నేలమ్మా.. మన్నించమ్మా! | The foundation of civilization | Sakshi
Sakshi News home page

నేలమ్మా.. మన్నించమ్మా!

Published Wed, Dec 3 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

నేలమ్మా..  మన్నించమ్మా!

నేలమ్మా.. మన్నించమ్మా!

జీవానికి మూలాధారమైన నేలతల్లి నిర్లక్ష్యమై వట్టి పోతోంది.  సకల జీవకోటికీ స్తన్యం పడుతున్న నేలమ్మే నాగరికతకు పునాది. మానవులతోపాటు భూమిపైన, భూమి లోపల సకల జీవులకూ ప్రాణాధారం భూమాతే. అన్నదాత చేతుల మీదుగా మన కంచాల్లోకి వస్తున్న ఆహారంలో 99% భూమాత ప్రసాదమే! ఆహారం, నీరు, వాతావరణం, జీవవైవిధ్యం, జీవితం.. వీటన్నిటికీ ప్రాణ దాతైన భూమాతతో సజీవ సంబంధాన్ని కొనసాగించడంలో మనం ఘోరంగా విఫలమయ్యాం. అందుకే.. అంతటి చల్లని తల్లికే పుట్టెడు కష్టం వచ్చిపడింది. సాగు భూమిలో 25% ఇప్పటికే నిస్సారమైంది. జీవాన్ని.. సేంద్రియ పదార్థాన్ని కోల్పోయింది. చౌడు తేలింది. చట్టుబండైంది. నీటిని గ్రహించే శక్తి నశించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. పంటల సాగుకు పనికిరాకుండా పోయింది.. నాశనమవుతూనే ఉంది..   
 ప్రతి ఏటా రెండున్నర కోట్ల ఎకరాల్లో సుసంపన్నమైన నేల నాశనమైపోతున్నది. అంటే.. ప్రతి నిమిషానికి 30 ఫుట్‌బాల్ కోర్టులంత మేర సారవంతమైన భూమి పనికిరాకుండా పోతోంది.

ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) నివేదిక ప్రకారం.. నేలతల్లి ప్రాణాలను అనుక్షణం మనమే చేజేతులా తోడేస్తున్నాం. ఈ విధ్వంసం అంతా వ్యవసాయం పేరిట సాగిపోతోంది.. జీవనాధారంగా ప్రారంభమైన వ్యవసాయం.. విచక్షణారహితంగా వాడుతున్న వ్యవసాయ రసాయనాల వల్లనే ముఖ్యంగా నేల నిర్జీవమవుతోంది.

తల్లి ఆరోగ్యం పాడైతే బిడ్డ బాగుంటుందా? అతిగా రసాయనిక అవశేషాలున్న ఆహారం తిన్న నేలతల్లి బిడ్డల ఆరోగ్యం కూడా అంతకంతకూ క్షీణిస్తోంది. మానవాళి మనుగడ సజావుగా సాగాలంటే.. నెత్తికెక్కిన కళ్లను నేల లోతులకు మళ్లించాలి. వనరుల విధ్వంసం ఆగాలంటే.. పారిశ్రామిక దేశాలు రుద్దిన సాంద్ర వ్యవసాయ పద్ధతిని వదిలేసి, ప్రకృతికి దగ్గరవ్వాలని ఎఫ్‌ఏవో మొత్తుకుంటున్నది.
 ఆహార భద్రత, పర్యావరణ వ్యవస్థలకు భూమి ఆరోగ్యం ప్రాణావసరమన్న స్పృహను పాలకుల్లో, ప్రజల్లో రగిలించడం తక్షణావసరం. ఇందుకోసమే 2015ను ‘అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అంతర్జాతీయ భూముల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5(రేపు) నుంచే భూముల పరిరక్షణకు పాలకులు, రైతులు, ప్రతి మనిషీ కదలాలని పిలుపునిచ్చింది. భూసారాన్ని పునరుద్ధరించుకుంటూనే నిశ్చింతగా జీవనాధారమైన పంటల సాగుకు ప్రపంచమంతా కంకణబద్ధులు కావాల్సిన తరుణమిది. వాతావరణ మార్పుల ప్రతికూల పరిస్థితుల మధ్య తెలుగు రాష్ట్రాలు ఈ అంశంపై తీక్షణంగా దృష్టిసారించాలి.
 భూసార విధ్వంసక విధానాలకు, అసపవ్య సాగు పద్ధతులకు పాతరేద్దాం.. ప్రకృతికి కీడు చేయని పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న ఆదర్శ అన్నదాతలకు జేజేలు పలుకుదాం.. నిస్సారమైన నేలకు తావు లేని రోజు కోసం అందరం ఉద్యమిద్దాం. జీవిత కాలంలో సెంటీమీటరు నేలను కూడా మనం సృష్టించలేం. అలాంటప్పుడు భూమిని పాడు చేసే హక్కు మనకెక్కడిది? ఆ తల్లి స్తన్యం తాగి రొమ్ము గుద్దడం మాని, నేలమ్మను పరిరక్షించుకుంటే పోయేదేమీ లేదు.. ఆహారోత్పత్తి 58% పెరగటం(ఎఫ్‌ఏఓ అంచనా) తప్ప!
 
మనిషి పనుల మూలంగా నేలమ్మ చాలా వేగంగా సారాన్ని కోల్పోతూ సాంఘిక, ఆర్థిక, ఇతర సమస్యలకు దారితీస్తోంది. నేలను అపసవ్యమైన రీతుల్లో అతిగా వినియోగించడం మనుగడకే ఎసరు తెస్తోంది. హరిత విప్లవ కాలంలో ముందుకొచ్చిన సాంద్ర వ్యవసాయ పద్ధతుల వల్ల గత ఆరు దశాబ్దాలుగా నేల గతమెన్నడూ ఎరుగనంతగా పతనమైంది. అవసరానికి మించి దున్నడం, ఏదో ఒకే పంటను సాగు చేయడం, సేంద్రియ ఎరువులు చాలినంతగా వేయకపోవడం, రసాయనిక ఎరువులతోపాటు కలుపు మందులను విచ్చలవిడిగా వాడటం, కాలువ నీటి వాడకంలో అపసవ్య పోకడలు.. ఇవీ భూములు నాశనం కావడానికి ముఖ్య కారణాలని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే ఆహారోత్పత్తి వ్యవస్థే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

దేశంలో 12 కోట్ల 10 లక్షల హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది. ఇందులో 2 కోట్ల 28 లక్షల హెక్టార్ల సాగు భూమి కేవలం రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడడం వల్ల నిర్జీవమై సాగుకు పనికిరాకుండా పోయింది. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చే క్రమంలో మన దేశంలో సాగు భూమి తగ్గిపోతున్నది. 1951లో ప్రతి మనిషికీ 1.19 ఎకరాల చొప్పున సాగు భూమి అందుబాటులో ఉండేది. ఇది 1991 నాటికి 40 సెంట్లకు తగ్గింది. 2035 నాటికి 20 సెంట్లకు తగ్గేలా ఉంది.

ఉత్పాదకతను కోల్పోతున్న లక్షల హెక్టార్లు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 రకాల భూములున్నాయి. మెట్ట, మాగాణి అనే తేడా లేకుండా అన్ని రకాల భూముల్లోనూ సారం అంతకంతకూ తగ్గిపోతూ పంటల దిగుబడి క్షీణిస్తోంది. తెలంగాణ (భూముల్లో 29 శాతం) లో 34 లక్షల హెక్టార్ల భూమి ఏదో ఒక రకంగా ఉత్పాదక శక్తిని కోల్పోయిందని తాజా అంచనా. ఆంధ్రప్రదేశ్ (భూముల్లో 36 శాతం)లోని 58 లక్షల హెక్టార్ల భూములు నిస్సారంగా మారాయి.

సేంద్రియ కర్బనం 0.5 శాతానికి అడుగంటిందని అంచనా. దీన్ని 2 శాతానికి పెంచుకోవడమే లక్ష్యంగా బహుముఖ వ్యూహాలను ప్రభుత్వం అమల్లోకి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, వీటిని రైతు దగ్గరకు తీసుకెళ్లే యంత్రాంగమే అరకొరగా ఉంది.
 రైతుకు సాంద్ర వ్యవసాయాన్ని అలవాటు చేసిన ప్రభుత్వం.. దాని ద్వారా ఏర్పడిన భూసార సమస్యను అధిగమించే సులభమైన, ఆచరణాత్మక పద్ధతులను రైతులకు అందించలేని స్థితిలో ఉండిపోవడం విషాదకర వాస్తవం. దిక్కుతోచని బడుగు రైతు మనుగడకే ఇది పెనుశాపంగా పరిణమించింది. ఫ్రాంక్లిన్ డెలొనొ రూజ్వెల్ట్ ఇలా అన్నారు: ‘భూములను నాశనం చేసుకునే దేశం, తనను తాను నాశనం చేసుకుంటుంది’. ప్రస్తుతం మన భూములు, మన దేశం పరిస్థితి ఇలాగే ఉంది.

ప్రత్యామ్నాయాల అడుగుజాడలు..

ప్రభుత్వం చేష్టలుడిగినంత మాత్రాన అన్నదాతలు అక్కడే ఆగిపోరు. తమ సమస్యలకు తామే పరిష్కారాలు వెతుక్కుంటూనే ఉంటారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడడం పూర్తిగానో, పాక్షికంగానో మానేసి.. స్థానిక వనరులతోనే ఖర్చు తక్కువతో కూడిన ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. భూసారాన్ని పెంపొందించుకుంటూనే పంట దిగుబడులనూ పెంచుకుంటున్నారు. టన్నులకొద్దీ పశువుల ఎరువుల అవసరం లేకుండానే కొత్త పద్ధతుల్లో తక్కువ పశువులతోనే ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వాలు అత్యాధునికమైనవన్న భ్రమలో విదేశీ నమూనా ఎండమావుల వెంటపడకుండా.. మన రైతుల అనుభవంలో నిగ్గుతేలిన మేలైన, ప్రకృతికి అనుగుణమైన ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై దృష్టిపెట్టాలి.
 మట్టిలోనే పుట్టి మట్టిలోనే బతుకుతూ సమాజానికి మూడు పూటలా తిండి పెడుతున్న అచ్చమైన రైతుల అనుభవాల నుంచి బేషజాల్లేకుండా నేర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అన్నదే అసలు ప్రశ్న. మన భూముల, మన రైతుల, వినియోగదారుల భవిష్యుత్తు, ఆరోగ్యం- ఈ ప్రశ్నకు వచ్చే సమాధానంపైనే ఆధారపడి ఉంది.
 - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
 
భూసారాన్ని రక్షించుకునేలా సాగు మారాలి

ఉత్పాదకత పెరగాలంటే భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచాలి. రసాయనిక, సేంద్రియ, జీవన ఎరువులు కలిపి వాడాలి. 25-50% పోషకాలను సేంద్రియ, జీవన ఎరువుల ద్వారా అందించాలి. భూసారాన్ని పరిరక్షించుకునే విధంగా వ్యవసాయ పద్ధతులు మార్చుకోవాలి. కౌలు, యువ రైతులకు అవగాహన కలిగించేందుకు విస్తరణ వ్యవస్థను పటిష్టం చేయాలి. సూక్ష్మజీవుల ద్వారా పోషకాలను అందించడంపై దృష్టిపెట్టాలి. సూక్ష్మజీవుల గురించి మనకు తెలిసింది ఒక శాతమే. అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం సందర్భంగా ఈ అంశాలపై శ్రద్ధ చూపాలి. పరిశోధన ఫలితాలను రైతులకు అందించడానికి విస్తృత కృషి జరగాలి. సాయిల్ రిసోర్సెస్ మ్యాపింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు ఉపకరిస్తాయి.  
 - డా. డి. బాలగురవయ్య, ప్రధాన శాస్త్రవేత్త, భూవిజ్ఞాన శాస్త్ర విభాగం,
 ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ), హైదరాబాద్
 
ప్రకృతి వ్యవసాయంతోనే భూముల పునరుజ్జీవనం!

మట్టి మొక్కలకు పునాది. ప్రకృతిసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలో జీవరాశి (వానపాములు, సూక్ష్మజీవులు, పురుగులు, శిలీంధ్రాలు, ఇంకా మట్టిలో ఉండే అనేక ప్రాణులు) నిరంతరాయంగా పోషకాలను మొక్కల వేళ్లకు అందిస్తాయి. కానీ గత అరవయ్యేళ్లుగా రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, శిలీంధ్రనాశనులు, కలుపుమందులు వాడుతుండడం వల్ల మట్టిలో ఉండాల్సిన వానపాములు, ఇతర జీవరాశి నాశనమై భూమి నిస్సారమైపోయింది. ఏదైనా ఎరువును బయటి నుంచి అధికంగా తెచ్చి వేస్తేనే గానీ పంట పండని దుస్థితి నెలకొంది. ఇప్పుడు మనం రసాయనిక ఎరువులు, పురుగుమందులు, సూక్ష్మపోషకాలు పొలంలో వేయకుండా పంటలు పండించాలనుకుంటే.. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా మట్టిలోని జీవరాశిని, వానపాములను తిరిగి ఆహ్వానించాలి. ప్రకృతి మనకు అందించిన ఈ అద్భుతమైన వ్యవసాయ విజ్ఞానానికి అడ్డుచెప్పే వారెవరూ ఇప్పుడు లేరు..ప్రాణావసరం కాబట్టి!
 - సుభాష్ పాలేకర్, ప్రకృతి వ్యవసాయోద్యమ సారధి, మహారాష్ట్ర (‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం - 1’ పుస్తకం నుంచి)
 
నడుస్తుంటే మట్టి పెళ్లలు గుచ్చుకునేవి..!


 పచ్చిరొట్ట ఎరువులు, ఘనజీవామృతం, జీవామృతం వాడుతూ 6 ఎకరాల్లో నాలుగేళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తున్నా. సేంద్రియ కర్బనం 0.5% నుంచి 0.95%కు పెరిగింది. అంతకుముందు పొలంలో చెప్పుల్లేకుండా నడిస్తే మట్టిపెళ్లలు గుచ్చుకునేవి. ఇప్పుడు నడి ఎండాకాలంలోనూ చెప్పుల్లేకుండా హాయిగా నడవొచ్చు. ఎకరానికి బీపీటీ ధాన్యం 28-30 బస్తాల దిగుబడి వస్తోంది. మా పొలం తుపాన్లు తట్టుకొని పడిపోకుండా నిలబడింది. నేల తేమ ఆరిపోదు. తక్కువ నీరే సరిపోతున్నది.  
 - కోగంటి రవికుమార్ (80192 59059), సేంద్రియ రైతు, ఇందుపల్లి, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా
 
సేంద్రియ కర్బనం 3% నుంచి 0.5%కి తగ్గింది..

 జీవామృతం, పంచగవ్య, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువుల ద్వారా సేంద్రియ వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తున్నాం. భూముల్లో సేంద్రియ కర్బనం 50 ఏళ్ల నాడు 3% ఉండే 0.5%కి తగ్గింది. దీన్ని కష్టపడి 1%కి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులను చైతన్యవంతం చేస్తున్నాం. 8 ఏళ్లలో సేంద్రియ సాగు విస్తీర్ణం 5% నుంచి 25%కి పెరిగింది. సేంద్రియ ముడి బియ్యంతోపాటు సేంద్రియ పాలూ అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగ దారుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి, వైద్య ఖర్చులు 50% తగ్గాయి. రైతులంతా సేంద్రియ సాగుకు మళ్లితే ఆసుపత్రుల అవసరమే ఉండదు. ప్రతి రైతుకూ నాటు ఆవు లేదా దూడైనా ఉండాలి.
 - కే సాంబశివరావు (97011 08511), సేంద్రియ సాగు సమన్వయకర్త, ప్రభుత్వ రైతు శిక్షణా కేంద్రం, విజయవాడ
 
http://img.sakshi.net/images/cms/2014-12/61417627756_Unknown.jpg

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement