అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి అక్టోబర్ 1 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రపంచ సంస్కృతులలోని భిన్నత్వాన్ని ఒకే వేదికపైకి చేర్చే ఈ ఉత్సవాలను గతంలో 3 సార్లు వివిధ దేశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించింది. 4వ విడత ఉత్సవాలను ఈ ఏడాది వాషింగ్టన్ డిసిలోని నేషనల్ మాల్ ప్రాంగణంలో మరింత ఘనంగా, చిరస్మరణీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
డిసిలోని క్యాపిటల్ భవనం ముందున్న విశాల ప్రాంగణంలో ఫుట్ బాల్ మైదానమంత విస్తీర్ణంలో భారీ వేదికను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుండి 17,000 మంది కళాకారులు, అనేక దేశాల నేతలు, ప్రముఖులు ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారని అంచనా వేస్తున్న ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా 50కి పైగా ప్రదర్శనలు జరుగబోతున్నాయి.
వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అమరుడయిన మార్టిన్ లూధర్ కింగ్ ప్రఖ్యాత ఉపన్యాసం “ఐ హావ్ ఎ డ్రీమ్” ను నేషనల్ మాల్ వేదికపై నుండే ఇచ్చారు.1963వ సంవత్సరంలో జరగిన ఈ ఉపన్యాసం ద్వారా ప్రపంచ సమైక్యత, సమానతా సందేశాన్ని అందరికీ చాటిచెప్పాడు. దానికి ఒక శతాబ్ది క్రితం షికాగోలోని ప్రపంచ పార్లమెంటు సదస్సులో స్వామి వివేకానందుని ఉపన్యాసం అక్కడి ప్రజలను సన్మోహితులను చేసి, ఆయన జ్ఞానానికి పాదాక్రాంతులను చేసింది. ప్రపంచంలోని వివిధ మత నాయకులను తన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు గా పేర్కొంటూ మతవిశ్వాసాల పేరుతో ప్రజలను విభజించడం, ఇతర ధర్మాల పట్ల అసహనం విడనాడ వలసిందిగా అతడు హితవు పలికాడు.
ఈ సెప్టెంబర్ 29వ తేదీన ప్రారంభం కానున్న ఈ చారిత్రాత్మక ఉత్సంలో శ్రీ శ్రీ రవిశంకర్, ప్రపంచంలో దేశాలు, ధర్మాలు, జాతుల మధ్య భేదాభిప్రాయాలను, అంతరాలను చెరిపివేసి, 180 దేశాలకు చెందిన ప్రజలను “ఒకే ప్రపంచ కుటుంబం” గా ఒకే వేదికపై ఆవిష్కరిస్తారు.మానవాళిని సమైక్యంగా ఉంచేవాటిలో ప్రధాన పాత్రగా ఉండే ఆహారం అనేది ఇక్కడ కూడా తన పాత్రను పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధదేశాలకు చెందిన వంటకాలు ఇక్కడి కార్యక్రమాలకు హాజరయ్యే ప్రేక్షకులకు విందుచేయనున్నాయి. ఈ సారి అనేకమంది ఔత్సాహిక కళాకారులు సైతం తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం విశేషం.
ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా హాజరౌతున్నవారిలో ఐక్యరాజ్య సమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్, భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్, అమెరికాలోని ప్రముఖ వైద్యుడు వివేక్ మూర్తి, అమెరికా సెనేటర్ రిక్ స్కాట్, నాన్సి పెలోసి, భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సురినామ్ దేశ రక్షణ మంత్రి కృష్ణకుమారి మాథెరా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment