అవసరమైతే జైలుకెళ్తా.. పైసా కట్టేది లేదు!
న్యూఢిల్లీ: జైలుకైనా వెళ్తాగానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన రూ.5 కోట్ల పరిహారం చెల్లించనని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. ‘మేం ఏ తప్పూ చేయలేదు, నిర్దోషులం. పైసా కూడా చెల్లించం. అవసరమైతే జైలుకెళ్తాం’ అని గురువారం ట్వీట్ చేశారు. ట్రిబ్యునల్ తీర్పును కోర్టులో సవాల్ చేస్తామన్నారు. ప్రాంగణం వద్ద ఒక్క చెట్టును కూడా నరకలేదని, మైదాన ప్రాంతాన్ని మాత్రం చదును చేశామన్నారు. ప్రధాని సభకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది సాంస్కృతిక ఒలింపిక్స్ అని, 37 వేల మంది కళాకారులు ఒకే వేదికపై పాలుపంచుకుంటారని చెప్పారు.
పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభను ఆపేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. భారతీయ కిసాన్ మజ్దూర్ సమితి పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్.. గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని సూచించింది. సభ ఏర్పాట్లు ఎప్పటి నుంచో జరుగుతుంటే ఇప్పుడెందుకొచ్చారని... ట్రిబ్యునల్‌ను ఎందుకు ఆశ్రయించలేదని కోర్టు ప్రశ్నించింది. ప్రచారం కోసమే చేశారా అంటూ పిటిషనర్‌ను తప్పుపట్టింది. ప్రపంచ సాంస్కృతిక పండుగకు తాము ఎలాంటి ఆర్థికసాయం చేయలేదని కేంద్రప్రభుత్వం తెలిపింది.