జాహ్నవి కేసు.. భారత్‌ కీలక ప్రకటన | Jaahnavi Kandula Case Updates: India Move Review On Court Order | Sakshi
Sakshi News home page

తెలుగమ్మాయి జాహ్నవి మృతి కేసు.. భారత్‌ కీలక ప్రకటన

Published Sat, Feb 24 2024 11:26 AM | Last Updated on Sat, Feb 24 2024 11:41 AM

Jaahnavi Kandula Case Updates: India Move Review On Court Order - Sakshi

సీటెల్‌: రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అధికారికి అక్కడి కోర్టు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. సరైన ఆధారాలు లేనందున ఆ అధికారిపై క్రిమినల్‌ అభియోగాలు మోపడం లేదని వాషింగ్టన్‌ స్టేట్‌లోని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం ప్రకటించింది. అయితే జాహ్నవి కందుల కేసులో భారత్‌  కీలక ప్రకటన చేసింది. తీర్పును సమీక్షించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని సీటెల్‌లోని భారత దౌత్య కార్యాలయం ధృవీకరించింది. 

‘‘దురదృష్టకర రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జాహ్నవి కందుల కేసులో.. ఇటీవలె కింగ్‌ కౌంటీ అటార్నీ ప్రాసిక్యూషన్‌ దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అయితే ఈ విషయంలో బాధిత కుటుంబంతో టచ్‌లో ఉన్నాం. న్యాయం జరిగేంతవరకు అన్ని రకాలుగా సహకారం అందిస్తూనే ఉంటాం అని దౌత్య కార్యాలయం తెలిపింది. అంతేకాదు.. ఈ కేసులో తగిన పరిష్కారం కోసం సీటెల్ పోలీసులతో సహా స్థానిక అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.

తీర్పుపై  సమీక్ష కోసం ఇప్పటికే సీటెల్ సిటీ అటార్నీ కార్యాలయానికి సిఫార్సు చేశామని పేర్కొంది.  సీటెల్ పోలీస్ విచారణ ముగింపు కోసం ఎదురు చూస్తున్నామని, అప్పటిదాకా కేసు పురోగతిని పరిశీలిస్తామని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికా వెళ్లింది. కిందటి ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో ఇంటికి వెళ్లబోతూ రోడ్డు దాటుతున్న ఆమెను..  ఓ పోలీసు పెట్రోలింగ్‌ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ వేగానికి వంద అడుగుల ఎత్తులో ఎగిరిపడి తీవ్రంగా గాయపడి జాహ్నవి మృతి చెందింది. ఆ టైంలో వాహనం నడుపుతున్న కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. ఇంకోవైపు..

ఇదీ చదవండి: జాహ్నవికి అన్యాయం.. కేటీఆర్‌ ఆవేదన

సియాటెల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ గిల్డ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డేనియల్‌ ఆర్డరర్‌ జాహ్నవి మృతిపై చులకనగా మాట్లాడాడు. ప్రమాదం గురించి పైఅధికారికి సమాచారం చేరవేస్తూ.. ఆర్డరర్‌ నవ్వులు చిందించాడు. అంతేకాదు.. ఆమె(జాహ్నవి) జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. పరిహారంగా కేవలం చెక్‌ ఇస్తే సరిపోతుందని.. చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. ఈ వ్యవహారం వీడియోతో సహా బయటకు రావడంతో దుమారం రేగింది. అయితే తాను అవమానించేందుకు అలా మాట్లాడలేదంటూ తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు ఆర్డరర్‌. అంతేకాదు.. జాహ్నవి మృతికి కారణమైన కెవిన్‌కు అనుకూలంగా.. తప్పంతా జాహ్నవిదే అన్నట్లు అధికారులకు నివేదిక  ఇచ్చాడు కూడా.

ఇక కెవిన్‌పై ఇప్పటికిప్పుడు క్రిమినల్‌ చర్యలు లేకపోయినా.. డిపార్ట్‌మెంట్‌ తరఫున చర్యలు ఉంటాయని అధికారులంటున్నారు. మార్చి 4వ తేదీన క్రమశిక్షణా కమిటీ ముందు కెవిన్‌ హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అతని వివరణతో కమిటీ సంతృప్తి చెందకపోతే మాత్రం చర్యలు తప్పవు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement