చెప్పే బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, నీమాస్త్రం తదితర కషాయాలను ఉపయోగించి చీడపీడలను నివారించుకోవచ్చు.
వ్యవసాయ సంక్షోభం పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన చర్యలివి:
► డా. ఎమ్మెస్ స్వామినాథన్ సారథ్యంలోని జాతీయ రైతు కమిషన్ చేసిన సిఫారసులను ఆమోదించినప్పుడే దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
► వ్యవసాయ ధరల కమిషన్‌ను పునర్వ్యవస్థీకరించి ‘టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్’ను పునఃసమీక్షించాలి. పంట ఉత్పత్తి వ్యయంపై 50 శాతాన్ని కలిపి మద్దతు ధర ప్రకటించాలి. అప్పుడే రైతు కుటుంబం సమాజంలోని ఇతర వర్గాల స్థాయిలో గౌరవప్రదంగా జీవించగలుగుతుంది.
► రైతు భరించగలిగిన స్థాయిలో ప్రీమియం నిర్ణయించి.. పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి.
జీ వ్యవసాయోత్పత్తుల మార్కెట్ ధరల్లో ఒడిదుడుకులు తట్టుకునేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి.
జీ వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల వల్ల మన రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండేందుకు ‘ఇండియన్ ట్రేడ్ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేయాలి.
► {పకృతి వైపరీత్యాల బారిన పడిన రైతులను ఆదుకొనేందుకు ‘వ్యవసాయ విపత్తు నిధి’ని ఏర్పాటు చేయాలి.
► రైతులకు, వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు ఉచిత జీవిత బీమా సదుపాయం కల్పించాలి.
► {V>Ò$×ులు, రైతులకు చైనాలోని ‘టౌన్ విలేజ్ ఎంటర్‌ప్రైజెస్’ మాదిరిగా నైపుణ్యాన్ని మెరుగుపరిచే శిక్షణ ఇవ్వాలి.
► వ్యవసాయ రంగం అభివృద్ధికి కొలమానం పంట ఎన్ని టన్నులు పండింది అని కాకుండా.. రైతు సంతోషంగా, ఆనందంగా ఉన్నాడా లేడన్నది ప్రామాణికం కావాలని స్వామినాథన్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్చించి 8 ఏళ్లు గడచింది. పార్లమెంటులో ఈ నివేదికపై చర్చించడం కానీ, ఆమోదించడం కానీ చెయ్యలేదు. 60 కోట్ల మంది రైతాంగం, గ్రామీణ ప్రజానీకం పట్ల కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యానికిది నిలువుటద్దం పడుతోంది.
► కోట్లాది మంది రైతులు, గ్రామీణ చేతివృత్తుల వారి ఆదాయం, కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగితేనే పారిశ్రామిక, సేవారంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిసీ.. చర్యలు చేపట్టకపోవటం రైతుల దౌర్భాగ్యం.
(వ్యాసకర్త ఏపీ వ్యవసాయ శాఖ మాజీమంత్రిర్యులు) మొబైల్: 93929 59999)
రెతుకు సక్రమంగా సంస్థాగత రుణాలివ్వడం.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం.. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు గిట్టుబాటు ధర కల్పించడం వంటి నిర్మాణాత్మక చర్యలు అమలు చేస్తే తప్ప వ్యవసాయ సంక్షోభాన్ని సమూలంగా పెకలించడం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు.
వడ్డే శోభనాద్రీశ్వరరావు