సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం | Five soldiers swept away by Shyok river during military training in Ladakh | Sakshi
Sakshi News home page

సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం

Published Sun, Jun 30 2024 5:10 AM | Last Updated on Sun, Jun 30 2024 5:10 AM

Five soldiers swept away by Shyok river during military training in Ladakh

తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ సమీపంలో నదిలో మునిగిన యుద్ధట్యాంకు  

నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఐదుగురు జవాన్ల దుర్మరణం  

మృతుల్లో తెలుగు సైనికుడు, జేసీఓ ముత్తముల రామకృష్ణారెడ్డి  

లేహ్‌/రాచర్ల:  సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంకుతో నదిని దాటుతుండగా హఠాత్తుగా వరద పోటెత్తడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి(జేసీఓ) ముత్తముల రామకృష్ణారెడ్డి సహా ఐదుగురు జవాన్లు మృత్యువాత పడ్డారు.

 తూర్పు లద్దాఖ్‌లో భారత్‌–చైనా సరిహద్దు వాస్తవా«దీన రేఖ(ఎల్‌ఏసీ) సమీపంలోని షియోక్‌ నదిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సైనికాధికారులు వెల్లడించారు. లేహ్‌ నుంచి 148 కిలోమీటర్ల దూరంలోని మందిర్‌ మోర్హ్‌ వద్ద భారత సైన్యం విన్యాసాలు చేపట్టింది. ఈ విన్యాసాల్లో భాగంగా జవాన్లు యుద్ధ ట్యాంకులు నడుపుతూ షియోక్‌ నదిని దాటుతుండగా, టి–72 ట్యాంకు నదిలో ఇరుక్కుపోయింది. 

ఇంతలో ఎగువ ప్రాంతం నుంచి ఆకస్మికంగా వరద పోటెత్తింది. నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. క్షణాల వ్యవధిలోనే టి–72 ట్యాంకు నీట మునిగిపోయింది. యుద్ధ ట్యాంకుపై ఉన్న ఐదుగురు సైనికులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగినప్పటికీ నదిలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో జవాన్లను రక్షించలేకపోయాయి. 

నదిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఐదుగురు జవాన్లు తూర్పు లద్దాఖ్‌ దౌలత్‌ బేగ్‌ ఓల్డీ మిలటరీ బేస్‌లోని 52 ఆర్మర్డ్‌ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. విన్యాసాల్లో పాల్గొంటూ దుదృష్టవశాత్తూ మరణించారు. ఈ సైనిక శిబిరం చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో∙ఉంది. ఎగువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడం వల్లే షియోక్‌ నదిలో వరద ప్రవాహం హఠాత్తుగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. దేశ రక్షణపరంగా వ్యూహాత్మకంగా కీలకమైన దెప్‌సాంగ్‌ ప్రాంతంలో ఈ నది ప్రవహిస్తోంది.  

పదవీ విరమణకు ఆరు నెలల ముందు మృత్యువాత  
తూర్పు లద్దాఖ్‌లో సైనిక విన్యాసాల్లో ప్రాణాలు కోల్పోయిన ముత్తముల రామకృష్ణారెడ్డి(47) స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లె. ఆయన భారత సైన్యంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రామకృష్ణారెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉందని గ్రామస్థులు తెలిపారు. 

ఆయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల చదువుల కోసం ఉమాదేవి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. రామకృష్ణారెడ్డి మృతదేహం ఆదివారం సాయంత్రం కాలువపల్లెకు చేరుకోనున్నట్లు స్థానికులు చెప్పారు. రామకృష్ణారెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆయన భార్య ఉమాదేవి, కుమారులు కాలువపల్లెకు బయలుదేరారు.  

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌  
వాస్తవా«దీన రేఖ సమీపంలో ఐదుగురు సైనికులు మరణించడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని శనివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాం«దీ, ప్రియాంక  సంతాపం ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement