
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సర్వోన్నత న్యాయస్ధానం తీర్పుపై నెలకొన్న వివాదంపై తలోరకంగా స్పందిస్తున్నారు. పది నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళల కోసం సుప్రీం తీర్పుకు అనుగుణంగా అక్టోబర్ 17 నుంచి శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు నవంబర్ 5న సాయంత్రం ఐదు గంటలకు నెలవారీ పూజల కోసం శబరిమల ఆలయం ముస్తాబైంది. కాగా ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ స్పష్టం చేశారు.
హిందూ సంస్ధలు ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు మనం పాదరక్షలను బయటే వదిలేస్తామని, గురుద్వారాలోకి వెళ్లే సమయంలో తలపాగా ధరిస్తామని, ముస్లింలు సైతం హజ్ యాత్రకు వెళ్లే క్రమంలో నిర్ధేశిత పద్ధతులను అనుసరిస్తారని, భారత సంస్కృతి నిర్ధేశించిన సంప్రదాయాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
రుతుక్రమంలో ఉన్న మహిళలు ఆలయంలోకి రాకూడదనే నియమం ఉంటే దాన్ని గౌరవించాలని స్పష్టం చేశారు. దీన్ని ఓ వివాదంగా చూడరాదని, సంప్రదాయాన్ని విధిగా ఆచరించాలని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను తాము గౌరవిస్తామని, అయితే ప్రజల మనోభావాలకు అనుగుణంగా దీనిపై రివ్యూ పిటిషన్‌ను న్యాయస్ధానం అనుమతిస్తుందన్న విశ్వాసం తమకుందన్నారు.