సాంస్కృతిక సంపదే గర్వకారణం
భారత్‌వైపే ప్రపంచమంతా చూస్తోంది
♦ ప్రపంచ సంస్కృతి సంగమం వేదికపై మోదీ వ్యాఖ్య
♦ ప్రపంచమంతా ఒకే కుటుంబం: శ్రీశ్రీ రవిశంకర్
న్యూఢిల్లీ: ఢిల్లీ సమీపంలో యమునానది వరద మైదానంలో ఏర్పాటుచేసిన ‘ప్రపంచ సంస్కృతి సంగమం’ వివిధ దేశాల సంస్కృతుల కుంభమేళా అని ప్రధాని మోదీ తెలిపారు. మూడ్రోజులపాటు జరిగే వేడుకలను శుక్రవారం సాయంత్రం ప్రారంభించిన మోదీ.. కార్యక్రమానికి విచ్చేసిన విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికారు. ‘భారత దేశం భిన్న సంస్కృతులకు నిలయం. అందుకే ప్రపంచ సంస్కృతికి భారత్ చేయాల్సింది చాలా ఉంది. మనలను మనం విమర్శించుకుంటూ పోతే.. ప్రపంచం మనవైపు ఎందుకు చూస్తుంది? ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ను ప్రపంచమంతా విస్తరించిన శ్రీశ్రీ రవిశంకర్‌ను అభినందించాలి. మంగోలియా వెళ్లినపుడు ఏఓఎల్ ప్రతినిధులు స్వాగతం పలకటం నాకింకా గుర్తుంది’ అని మోదీ అన్నారు. మోదీ దాదాపు మూడు గంటలపాటు ఇక్కడే ఉన్నారు. పర్యావరణ, భద్రత విషయాలపై వివాదాలు నెలకొన్న నేపథ్యంలో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. 17 వందల మంది కథక్ కళాకారులతో చేసిన నృత్యంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను స్థాపించి 35 ఏళ్లయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.
నేను అందరివాడిని: రవిశంకర్
తనపై వస్తున్న విమర్శలకు శ్రీశ్రీ రవిశంకర్ సమాధానమిచ్చారు. ఏదైనా గొప్ప కార్యం జరుగుతున్నప్పుడు అవాంతరాలు రావటం సహజమన్నారు. తను అందరివాడినన్నారు. ‘మనం ఒకచోట చేరటానికి కారణం. ప్రపంచమంతా ఒక కుటుంబం అనే భావనను కలిగించటమే. క్రీడలు, కళలు-సంస్కృతి, ఆర్థిక వ్యవహారాలు, సత్యాన్వేషణ, ఆధ్యాత్మికత అనే ఐదు అంశాలే ప్రపంచాన్ని ఏకం చేస్తాయి’ అని ఆయన అన్నారు. కాగా, కార్యక్రమం ప్రారంభానికి ముందు ఉరుములు, మెరుపులతో పదినిమిషాలసేపు కురిసిన భారీ వర్షం నిర్వాహకులను ఆందోళనకు గురిచేసింది. అయితే ఆ వెంటనే వర్షం తగ్గటంతో ఆహూతులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.
పరిహారం చెల్లింపునకు మూడు వారాలు
కార్యక్రమం నిర్వహణపై విధించిన రూ. 5 కోట్ల పరిహారాన్ని చెల్లించనన్న శ్రీశ్రీ రవిశంకర్ వ్యాఖ్యలపై ఎన్‌జీటీ మండిపడింది. ప్రభుత్వం ఇచ్చిన రూ. 2.5 కోట్లలో రూ. 25 లక్షలు తక్షణమే చెల్లించాలని ఆదేశించింది. ఏఓఎల్ ఆమేరకు చెల్లించింది. మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు ఎన్‌జీటీ మూడు వారాల సమయం ఇచ్చింది. ఇదిలావుంటే.. ఎన్‌జీటీ సూచించిన పరిహారాన్ని ఇవ్వకుండా ఏఓఎల్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి విమర్శించారు. పరిహారం కట్టనన్న రవిశంకర్‌ను జైల్లో పెట్టాలని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ వ్యాఖ్యానించారు. శ్రీశ్రీ రవిశంకర్ ఆశీర్వాదం ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఏకం చేసిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కాగా.. ఆదివారం జరగాల్సిన ముగింపు కార్యక్రమానికి హాజరుకావాల్సిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వెనక్కు తగ్గినట్లు తెలిసింది.