వాషింగ్టన్ డిసి: నేషనల్ మాల్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలలో మొదటిరోజునే రికార్డు స్థాయిలో పది లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా హాజరై తిలకించారు. ప్రపంచంలోని భిన్న సంస్కృతుల సమాహారంగా, మానత్వం, శాంతి సందేశాల ద్వారా మానవాళిని ఏకంచేసే ఉద్దేశ్యంతో రూపొందిన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు 180 దేశాల నుంచి కళాకారులు ఇక్కడకు చేరుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో ఐక్యరాజ్యసమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, వాషింగ్టన్ డిసి నగర మేయర్ మురియెల్ బౌసర్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పోంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గౌరవ ఛాన్సలర్ బిషప్ ఎమెరిటస్ మార్సెలో శాంచెజ్ సోరోండో ఉన్నారు. మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా గ్రామీ అవార్డు గ్రహీత చంద్రికా టాండన్, 200 మంది కళాకారుల బృందంచే అమెరికా ది బ్యూటిఫుల్, వందేమాతరం మనోహర సంగీత ప్రదర్శన, పంచభూతం పేరిట, 1000 మంది భారతీయ శాస్త్రీయ నృత్యకళాకారులచే శాస్త్రీయ నృత్య-వాద్య సంగమం, గ్రామీ అవార్డు విజేత మిక్కీ ఫ్రీ నేతృత్వంలో1000మంది కళాకారులచే ప్రపంచ గిటార్ వాద్యగోష్టి, ఇంకా ఆఫ్రికా, జపాన్, మధ్యప్రాచ్య దేశాల కళాకారుల ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ రవిశంకర్ తన భావాలను పంచుకున్నారు. “మానవ జాతిలోని వైవిధ్యాన్ని ఒక ఉత్సవంగా జరుపుకునే సుందరమైన సందర్భం ఇది. ఈ భూమి చాలా వైవిధ్యంతో కూడి ఉంది, అయినప్పటికీ, మానవ విలువలనే సూత్రం ద్వారా మనందరిలో అంతర్లీనంగా ఐక్యత ఉంది. ఈ రోజు, ఈ ఉత్సవం సందర్భంగా, సమాజానికి మరింత ఆనందాన్ని తీసుకురావడానికి మనం కట్టుబడదాం. ప్రతీ ఒక్కరి ముఖంలో చిరునవ్వులు పూయించేందుకు కృషిచేద్దాం. అదే మానవత్వం. మనమందరం దానితోనే రూపొందించబడ్డాం. జ్ఞానం ఆలంబనగా లేకపోతే ఏ ఉత్సవమైనా శోభించదు. ఆ జ్ఞానం మన అందరిలోనూ ఉంది. మనలో ప్రతీ ఒక్కరూ ప్రత్యేకమైన వారని, అదే సమయంలో అందరూ ఒకటే అని గుర్తించడమే ఆ జ్ఞానం.
మీలో ప్రతీ ఒక్కరికీ మరొక్కసారి చెబుతున్నాను. మనమంతా ఒకరికొకరు సంబంధించిన వారం. మనమంతా ఒకే విశ్వకుటుంబానికి చెందినవారం. రండి, మన జీవితాలను పండుగలా, ఉత్సవంలా జరుపుకుందాం. సవాళ్లను అంగీకరించి, ధైర్యంగా ఎదుర్కొందాం. మనకోసం, రాబోయే తరాలకోసం మరింత మెరుగైన భవిష్యత్తును ఆశిద్దాం’’ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, “మనం మరింత సమృద్ధికోసం, మన భూమి భవిష్యత్తును కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నపుడు, దానికి వ్యతిరేకంగా సవాళ్ళను ఎదుర్కొనడం సహజం. అవి ప్రకృతి ఉత్పాతాలు కావచ్చు. లేదా మానవ తప్పిదాలు, సంఘర్షణలు, లేదా అంతరాయాలు కావచ్చు. ఈనాటి పరస్పర ఆధారిత ప్రపంచంలో మనమంతా ఒకరికొకరు అండగా ఉన్నామనేది ముఖ్యమైన విషయం. ఈ విషయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మనకు ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచింది. ఇటీవలి ఉక్రెయిన్ సంఘర్షణలో వీరిద్వారా కలిగిన ప్రభావవంతమైన మార్పును నేను ప్రత్యక్షంగా గమనించాను. ఈ రోజు, వారి సందేశం, మీ సందేశం, నా సందేశం ఒకటే. పరస్పరం దయ కలిగి ఉండడం, మనకు కలిగిన దానిని ఇతరులతో పంచుకోవడం, పరస్పరం సుహృద్భావంతో అర్థంచేసుకోవడం, సహకరించుకోవడం. ఇవే ఈనాడు మనందరినీ సమైక్యంగా ఇక్కడకు చేర్చాయి.” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పోప్ తమ సందేశాన్ని పోంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గౌరవ ఛాన్సలర్ బిషప్ ఎమెరిటస్ మార్సెలో శాంచెజ్ సోరోండో ద్వారా పంచుకున్నారు. “ప్రపంచ శాంతిని సాధించేందుకు, మనకు అంతరంగంలో శాంతి అవసరం. శాంతిని ప్రవచించేందుకు ముందు, మనం శాంతితో జీవించాలి. శాంతియుతంగా జీవించడానికి మనకు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కావాలి. శాంతియుతంగా జీవించే కళను పొందాలంటే మనం దైవంతో సంభాషిస్తూ ఉండాలి. దేవుడంటే మనిషికి శత్రువు కాదు, దైవం మనకు మిత్రుడు. దైవం అంటే ప్రేమ. దైవాన్ని పొందాలంటే మనం ధ్యానంలోకి, ప్రార్థనలోకి తిరిగి వెళ్లాలి. మన మూలాలకు చేరుకోవాలి. కాబట్టి, ఈనాటి సున్నితమైన క్షణంలో, మనలో దైవాన్ని ఆవాహన చేసుకోవాలి. పోప్ ఫ్రాన్సిస్ తరపున, సమస్త ప్రజలకు సోదరుడినైన నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ అతిపెద్ద సమావేశానికి హాజరైన మీ అందరికీ నా ఆశీస్సులు. నిజంగా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఈ విధంగా జీవించే కళ) మన మానవాళికి భవిష్యత్తు అని నా ఉద్దేశ్యం.” అని పేర్కొన్నారు.
రవిశంకర్ స్ఫూర్తితో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడుతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం, దేశాల భౌగోళిక ఎల్లలను చెరిపివేస్తూ మానవాళి, సౌభ్రాతృత్వాలను పడుగు పేకలుగా నేసి, విశ్వమానవ సంస్కృతి అనే అద్భుతమైన వస్త్రాన్ని సృజించింది. సంగీత, నృత్యాల ద్వారా ప్రాంతీయ, దేశీయ సంప్రదాయాల పరిరక్షణకు, అదే సమయంలో ప్రతి ఒక్కరూ ఆనందించి, ఆస్వాదించడానికి ఒక చక్కని వేదికను ఈ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం అందించింది. ప్రేమ, కరుణ, స్నేహశీలత వంటి సార్వత్రిక మానవ విలువల పునరుద్ధరణకు ఈ ఉద్యమం స్ఫూర్తినిస్తుంది.
ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ మాట్లాడుతూ, “సంస్కృతి అనేది వారధులను నిర్మిస్తుంది, అడ్డుగోడలను కూల్చివేస్తుంది, చర్చలు, పరస్పర అవగాహనల ద్వారా ప్రపంచాన్ని కలుపుతుంది. ప్రజల మధ్య, దేశాల మధ్య ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందిస్తుంది. సంస్కృతి ప్రపంచ పౌరులందరి మధ్య శక్తివంతమైన పరస్పర చర్చలను, అవగాహనల మార్పిడిని సృష్టించగలదు. ఈనాడు, ప్రపంచంలోని సాంస్కృతిక సంపద అంతా యునైటెడ్ స్టేట్స్ లోని ఈ నేషనల్ మాల్ కు తరలి వచ్చింది. ఏకత్వం, భిన్నత్వం విషయంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ కు గల స్ఫూర్తిదాయకమైన దృక్పథానికి నా అభినందనలు. ఇటువంటి మరిన్ని వేడుకలు, మరింతమంది కలిసి రావడం, మరింత శాంతి, మరింత సహకారం, సంఘీభావం, భాగస్వామ్యం మనకు అవసరం. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పెను సవాళ్లను పట్టుదలతో ఎదుర్కొనడం వీటిద్వారా మనకు సాధ్యం అవుతుంది. ఈ విధంగా మనం శాంతిని స్థాపించగలుగుతాం, సంఘర్షణలను పరిష్కరిస్తాము, ఆకలిబాధను అంతం చేసి, ఆరోగ్యకరమైన జీవితాలను సమకూర్చి, నాణ్యమైన విద్యను అందించగలుగుతాము. మహిళలు, బాలికలకు సాధికారత కల్పిస్తాము. ఈ విధంగా మనం ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా అంతా కలసి ముందుకు వెళ్తాము’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment