ప్రకృతి వ్యవసాయోద్యమంలో కలిసి పనిచేస్తున్న రామకృష్ణారెడ్డి, ఉమామహేశ్వరి
{పకృతి సేద్య కళను ఉద్యమ స్ఫూర్తితో రైతులకందిస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ
అన్నదాతల ఆత్మహత్యల్లేని ఆరోగ్యదాయక సమాజం కోసం విస్తృతంగా రైతు శిక్షణ శిబిరాలు
6 నెలల్లో వెయ్యి మంది ప్రకృతి వ్యవసాయ ఉపాధ్యాయులకు శిక్షణతో ఊరూరా శిబిరాలు.. ఉచిత కాల్‌సెంటర్..
{పకృతి వ్యవసాయ పంచాంగం రూపకల్పన.. రైతుల భాగస్వామ్యంతో స్వతంత్ర మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు యత్నాలు
తెలుగునాట రెండేళ్లలో ప్రకృతి వ్యవసాయ విప్లవం తథ్యం.. ఐదేళ్లలో పూర్తిగా రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పతి సాధ్యమే..
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుగు రాష్ట్రాల సారథి పులిమామిడి రామకృష్ణారెడ్డి వెల్లడి
తెలుగునాట సంక్షోభంలో కూరుకుపోయి అల్లాడుతున్న అన్నదాతలకు ప్రకృతి వ్యవసాయాన్ని ‘జీవన కళ’తో మేళవించి అందిస్తోంది ఆర్ట్ ఆఫ్ లివింగ్(ఏఓఎల్) ఆధ్యాత్మిక సంస్థ. రైతుల జీవితాలను, భూములను పునరుజ్జీవింపజేయడానికి సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా సులువుగా సాధ్యమవుతుందని ఏఒఎల్ విశ్వసిస్తున్నదని తెలుగు రాష్ట్రాల కమిటీ అధ్యక్షుడు పులిమామిడి రామకృష్ణారెడ్డి (98490 57599) ‘సాక్షి’ ఇంటర్వ్యూలో తెలిపారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో జన్మించిన పారిశ్రామికవేత్త రామకృష్ణారెడ్డి ఏఓఎల్‌కు ఎనిమిదేళ్లుగా సారథ్యం వహిస్తున్నారు. అప్పులు, ఆత్మహత్యల్లేని వ్యవసాయాన్ని రైతులు.. విషరహిత ఆహారాన్ని వినియోగదారులు కోరుకుంటున్నారన్నారు. ఈ లక్ష్య సాధన కోసమే గత ఆర్నెల్లుగా ‘రుషి కృషి’ పేరుతో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ఇస్తు న్నామని చెప్పారు. మనిషి మారితేనే వ్యవసాయ పద్ధతి మారుతుందంటూ.. జీవన కళతో మేళవించిన వ్యవసాయ శిక్షణ సత్ఫలితాలనిస్తున్నదన్నారు. ఇలాఉండగా, హైదరాబాద్‌కు చెందిన చక్కిలం ఉమామహేశ్వరి(90004 08907) ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యకలాపాలను సమన్వయపరుస్తున్నారు. బ్యాంకులో ఉన్నతోద్యాగాన్ని పదేళ్లు ముందే వదిలేసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలకు ఆమె పూర్తికాలాన్ని వెచ్చిస్తున్నారు. చాలా గ్రామాల్లో ఆవుల జాడే లేదని, వయసులో ఉన్న వారు పొట్టచేతపట్టుకొని పట్నాలకు వలస పోగా వృద్ధులే గ్రామాల్లో మిగిలారన్నారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చే శక్తి ప్రకృతి సేద్యానికే ఉందని ఆమె విశ్వసిస్తున్నారు.
వ్యవసాయ సంక్షోభానికి ప్రకృతి సేద్యమే పరిష్కారమా?
అవును. యూరప్‌కు రెండు, మూడు వేల ఏళ్లు, అమెరికాకు రెండొందల ఏళ్లకు క్రితమే వ్యవసాయం తెలుసు. మనది పది వేల ఏళ్ల నాటి సుసంపన్నమైన వ్యవసాయ సంస్కృతి. మన దేశప్రజల డీఎన్‌ఏలోనే వ్యవసాయ సంస్కృతి ఉంది. హరిత విప్లవం పేరిట రసాయనిక వ్యవసాయం అలవాటు చేయడం వల్ల ఈ సంస్కృతి ధ్వంసమైంది. 30 శాతం సాగు భూమి నిస్సారమైపోవడమో, చౌడుదేలడమో అయ్యింది. ఇప్పుడు తిరిగి ప్రకృతి వ్యవసాయ సంస్కృతిని అలవరచుకోవడమే సంక్షోభానికి పరిష్కారం.
{పకృతి సేద్యంపై శిక్షణ ఇచ్చే క్రమంలో అవరోధాలను ఎలా అధిగమిస్తున్నారు?
మనిషి మారితేనే వ్యవసాయ పద్ధతి మారుతుంది. అలవాటు లేని ప్రకృతి సేద్య పద్ధతి గురించి తెలియజెప్పడానికి ముందు జీవన కళ గురించి పరిచయం చేస్తున్నాం. టన్నుల కొద్దీ పశువుల ఎరువు అవసరం లేని, దుక్కి అవసరంలేని, స్వల్ప ఖర్చుతో చేసుకునే పాలేకర్ పద్ధతిని తెలియజెపుతున్నాం. ఒక ఆవు ద్వారా 10-15 ఎకరాల్లో వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, పురుగుమందులు, శిలీంధ్రనాశనులు తయారు చేసుకునే పద్ధతులు నేర్పిస్తున్నాం. ఆవును కొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు.. ఆరు నెలల్లో ఆవు ఖరీదు తిరిగొచ్చేస్తోంది. రైతుల ఆర్థిక, పర్యావరణ, సాంఘిక సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నాం. ప్రభుత్వ సంస్థలు నిర్వహించే శిక్షణకు స్పందించని రైతులు సైతం మా శిక్షణకు స్పందిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులకు, సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్నాం.
శిక్షణ పొందిన రైతులకు ఎటువంటి తోడ్పాటునందిస్తారు?
ఒకసారి శిక్షణ పొందిన రైతు.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందంలో జీవిత సభ్యుడవుతాడు. ప్రకృతి వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలు, సందేహాల నివృత్తి కోసం ఉచిత కాల్‌సెంటర్‌ను రెండు నెలల్లో ఏర్పాటు చేస్తున్నాం. 24 మంది శాస్త్రవేత్తల బృందం నిరంతరం అన్ని భాషల్లోనూ రైతులకు సూచనలు సలహాలు ఇస్తారు. కరువు బారిన పడకుండా వ్యవసాయం చేసే మెలకువలతో కూడిన ‘ప్రకృతి వ్యవసాయ పంచాగం’ సిద్ధమవుతోంది. మారిన వాతావరణాన్ని బట్టి వ్యవసాయ పనులు 1 లేదా 2 కార్తెలు ముందుకు జరగాలన్నది మా అభిప్రాయం. వర్షాల తీరు మారింది. స్థానికంగా చెట్లు, అడవి ఎక్కువగా ఉన్న చోటే కురుస్తున్నాయి. శాస్త్రబద్ధమైన ఈ విషయ పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం ద్వారా.. వారిలో చెట్ల పెంపకం, చెట్ల జాతులతో కలిపి వార్షిక పంటలు పండించడంపై ఆసక్తిని పెంచుతున్నాం. భూసారం పెంపుదల, చౌడు భూమిని తిరిగి వినియోగంలోకి తెచ్చుకోవడం ప్రకృతి సేద్య పద్ధతుల ద్వారానే సాధ్యం.. వీటన్నిటినీ నిరంతరం సమన్వయం చేయడానికి శ్రీశ్రీ కిసాన్ సంఘాలను, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం.
రైతులందరికీ ప్రకృతి వ్యవసాయ శిక్షణ అందేదెలా?
మా సంస్థకు విస్తృతమైన యంత్రాంగం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే నైపుణ్యం, దాతల మద్దతు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల రైతులందరికీ రెండేళ్లలో శిక్షణ ఇచ్చేదిశగా కదులుతున్నాం. జూన్ నుంచి వారానికో శిబిరం నిర్వహిస్తున్నాం. రాబోయే 6 నెలల్లో వెయ్యి మంది ప్రకృతి సేద్యం నేర్పించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే ఎందరో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనుభవం గడించారు. వీరి అనుభవాలు చెప్పించి రైతుల్లో పూర్తి భరోసా కలిగిస్తున్నాం. ప్రతి గ్రామంలో కొందరికి సరిగ్గా నేర్పితే చాలు.. వాళ్లను చూసి మిగతా వాళ్లు నేర్చుకుంటారు. విరాళాలు, ప్రభుత్వ తోడ్పాటుతో రైతులందరికీ రెండేళ్లలో శిక్షణ ఇస్తాం. ఏదేమైనా ఐదేళ్లలో 100% విష రసాయనాల అవశేషాల్లేని ఆహారోత్పత్తి జరిగేలా చూడాలన్నది మా లక్ష్యం. సహజాహారంపై చైతన్యం వినియోగదారుల్లోనూ పెరుగుతోంది.
{పకృతి వ్యవసాయదారుల మార్కెటింగ్ సమస్యలపై మీ అభిప్రాయం?
వేల సంఖ్యలో రైతులు ఇప్పటికే ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వారికి ఖర్చు తగ్గింది. ఆదాయం పెరిగింది. సరుకును మార్కెట్‌కు తీసుకెళ్లాల్సిన బాధే లేదు. మంచి ఆహారం కావాల్సిన వాళ్లు రైతుల ఇళ్లకొచ్చి కొనుక్కెళ్తున్నారు. రైతుల భాగస్వామ్యంతో విశ్వసనీయమైన మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. రైతులకు నిరంతరం అండగా ఉండి నడిపించేందుకు ఏ లోటూ లేకుండా చూస్తున్నాం.
- సంభాషణ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్