Art of Living founder sri sri Ravi Shankar
-
విజయదశమి వేళ వేదమంత్రాల మధ్య విదేశీ జంటల వివాహ వేడుకలు!
సాక్షి, బెంగళూరు: భారతీయ సంప్రదాయ వివాహ సంస్కృతిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. దీనికి నిదర్శనంగా, జపాన్, మంగోలియా, అమెరికా తదితర దేశాల నుంచి మనదేశానికి విచ్చేసిన జంటలు ఇక్కడి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలోని వైదిక వివాహ మంటపంలో భారతీయ వైదిక సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. విజయదశమి పర్వదినాన జరిగిన ఈ వేడుకకు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ స్వయంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఆధ్యాత్మిక జ్ఞానం, యోగా, ఆయుర్వేదపు జ్ఞానాన్ని అందిస్తున్న గురుదేవ్, కాలక్రమంలో మరుగున పడుతున్న అనేక భారతీయ సంప్రదాయాలను కూడా పునరుద్ధరించారు. లోతైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగిన సంప్రదాయాలు. మంత్రాలతో కూడిన వైదిక వివాహ విధానం వాటిలో ఒకటి. వర్తమాన భారతీయ వివాహాలలో సంప్రదాయాలు క్రమంగా మరుగున పడి, ఆడంబరాలు పెచ్చుమీరుతున్న ఈ కాలంలో వేదమంత్రాల సాక్షిగా ప్రమాణాలు, ఒకరిపట్ల ఒకరు నిబద్ధత కలిగి ఉండటం వంటి మౌలిక అంశాలకు ప్రాధాన్యతనిచ్చే వైదిక వివాహాలకు గురుదేవ్ తిరిగి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ప్రాచీన వాఙ్మయం ప్రకారం చూసినపుడు, వివాహ సందర్భంగా పఠించే వేదమంత్రాలు, విశ్వచైతన్యం ఒకటి మాత్రమే అనే సత్యాన్ని పెండ్లి చేసుకునే జంటకు గుర్తుచేస్తూ, వారి మధ్య అనంతకాలం నిలిచి ఉండే బాంధవ్యాన్ని ముడివేస్తాయి. మరోవిధంగా చెప్పాలంటే అన్నం, పప్పుతో కలిసి పూర్ణం అయినట్లుగా అన్నమాట. "ఇది మాపై ఆశీర్వాదాల వర్షం కురిసినట్లు అనిపించింది. ఈ రోజు మాకు సరికొత్త ప్రారంభం.” అని మంగోలియాకు చెందిన జంట బయాస్గలన్, సురేంజార్గల్ తమ అనుభవాన్ని పంచుకున్నారు. "మేము 8 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాము. వైదిక పద్ధతిలో వివాహం జరగాలని నా భాగస్వామి ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉండటం వలన ఇది ఎలా ఉండబోతోందో మాకు తెలుసు. పురోహితుల జపవిధానం, వివాహప్రక్రియ నుండి స్వయంగా గురుదేవుని ఆశీర్వాదాలు పొందడం వరకు వివాహవేడుక చక్కగా సంప్రదాయబద్ధంగా జరిగింది. 17 రకాల శాకాహార వంటకాలతో.. మాకు ఇంతకంటే మరే కోరికా లేదు." అని దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుండి ఇక్కడకు వచ్చి వివాహం చేసుకున్న రే మోంగీ, లారెన్ డెర్బీ-లూయిస్ దంపతులు పేర్కొన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గత తొమ్మిది రోజులపాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ప్రాచీన వేద మంత్రోచ్ఛారణలు, పవిత్రమైన హోమాలు, భక్తి సంగీత-నృత్యోత్సవాల శోభతో కూడిన వాతావరణం వెల్లివెరిసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుండి, దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన లక్షలాది భక్తులు భక్తి, జ్ఞాన, ఆనందసంగమంగా సాగిన నవరాత్రి ఉత్సవాలలో పాలుపంచుకున్నారు. జగదంబను, దేవీశక్తిని పూజించే ఈ ఉత్సవాలలో భాగంగా నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మారిషస్, కెనడా సహా ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలలో చండీహోమం, మన దేశంలో 100 ప్రాంతాలలో దుర్గాహోమం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. దుర్గాష్టమిరోజున ఇక్కడి భక్తులకోసం ఆశ్రమంలోని వంటశాలలో 17 రకాల శాకాహార వంటకాలతో కూడిన భోజనాలు1,20,000 మందికి దేవీ ప్రసాదంగా వండి వడ్డించారు. (చదవండి: దసరా రోజున.. ఈ మూడు రకాల పక్షులను చూసారో.. ఇకపై విజయాలే!) -
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు (ఫోటోలు)
-
USA : ఘనంగా జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ 4వ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు
వాషింగ్టన్ డి.సి. లోని నేషనల్ మాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలలో మొదటిరోజునే రికార్డు స్థాయిలో పది లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా హాజరై తిలకించారని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నాము. ప్రపంచంలోని భిన్న సంస్కృతుల సమాహారంగా, మానత్వం, శాంతి సందేశాల ద్వారా మానవాళిని ఏకంచేసే ఉద్దేశ్యంతో రూపొందిన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు 180 దేశాలనుండి కళాకారులు ఇక్కడకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో ఐక్యరాజ్యసమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, వాషింగ్టన్ డి.సి. నగర మేయర్ మురియెల్ బౌసర్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పోంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఛాన్సలర్ బిషప్ ఎమెరిటస్, మార్సెలో శాంచెజ్ సోరోండో మొదలైనవారు ఉన్నారు. మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా గ్రామీ అవార్డు గ్రహీత చంద్రికా టాండన్, 200 మంది కళాకారుల బృందంచే అమెరికా ది బ్యూటిఫుల్, వందేమాతరం మనోహర సంగీత ప్రదర్శన, పంచభూతం పేరిట, 1000 మంది భారతీయ శాస్త్రీయ నృత్యకళాకారులచే శాస్త్రీయ నృత్య-వాద్య సంగమం, గ్రామీ అవార్డు విజేత మిక్కీ ఫ్రీ నేతృత్వంలో 1000 మంది కళాకారులచే ప్రపంచ గిటార్ వాద్యగోష్టి, ఇంకా ఆఫ్రికా, జపాన్, మధ్యప్రాచ్య దేశాల కళాకారుల ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. -
USA : ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు
అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి అక్టోబర్ 1 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రపంచ సంస్కృతులలోని భిన్నత్వాన్ని ఒకే వేదికపైకి చేర్చే ఈ ఉత్సవాలను గతంలో 3 సార్లు వివిధ దేశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించింది. 4వ విడత ఉత్సవాలను ఈ ఏడాది వాషింగ్టన్ డిసిలోని నేషనల్ మాల్ ప్రాంగణంలో మరింత ఘనంగా, చిరస్మరణీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసిలోని క్యాపిటల్ భవనం ముందున్న విశాల ప్రాంగణంలో ఫుట్ బాల్ మైదానమంత విస్తీర్ణంలో భారీ వేదికను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుండి 17,000 మంది కళాకారులు, అనేక దేశాల నేతలు, ప్రముఖులు ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారని అంచనా వేస్తున్న ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా 50కి పైగా ప్రదర్శనలు జరుగబోతున్నాయి. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అమరుడయిన మార్టిన్ లూధర్ కింగ్ ప్రఖ్యాత ఉపన్యాసం “ఐ హావ్ ఎ డ్రీమ్” ను నేషనల్ మాల్ వేదికపై నుండే ఇచ్చారు.1963వ సంవత్సరంలో జరగిన ఈ ఉపన్యాసం ద్వారా ప్రపంచ సమైక్యత, సమానతా సందేశాన్ని అందరికీ చాటిచెప్పాడు. దానికి ఒక శతాబ్ది క్రితం షికాగోలోని ప్రపంచ పార్లమెంటు సదస్సులో స్వామి వివేకానందుని ఉపన్యాసం అక్కడి ప్రజలను సన్మోహితులను చేసి, ఆయన జ్ఞానానికి పాదాక్రాంతులను చేసింది. ప్రపంచంలోని వివిధ మత నాయకులను తన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు గా పేర్కొంటూ మతవిశ్వాసాల పేరుతో ప్రజలను విభజించడం, ఇతర ధర్మాల పట్ల అసహనం విడనాడ వలసిందిగా అతడు హితవు పలికాడు. ఈ సెప్టెంబర్ 29వ తేదీన ప్రారంభం కానున్న ఈ చారిత్రాత్మక ఉత్సంలో శ్రీ శ్రీ రవిశంకర్, ప్రపంచంలో దేశాలు, ధర్మాలు, జాతుల మధ్య భేదాభిప్రాయాలను, అంతరాలను చెరిపివేసి, 180 దేశాలకు చెందిన ప్రజలను “ఒకే ప్రపంచ కుటుంబం” గా ఒకే వేదికపై ఆవిష్కరిస్తారు.మానవాళిని సమైక్యంగా ఉంచేవాటిలో ప్రధాన పాత్రగా ఉండే ఆహారం అనేది ఇక్కడ కూడా తన పాత్రను పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధదేశాలకు చెందిన వంటకాలు ఇక్కడి కార్యక్రమాలకు హాజరయ్యే ప్రేక్షకులకు విందుచేయనున్నాయి. ఈ సారి అనేకమంది ఔత్సాహిక కళాకారులు సైతం తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా హాజరౌతున్నవారిలో ఐక్యరాజ్య సమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్, భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్, అమెరికాలోని ప్రముఖ వైద్యుడు వివేక్ మూర్తి, అమెరికా సెనేటర్ రిక్ స్కాట్, నాన్సి పెలోసి, భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సురినామ్ దేశ రక్షణ మంత్రి కృష్ణకుమారి మాథెరా ఉన్నారు. -
30 నుంచి బెంగళూరులో కిసాన్ మేళా, దేశీ విత్తనోత్సవం
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు (ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి.) ఆధ్వర్యంలో మార్చి 30–31 తేదీల్లో రైతు మేళా, దేశీ విత్తనోత్సవం జరగనున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మార్పుల నేపథ్యంలో కరువు, చీడపీడలను తట్టుకోవడానికి తమ సంప్రదాయ విత్తనాన్ని అభివృద్ధి చేసుకొని విత్తుకోవడమే ఉత్తమం. దేశీ విత్తన స్వాతంత్య్రం, దేశీ గోమాతే రైతులకు రక్షగా నిలుస్తాయని ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. భావిస్తోందని ప్రతినిధి ఉమామహేశ్వరి తెలిపారు. ఈ అంశాలపై రైతులను చైతన్యవంతం చేయడమే లక్ష్యమన్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే దేశీ విత్తన సంరక్షకులు ఈ మేళాలో పాల్గొంటారన్నారు. రెండున్నర కిలోల దేశీ వరివిత్తనంతో ఎకరం సాగు చేసే శ్రీ పద్ధతి, పావు కిలో విత్తనంతో సాగు చేసే పెరుమాళ్లు పద్ధతి, పంటల ప్రణాళిక రూపకల్పన, దేశీ విత్తన సంరక్షణలో మెలకువలు తదితర అంశాలపై ప్రకృతి వ్యవసాయదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. వివరాలకు.. ఉమామహేశ్వరి – 90004 08907 కుంకుడు గుత్తులు! సాధారణంగా కుంకుడు చెట్టుకు కాయలు విడివిడిగా కాస్తాయి. ఆశ్చర్యకరంగా ఈ చెట్టుకు కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం జనగామకు సమీపంలో ఓ మెట్టభూమి గట్టు మీద ఈ చెట్టు ఉండగా సుస్థిర వ్యవసాయ కేంద్రం డా. జి. రాజశేఖర్ దృష్టిలో పడింది. ఈ విత్తనాలు కావాలనుకున్న వారు డా. రాజశేఖర్‌ను 83329 45368 నంబరులో సంప్రదించవచ్చు. 24న సేంద్రియ గొర్రెల పెంపకంపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈ నెల 24 (ఆదివారం)న సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సాంకేతిక అధికారి డా. టి. వెంకటేశ్వర్లు, పశువైద్యులు డా. జి. రాంబాబు(కడప), గొర్రెల పెంపకందారుడు రషీద్ రైతులకు అవగాహన కల్పిస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. వివరాలకు.. 97053 83666, 0863–2286255. కట్టె గానుగల నిర్వహణపై 3 రోజుల శిక్షణ .సహజ సాగు పద్ధతిలో పండించిన నూనెగింజలతో ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా పరిశుభ్రమైన రీతిలో కట్టె గానుగలో వంటనూనెలను వెలికితీయడంపై యువతీ యువకులకు మార్చి 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ ఏ.ఎస్.రావు నగర్లో శిక్షణ ఇవ్వనున్నట్లు న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షిండె శివశంకర్ తెలిపారు. కనీసం పదోతరగతి చదివిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఆసక్తి గల వారు తమ వివరాలను ఈ నెల 24లోగా 81210 08002, 70133 09949లలో ఏదో ఒక నంబర్‌కు ఎస్.ఎం.ఎస్. లేదా వాట్సప్ ద్వారా సమాచారం పంపాలని ఆయన కోరారు. -
శబరిమల వివాదం : సంప్రదాయాలు పాటించాల్సిందే..
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సర్వోన్నత న్యాయస్ధానం తీర్పుపై నెలకొన్న వివాదంపై తలోరకంగా స్పందిస్తున్నారు. పది నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళల కోసం సుప్రీం తీర్పుకు అనుగుణంగా అక్టోబర్ 17 నుంచి శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు నవంబర్ 5న సాయంత్రం ఐదు గంటలకు నెలవారీ పూజల కోసం శబరిమల ఆలయం ముస్తాబైంది. కాగా ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ స్పష్టం చేశారు. హిందూ సంస్ధలు ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు మనం పాదరక్షలను బయటే వదిలేస్తామని, గురుద్వారాలోకి వెళ్లే సమయంలో తలపాగా ధరిస్తామని, ముస్లింలు సైతం హజ్ యాత్రకు వెళ్లే క్రమంలో నిర్ధేశిత పద్ధతులను అనుసరిస్తారని, భారత సంస్కృతి నిర్ధేశించిన సంప్రదాయాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. రుతుక్రమంలో ఉన్న మహిళలు ఆలయంలోకి రాకూడదనే నియమం ఉంటే దాన్ని గౌరవించాలని స్పష్టం చేశారు. దీన్ని ఓ వివాదంగా చూడరాదని, సంప్రదాయాన్ని విధిగా ఆచరించాలని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను తాము గౌరవిస్తామని, అయితే ప్రజల మనోభావాలకు అనుగుణంగా దీనిపై రివ్యూ పిటిషన్‌ను న్యాయస్ధానం అనుమతిస్తుందన్న విశ్వాసం తమకుందన్నారు. -
మందిర్ కోసం ముస్లింలు ఆ స్ధలం ఇవ్వాలి : రవిశంకర్
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మధ్యవర్తిత్వం నెరపుతానన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకులు శ్రీశ్రీ రవిశంకర్ పలు ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముస్లింలు భూమిని బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరారు. ‘అయోధ్య రాముడి జన్మభూమి అయినందున ఈ ప్రదేశంపై హిందువులకు గట్టి సెంటిమెంట్ ముడిపడిఉందని, ముస్లింలకు ఇది కీలక ప్రాంతం కానందున ఇక్కడ నమాజ్ చేసుకోవడం ఆమోదయోగ్యం కాద’ని రవిశంకర్ వ్యాఖ్యానించారు. ముస్లింలకు అయోధ్య ముఖ్యమైన ప్రదేశం కానందున సదరు స్థలాన్ని హిందువులకు బహుమతిగా ఇవ్వాలని ఆయన సూచించారు. కోర్టు వెలుపల సమస్య పరిష్కారానికి ఈ ప్రతిపాదన ద్వారా మార్గం సుగమమవుతుందన్నారు.సున్నీ, షియా ముస్లిం నేతలను ఇటీవల కలుసుకున్న రవిశంకర్ తాను అయోధ్య వివాద పరిష్కారంపై ప్రభుత్వంతో సంప్రదించడం లేదని, తన ప్రయత్నాలతో అధికార యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయోధ్య వ్యవహారంలో సుప్రీం కోర్టు ఓ వర్గానికి అనుకూలంగా తీర్పు వెలువరిస్తే రక్తపాతం జరుగుతుందని తాను వ్యాఖ్యానించలేదని ఆయన స్పష్టం చేశారు. -
ఈ వివాదం కోర్టుల్లో తేలేది కాదు..
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదం న్యాయస్ధానాల్లో తేలేది కాదని ఆథ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. కోర్టులో కేసును ఓడిపోయిన వారు తొలుత తీర్పును అంగీకరించినా భవిష్యత్‌లో దీనిపై గందరగోళం సృష్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య వ్యవహారాన్ని కోర్టు వెలుపల సామరస్యంగా పరిష్కరించుకుంటేనే మేలని సూచించారు. కాగా అయోధ్యలో మందిర్, మసీదు వివాదం కోర్టు వెలుపల పరిష్కారం కావాలన్న శ్రీశ్రీ సూచనపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయోధ్య వివాదానికి శ్రీశ్రీ దూరంగా ఉండాలని బాబ్రీ యాక్షన్ కమిటీ కోరగా, శ్రీశ్రీ మధ్యవర్తిత్వాన్ని మరికొందరు రాజకీయ నేతలు తోసిపుచ్చారు. హిందువులు, ముస్లింలు ముందుకొచ్చి శతాబ్ధాల నాటి వివాదాన్ని పరిష్కరించుకోవాలని గతంలోనూ శ్రీశ్రీ రవిశంకర్ పిలుపు ఇచ్చారు. అయోధ్యలో మందిర నిర్మాణాన్ని పెద్దసంఖ్యలో ముస్లింలు వ్యతిరేకించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. బాబ్రీ మసీదు-రామజన్మభూమి కేసులో తుది విచారణను గతేడాది డిసెంబర్ 5న సుప్రీం కోర్టు ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
‘మందిర్ నిర్మాణానికి వారు వ్యతిరేకం కాదు’
సాక్షి,అయోధ్య: రామ మందిర నిర్మాణాన్నిముస్లింలు సైతం వ్యతిరేకించడం లేదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ‘కొన్ని సార్లు అయోధ్య సమస్యకు పరిష్కారం కనుచూపుమేరలో కనిపించకపోయినప్పటికీ, మన యువత, ఇరు వర్గాల ప్రజలు తలుచుకుంటే ఇది సాధ్యమే’ నన్నారు. మందిర్ వివాదానికి ముగింపు పలికే క్రమంలో రవిశంకర్ గురువారం అయోధ్యలో మతపెద్దలు సహా పలువురితో ముచ్చటించారు. డిసెంబర్ 5న అయోధ్య కేసును సుప్రీం కోర్టు విచారించనున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వ చర్చలు ఇప్పుడే ప్రారంభమయ్యాయని అయితే ఇవి ఎప్పటికి తుదిరూపు తీసుకుంటాయో ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో ప్రతిఒక్కరితో సంప్రదింపులు జరిపేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఈ అంశంలో తనకు ఎటువంటి అజెండా లేదని అందరి అభిప్రాయాలను కూలంకషంగా తెలుసుకుంటానన్నారు. కాగా రవిశంకర్ పర్యటనను బీజేపీ నేతలు స్వాగతించగా, విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. అయోధ్య అంశంపై అందరి మనోభావాలను తెలుసుకునే ముందు రవిశంకర్ బుధవారం లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. -
యోగి ఆదిత్యనాథ్‌తో శ్రీశ్రీ రవిశంకర్ భేటీ
సాక్షి, లక్నో : ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ బుధవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం 5కేడీ మార్గ్‌లో ఈ సమావేశం జరిగింది. అయోధ్య రామమందిర వివాదం ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రామ జన్మభూమి వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేస్తానంటూ శ్రీశ్రీ రవిశంకర్ స్వయంగా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి తన ఆసక్తిని ప్రకటించారు. రవిశంకర్ గురువారం అయోధ్యను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే యోగి ఆధిత్యనాథ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. -
సాంస్కృతిక సంపదే గర్వకారణం
భారత్‌వైపే ప్రపంచమంతా చూస్తోంది ♦ ప్రపంచ సంస్కృతి సంగమం వేదికపై మోదీ వ్యాఖ్య ♦ ప్రపంచమంతా ఒకే కుటుంబం: శ్రీశ్రీ రవిశంకర్ న్యూఢిల్లీ: ఢిల్లీ సమీపంలో యమునానది వరద మైదానంలో ఏర్పాటుచేసిన ‘ప్రపంచ సంస్కృతి సంగమం’ వివిధ దేశాల సంస్కృతుల కుంభమేళా అని ప్రధాని మోదీ తెలిపారు. మూడ్రోజులపాటు జరిగే వేడుకలను శుక్రవారం సాయంత్రం ప్రారంభించిన మోదీ.. కార్యక్రమానికి విచ్చేసిన విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికారు. ‘భారత దేశం భిన్న సంస్కృతులకు నిలయం. అందుకే ప్రపంచ సంస్కృతికి భారత్ చేయాల్సింది చాలా ఉంది. మనలను మనం విమర్శించుకుంటూ పోతే.. ప్రపంచం మనవైపు ఎందుకు చూస్తుంది? ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ను ప్రపంచమంతా విస్తరించిన శ్రీశ్రీ రవిశంకర్‌ను అభినందించాలి. మంగోలియా వెళ్లినపుడు ఏఓఎల్ ప్రతినిధులు స్వాగతం పలకటం నాకింకా గుర్తుంది’ అని మోదీ అన్నారు. మోదీ దాదాపు మూడు గంటలపాటు ఇక్కడే ఉన్నారు. పర్యావరణ, భద్రత విషయాలపై వివాదాలు నెలకొన్న నేపథ్యంలో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. 17 వందల మంది కథక్ కళాకారులతో చేసిన నృత్యంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను స్థాపించి 35 ఏళ్లయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. నేను అందరివాడిని: రవిశంకర్ తనపై వస్తున్న విమర్శలకు శ్రీశ్రీ రవిశంకర్ సమాధానమిచ్చారు. ఏదైనా గొప్ప కార్యం జరుగుతున్నప్పుడు అవాంతరాలు రావటం సహజమన్నారు. తను అందరివాడినన్నారు. ‘మనం ఒకచోట చేరటానికి కారణం. ప్రపంచమంతా ఒక కుటుంబం అనే భావనను కలిగించటమే. క్రీడలు, కళలు-సంస్కృతి, ఆర్థిక వ్యవహారాలు, సత్యాన్వేషణ, ఆధ్యాత్మికత అనే ఐదు అంశాలే ప్రపంచాన్ని ఏకం చేస్తాయి’ అని ఆయన అన్నారు. కాగా, కార్యక్రమం ప్రారంభానికి ముందు ఉరుములు, మెరుపులతో పదినిమిషాలసేపు కురిసిన భారీ వర్షం నిర్వాహకులను ఆందోళనకు గురిచేసింది. అయితే ఆ వెంటనే వర్షం తగ్గటంతో ఆహూతులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. పరిహారం చెల్లింపునకు మూడు వారాలు కార్యక్రమం నిర్వహణపై విధించిన రూ. 5 కోట్ల పరిహారాన్ని చెల్లించనన్న శ్రీశ్రీ రవిశంకర్ వ్యాఖ్యలపై ఎన్జీటీ మండిపడింది. ప్రభుత్వం ఇచ్చిన రూ. 2.5 కోట్లలో రూ. 25 లక్షలు తక్షణమే చెల్లించాలని ఆదేశించింది. ఏఓఎల్ ఆమేరకు చెల్లించింది. మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు ఎన్జీటీ మూడు వారాల సమయం ఇచ్చింది. ఇదిలావుంటే.. ఎన్జీటీ సూచించిన పరిహారాన్ని ఇవ్వకుండా ఏఓఎల్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి విమర్శించారు. పరిహారం కట్టనన్న రవిశంకర్‌ను జైల్లో పెట్టాలని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ వ్యాఖ్యానించారు. శ్రీశ్రీ రవిశంకర్ ఆశీర్వాదం ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఏకం చేసిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కాగా.. ఆదివారం జరగాల్సిన ముగింపు కార్యక్రమానికి హాజరుకావాల్సిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వెనక్కు తగ్గినట్లు తెలిసింది. -
'అవును ఇది నా ప్రయివేట్ పార్టీనే'
న్యూఢిల్లీ : ప్రపంచమే తన కుటుంబమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ అన్నారు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ 35వ వార్షికోత్సవం సందర్బంగా ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనాన్ని ఢిల్లీలోని యమునా నది ఒడ్డున నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసంగిస్తూ అందరూ నవ్వుతూ బతకాలని, సమాజానికి ఎంత ప్రేమ పంచితే... ఆ ప్రేమ మీలో వంద రెట్లు పెరుగుతుందని పేర్కొన్నారు. వివిధ మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలవారిని ఏకం చేయాలని శ్రీశ్రీ రవిశంకర్ పిలుపునిచ్చారు. 'ఇది నా ప్రయివేటు పార్టీ అని కొందరు ఆరోపణలు చేశారు.. అవును ఇది నా ప్రైవేట్ పార్టీనే.. ప్రపంచమే నా కుటుంబం' అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ప్రజలను ఐక్యం చేసేందుకు ఐదు మధ్యమాలు ఉన్నాయన్న శ్రీశ్రీ రవిశంకర్, వివిధ, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలవారిని ఏకం చేయాల్సిన అవసరం ఉందనన్నారు. మంచి పని చేసేటప్పుడు కొన్ని విఘ్నాలు కలగడం సహజమేనని, అయితే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొనడం ఈ కార్యక్రమానికే వన్నె తెచ్చిందన్నారు. -
అవసరమైతే జైలుకెళ్తా.. పైసా కట్టేది లేదు!
న్యూఢిల్లీ: జైలుకైనా వెళ్తాగానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన రూ.5 కోట్ల పరిహారం చెల్లించనని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. ‘మేం ఏ తప్పూ చేయలేదు, నిర్దోషులం. పైసా కూడా చెల్లించం. అవసరమైతే జైలుకెళ్తాం’ అని గురువారం ట్వీట్ చేశారు. ట్రిబ్యునల్ తీర్పును కోర్టులో సవాల్ చేస్తామన్నారు. ప్రాంగణం వద్ద ఒక్క చెట్టును కూడా నరకలేదని, మైదాన ప్రాంతాన్ని మాత్రం చదును చేశామన్నారు. ప్రధాని సభకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది సాంస్కృతిక ఒలింపిక్స్ అని, 37 వేల మంది కళాకారులు ఒకే వేదికపై పాలుపంచుకుంటారని చెప్పారు. పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభను ఆపేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. భారతీయ కిసాన్ మజ్దూర్ సమితి పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్.. గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని సూచించింది. సభ ఏర్పాట్లు ఎప్పటి నుంచో జరుగుతుంటే ఇప్పుడెందుకొచ్చారని... ట్రిబ్యునల్‌ను ఎందుకు ఆశ్రయించలేదని కోర్టు ప్రశ్నించింది. ప్రచారం కోసమే చేశారా అంటూ పిటిషనర్‌ను తప్పుపట్టింది. ప్రపంచ సాంస్కృతిక పండుగకు తాము ఎలాంటి ఆర్థికసాయం చేయలేదని కేంద్రప్రభుత్వం తెలిపింది.