Cooking-crop
-
రైతు గోడు పట్టని ప్రభుత్వాలు!
వ్యవసాయ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో ఇటీవలి సర్వేలు మరోసారి దేశప్రజల కళ్లకు కట్టాయి. తెలంగాణలో 89%, నవ్యాంధ్రలో 93% రైతులు రుణగ్రస్థులై ఉన్నారు. సగం మంది రైతులకు కూడా సంస్థాగత రుణాలు అందదకపోవడం ఈ అప్పులకు ఒక ముఖ్య కారణం. సన్న, చిన్నకారు, కౌలు రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు రుణాలపై ఆధారపడుతున్నారన్నది నగ్నసత్యం. బ్యాంకులను జాతీయం చేసినా.. అవసరానికి అనుగుణంగా సకాలంలో రుణ పరపతి అందినప్పుడే రైతులు వ్యవసాయ పనులను సకాలంలో పూర్తిచేసి సత్ఫలితాలు పొందగలుగుతారు. కానీ, 1970వ దశకంలో బ్యాంకులను జాతీయం చేసినా ఇప్పటికీ చిన్న, సన్నకారు, కౌలు రైతులకు ఇప్పటికీ బ్యాంకులు పంట రుణాలను, భూమి మెరుగుదలకు దీర్ఘకాలిక రుణాలను తగినంతగా అందించడం లేదు. మెట్రో నగరాల్లో, పట్టణాల్లో వ్యవసాయాధార, ప్రోసెసింగ్ పరిశ్రమలకు అందించే రుణాలనూ వ్యవసాయ రుణాల లెక్కలో చేర్చి లక్ష్యాలు సాధించామని బ్యాంకులు ప్రకటించుకోవటం గమనిస్తూనే ఉన్నాం. రైతుమిత్ర గ్రూపులు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు ఏర్పాటు చేసినా.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చినా ప్రభుత్వం ఆశించిన దాంట్లో కనీసం 5వ వంతు కూడా బ్యాంకులు సహకరించడం లేదు. ఇందువల్లే రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు.. ఆత్మహత్యల పాలవుతున్నారు. ఇది అత్యంత దురదృష్టకరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి అనేకసార్లు రుణమాఫీ కార్యక్రమం చేపట్టినా రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అతలాకుతలం చేస్తున్నది సర్కారు విధానాలే వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతూ రైతుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నది ప్రభుత్వ విధానాలే. వీటిని మార్చుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయకపోవడం బాధాకరం. రైతులు అష్టకష్టాలు పడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వటానికి నిరాకరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ధరలను ఇష్టానుసారం పెంచుకోవడానికి కంపెనీలకు స్వేచ్ఛనిచ్చారు. ఫలితంగా ఫాస్పేట్, పొటాష్ ధరలు 3 నుంచి 4 రెట్లు పెరిగాయి. దిగుబడులు మాత్రం పెరగటం లేదు. ఫలితంగా వ్యవసాయం గిట్టుబాటు కాని వ్యాపకంగా మారింది. అనుసరణీయమైనది ప్రకృతి వ్యవసాయం ఈ పరిస్థితుల్లో వ్యవసాయ ఖర్చులు తగ్గించుకుంటూ, అధికోత్పత్తిని సాధించగలిగే వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉంటుంది. ప్రధానంగా భూసారాన్ని పెంపొందించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. రసాయనిక ఎరువుల వాడకాన్ని బాగా తగ్గించి.. పచ్చిరొట్ట ఎరువులు, చెరకు ఆకు, వరి గడ్డితోపాటు పత్తి, జొన్న, మొక్కజొన్న మొదలగు పంటల వ్యర్థాలను భూమిలో కలిపి దున్నటం ద్వారా భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించాలి. అప్పుడే భూముల్లో హ్యూమస్(జీవనద్రవ్యం) పెరిగి అధిక దిగుబడులు లభిస్తాయి. సుభాష్ పాలేకర్ బోధిస్తున్న పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానం ఎంతైనా అనుసరణీయం. ఒక్క దేశీ ఆవుతోనే దాదాపు 20 ఎకరాలకు ఎరువు అందించగలిగే వీలుంది. ఆవుమూత్రం, ఆవు పేడతో ఘన, ద్రవ జీవామృతాలను తయారు చేసుకొని వినియోగించుకోవచ్చు. పాలేకర్ చెప్పే బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, నీమాస్త్రం తదితర కషాయాలను ఉపయోగించి చీడపీడలను నివారించుకోవచ్చు. వ్యవసాయ సంక్షోభం పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన చర్యలివి: ► డా. ఎమ్మెస్ స్వామినాథన్ సారథ్యంలోని జాతీయ రైతు కమిషన్ చేసిన సిఫారసులను ఆమోదించినప్పుడే దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ► వ్యవసాయ ధరల కమిషన్‌ను పునర్వ్యవస్థీకరించి ‘టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్’ను పునఃసమీక్షించాలి. పంట ఉత్పత్తి వ్యయంపై 50 శాతాన్ని కలిపి మద్దతు ధర ప్రకటించాలి. అప్పుడే రైతు కుటుంబం సమాజంలోని ఇతర వర్గాల స్థాయిలో గౌరవప్రదంగా జీవించగలుగుతుంది. ► రైతు భరించగలిగిన స్థాయిలో ప్రీమియం నిర్ణయించి.. పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. జీ వ్యవసాయోత్పత్తుల మార్కెట్ ధరల్లో ఒడిదుడుకులు తట్టుకునేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. జీ వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల వల్ల మన రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండేందుకు ‘ఇండియన్ ట్రేడ్ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేయాలి. ► {పకృతి వైపరీత్యాల బారిన పడిన రైతులను ఆదుకొనేందుకు ‘వ్యవసాయ విపత్తు నిధి’ని ఏర్పాటు చేయాలి. ► రైతులకు, వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు ఉచిత జీవిత బీమా సదుపాయం కల్పించాలి. ► {V>Ò$×ులు, రైతులకు చైనాలోని ‘టౌన్ విలేజ్ ఎంటర్ప్రైజెస్’ మాదిరిగా నైపుణ్యాన్ని మెరుగుపరిచే శిక్షణ ఇవ్వాలి. ► వ్యవసాయ రంగం అభివృద్ధికి కొలమానం పంట ఎన్ని టన్నులు పండింది అని కాకుండా.. రైతు సంతోషంగా, ఆనందంగా ఉన్నాడా లేడన్నది ప్రామాణికం కావాలని స్వామినాథన్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్చించి 8 ఏళ్లు గడచింది. పార్లమెంటులో ఈ నివేదికపై చర్చించడం కానీ, ఆమోదించడం కానీ చెయ్యలేదు. 60 కోట్ల మంది రైతాంగం, గ్రామీణ ప్రజానీకం పట్ల కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యానికిది నిలువుటద్దం పడుతోంది. ► కోట్లాది మంది రైతులు, గ్రామీణ చేతివృత్తుల వారి ఆదాయం, కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగితేనే పారిశ్రామిక, సేవారంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిసీ.. చర్యలు చేపట్టకపోవటం రైతుల దౌర్భాగ్యం. (వ్యాసకర్త ఏపీ వ్యవసాయ శాఖ మాజీమంత్రిర్యులు) మొబైల్: 93929 59999) రెతుకు సక్రమంగా సంస్థాగత రుణాలివ్వడం.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం.. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు గిట్టుబాటు ధర కల్పించడం వంటి నిర్మాణాత్మక చర్యలు అమలు చేస్తే తప్ప వ్యవసాయ సంక్షోభాన్ని సమూలంగా పెకలించడం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు -
కాయకల్ప చికిత్స ప్రకృతి సేద్య కళతో పునరుజ్జీవనం!
{పకృతి సేద్య కళను ఉద్యమ స్ఫూర్తితో రైతులకందిస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ అన్నదాతల ఆత్మహత్యల్లేని ఆరోగ్యదాయక సమాజం కోసం విస్తృతంగా రైతు శిక్షణ శిబిరాలు 6 నెలల్లో వెయ్యి మంది ప్రకృతి వ్యవసాయ ఉపాధ్యాయులకు శిక్షణతో ఊరూరా శిబిరాలు.. ఉచిత కాల్‌సెంటర్.. {పకృతి వ్యవసాయ పంచాంగం రూపకల్పన.. రైతుల భాగస్వామ్యంతో స్వతంత్ర మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు యత్నాలు తెలుగునాట రెండేళ్లలో ప్రకృతి వ్యవసాయ విప్లవం తథ్యం.. ఐదేళ్లలో పూర్తిగా రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పతి సాధ్యమే.. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుగు రాష్ట్రాల సారథి పులిమామిడి రామకృష్ణారెడ్డి వెల్లడి తెలుగునాట సంక్షోభంలో కూరుకుపోయి అల్లాడుతున్న అన్నదాతలకు ప్రకృతి వ్యవసాయాన్ని ‘జీవన కళ’తో మేళవించి అందిస్తోంది ఆర్ట్ ఆఫ్ లివింగ్(ఏఓఎల్) ఆధ్యాత్మిక సంస్థ. రైతుల జీవితాలను, భూములను పునరుజ్జీవింపజేయడానికి సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా సులువుగా సాధ్యమవుతుందని ఏఒఎల్ విశ్వసిస్తున్నదని తెలుగు రాష్ట్రాల కమిటీ అధ్యక్షుడు పులిమామిడి రామకృష్ణారెడ్డి (98490 57599) ‘సాక్షి’ ఇంటర్వ్యూలో తెలిపారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో జన్మించిన పారిశ్రామికవేత్త రామకృష్ణారెడ్డి ఏఓఎల్‌కు ఎనిమిదేళ్లుగా సారథ్యం వహిస్తున్నారు. అప్పులు, ఆత్మహత్యల్లేని వ్యవసాయాన్ని రైతులు.. విషరహిత ఆహారాన్ని వినియోగదారులు కోరుకుంటున్నారన్నారు. ఈ లక్ష్య సాధన కోసమే గత ఆర్నెల్లుగా ‘రుషి కృషి’ పేరుతో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ఇస్తు న్నామని చెప్పారు. మనిషి మారితేనే వ్యవసాయ పద్ధతి మారుతుందంటూ.. జీవన కళతో మేళవించిన వ్యవసాయ శిక్షణ సత్ఫలితాలనిస్తున్నదన్నారు. ఇలాఉండగా, హైదరాబాద్‌కు చెందిన చక్కిలం ఉమామహేశ్వరి(90004 08907) ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యకలాపాలను సమన్వయపరుస్తున్నారు. బ్యాంకులో ఉన్నతోద్యాగాన్ని పదేళ్లు ముందే వదిలేసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలకు ఆమె పూర్తికాలాన్ని వెచ్చిస్తున్నారు. చాలా గ్రామాల్లో ఆవుల జాడే లేదని, వయసులో ఉన్న వారు పొట్టచేతపట్టుకొని పట్నాలకు వలస పోగా వృద్ధులే గ్రామాల్లో మిగిలారన్నారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చే శక్తి ప్రకృతి సేద్యానికే ఉందని ఆమె విశ్వసిస్తున్నారు. వ్యవసాయ సంక్షోభానికి ప్రకృతి సేద్యమే పరిష్కారమా? అవును. యూరప్‌కు రెండు, మూడు వేల ఏళ్లు, అమెరికాకు రెండొందల ఏళ్లకు క్రితమే వ్యవసాయం తెలుసు. మనది పది వేల ఏళ్ల నాటి సుసంపన్నమైన వ్యవసాయ సంస్కృతి. మన దేశప్రజల డీఎన్ఏలోనే వ్యవసాయ సంస్కృతి ఉంది. హరిత విప్లవం పేరిట రసాయనిక వ్యవసాయం అలవాటు చేయడం వల్ల ఈ సంస్కృతి ధ్వంసమైంది. 30 శాతం సాగు భూమి నిస్సారమైపోవడమో, చౌడుదేలడమో అయ్యింది. ఇప్పుడు తిరిగి ప్రకృతి వ్యవసాయ సంస్కృతిని అలవరచుకోవడమే సంక్షోభానికి పరిష్కారం. {పకృతి సేద్యంపై శిక్షణ ఇచ్చే క్రమంలో అవరోధాలను ఎలా అధిగమిస్తున్నారు? మనిషి మారితేనే వ్యవసాయ పద్ధతి మారుతుంది. అలవాటు లేని ప్రకృతి సేద్య పద్ధతి గురించి తెలియజెప్పడానికి ముందు జీవన కళ గురించి పరిచయం చేస్తున్నాం. టన్నుల కొద్దీ పశువుల ఎరువు అవసరం లేని, దుక్కి అవసరంలేని, స్వల్ప ఖర్చుతో చేసుకునే పాలేకర్ పద్ధతిని తెలియజెపుతున్నాం. ఒక ఆవు ద్వారా 10-15 ఎకరాల్లో వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, పురుగుమందులు, శిలీంధ్రనాశనులు తయారు చేసుకునే పద్ధతులు నేర్పిస్తున్నాం. ఆవును కొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు.. ఆరు నెలల్లో ఆవు ఖరీదు తిరిగొచ్చేస్తోంది. రైతుల ఆర్థిక, పర్యావరణ, సాంఘిక సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నాం. ప్రభుత్వ సంస్థలు నిర్వహించే శిక్షణకు స్పందించని రైతులు సైతం మా శిక్షణకు స్పందిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులకు, సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పొందిన రైతులకు ఎటువంటి తోడ్పాటునందిస్తారు? ఒకసారి శిక్షణ పొందిన రైతు.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందంలో జీవిత సభ్యుడవుతాడు. ప్రకృతి వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలు, సందేహాల నివృత్తి కోసం ఉచిత కాల్‌సెంటర్‌ను రెండు నెలల్లో ఏర్పాటు చేస్తున్నాం. 24 మంది శాస్త్రవేత్తల బృందం నిరంతరం అన్ని భాషల్లోనూ రైతులకు సూచనలు సలహాలు ఇస్తారు. కరువు బారిన పడకుండా వ్యవసాయం చేసే మెలకువలతో కూడిన ‘ప్రకృతి వ్యవసాయ పంచాగం’ సిద్ధమవుతోంది. మారిన వాతావరణాన్ని బట్టి వ్యవసాయ పనులు 1 లేదా 2 కార్తెలు ముందుకు జరగాలన్నది మా అభిప్రాయం. వర్షాల తీరు మారింది. స్థానికంగా చెట్లు, అడవి ఎక్కువగా ఉన్న చోటే కురుస్తున్నాయి. శాస్త్రబద్ధమైన ఈ విషయ పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం ద్వారా.. వారిలో చెట్ల పెంపకం, చెట్ల జాతులతో కలిపి వార్షిక పంటలు పండించడంపై ఆసక్తిని పెంచుతున్నాం. భూసారం పెంపుదల, చౌడు భూమిని తిరిగి వినియోగంలోకి తెచ్చుకోవడం ప్రకృతి సేద్య పద్ధతుల ద్వారానే సాధ్యం.. వీటన్నిటినీ నిరంతరం సమన్వయం చేయడానికి శ్రీశ్రీ కిసాన్ సంఘాలను, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. రైతులందరికీ ప్రకృతి వ్యవసాయ శిక్షణ అందేదెలా? మా సంస్థకు విస్తృతమైన యంత్రాంగం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే నైపుణ్యం, దాతల మద్దతు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల రైతులందరికీ రెండేళ్లలో శిక్షణ ఇచ్చేదిశగా కదులుతున్నాం. జూన్ నుంచి వారానికో శిబిరం నిర్వహిస్తున్నాం. రాబోయే 6 నెలల్లో వెయ్యి మంది ప్రకృతి సేద్యం నేర్పించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే ఎందరో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనుభవం గడించారు. వీరి అనుభవాలు చెప్పించి రైతుల్లో పూర్తి భరోసా కలిగిస్తున్నాం. ప్రతి గ్రామంలో కొందరికి సరిగ్గా నేర్పితే చాలు.. వాళ్లను చూసి మిగతా వాళ్లు నేర్చుకుంటారు. విరాళాలు, ప్రభుత్వ తోడ్పాటుతో రైతులందరికీ రెండేళ్లలో శిక్షణ ఇస్తాం. ఏదేమైనా ఐదేళ్లలో 100% విష రసాయనాల అవశేషాల్లేని ఆహారోత్పత్తి జరిగేలా చూడాలన్నది మా లక్ష్యం. సహజాహారంపై చైతన్యం వినియోగదారుల్లోనూ పెరుగుతోంది. {పకృతి వ్యవసాయదారుల మార్కెటింగ్ సమస్యలపై మీ అభిప్రాయం? వేల సంఖ్యలో రైతులు ఇప్పటికే ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వారికి ఖర్చు తగ్గింది. ఆదాయం పెరిగింది. సరుకును మార్కెట్‌కు తీసుకెళ్లాల్సిన బాధే లేదు. మంచి ఆహారం కావాల్సిన వాళ్లు రైతుల ఇళ్లకొచ్చి కొనుక్కెళ్తున్నారు. రైతుల భాగస్వామ్యంతో విశ్వసనీయమైన మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. రైతులకు నిరంతరం అండగా ఉండి నడిపించేందుకు ఏ లోటూ లేకుండా చూస్తున్నాం. - సంభాషణ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
నేలమ్మా.. మన్నించమ్మా!
జీవానికి మూలాధారమైన నేలతల్లి నిర్లక్ష్యమై వట్టి పోతోంది. సకల జీవకోటికీ స్తన్యం పడుతున్న నేలమ్మే నాగరికతకు పునాది. మానవులతోపాటు భూమిపైన, భూమి లోపల సకల జీవులకూ ప్రాణాధారం భూమాతే. అన్నదాత చేతుల మీదుగా మన కంచాల్లోకి వస్తున్న ఆహారంలో 99% భూమాత ప్రసాదమే! ఆహారం, నీరు, వాతావరణం, జీవవైవిధ్యం, జీవితం.. వీటన్నిటికీ ప్రాణ దాతైన భూమాతతో సజీవ సంబంధాన్ని కొనసాగించడంలో మనం ఘోరంగా విఫలమయ్యాం. అందుకే.. అంతటి చల్లని తల్లికే పుట్టెడు కష్టం వచ్చిపడింది. సాగు భూమిలో 25% ఇప్పటికే నిస్సారమైంది. జీవాన్ని.. సేంద్రియ పదార్థాన్ని కోల్పోయింది. చౌడు తేలింది. చట్టుబండైంది. నీటిని గ్రహించే శక్తి నశించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. పంటల సాగుకు పనికిరాకుండా పోయింది.. నాశనమవుతూనే ఉంది.. ప్రతి ఏటా రెండున్నర కోట్ల ఎకరాల్లో సుసంపన్నమైన నేల నాశనమైపోతున్నది. అంటే.. ప్రతి నిమిషానికి 30 ఫుట్‌బాల్ కోర్టులంత మేర సారవంతమైన భూమి పనికిరాకుండా పోతోంది. ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) నివేదిక ప్రకారం.. నేలతల్లి ప్రాణాలను అనుక్షణం మనమే చేజేతులా తోడేస్తున్నాం. ఈ విధ్వంసం అంతా వ్యవసాయం పేరిట సాగిపోతోంది.. జీవనాధారంగా ప్రారంభమైన వ్యవసాయం.. విచక్షణారహితంగా వాడుతున్న వ్యవసాయ రసాయనాల వల్లనే ముఖ్యంగా నేల నిర్జీవమవుతోంది. తల్లి ఆరోగ్యం పాడైతే బిడ్డ బాగుంటుందా? అతిగా రసాయనిక అవశేషాలున్న ఆహారం తిన్న నేలతల్లి బిడ్డల ఆరోగ్యం కూడా అంతకంతకూ క్షీణిస్తోంది. మానవాళి మనుగడ సజావుగా సాగాలంటే.. నెత్తికెక్కిన కళ్లను నేల లోతులకు మళ్లించాలి. వనరుల విధ్వంసం ఆగాలంటే.. పారిశ్రామిక దేశాలు రుద్దిన సాంద్ర వ్యవసాయ పద్ధతిని వదిలేసి, ప్రకృతికి దగ్గరవ్వాలని ఎఫ్ఏవో మొత్తుకుంటున్నది. ఆహార భద్రత, పర్యావరణ వ్యవస్థలకు భూమి ఆరోగ్యం ప్రాణావసరమన్న స్పృహను పాలకుల్లో, ప్రజల్లో రగిలించడం తక్షణావసరం. ఇందుకోసమే 2015ను ‘అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అంతర్జాతీయ భూముల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5(రేపు) నుంచే భూముల పరిరక్షణకు పాలకులు, రైతులు, ప్రతి మనిషీ కదలాలని పిలుపునిచ్చింది. భూసారాన్ని పునరుద్ధరించుకుంటూనే నిశ్చింతగా జీవనాధారమైన పంటల సాగుకు ప్రపంచమంతా కంకణబద్ధులు కావాల్సిన తరుణమిది. వాతావరణ మార్పుల ప్రతికూల పరిస్థితుల మధ్య తెలుగు రాష్ట్రాలు ఈ అంశంపై తీక్షణంగా దృష్టిసారించాలి. భూసార విధ్వంసక విధానాలకు, అసపవ్య సాగు పద్ధతులకు పాతరేద్దాం.. ప్రకృతికి కీడు చేయని పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న ఆదర్శ అన్నదాతలకు జేజేలు పలుకుదాం.. నిస్సారమైన నేలకు తావు లేని రోజు కోసం అందరం ఉద్యమిద్దాం. జీవిత కాలంలో సెంటీమీటరు నేలను కూడా మనం సృష్టించలేం. అలాంటప్పుడు భూమిని పాడు చేసే హక్కు మనకెక్కడిది? ఆ తల్లి స్తన్యం తాగి రొమ్ము గుద్దడం మాని, నేలమ్మను పరిరక్షించుకుంటే పోయేదేమీ లేదు.. ఆహారోత్పత్తి 58% పెరగటం(ఎఫ్ఏఓ అంచనా) తప్ప! మనిషి పనుల మూలంగా నేలమ్మ చాలా వేగంగా సారాన్ని కోల్పోతూ సాంఘిక, ఆర్థిక, ఇతర సమస్యలకు దారితీస్తోంది. నేలను అపసవ్యమైన రీతుల్లో అతిగా వినియోగించడం మనుగడకే ఎసరు తెస్తోంది. హరిత విప్లవ కాలంలో ముందుకొచ్చిన సాంద్ర వ్యవసాయ పద్ధతుల వల్ల గత ఆరు దశాబ్దాలుగా నేల గతమెన్నడూ ఎరుగనంతగా పతనమైంది. అవసరానికి మించి దున్నడం, ఏదో ఒకే పంటను సాగు చేయడం, సేంద్రియ ఎరువులు చాలినంతగా వేయకపోవడం, రసాయనిక ఎరువులతోపాటు కలుపు మందులను విచ్చలవిడిగా వాడటం, కాలువ నీటి వాడకంలో అపసవ్య పోకడలు.. ఇవీ భూములు నాశనం కావడానికి ముఖ్య కారణాలని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే ఆహారోత్పత్తి వ్యవస్థే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దేశంలో 12 కోట్ల 10 లక్షల హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది. ఇందులో 2 కోట్ల 28 లక్షల హెక్టార్ల సాగు భూమి కేవలం రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడడం వల్ల నిర్జీవమై సాగుకు పనికిరాకుండా పోయింది. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చే క్రమంలో మన దేశంలో సాగు భూమి తగ్గిపోతున్నది. 1951లో ప్రతి మనిషికీ 1.19 ఎకరాల చొప్పున సాగు భూమి అందుబాటులో ఉండేది. ఇది 1991 నాటికి 40 సెంట్లకు తగ్గింది. 2035 నాటికి 20 సెంట్లకు తగ్గేలా ఉంది. ఉత్పాదకతను కోల్పోతున్న లక్షల హెక్టార్లు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 రకాల భూములున్నాయి. మెట్ట, మాగాణి అనే తేడా లేకుండా అన్ని రకాల భూముల్లోనూ సారం అంతకంతకూ తగ్గిపోతూ పంటల దిగుబడి క్షీణిస్తోంది. తెలంగాణ (భూముల్లో 29 శాతం) లో 34 లక్షల హెక్టార్ల భూమి ఏదో ఒక రకంగా ఉత్పాదక శక్తిని కోల్పోయిందని తాజా అంచనా. ఆంధ్రప్రదేశ్ (భూముల్లో 36 శాతం)లోని 58 లక్షల హెక్టార్ల భూములు నిస్సారంగా మారాయి. సేంద్రియ కర్బనం 0.5 శాతానికి అడుగంటిందని అంచనా. దీన్ని 2 శాతానికి పెంచుకోవడమే లక్ష్యంగా బహుముఖ వ్యూహాలను ప్రభుత్వం అమల్లోకి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, వీటిని రైతు దగ్గరకు తీసుకెళ్లే యంత్రాంగమే అరకొరగా ఉంది. రైతుకు సాంద్ర వ్యవసాయాన్ని అలవాటు చేసిన ప్రభుత్వం.. దాని ద్వారా ఏర్పడిన భూసార సమస్యను అధిగమించే సులభమైన, ఆచరణాత్మక పద్ధతులను రైతులకు అందించలేని స్థితిలో ఉండిపోవడం విషాదకర వాస్తవం. దిక్కుతోచని బడుగు రైతు మనుగడకే ఇది పెనుశాపంగా పరిణమించింది. ఫ్రాంక్లిన్ డెలొనొ రూజ్వెల్ట్ ఇలా అన్నారు: ‘భూములను నాశనం చేసుకునే దేశం, తనను తాను నాశనం చేసుకుంటుంది’. ప్రస్తుతం మన భూములు, మన దేశం పరిస్థితి ఇలాగే ఉంది. ప్రత్యామ్నాయాల అడుగుజాడలు.. ప్రభుత్వం చేష్టలుడిగినంత మాత్రాన అన్నదాతలు అక్కడే ఆగిపోరు. తమ సమస్యలకు తామే పరిష్కారాలు వెతుక్కుంటూనే ఉంటారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడడం పూర్తిగానో, పాక్షికంగానో మానేసి.. స్థానిక వనరులతోనే ఖర్చు తక్కువతో కూడిన ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. భూసారాన్ని పెంపొందించుకుంటూనే పంట దిగుబడులనూ పెంచుకుంటున్నారు. టన్నులకొద్దీ పశువుల ఎరువుల అవసరం లేకుండానే కొత్త పద్ధతుల్లో తక్కువ పశువులతోనే ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వాలు అత్యాధునికమైనవన్న భ్రమలో విదేశీ నమూనా ఎండమావుల వెంటపడకుండా.. మన రైతుల అనుభవంలో నిగ్గుతేలిన మేలైన, ప్రకృతికి అనుగుణమైన ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై దృష్టిపెట్టాలి. మట్టిలోనే పుట్టి మట్టిలోనే బతుకుతూ సమాజానికి మూడు పూటలా తిండి పెడుతున్న అచ్చమైన రైతుల అనుభవాల నుంచి బేషజాల్లేకుండా నేర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అన్నదే అసలు ప్రశ్న. మన భూముల, మన రైతుల, వినియోగదారుల భవిష్యుత్తు, ఆరోగ్యం- ఈ ప్రశ్నకు వచ్చే సమాధానంపైనే ఆధారపడి ఉంది. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ భూసారాన్ని రక్షించుకునేలా సాగు మారాలి ఉత్పాదకత పెరగాలంటే భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచాలి. రసాయనిక, సేంద్రియ, జీవన ఎరువులు కలిపి వాడాలి. 25-50% పోషకాలను సేంద్రియ, జీవన ఎరువుల ద్వారా అందించాలి. భూసారాన్ని పరిరక్షించుకునే విధంగా వ్యవసాయ పద్ధతులు మార్చుకోవాలి. కౌలు, యువ రైతులకు అవగాహన కలిగించేందుకు విస్తరణ వ్యవస్థను పటిష్టం చేయాలి. సూక్ష్మజీవుల ద్వారా పోషకాలను అందించడంపై దృష్టిపెట్టాలి. సూక్ష్మజీవుల గురించి మనకు తెలిసింది ఒక శాతమే. అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం సందర్భంగా ఈ అంశాలపై శ్రద్ధ చూపాలి. పరిశోధన ఫలితాలను రైతులకు అందించడానికి విస్తృత కృషి జరగాలి. సాయిల్ రిసోర్సెస్ మ్యాపింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు ఉపకరిస్తాయి. - డా. డి. బాలగురవయ్య, ప్రధాన శాస్త్రవేత్త, భూవిజ్ఞాన శాస్త్ర విభాగం, ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ), హైదరాబాద్ ప్రకృతి వ్యవసాయంతోనే భూముల పునరుజ్జీవనం! మట్టి మొక్కలకు పునాది. ప్రకృతిసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలో జీవరాశి (వానపాములు, సూక్ష్మజీవులు, పురుగులు, శిలీంధ్రాలు, ఇంకా మట్టిలో ఉండే అనేక ప్రాణులు) నిరంతరాయంగా పోషకాలను మొక్కల వేళ్లకు అందిస్తాయి. కానీ గత అరవయ్యేళ్లుగా రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, శిలీంధ్రనాశనులు, కలుపుమందులు వాడుతుండడం వల్ల మట్టిలో ఉండాల్సిన వానపాములు, ఇతర జీవరాశి నాశనమై భూమి నిస్సారమైపోయింది. ఏదైనా ఎరువును బయటి నుంచి అధికంగా తెచ్చి వేస్తేనే గానీ పంట పండని దుస్థితి నెలకొంది. ఇప్పుడు మనం రసాయనిక ఎరువులు, పురుగుమందులు, సూక్ష్మపోషకాలు పొలంలో వేయకుండా పంటలు పండించాలనుకుంటే.. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా మట్టిలోని జీవరాశిని, వానపాములను తిరిగి ఆహ్వానించాలి. ప్రకృతి మనకు అందించిన ఈ అద్భుతమైన వ్యవసాయ విజ్ఞానానికి అడ్డుచెప్పే వారెవరూ ఇప్పుడు లేరు..ప్రాణావసరం కాబట్టి! - సుభాష్ పాలేకర్, ప్రకృతి వ్యవసాయోద్యమ సారధి, మహారాష్ట్ర (‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం - 1’ పుస్తకం నుంచి) నడుస్తుంటే మట్టి పెళ్లలు గుచ్చుకునేవి..! పచ్చిరొట్ట ఎరువులు, ఘనజీవామృతం, జీవామృతం వాడుతూ 6 ఎకరాల్లో నాలుగేళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తున్నా. సేంద్రియ కర్బనం 0.5% నుంచి 0.95%కు పెరిగింది. అంతకుముందు పొలంలో చెప్పుల్లేకుండా నడిస్తే మట్టిపెళ్లలు గుచ్చుకునేవి. ఇప్పుడు నడి ఎండాకాలంలోనూ చెప్పుల్లేకుండా హాయిగా నడవొచ్చు. ఎకరానికి బీపీటీ ధాన్యం 28-30 బస్తాల దిగుబడి వస్తోంది. మా పొలం తుపాన్లు తట్టుకొని పడిపోకుండా నిలబడింది. నేల తేమ ఆరిపోదు. తక్కువ నీరే సరిపోతున్నది. - కోగంటి రవికుమార్ (80192 59059), సేంద్రియ రైతు, ఇందుపల్లి, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా సేంద్రియ కర్బనం 3% నుంచి 0.5%కి తగ్గింది.. జీవామృతం, పంచగవ్య, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువుల ద్వారా సేంద్రియ వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తున్నాం. భూముల్లో సేంద్రియ కర్బనం 50 ఏళ్ల నాడు 3% ఉండే 0.5%కి తగ్గింది. దీన్ని కష్టపడి 1%కి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులను చైతన్యవంతం చేస్తున్నాం. 8 ఏళ్లలో సేంద్రియ సాగు విస్తీర్ణం 5% నుంచి 25%కి పెరిగింది. సేంద్రియ ముడి బియ్యంతోపాటు సేంద్రియ పాలూ అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగ దారుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి, వైద్య ఖర్చులు 50% తగ్గాయి. రైతులంతా సేంద్రియ సాగుకు మళ్లితే ఆసుపత్రుల అవసరమే ఉండదు. ప్రతి రైతుకూ నాటు ఆవు లేదా దూడైనా ఉండాలి. - కే సాంబశివరావు (97011 08511), సేంద్రియ సాగు సమన్వయకర్త, ప్రభుత్వ రైతు శిక్షణా కేంద్రం, విజయవాడ -
విధానాలు మారితేనే భూమి పదిలం!
కోల్పోతున్న వనరులను తనంతట తానే సమకూర్చుకునే సహజ శక్తి భూమికి ఉంది. ఈ శక్తిని రసాయనిక వ్యవసాయం కుంగదీస్తున్నది. ఫలితంగా నాగరికతకు మూలమైన భూమాత నిస్సారమవుతోంది. ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రకృతికి హాని చేయని సాగు పద్ధతులెన్నో అందుబాటులో ఉన్నా.. ప్రభుత్వం పనిగట్టుకొని విస్మరిస్తోంది. ఏ కోణం నుంచి చూసినా మనం భూముల్ని ఎంతో గౌరవిస్తాం. అందువల్ల భూగోళాన్ని భూమాతగా భావిస్తుంటాం. మానవులతో సహా అన్ని జీవరాశులు రూపుదిద్దుకోవడానికి భూమాత ఒక వేదికగా కొనసాగడమే దీనికి కారణం. మన నాగరికత, సంస్కృతి భూమి చుట్టూ తిరుగుతుంటాయి. మన నాగరికత, సంస్కృతి ప్రారంభ కాలం నుంచి మనకు అవసరమైన మేర మాత్రమే భూముల(ప్రకృతి) నుంచి ఆహారాన్ని, ఇతర అవసరాలను తీర్చుకునేవాళ్లం. ఆ మేరకే ఉత్పత్తి చేసే వాళ్లం. కోల్పోయిన వనరులను ప్రకృతి తిరిగి తనంతట తానే పునరుజ్జీవింప చేసుకునేది. పశుపోషణ సేద్యంలో ముఖ్య భాగంగా కొనసాగింది. అలా శతాబ్దాలు గడచినా భూమి ఉత్పాదకత, ఆరోగ్యం ఏమీ క్షీణించలేదు. కానీ, సొంత వినిమయానికి కాక కేవలం లాభాపేక్షతో ‘సంపాదించి ఆస్తులను కూడబెట్టుకోవడానికి’ ప్రకృతి వనరులను వేగంగా కొల్లగొట్టడం దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. కోల్పోతున్న వనరులను ప్రకృతి తనంతట తాను పునరుజ్జీవింప చేయలేని స్థితికి చేరింది. పారిశ్రామిక రసాయనిక వ్యవసాయ పద్ధతుల వల్ల భూమాత తిరిగి కోలుకోలేని విధంగా క్షీణిస్తోంది. ఒకప్పుడు భూమాతపై ఎంతో విశ్వాసంతో ఆధారపడిన మనం ఇప్పుడు ఆస్థాయిలో ఆధారపడలేకపోతున్నాం. పర్యావరణాన్ని రక్షించే సేద్యం మేలు ఈ నేపథ్యంలో పంటలు పండించే ప్రక్రియను తిరిగి ప్రకృతిలో భాగంగా మార్చుకొని సుస్థిరాభివృద్ధిని సాధించాలి. అదెలాగన్నదే నేడు మన ముందున్న ప్రధాన ప్రశ్న. దీనికి సమాధానంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, ప్రకృతిలో భాగంగా సేద్యం కొనసాగాలి. సేద్య భూముల్లో పెద్ద ఎత్తున సేంద్రియ పదార్థాలను కలపడం మినహా మరో పద్ధతి లేదు. అయితే, ఇప్పుడు మన సేద్యం ప్రధానంగా 5 ఎకరాల లోపు విస్తీర్ణం గల చిన్న కమతాలలో కొనసాగుతోంది. పైగా, సేద్య భూమిపై ఏ హక్కూలేని కౌలు సేద్యం వేగంగా విస్తరిస్తోంది. కౌలు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తక్షణం లాభాన్ని చేకూర్చే సేద్య పద్ధతులను, సాంకేతికాలను వినియోగిస్తున్నారే తప్ప.. దీర్ఘకాలంలో భూమి ఉత్పాదకతకు అవసరమైన సేంద్రియ ఎరువుల వాడకంపై శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా, భూముల ఉత్పాదకత రోజురోజుకూ క్షీణిస్తున్నది. భూసారం పెంపుపై రైతులకు దీర్ఘకాల ఆసక్తి కలిగించేలా సర్కారూ చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదు. కార్పొరేట్ సేద్యం నష్టదాయకం ప్రపంచీకరణ దృష్ట్యా ప్రభుత్వం కార్పొరేట్ సేద్యానికే మొదటి ప్రాధాన్యతనిస్తున్నది. కార్పొరేట్ యాజమాన్యాలు కూడా తక్షణ అధిక లాభాల్నిచ్చే భారీ యాంత్రీకరణకు, రసాయనిక ఎరువులు, ఇతర రసాయనాల వాడకానికే ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప సేంద్రియ ఎరువులను వాడుతూ దీర్ఘకాలంలో భూమి ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు. అందువల్ల కార్పొరేట్ అనుకూల విధానాలను పునరంచనా వేసి.. సుస్థిర వ్యవసాయోత్పత్తికి దోహదపడే విధంగా వాటిని మార్చాలి. రసాయనిక వ్యవసాయం వల్ల వాతావరణంలో వస్తున్న మార్పుల దుష్పలితాలను తుపాన్లు, అకాల వర్షాలు, వరదలు, అనావృష్టి, కరవు కాటకాల రూపంలో ప్రతి సంవత్సరమూ అనుభవిస్తూనే ఉన్నాం. వాతావరణం వేడెక్కడానికి ప్రధాన కారకులు అభివృద్ధి చెందిన దేశాలే. వాతావరణ మార్పులను నిలువరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సిద్ధాంత రీత్యా అంగీకారం తెలుపుతూనే.. తమ వంతు బాధ్యతలు తీసుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు పూర్తిగా అంగీకరించడం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఈ భారాన్ని భరించాలని ఒత్తిడి చేస్తున్నాయి. కానీ, తుపాన్లు వరదలు, కరవు కాటకాల వల్ల జరుగుతున్న నష్టాలు స్థానిక స్వభావం కలవి. వీటి దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి స్థానికంగానే గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల మన దేశం గట్టి చర్యలు తీసుకోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్పొరేట్ అనుకూల విధానాలు మారాలి మన దేశంతో సహా 30 దేశాల నుంచి దాదాపు 600 మంది ఉన్నతస్థాయి శాస్త్రజ్ఞులు, విధాన నిర్ణేతలు 2008లో సమావేశమై ఈ చర్యలపై చర్చించారు. సుస్థిర వ్యవసాయోత్పత్తికి వ్యవసాయ రసాయనాలు దోహదపడవనీ, సేంద్రియ ఎరువులను వాడాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. వచ్చే 50 ఏళ్లలో చింతలేని వ్యవసాయానికి తగిన సాంకేతికాలు.. చిన్న కమతాల రైతులకు అనుకూలంగా ఉన్నాయి. వీటిని అమలు చేయడానికి సంసిద్ధత తెలుపుతూ భారతదేశం సంతకం చేసింది. కానీ, కార్పొరేట్ సేద్యాన్ని ప్రోత్సహించే విధానాలనే ప్రభుత్వం కొనసాగిస్తోంది. చిన్న కమతాల స్థాయిలో సేంద్రియ ఎరువుల వాడకంపై రైతుల్లో ఆసక్తిని కలిగించడానికి ప్రభుత్వం విధానాలను మార్చాలి. వాతావరణ మార్పుల్ని, వాటి దుష్ర్పభావాలను గమనంలో ఉంచుకొని భారత ప్రభుత్వం 2011లో వాతావరణ ఒడుదొడుకులను తట్టుకునే వ్యవసాయ జాతీయ పరిశోధనా సంస్థను స్థాపించింది. దీనికి అనుగుణమైన విజ్ఞానం, ఎన్నో సాంకేతికాలు, సాగు పద్ధతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిని అమల్లోకి తేవడంపై భారత ప్రభుత్వం ఆసక్తి చూపటం లేదు. సుస్థిర వ్యవసాయాభివృద్ధికి, భూమి ఉత్పాదకత పెంచటానికి అందుబాటులో ఉన్న సాంకేతికాల అమలుపై దృష్టి కేంద్రీకరించాలి. సేంద్రియ ఎరువుల లభ్యత పెంచి భూముల సారాన్ని పెంచేందుకు దోహదపడాలి. భూముల్ని ప్రైవేటు ఆస్తులుగా చూడకుండా.. జాతీయ సంపదగా పరిగణించాలన్న స్పృహను కలిగించాలి. ‘అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం-2015’ ఈ దిశలో ఆలోచింపచేయటానికి దోహదపడాలి. (వ్యాసకర్త: విశ్రాంతాచార్యులు, భూవిజ్ఞాన శాస్త్ర విభాగం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం)