World Cultural Festival
-
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు (ఫోటోలు)
-
ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల్లో ఉక్రెయిన్‌లో శాంతి కోసం ప్రార్ధనలు
ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల రెండవ రోజున విశ్వమానవ హృదయ స్పందన గురుదేవ్ నేతృత్వంలో 180 దేశాల ప్రజలచే ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం ప్రార్థన. బెంగుళూరు : వందలాది దేశాల పతాకాల రెపరెపల నేపథ్యంలో 180 దేశాల సంస్కృతులు, నృత్య-గాన రీతులు, ఆహార వ్యవహారాలకు సమైక్య వేదికగా ప్రపంచ సాంస్కృతిక మహోత్సవాలు అమెరికాలోని నేషనల్ మాల్ ప్రాంగణంలో కొనసాగాయి. ప్రపంచ ప్రజలను సమైక్యపరచటంలో భారతదేశానికి గల సామర్థ్యాన్ని ఈ ఉత్సవాలు ఘనంగా చాటిచెప్పాయి. మానవజాతి మైత్రి బంధం.. ఇక్కడి చారిత్రక లింకన్ మెమోరియల్ వద్ద హాజరైన 1000 మందికి పైగా ఆహుతుల యోగాభ్యాసంతో రెండవరోజు వేడుకలు కూడా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకోసం ప్రత్యేకించిన యోగ, ప్రాణాయామం జరిగిన అనంతరం గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ స్వయంగా ఆహుతులచే ధ్యానం చేయించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు, స్ఫూర్తిదాయక ప్రసంగాలు అక్కడ హజరైన జనహృదయాలను ఉర్రూతలూగించి మానవజాతి మైత్రీబంధానికి సాక్షిగా నిలిచాయి. విశ్వమానవ కుటుంబం.. భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించినట్లుగా, ‘పర్వతప్రాంతాల నుంచి మైదానాలదాకా, నదీతీరాల నుంచి ఇసుకతిన్నెలు, ఎడారులదాకా వ్యాపించిన ప్రజావాహిని అంతా నేడు ఇక్కడ సమావేశమైందని ఈ విధంగా విశ్వ మానవ కుటుంబపు సంక్షిప్తరూపం ఇక్కడ ఆవిష్కరింపబడిందని అన్నారు. సమైక్య ప్రార్ధనలు.. రెండవరోజు ప్రదర్శింపబడిన అనేక కళారూపాలలో ప్రఖ్యాత ఉక్రేనియన్ సంగీతకారురాలు ఒలెనా అస్తాషేవా నిర్వహించిన సాంప్రదాయ ఉక్రేనియన్ పాట కూడా ఉంది. యుద్ధం కారణంగా తన మాతృభూమిని విడిచిపెట్టాల్సి వచ్చిన ఆమె, తన బృందంతో ఇచ్చిన ప్రదర్శనతో మనసు చలించిన ప్రేక్షకులు గురుదేవ్ నేతృత్వంలో ఉక్రెయిన్ లో శాంతి నెలకొనాలని ప్రార్థించారు. ‘సమైక్యంగా చేసే మన ప్రార్థనలు ఫలిస్తాయి’ అని గురుదేవ్ పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రూఫ్? ప్రజలను ఉర్రూతలూగించే ప్రసంగాలకు పేరుగాంచిన రెవరెండ్ గెరాల్డ్ ఎల్ డర్లీ, మాట్లాడుతూ, 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' పేరును 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రూఫ్'గా మార్చాలని ఎందుకంటే మనం ప్రేమించగలమని, ప్రేమను పంచగలమని, దయతో ఉండగలమని గురుదేవ్ ఇక్కడ నిరూపిస్తున్నారని పేర్కొన్నారు. మీ నాయకుడు ఎవరని అడిగితే.. అమెరికన్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్, వ్యాపారవేత్త టిమ్ డ్రేపర్ తన అభిప్రాయాలను పంచుకుంటూ, 'అమెరికన్లు ఇతర దేశాల ప్రజలను గ్రహాంతరవాసులని పిలిచేవారం. ఇది మంచి పదం కాదు. క్రమంగా మేము ఏదో ఒక విధంగా ఇతర దేశాల ప్రజలను అంగీకరించి, ఏకీకృతం చేయడం ప్రారంభించాము. గురుదేవ్ నాయకత్వంలో ఈనాడు ఇంతమంది ప్రజలను ఒకచోట చేర్చాము. ఇకపై భూమిపై ఎవరూ గ్రహాంతరవాసులు కాదు. ఇంకా ఈ భూమిపై ఎవరైనా గ్రహాంతర వాసులు.. నన్ను మీ నాయకుడి దగ్గరకు తీసుకెళ్లమని అడిగితే, నేను వారికి గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ను చూపుతానని అన్నారు. ఇలాంటివి అవసరం.. యు.ఎస్. సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి మాట్లాడుతూ.. ఇటువంటి సాంస్కృతిక ఉత్సవాలు శక్తివంతమైనవి ఎందుకంటే, మనమందరమూ పరస్పర సంబంధాలను కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను ఇవి గుర్తుచేస్తాయని అన్నారు. గతంలో కంటే ఈరోజుల్లో ఇవి మనకు అత్యవసరం. ఈనాటి జీవనంలో ఒంటరితనం, తోడు లేకపోవడం అనేవి అంటువ్యాధులుగా మారి, మతిభ్రమణం, గుండె జబ్బుల వంటి మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని తద్వారా మన సమాజపు సంక్షేమానికే బెడదగా పరిణమిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అతిరథమహారధులు.. రెండవ రోజు కార్యక్రమంలో ప్రసంగించిన ఇతర ప్రముఖులలో మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్ రూపన్, భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, జపాన్ దివంగత ప్రధాన మంత్రి షింజో అబే భార్య అకీ అబే, అమెరికాలోని సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి తదితరులు ఉన్నారు. వివిధ దేశాల సాంస్కృతిక కార్యక్రమాలు.. 2వ రోజు జరిగిన సాంస్కృతిక ముఖ్యాంశాలలో, ప్రముఖ భారతీయ అమెరికన్ గాయకుడు, గ్రామీ అవార్డు విజేత ఫాలు షా నేతృత్వంలో 10,000 మంది నాట్యబృందంచే గార్బా నృత్య ప్రదర్శన, 200 మంది కళాకారులతో ఉత్సాహభరితమైన భాంగ్రా ప్రదర్శన, ఐర్లాండు కళాకారుల బృందంచే ఐరిష్ స్టెప్ డ్యాన్స్, అప్ఘన్ కళాకారుల గీతాలాపన, 1,000 మంది చైనీస్-అమెరికన్ గాయకులు, కళాకారుల అద్భుతమైన నృత్యం, కుంగ్ ఫూ ప్రదర్శనతోపాటు వాటికి తోడుగా గంభీరమైన డ్రాగన్లు, సింహాలు ప్రాణంతో ఉన్నవా అనిపించేలా తీర్చిదిద్దిన కళాత్మక నాట్యం మొదలైనవి వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇంకా ఇండోనేషియా, బ్రెజిల్, బొలీవియా, లాటిన్ అమెరికా దేశాల కళాకారుల మరపురాని ప్రదర్శనలు, కుర్టిస్ బ్లో వంటి దిగ్గజాల నేతృత్వంలో హిప్ హాప్, బ్రేక్ డ్యాన్స్ ప్రదర్శనలు, 1200 మందిచే సువార్త గానం, పాకిస్తానీ కళాకారుల మంత్రముగ్ధమైన ప్రదర్శన ప్రేక్షకులను అలరించాయి. ఇది కూడా చదవండి: డల్లాస్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్! -
ఘనంగా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం
వాషింగ్టన్ డిసి: నేషనల్ మాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలలో మొదటిరోజునే రికార్డు స్థాయిలో పది లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా హాజరై తిలకించారు. ప్రపంచంలోని భిన్న సంస్కృతుల సమాహారంగా, మానత్వం, శాంతి సందేశాల ద్వారా మానవాళిని ఏకంచేసే ఉద్దేశ్యంతో రూపొందిన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు 180 దేశాల నుంచి కళాకారులు ఇక్కడకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో ఐక్యరాజ్యసమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, వాషింగ్టన్ డిసి నగర మేయర్ మురియెల్ బౌసర్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పోంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గౌరవ ఛాన్సలర్ బిషప్ ఎమెరిటస్ మార్సెలో శాంచెజ్ సోరోండో ఉన్నారు. మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా గ్రామీ అవార్డు గ్రహీత చంద్రికా టాండన్, 200 మంది కళాకారుల బృందంచే అమెరికా ది బ్యూటిఫుల్, వందేమాతరం మనోహర సంగీత ప్రదర్శన, పంచభూతం పేరిట, 1000 మంది భారతీయ శాస్త్రీయ నృత్యకళాకారులచే శాస్త్రీయ నృత్య-వాద్య సంగమం, గ్రామీ అవార్డు విజేత మిక్కీ ఫ్రీ నేతృత్వంలో1000మంది కళాకారులచే ప్రపంచ గిటార్ వాద్యగోష్టి, ఇంకా ఆఫ్రికా, జపాన్, మధ్యప్రాచ్య దేశాల కళాకారుల ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ రవిశంకర్ తన భావాలను పంచుకున్నారు. “మానవ జాతిలోని వైవిధ్యాన్ని ఒక ఉత్సవంగా జరుపుకునే సుందరమైన సందర్భం ఇది. ఈ భూమి చాలా వైవిధ్యంతో కూడి ఉంది, అయినప్పటికీ, మానవ విలువలనే సూత్రం ద్వారా మనందరిలో అంతర్లీనంగా ఐక్యత ఉంది. ఈ రోజు, ఈ ఉత్సవం సందర్భంగా, సమాజానికి మరింత ఆనందాన్ని తీసుకురావడానికి మనం కట్టుబడదాం. ప్రతీ ఒక్కరి ముఖంలో చిరునవ్వులు పూయించేందుకు కృషిచేద్దాం. అదే మానవత్వం. మనమందరం దానితోనే రూపొందించబడ్డాం. జ్ఞానం ఆలంబనగా లేకపోతే ఏ ఉత్సవమైనా శోభించదు. ఆ జ్ఞానం మన అందరిలోనూ ఉంది. మనలో ప్రతీ ఒక్కరూ ప్రత్యేకమైన వారని, అదే సమయంలో అందరూ ఒకటే అని గుర్తించడమే ఆ జ్ఞానం. మీలో ప్రతీ ఒక్కరికీ మరొక్కసారి చెబుతున్నాను. మనమంతా ఒకరికొకరు సంబంధించిన వారం. మనమంతా ఒకే విశ్వకుటుంబానికి చెందినవారం. రండి, మన జీవితాలను పండుగలా, ఉత్సవంలా జరుపుకుందాం. సవాళ్లను అంగీకరించి, ధైర్యంగా ఎదుర్కొందాం. మనకోసం, రాబోయే తరాలకోసం మరింత మెరుగైన భవిష్యత్తును ఆశిద్దాం’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, “మనం మరింత సమృద్ధికోసం, మన భూమి భవిష్యత్తును కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నపుడు, దానికి వ్యతిరేకంగా సవాళ్ళను ఎదుర్కొనడం సహజం. అవి ప్రకృతి ఉత్పాతాలు కావచ్చు. లేదా మానవ తప్పిదాలు, సంఘర్షణలు, లేదా అంతరాయాలు కావచ్చు. ఈనాటి పరస్పర ఆధారిత ప్రపంచంలో మనమంతా ఒకరికొకరు అండగా ఉన్నామనేది ముఖ్యమైన విషయం. ఈ విషయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మనకు ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచింది. ఇటీవలి ఉక్రెయిన్ సంఘర్షణలో వీరిద్వారా కలిగిన ప్రభావవంతమైన మార్పును నేను ప్రత్యక్షంగా గమనించాను. ఈ రోజు, వారి సందేశం, మీ సందేశం, నా సందేశం ఒకటే. పరస్పరం దయ కలిగి ఉండడం, మనకు కలిగిన దానిని ఇతరులతో పంచుకోవడం, పరస్పరం సుహృద్భావంతో అర్థంచేసుకోవడం, సహకరించుకోవడం. ఇవే ఈనాడు మనందరినీ సమైక్యంగా ఇక్కడకు చేర్చాయి.” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోప్ తమ సందేశాన్ని పోంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గౌరవ ఛాన్సలర్ బిషప్ ఎమెరిటస్ మార్సెలో శాంచెజ్ సోరోండో ద్వారా పంచుకున్నారు. “ప్రపంచ శాంతిని సాధించేందుకు, మనకు అంతరంగంలో శాంతి అవసరం. శాంతిని ప్రవచించేందుకు ముందు, మనం శాంతితో జీవించాలి. శాంతియుతంగా జీవించడానికి మనకు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కావాలి. శాంతియుతంగా జీవించే కళను పొందాలంటే మనం దైవంతో సంభాషిస్తూ ఉండాలి. దేవుడంటే మనిషికి శత్రువు కాదు, దైవం మనకు మిత్రుడు. దైవం అంటే ప్రేమ. దైవాన్ని పొందాలంటే మనం ధ్యానంలోకి, ప్రార్థనలోకి తిరిగి వెళ్లాలి. మన మూలాలకు చేరుకోవాలి. కాబట్టి, ఈనాటి సున్నితమైన క్షణంలో, మనలో దైవాన్ని ఆవాహన చేసుకోవాలి. పోప్ ఫ్రాన్సిస్ తరపున, సమస్త ప్రజలకు సోదరుడినైన నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ అతిపెద్ద సమావేశానికి హాజరైన మీ అందరికీ నా ఆశీస్సులు. నిజంగా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఈ విధంగా జీవించే కళ) మన మానవాళికి భవిష్యత్తు అని నా ఉద్దేశ్యం.” అని పేర్కొన్నారు. రవిశంకర్ స్ఫూర్తితో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడుతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం, దేశాల భౌగోళిక ఎల్లలను చెరిపివేస్తూ మానవాళి, సౌభ్రాతృత్వాలను పడుగు పేకలుగా నేసి, విశ్వమానవ సంస్కృతి అనే అద్భుతమైన వస్త్రాన్ని సృజించింది. సంగీత, నృత్యాల ద్వారా ప్రాంతీయ, దేశీయ సంప్రదాయాల పరిరక్షణకు, అదే సమయంలో ప్రతి ఒక్కరూ ఆనందించి, ఆస్వాదించడానికి ఒక చక్కని వేదికను ఈ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం అందించింది. ప్రేమ, కరుణ, స్నేహశీలత వంటి సార్వత్రిక మానవ విలువల పునరుద్ధరణకు ఈ ఉద్యమం స్ఫూర్తినిస్తుంది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ మాట్లాడుతూ, “సంస్కృతి అనేది వారధులను నిర్మిస్తుంది, అడ్డుగోడలను కూల్చివేస్తుంది, చర్చలు, పరస్పర అవగాహనల ద్వారా ప్రపంచాన్ని కలుపుతుంది. ప్రజల మధ్య, దేశాల మధ్య ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందిస్తుంది. సంస్కృతి ప్రపంచ పౌరులందరి మధ్య శక్తివంతమైన పరస్పర చర్చలను, అవగాహనల మార్పిడిని సృష్టించగలదు. ఈనాడు, ప్రపంచంలోని సాంస్కృతిక సంపద అంతా యునైటెడ్ స్టేట్స్ లోని ఈ నేషనల్ మాల్ కు తరలి వచ్చింది. ఏకత్వం, భిన్నత్వం విషయంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ కు గల స్ఫూర్తిదాయకమైన దృక్పథానికి నా అభినందనలు. ఇటువంటి మరిన్ని వేడుకలు, మరింతమంది కలిసి రావడం, మరింత శాంతి, మరింత సహకారం, సంఘీభావం, భాగస్వామ్యం మనకు అవసరం. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పెను సవాళ్లను పట్టుదలతో ఎదుర్కొనడం వీటిద్వారా మనకు సాధ్యం అవుతుంది. ఈ విధంగా మనం శాంతిని స్థాపించగలుగుతాం, సంఘర్షణలను పరిష్కరిస్తాము, ఆకలిబాధను అంతం చేసి, ఆరోగ్యకరమైన జీవితాలను సమకూర్చి, నాణ్యమైన విద్యను అందించగలుగుతాము. మహిళలు, బాలికలకు సాధికారత కల్పిస్తాము. ఈ విధంగా మనం ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా అంతా కలసి ముందుకు వెళ్తాము’’ అని పేర్కొన్నారు. -
USA : ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు
అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి అక్టోబర్ 1 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రపంచ సంస్కృతులలోని భిన్నత్వాన్ని ఒకే వేదికపైకి చేర్చే ఈ ఉత్సవాలను గతంలో 3 సార్లు వివిధ దేశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించింది. 4వ విడత ఉత్సవాలను ఈ ఏడాది వాషింగ్టన్ డిసిలోని నేషనల్ మాల్ ప్రాంగణంలో మరింత ఘనంగా, చిరస్మరణీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసిలోని క్యాపిటల్ భవనం ముందున్న విశాల ప్రాంగణంలో ఫుట్ బాల్ మైదానమంత విస్తీర్ణంలో భారీ వేదికను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుండి 17,000 మంది కళాకారులు, అనేక దేశాల నేతలు, ప్రముఖులు ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారని అంచనా వేస్తున్న ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా 50కి పైగా ప్రదర్శనలు జరుగబోతున్నాయి. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అమరుడయిన మార్టిన్ లూధర్ కింగ్ ప్రఖ్యాత ఉపన్యాసం “ఐ హావ్ ఎ డ్రీమ్” ను నేషనల్ మాల్ వేదికపై నుండే ఇచ్చారు.1963వ సంవత్సరంలో జరగిన ఈ ఉపన్యాసం ద్వారా ప్రపంచ సమైక్యత, సమానతా సందేశాన్ని అందరికీ చాటిచెప్పాడు. దానికి ఒక శతాబ్ది క్రితం షికాగోలోని ప్రపంచ పార్లమెంటు సదస్సులో స్వామి వివేకానందుని ఉపన్యాసం అక్కడి ప్రజలను సన్మోహితులను చేసి, ఆయన జ్ఞానానికి పాదాక్రాంతులను చేసింది. ప్రపంచంలోని వివిధ మత నాయకులను తన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు గా పేర్కొంటూ మతవిశ్వాసాల పేరుతో ప్రజలను విభజించడం, ఇతర ధర్మాల పట్ల అసహనం విడనాడ వలసిందిగా అతడు హితవు పలికాడు. ఈ సెప్టెంబర్ 29వ తేదీన ప్రారంభం కానున్న ఈ చారిత్రాత్మక ఉత్సంలో శ్రీ శ్రీ రవిశంకర్, ప్రపంచంలో దేశాలు, ధర్మాలు, జాతుల మధ్య భేదాభిప్రాయాలను, అంతరాలను చెరిపివేసి, 180 దేశాలకు చెందిన ప్రజలను “ఒకే ప్రపంచ కుటుంబం” గా ఒకే వేదికపై ఆవిష్కరిస్తారు.మానవాళిని సమైక్యంగా ఉంచేవాటిలో ప్రధాన పాత్రగా ఉండే ఆహారం అనేది ఇక్కడ కూడా తన పాత్రను పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధదేశాలకు చెందిన వంటకాలు ఇక్కడి కార్యక్రమాలకు హాజరయ్యే ప్రేక్షకులకు విందుచేయనున్నాయి. ఈ సారి అనేకమంది ఔత్సాహిక కళాకారులు సైతం తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా హాజరౌతున్నవారిలో ఐక్యరాజ్య సమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్, భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్, అమెరికాలోని ప్రముఖ వైద్యుడు వివేక్ మూర్తి, అమెరికా సెనేటర్ రిక్ స్కాట్, నాన్సి పెలోసి, భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సురినామ్ దేశ రక్షణ మంత్రి కృష్ణకుమారి మాథెరా ఉన్నారు. -
ఘనంగా ముగిసిన సాంస్కృతిక మేళా
దేశ ప్రతిష్ట పెంచే సభలపై రాజకీయాలు వద్దు: శ్రీశ్రీ రవిశంకర్ న్యూఢిల్లీ: దేశ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాల్ని పార్టీలు రాజకీయం చేయకూడదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంపై విమర్శల సందర్భంగా మీడియా కఠినంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో యుమునా తీరంలో ఆదివారం ప్రపంచ సాంస్కృతిక సంగమం ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ... వచ్చే సదస్సు కోసం ఆస్ట్రేలియా, మెక్సికో, ఇతర దేశాల నుంచి ఇప్పటికే ఆహ్వానాలు అందాయన్నారు. పార్టీలన్నీ కలసికట్టుగా తరలివస్తే ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ట పెరుగుతుందన్నారు. ఇంత పెద్ద సదస్సు నిర్వహించడం తేలిక కాదని, అందువల్లే ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కలుసుకునే అవకాశం కలిగిందన్నారు. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ... గందరగోళం ఉంటే నాయకత్వానికి అర్థమే లేదని, ఏకీకృత సాంఘిక విధానం కంటే వివిధ సంస్కృతుల సమ్మేళనం భారత్‌ను గొప్ప నాగరికత వైపు తీసుకెళ్తుందన్నారు. జీవవైవిధ్యంతో మన జీవితాల్ని సుసంపన్నం చేస్తున్న ప్రకృతి నుంచి ప్రజలు ఎన్నో నేర్చుకోవాలన్నారు. సంస్కృతి లేకపోతే జీవితానికి అర్థం ఉండేది కాదని, కొన్ని వివాదాలకు అది కారణమైనా క్రమంగా సమాజంలో శాంతిని తీసుకొచ్చిందని చెప్పారు. ఉన్నత ఆశయాలు, మానవత్వం సరిహద్దులు దాటాయనడానికి 160 దేశాల ప్రజలు ఒకే వేదిక పంచుకోవడమే నిదర్శనమని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ అన్నారు. నాయకత్వ విలువల పతనం, మంచి నేతలుగా ఎలా ఎదగాలో అన్న అంశాలపై కేంద్ర మంత్రి వీకే సింగ్, నార్వే మాజీ ప్రధాని కెల్ మాగ్నే బాండ్వెక్లు సూచనలు చేశారు. నాయకుడు ఎప్పుడూ ఆదర్శంగా ఉండాలని, భయపెట్టకూడదని వీకే సింగ్ అన్నారు. మూడో రోజు కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య, గడ్కారీ, నిర్మలా సీతారామన్, నేపాల్ ఉప ప్రధాని కమల్ థాపా తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల నుంచి ఆహ్వానం.. రవిశంకర్‌కు ప్రపంచనేతల నుంచి ఆహ్వానాలు, ప్రశంసలు వెల్లువెత్తాయి. హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రసంగించాని బ్రిటన్ ప్రధాని కామెరాన్ ఆహ్వానించారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాన్ని తమ దేశంలో జరపాలని ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ కోరారు.