విధానాలు మారితేనే భూమి పదిలం!
కోల్పోతున్న వనరులను తనంతట తానే సమకూర్చుకునే సహజ శక్తి భూమికి ఉంది. ఈ శక్తిని రసాయనిక వ్యవసాయం కుంగదీస్తున్నది. ఫలితంగా నాగరికతకు మూలమైన భూమాత నిస్సారమవుతోంది. ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రకృతికి హాని చేయని సాగు పద్ధతులెన్నో అందుబాటులో ఉన్నా.. ప్రభుత్వం పనిగట్టుకొని విస్మరిస్తోంది.
ఏ కోణం నుంచి చూసినా మనం భూముల్ని ఎంతో గౌరవిస్తాం. అందువల్ల భూగోళాన్ని భూమాతగా భావిస్తుంటాం. మానవులతో సహా అన్ని జీవరాశులు రూపుదిద్దుకోవడానికి భూమాత ఒక వేదికగా కొనసాగడమే దీనికి కారణం. మన నాగరికత, సంస్కృతి భూమి చుట్టూ తిరుగుతుంటాయి. మన నాగరికత, సంస్కృతి ప్రారంభ కాలం నుంచి మనకు అవసరమైన మేర మాత్రమే భూముల(ప్రకృతి) నుంచి ఆహారాన్ని, ఇతర అవసరాలను తీర్చుకునేవాళ్లం. ఆ మేరకే ఉత్పత్తి చేసే వాళ్లం. కోల్పోయిన వనరులను ప్రకృతి తిరిగి తనంతట తానే పునరుజ్జీవింప చేసుకునేది. పశుపోషణ సేద్యంలో ముఖ్య భాగంగా కొనసాగింది. అలా శతాబ్దాలు గడచినా భూమి ఉత్పాదకత, ఆరోగ్యం ఏమీ క్షీణించలేదు. కానీ, సొంత వినిమయానికి కాక కేవలం లాభాపేక్షతో ‘సంపాదించి ఆస్తులను కూడబెట్టుకోవడానికి’ ప్రకృతి వనరులను వేగంగా కొల్లగొట్టడం దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. కోల్పోతున్న వనరులను ప్రకృతి తనంతట తాను పునరుజ్జీవింప చేయలేని స్థితికి చేరింది. పారిశ్రామిక రసాయనిక వ్యవసాయ పద్ధతుల వల్ల భూమాత తిరిగి కోలుకోలేని విధంగా క్షీణిస్తోంది. ఒకప్పుడు భూమాతపై ఎంతో విశ్వాసంతో ఆధారపడిన మనం ఇప్పుడు ఆస్థాయిలో ఆధారపడలేకపోతున్నాం.
పర్యావరణాన్ని రక్షించే సేద్యం మేలు
ఈ నేపథ్యంలో పంటలు పండించే ప్రక్రియను తిరిగి ప్రకృతిలో భాగంగా మార్చుకొని సుస్థిరాభివృద్ధిని సాధించాలి. అదెలాగన్నదే నేడు మన ముందున్న ప్రధాన ప్రశ్న. దీనికి సమాధానంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, ప్రకృతిలో భాగంగా సేద్యం కొనసాగాలి. సేద్య భూముల్లో పెద్ద ఎత్తున సేంద్రియ పదార్థాలను కలపడం మినహా మరో పద్ధతి లేదు. అయితే, ఇప్పుడు మన సేద్యం ప్రధానంగా 5 ఎకరాల లోపు విస్తీర్ణం గల చిన్న కమతాలలో కొనసాగుతోంది. పైగా, సేద్య భూమిపై ఏ హక్కూలేని కౌలు సేద్యం వేగంగా విస్తరిస్తోంది. కౌలు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తక్షణం లాభాన్ని చేకూర్చే సేద్య పద్ధతులను, సాంకేతికాలను వినియోగిస్తున్నారే తప్ప.. దీర్ఘకాలంలో భూమి ఉత్పాదకతకు అవసరమైన సేంద్రియ ఎరువుల వాడకంపై శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా, భూముల ఉత్పాదకత రోజురోజుకూ క్షీణిస్తున్నది. భూసారం పెంపుపై రైతులకు దీర్ఘకాల ఆసక్తి కలిగించేలా సర్కారూ చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదు.
కార్పొరేట్ సేద్యం నష్టదాయకం
ప్రపంచీకరణ దృష్ట్యా ప్రభుత్వం కార్పొరేట్ సేద్యానికే మొదటి ప్రాధాన్యతనిస్తున్నది. కార్పొరేట్ యాజమాన్యాలు కూడా తక్షణ అధిక లాభాల్నిచ్చే భారీ యాంత్రీకరణకు, రసాయనిక ఎరువులు, ఇతర రసాయనాల వాడకానికే ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప సేంద్రియ ఎరువులను వాడుతూ దీర్ఘకాలంలో భూమి ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు. అందువల్ల కార్పొరేట్ అనుకూల విధానాలను పునరంచనా వేసి.. సుస్థిర వ్యవసాయోత్పత్తికి దోహదపడే విధంగా వాటిని మార్చాలి. రసాయనిక వ్యవసాయం వల్ల వాతావరణంలో వస్తున్న మార్పుల దుష్పలితాలను తుపాన్లు, అకాల వర్షాలు, వరదలు, అనావృష్టి, కరవు కాటకాల రూపంలో ప్రతి సంవత్సరమూ అనుభవిస్తూనే ఉన్నాం. వాతావరణం వేడెక్కడానికి ప్రధాన కారకులు అభివృద్ధి చెందిన దేశాలే. వాతావరణ మార్పులను నిలువరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సిద్ధాంత రీత్యా అంగీకారం తెలుపుతూనే.. తమ వంతు బాధ్యతలు తీసుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు పూర్తిగా అంగీకరించడం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఈ భారాన్ని భరించాలని ఒత్తిడి చేస్తున్నాయి. కానీ, తుపాన్లు వరదలు, కరవు కాటకాల వల్ల జరుగుతున్న నష్టాలు స్థానిక స్వభావం కలవి. వీటి దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి స్థానికంగానే గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల మన దేశం గట్టి చర్యలు తీసుకోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి.
కార్పొరేట్ అనుకూల విధానాలు మారాలి
మన దేశంతో సహా 30 దేశాల నుంచి దాదాపు 600 మంది ఉన్నతస్థాయి శాస్త్రజ్ఞులు, విధాన నిర్ణేతలు 2008లో సమావేశమై ఈ చర్యలపై చర్చించారు. సుస్థిర వ్యవసాయోత్పత్తికి వ్యవసాయ రసాయనాలు దోహదపడవనీ, సేంద్రియ ఎరువులను వాడాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. వచ్చే 50 ఏళ్లలో చింతలేని వ్యవసాయానికి తగిన సాంకేతికాలు.. చిన్న కమతాల రైతులకు అనుకూలంగా ఉన్నాయి. వీటిని అమలు చేయడానికి సంసిద్ధత తెలుపుతూ భారతదేశం సంతకం చేసింది. కానీ, కార్పొరేట్ సేద్యాన్ని ప్రోత్సహించే విధానాలనే ప్రభుత్వం కొనసాగిస్తోంది. చిన్న కమతాల స్థాయిలో సేంద్రియ ఎరువుల వాడకంపై రైతుల్లో ఆసక్తిని కలిగించడానికి ప్రభుత్వం విధానాలను మార్చాలి.
వాతావరణ మార్పుల్ని, వాటి దుష్ర్పభావాలను గమనంలో ఉంచుకొని భారత ప్రభుత్వం 2011లో వాతావరణ ఒడుదొడుకులను తట్టుకునే వ్యవసాయ జాతీయ పరిశోధనా సంస్థను స్థాపించింది. దీనికి అనుగుణమైన విజ్ఞానం, ఎన్నో సాంకేతికాలు, సాగు పద్ధతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిని అమల్లోకి తేవడంపై భారత ప్రభుత్వం ఆసక్తి చూపటం లేదు. సుస్థిర వ్యవసాయాభివృద్ధికి, భూమి ఉత్పాదకత పెంచటానికి అందుబాటులో ఉన్న సాంకేతికాల అమలుపై దృష్టి కేంద్రీకరించాలి. సేంద్రియ ఎరువుల లభ్యత పెంచి భూముల సారాన్ని పెంచేందుకు దోహదపడాలి. భూముల్ని ప్రైవేటు ఆస్తులుగా చూడకుండా.. జాతీయ సంపదగా పరిగణించాలన్న స్పృహను కలిగించాలి. ‘అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం-2015’ ఈ దిశలో ఆలోచింపచేయటానికి దోహదపడాలి.
(వ్యాసకర్త: విశ్రాంతాచార్యులు, భూవిజ్ఞాన శాస్త్ర విభాగం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం)