the art of living
-
ఘనంగా ముగిసిన సాంస్కృతిక మేళా
దేశ ప్రతిష్ట పెంచే సభలపై రాజకీయాలు వద్దు: శ్రీశ్రీ రవిశంకర్ న్యూఢిల్లీ: దేశ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాల్ని పార్టీలు రాజకీయం చేయకూడదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంపై విమర్శల సందర్భంగా మీడియా కఠినంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో యుమునా తీరంలో ఆదివారం ప్రపంచ సాంస్కృతిక సంగమం ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ... వచ్చే సదస్సు కోసం ఆస్ట్రేలియా, మెక్సికో, ఇతర దేశాల నుంచి ఇప్పటికే ఆహ్వానాలు అందాయన్నారు. పార్టీలన్నీ కలసికట్టుగా తరలివస్తే ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ట పెరుగుతుందన్నారు. ఇంత పెద్ద సదస్సు నిర్వహించడం తేలిక కాదని, అందువల్లే ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కలుసుకునే అవకాశం కలిగిందన్నారు. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ... గందరగోళం ఉంటే నాయకత్వానికి అర్థమే లేదని, ఏకీకృత సాంఘిక విధానం కంటే వివిధ సంస్కృతుల సమ్మేళనం భారత్‌ను గొప్ప నాగరికత వైపు తీసుకెళ్తుందన్నారు. జీవవైవిధ్యంతో మన జీవితాల్ని సుసంపన్నం చేస్తున్న ప్రకృతి నుంచి ప్రజలు ఎన్నో నేర్చుకోవాలన్నారు. సంస్కృతి లేకపోతే జీవితానికి అర్థం ఉండేది కాదని, కొన్ని వివాదాలకు అది కారణమైనా క్రమంగా సమాజంలో శాంతిని తీసుకొచ్చిందని చెప్పారు. ఉన్నత ఆశయాలు, మానవత్వం సరిహద్దులు దాటాయనడానికి 160 దేశాల ప్రజలు ఒకే వేదిక పంచుకోవడమే నిదర్శనమని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ అన్నారు. నాయకత్వ విలువల పతనం, మంచి నేతలుగా ఎలా ఎదగాలో అన్న అంశాలపై కేంద్ర మంత్రి వీకే సింగ్, నార్వే మాజీ ప్రధాని కెల్ మాగ్నే బాండ్వెక్లు సూచనలు చేశారు. నాయకుడు ఎప్పుడూ ఆదర్శంగా ఉండాలని, భయపెట్టకూడదని వీకే సింగ్ అన్నారు. మూడో రోజు కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య, గడ్కారీ, నిర్మలా సీతారామన్, నేపాల్ ఉప ప్రధాని కమల్ థాపా తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల నుంచి ఆహ్వానం.. రవిశంకర్‌కు ప్రపంచనేతల నుంచి ఆహ్వానాలు, ప్రశంసలు వెల్లువెత్తాయి. హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రసంగించాని బ్రిటన్ ప్రధాని కామెరాన్ ఆహ్వానించారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాన్ని తమ దేశంలో జరపాలని ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ కోరారు. -
యేసు అంటేనే ప్రేమ
జీవన వికాసం శ్రీశ్రీ రవిశంకర్ వ్యవస్థాపకులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యేసు అంటేనే ప్రేమ. ప్రేమ అని మీరు అంటే యేసు అని వేరే చెప్పనక్కర్లేదు. ఆలాగే మీరు యేసు అంటే దాని అర్థం ప్రేమే. యేసుక్రీస్తులో మీకు కనిపించే ప్రేమను ఒక లేశమాత్రం చూసినా సరే, అందులో పరిపూర్ణత, అనిర్వచనీయమైన దైవత్వపు ప్రకటన, జీవితం అనేది దైవత్వపు ఆవిష్కరణకు మానవుడు చేసే నిరంతర ప్రయత్నమే అనే సత్యమూ మనకు గోచరిస్తాయి. యేసు ప్రేమ స్వరూపాన్ని గ్రహించకుండా ఉండటం ఎవరివల్లా కాలేదు. అయితే, ప్రేమ మిమ్మల్ని బలహీనంగా మార్చేసినపుడు భయం కూడా వేస్తుంది. కొన్ని వేలమంది జనాభాలో అతికొద్దిమంది మాత్రమే ఆనాడు అతనిని అనుసరించారు. విన్నది అనేకమంది, అనుసరించి వచ్చినవారు కొందరే. అందుకే అతడు అన్నాడు.. అతికొద్దిమంది మాత్రమే ఈ ఇరుకుదారిగుండా పోగలరు’. అన్ని మహిమలు చూపిన తరువాత కూడా అతికొద్దిమంది మాత్రమే అతనిని నిజంగా గుర్తించి అనుసరించారు. వారేమీ జ్ఞానులు కాదు. సామాన్యమైన, అమాయక ప్రజలు. బుద్ధిని దాటి ఆత్మను, జీవన మూలాన్ని చేరుకోవటానికి మానవులకు చేయగలిగిన సహాయమంతా చేశాడు యేసు. నేను ఫలానా అని ఏదో ఒకదానితో ముడిపెట్టుకుని ఉండే మీ సంకుచిత భావాన్ని ఛేదించి, మీలోని దైవత్వాన్ని గుర్తించండి, మీరు పైకి కనిపించే ఈ మనుష్యరూపంకంటే చాలా ఉన్నతమైనవారని గుర్తించండి. మీరు దైవంలో భాగం. దైవరాజ్యానికి మీరే వారసులు. ఆ రాజ్యం ఇక్కడే, మీలోపలే ఉంది అని బోధించాడు. ఒక సందర్భంలో అతడు అంటాడు - ‘(ఇస్కరియేత్) యూదా అసలు పుట్టకపోయి ఉంటే బాగుండేది’. ఆ మాటలు కోపంతోనో, అసహనంతోనో వచ్చినవి కావు. చాలాసార్లు ప్రజలు తమకు ఎవరైనా నచ్చనప్పుడు వాళ్ళు పుట్టకుండా ఉంటే బాగుండేది అనటం మనం చూస్తాం. ఇక్కడ యేసు యూదా.... అతడు ఎప్పుడూ పుట్టకూడదని కోరుకుంటాను అంటున్నాడు. యూదా పడుతున్న బాధలను యేసు ఊహింపగల్గాడు. జగన్నాటకంలో యూదాకు ఒక పాత్ర ఇవ్వబడింది. దానిని అతడు పోషించాడు అంతే. అతడు పడుతున్న బాధను యేసు గ్రహించాడు. అతనిపట్ల యేసుకు గల అపారమైన కరుణకు తార్కాణం... అతడు పుట్టకపోయి ఉంటే బాగుండేది. యూదాపట్ల అతనికి గల అపరిమితమైన ప్రేమ అది. చివరిలో ఒకచోట యేసు అంటాడు - ‘నేను ఇంకా నా తండ్రితో కలసిపోలేదు, ఇంటి ముంగిట నిలిచి ఉన్నాను. మీరు వెళ్ళి, నేను ఇంటికి చేరానని ప్రపంచానికి చెప్పండి. ఇంటికి రావాలని కోరుకునే వారందరికీ స్వాగతం పలకటానికి నేను ద్వారంవద్దనే వేచి ఉంటాను’. మీరు ప్రాణశక్తితో సజీవంగా లేకుంటే యేసు వాక్యాలను అర్థంచేసుకోలేరు. విన్న జ్ఞానం అంతా ఒక అభిప్రాయంగా, ఒక భావంగా మీ తలలో ఉంటుంది. కాని హృదయం మాత్రమే ఆ హృదయపు భావాన్ని గ్రహించగలదు. అలా కానపుడు యేసు పేరిట, దైవం పేరిట, మతం పేరిట ప్రజలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. యుద్ధాలు జరిగాయి. శతాబ్దాల కాలంపాటు మనుషులు దేవుని పేరుతో పోట్లాడుకున్నారు. యేసు చెప్పిన మాటలకు అర్థం ఏమిటో వారికి అణుమాత్రం కూడా తెలియదు. అయితే ఇదంతా యేసు ముందే ఊహించాడు. ‘మిమ్మల్ని స్నేహితులుగా చూస్తాను, సేవకులుగా కాదు. ఎందుకంటే యజమాని ఏం చేస్తాడో సేవకులకు తెలియదు. నేను మీకు చెబుతాను, నా తండ్రి గురించి నేను విన్నదంతా మీతో పంచుకుంటాను’ అంటాడు యేసు. బోధించటానికి అతి చక్కని మార్గం ఇది. ప్రేమను పంచటానికి అతిచక్కని మార్గం ఇది. యజమాని పట్ల మీకు గౌరవం ఉంటుంది, కాని వ్యక్తిగతంగా ప్రేమ ఉండదు. అదే స్నేహితుడైతే మీ మనసులోని వ్యక్తిగత భావాలను, ఆలోచనలను, రహస్యాలను పంచుకుంటారు. యేసు ‘నేను మీ స్నేహితుడిని’ అన్నాడు. ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండలేదు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అధికారానికి తావు లేదు. చేతులు సాచి యేసు పిలుస్తున్నాడు, రా, నీవు నా స్నేహితుడివి. భయం వద్దు. నన్ను సిలవపై పెట్టవద్దు. నీ హృదయంలో నాకు చోటు ఇయ్యి. నీ చుట్టుపక్కల కనిపించే ప్రతి ఒక్కరిలోనూ నన్నే చూడు. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నీవు ప్రతీ ఒక్కరినీ అంతలా ప్రేమించు... లేదా నన్నెంతగా ప్రేమిస్తున్నావో అంతలా ప్రేమించు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితోనూ ఈ విషయాన్ని పంచుకో. అటువంటి ప్రేమైకమూర్తిని గుర్తించటానికి మీకు ఇంతకంటే ఏం కావాలి? అయినా, ప్రజలు సాక్ష్యాలు కోరారు. యేసు ఈరోజు వచ్చినా సరే, ప్రజలు ‘నీవు దేవుని కుమారుడవే అని నిరూపించుకో’ అంటారు. ఎందుకంటే బుద్ధి ఎప్పుడు సాక్ష్యాలపైనే ఆధారపడుతుంది. బుద్ధి యేసును అర్థంచేసుకోలేదు. కేవలం హృదయం మాత్రమే అతని ఉనికిని అనుభవించగలదు. మీరు నిజంగా యేసుతో ప్రేమలో ఉన్నపుడు, ప్రతీ పేరులోనూ, ప్రతీ ఆకారంలోనూ, ఈ భూమిపై, భూమికి ఆవల ఉన్న ప్రతీ ప్రదేశంలోనూ యేసును చూస్తారు. ఆ గురువు ఏ విలువలకు ప్రతినిధిగా నిలిచాడో ఆ విలువలలో జీవించండి. అలా జీవించినపుడు యేసు ఎప్పుడో గడచినకాలపు వ్యక్తిగా కాక, ఇప్పుడే, ఇక్కడే ఉంటాడు. భవిష్యత్తులో కూడా ఉంటాడు, ఎల్లప్పుడూ, ఎప్పటికీ ఉంటాడు. -
చిరునవ్వే జీవితాభరణం
జీవించడం ఒక కళ. ఆ కళను సాధన చేస్తూ సమాజానికి ధ్యానయోగాన్ని పరిచయం చేసిన గురు శ్రీశ్రీ రవిశంకర్! సమాజంలోని రుగ్మతలను నయంచేసే మందు ఆర్ట్ ఆఫ్ లివింగే అంటారు ఆయన! జాతి, మత, కుల విభేదాలను ఓ చిన్న సమ్మేళనం ద్వారా తొలగించుకోవచ్చు.. చెలిమిని పెంపొందించుకోవచ్చు.. వసుధైక కుటుంబ భావనను సాధించుకోవచ్చు అని ‘స్నేహ మిలన్’ అనే కార్యక్రమం ద్వారా చాటే ప్రయత్నం చేస్తున్నారు రవి శంకర్! తాజాగాబెంగళూరులోని ఆయన ఆశ్రమంలో ప్రపంచంలోని అన్ని మతాల ప్రతినిధులతో స్నేహమిలన్ జరిగింది. ఆ సందర్భంగా తనను కలిసిన సాక్షి ప్రతినిధితో రవిశంకర్ పంచుకున్న మనోభావాలు. సరస్వతి రమ అనారోగ్యంగా ఉన్నవాళ్లకుమందు ఎంత అవసరమో, సమాజానికి వచ్చిన అంతర్గత కలహాలనే రుగ్మతలకూ మందు ఇవ్వాల్సిన అవసరం అంత ఉంది. ఆ మందే ‘స్నేహ మిలన్’. భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి.. మన సంప్రదాయం. దాన్ని పరిరక్షించుకోవాలి. ప్రపంచంలోని భిన్న మతాల మధ్య సమన్వయాన్ని, సయోధ్యను కుదిర్చే వేదికే స్నేహ మిలన్. అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే ప్రయత్నం. ఈ ఏడాదిలో ఇది రెండో సమావేశం. దీనికి ప్రపంచంలోని వివిధ మతాల ప్రతినిధులంతా హాజరయ్యారు. భేదాభిప్రాయాలున్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే సమసిపోతాయి. చర్చిస్తే ఐక్యతను సాధించగలం. ఆ లక్ష్యంతోనే సాగుతోంది మా స్నేహమిలన్. పెషావర్.. ఓ దుర్ఘటన ఒకవైపు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచే ప్రయత్నం కొనసాగుతుండగా ఇంకోవైపు పాకిస్తాన్ పెషావర్‌లోని స్కూల్ పిల్లల మీద ఉగ్రవాదుల దాడి అమానుష కృత్యం. పసి పిల్లల మీద అలాంటి చర్యకు పాల్పడ్డారంటే వాళ్లు మనుషులు కాదు. ఇప్పుడు ఈ స్కూల్ పిల్లల మీద దాడి చేసిన ఉగ్రవాద సంస్థే మొన్న మార్చి 8న పాకిస్తాన్‌లోని మా ఆశ్రమం మీదా దాడి చేసింది. దుండగులు ఆశ్రమానికి నిప్పంటించి కాల్చేశారు. దైవానుగ్రహం వల్ల భక్తులెవరూ ఆశ్రమంలో లేరు కాబట్టి సరిపోయింది. మానవీయ విలువలు తగ్గిపోవడం వల్లే ఇలాంటి హింసాకృత్యాలు జరుగుతుంటాయి. ఇలాంటి అకృత్యాలను నివారించడానికే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవసరం. ఈ సాధన మనిషిని మనిషిగా నిలబెడుతుంది. మన ఆలోచనావిధానాన్ని మారుస్తుంది. సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. శాంతిదూతగా... సాధారణంగా ఏ శాంతి సమావేశాలనైనా ప్రశాంత వాతావరణమున్నచోటే నిర్వహిస్తుంటారు. కానీ శాంతియుత వాతావరణమున్న చోట ఇలాంటి సమావేశాలు అక్కర్లేదు. ఎక్కడైతే అశాంతి నెలకొని ఉందో అక్కడ శాంతి ప్రాముఖ్యతను తెలియజెప్పాల్సిన అవసరముంది. అందుకే నిరంతరం తెగల మధ్య అంతర్గత యుద్ధాలతో అట్టుడికిపోతున్న ప్రాంతంలో ఓ శాంతిసమావేశం ఏర్పాటు చేయాలని తలచాను. అందుకు ఇరాక్‌ను ఎంచుకున్నాను. యుద్ధభూమిలో సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అనగానే చాలామంది ‘ప్రమాదకరమైన పనిచేస్తున్నారు. వద్దు వెళ్లొద్దు’ అని హెచ్చరించారు. ‘వెళ్తాను. చూద్దాం ఏమవుతుందో’ అని వెళ్లాను. సమావేశం ఏర్పాటు చేశాను. విజయవంతమైంది. అక్కడున్న పదిహేనులక్షల మంది నిరాశ్రయులకు మా వాలంటీర్లు చక్కగా సేవలందిస్తున్నారు. నూట ఇరవై టన్నుల ఆహారాన్ని పోగుచేసి సింజార్ మౌంటెన్ పైనున్న నిరాశ్రీతులకు అందజేశారు. అయితే అదంతా అంత తేలికగా ఏమీ జరగలేదు. మా హితులు హెచ్చరించినట్టుగానే ప్రమాదాలు ఎదురైనాయి. ఓరోజు అక్కడి గవర్నర్‌ను కలవడానికి వెళ్తుంటే ఓ ఆత్మాహుతి దళం పేల్చిన బాంబుదాడి నుంచి రెప్పపాటులో బయటపడ్డాం. అయినా అధైర్యపడలేదు. చేస్తున్నది మంచి పనైనప్పుడు భగవంతుడి ఆశీస్సులుంటాయి. మనుషుల మధ్య విశ్వాసాలు కొరవడే ఇలాంటి అకృత్యాలు జరుగుతుంటాయి. మనిషిని మనిషి నమ్మినరోజు ఈ వైషమ్యాలు తొలగి పోతాయి. ఆ నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా! అస్సాంలో ఉల్ఫా ఉగ్రవాదులను బుల్లెట్ నుంచి బ్యాలెట్ దారికి తేగలిగాం. అంటే వాళ్లకు ఓ వ్యవస్థమీద నమ్మకం ఏర్పర్చగలిగామన్నమాట. ఉగ్రవాదులు, తీవ్రవాదులు.. అందరూ మనుషులే. వాళ్లకేదో నష్టం జరిగింది. వాళ్ల జీవితాల్లో మానని గాయం ఉంది. వాళ్లకు మన అటెన్షన్ కావాలి. అది మేం ఇచ్చాం. ఆ గాయాన్ని మాన్పే వైద్యాన్నిస్తున్నాం. ప్రాణాయామం, ధ్యానం, జీవితాన్ని విశాల దృక్పథంతో చూడడాన్ని నేర్పిస్తున్నాం. దీనివల్ల వాళ్ల మనసుల్లో ఉన్న చెడు తొలగిపోయి, తోటి మనుషుల పట్ల ప్రేమాభిమానాలు, నమ్మకం, గౌరవం ఏర్పడతాయి. వాళ్లలోని హింసాప్రవృత్తిని నాశనం చేస్తాయి. మనకు కావల్సింది కూడా ఈ మార్పే కదా! రోల్‌మోడల్స్ కావాలి.. మన దగ్గర ఆదర్శాలు చాలా ఉన్నాయి. వాటిని చెప్పేవాళ్లూ చాలామందే ఉన్నారు. కాని అనుసరించేవాళ్లే లేరు. సిద్ధాంతాలు వల్లె వేయడం కాదు వాటిని ఆచరించి చూపే వారు కావాలి. చెప్పేదొకటి.. చేసేదొకటైతే చెప్పే సిద్ధాంతం ప్రభావాన్ని చూపదు. కాబట్టి చెప్పే మాటలను చేతల్లో చూపే రోల్‌మోడల్స్ కావాలి మనకిప్పుడు. ఆధ్మాత్మిక చింతనవల్లే.. నేటి దైనందిన జీవితం విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తోంది. దాన్ని తప్పించుకునే మార్గం మన దగ్గరే ఉంది. అదే జీవన కళ. ధ్యానం, సుదర్శన క్రియ ఆ కళలో భాగాలే. మెదడులో ఉన్న ఒత్తిడిని ధ్యానంతో జయించొచ్చు. ప్రశాంతత.. మనం పొందలేనిదేమీ కాదు. కొంచెం సమయం కేటాయిస్తే చాలు ధ్యానంతో దాన్ని సొంతం చేసుకోవచ్చు. పల్లె, పట్నం, పిల్లాపాప, యువత, వృద్ధులు, ఆడ, మగ.. ఇలా ఎవరికైనా జీవితంలో సమస్యలు, సవాళ్లు సర్వసాధారణం. వాటిని ఎదుర్కొనడానికి ఆత్మబలం కావాలి. అది సాధనవల్ల వస్తుంది. ఆ సాధనే ధ్యానం. పది నిమిషాల ఏకాగ్రత.. మనలో శక్తిని జనింపచేస్తుంది. దీన్ని సాధన చేసేవాళ్లు సంతోషంగా ఉంటారు. చుట్టుపక్కలున్నవాళ్లనూ సంతోషంగా ఉంచుతారు. లోకాన్ని ఆనందమయం చేస్తారు. గ్రామాల్లో సేవా కార్యక్రమాలుఇవ్వాళ మనదగ్గర జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు కారణం విషరసాయనాలతో చేస్తున్న వ్యవసాయమే. ఇది గొలుసు సమస్యలను సృష్టించి చివరకు అన్నదాతను ఉరికంబానికి ఎక్కిస్తోంది. దీనికి విరుగుడు సేంద్రియ సేద్యం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా దీన్ని మేం మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్తున్నాం. తద్వారా రైతు అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. యువత.. ఆర్ట్ ఆఫ్ లివింగ్.. నేను ఇంతక్రితం చెప్పిన రోల్‌మోడల్స్ కొరతను ఆర్ట్ ఆఫ్ లివింగ్ తీరుస్తుంది. దానికి యువతే మాకు లక్ష్యం. ఇందులో భాగంగా యువతకు ప్రాణాయామం, ధ్యానం, విచార బోధన చేస్తాం. దీనివల్ల వాళ్లు తమ ఆలోచనావిధానం ఎలా ఉందో తెలుసుకుంటారు. విశ్లేషణ, విచక్షణా జ్ఞానం వస్తుంది. ఇదంతా దీర్ఘకాలిక వ్యవహారం కాదు. దీర్ఘకాల ప్రక్రియల మీద నాకు విశ్వాసం లేదు. కాబట్టి మా కార్యక్రమాలన్నీ షార్ట్‌టైమ్ ప్రోగ్రామ్సే. అయిదు రోజులు చాలు. యువతను యువతే ఆకర్షిస్తుంది కనుక మా దగ్గర వాలంటీర్స్ అందరూ యువతే. వాళ్లే తమ వయసువాళ్లను ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్టూడెంట్స్‌గా మారుస్తున్నారు. మా శాఖలు ప్రపంచమంతా ఉన్నాయి. మా వాలంటీర్స్‌తో యూత్ స్నేహం చేస్తే చాలు! స్మైల్ అండ్ సర్వ్ రోల్‌మోడల్స్ యువత నుంచే రావాలి. ధ్యానం.. చిరునవ్వు, సేవ ఈమూడే యువతను ముందుకు నడిపిస్తాయి. అందుకే వాళ్లకు నేనిచ్చే సందేశం ఒక్కటే... ధ్యానంతో ఒత్తిడి దూరం చేసుకోండి. చిరునవ్వును ఆభరణంగా మలచుకోండి. సేవను నైజంగా మార్చుకోండి. మనదేశం వనరుల గని. వాటిని సద్వినియోగ పర్చుకునేదిశగా మీ శక్తియుక్తులను పెట్టండి. వసుధైక కుటుంబం టెక్నాలజీ.. మన ప్రపంచాన్ని ఓ గ్రామంగా ఎలా మార్చిందో ఆధ్యాత్మిక చింతన అలా ఈ ప్రపంచాన్ని ఓ కుటుంబంలా మారుస్తుంది. ఇప్పుడున్న సమాజానికి సాంకేతికత... ఆధ్యాత్మికత... ఈ రెండూ కావాలి. హింసలేని సమాజాన్ని నేను కాంక్షిస్తున్నాను. ప్రేమమయమైన సమాజాన్ని కోరుకుంటున్నాను. దీనికి ప్రజలందరి సహకారం కావాలి! సమష్టి కృషి ధార్మికక్షేత్రంలో ఉండేవాళ్లు, రాజకీయనాయకులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా.. ఈ నలుగురూ సమష్టిగా పనిచేస్తేనే సమాజం ఉన్నతి సాధిస్తుంది. ఉదాహరణకు.. ఇక్కడున్న (కర్ణాటకలోని) అల్కావతి నదిలో నలభై ఏళ్ల నుంచి నీళ్లు లేవు. మా వాలంటీర్స్ వెళ్లి దాన్ని బాగుచేశారు. దాని ఒడ్డున మొక్కలు నాటారు. చెక్‌డ్యామ్ కట్టారు. ఇప్పుడా నది నీటితో కళకళలాడుతోంది. దాని దరిదాపుల్లో 600 అడుగుల లోతు తవ్వితే కాని నీరుపడని ప్రదేశాల్లో ఇప్పుడు 50 అడుగుల లోతుకే నీటి ఊట బయటపడుతోంది. ఇది పెద్దమార్పు కదా. అలాగే ఆడశిశు మరణాలను నివారించడంకోసం ప్రజల్లో అవగాహనకల్పించే ప్రయత్నం చేశాం. అదేవిధంగా జాతి, మతాల విభేదాలు తొలగి అందరూ కలిసిమెలసి ఉండడానికి ‘హార్మొనీ ఇన్ డైవర్సిటీ’ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాం. ఇలా సమాజంలోని అన్ని వర్గాలు సమష్టిగా పనిచేస్తే సుందరసమాజాన్ని నిర్మించుకోవచ్చు. నేను చెప్పేదొక్కటే.. ఆధ్యాత్మిక చింతనలేకపోవడం వల్లే సమాజంలో ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక చింతనే అన్ని రుగ్మతలకు అసలైన మందు. -
అంతర్జాతీయ సమాజం మద్దతుతోనే ఉగ్రవాదానికి ఉరి
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ బెంగళూరు : ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాలకు పెను సవాలుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ పిలుపునిచ్చారు. సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పేందుకు గాను వివిధ మతాలకు చెందిన పెద్దలతో బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో గురువారం సాయంత్రం ఁస్నేహ మిలన* కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవిశంకర్ గురూజీ మాట్లాడుతూ.. ప్రపంచమంతటా సోదర భావాన్ని పెంపొందించడం, శాంతి స్థాపనలకు గాను మత పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు ఇలా అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అభద్రతా భావంతో ఎవరితోనూ కలవకుండా తమకు తామే కొన్ని పరిధులు గీసుకొని జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఇలా కాకుండా అందరమూ ఒకే కుటుంబమనే భావనతో ఒక్కటిగా చేరినప్పుడు ఈ అభద్రతా భావాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని తెలిపారు. వివిధ పువ్వులను దండగా కూర్చేందుకు దారం ఉపయోగపడుతుందని, అదే విధంగా విభిన్న వర్గాలు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులను మానవత్వం అనే దారంతో కూర్చాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత వరకు ఇతరుల కన్నీళ్లు తుడిచి, వారి ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు శ్రమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మత పెద్దలను రవిశంకర్ గురూజీ సత్కరించారు. ఁస్నేహ మిలన* కార్యక్రమంలో క్రైస్ట్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ వి.ఎం.అబ్రహాం, ఇంటర్నేషనల్ సూఫీ సెంటర్ ప్రెసిడెంట్ సలీమ్ హజార్వీ, నెదర్లాండ్ మాజీ ప్రధాని రూద్లూబర్స్, జామియా మసీదు ప్రతినిధి అన్వర్ షరీఫ్, యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు లెనైన్ తదితరులు పాల్గొన్నారు. -
కాయకల్ప చికిత్స ప్రకృతి సేద్య కళతో పునరుజ్జీవనం!
{పకృతి సేద్య కళను ఉద్యమ స్ఫూర్తితో రైతులకందిస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ అన్నదాతల ఆత్మహత్యల్లేని ఆరోగ్యదాయక సమాజం కోసం విస్తృతంగా రైతు శిక్షణ శిబిరాలు 6 నెలల్లో వెయ్యి మంది ప్రకృతి వ్యవసాయ ఉపాధ్యాయులకు శిక్షణతో ఊరూరా శిబిరాలు.. ఉచిత కాల్‌సెంటర్.. {పకృతి వ్యవసాయ పంచాంగం రూపకల్పన.. రైతుల భాగస్వామ్యంతో స్వతంత్ర మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు యత్నాలు తెలుగునాట రెండేళ్లలో ప్రకృతి వ్యవసాయ విప్లవం తథ్యం.. ఐదేళ్లలో పూర్తిగా రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పతి సాధ్యమే.. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుగు రాష్ట్రాల సారథి పులిమామిడి రామకృష్ణారెడ్డి వెల్లడి తెలుగునాట సంక్షోభంలో కూరుకుపోయి అల్లాడుతున్న అన్నదాతలకు ప్రకృతి వ్యవసాయాన్ని ‘జీవన కళ’తో మేళవించి అందిస్తోంది ఆర్ట్ ఆఫ్ లివింగ్(ఏఓఎల్) ఆధ్యాత్మిక సంస్థ. రైతుల జీవితాలను, భూములను పునరుజ్జీవింపజేయడానికి సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా సులువుగా సాధ్యమవుతుందని ఏఒఎల్ విశ్వసిస్తున్నదని తెలుగు రాష్ట్రాల కమిటీ అధ్యక్షుడు పులిమామిడి రామకృష్ణారెడ్డి (98490 57599) ‘సాక్షి’ ఇంటర్వ్యూలో తెలిపారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో జన్మించిన పారిశ్రామికవేత్త రామకృష్ణారెడ్డి ఏఓఎల్‌కు ఎనిమిదేళ్లుగా సారథ్యం వహిస్తున్నారు. అప్పులు, ఆత్మహత్యల్లేని వ్యవసాయాన్ని రైతులు.. విషరహిత ఆహారాన్ని వినియోగదారులు కోరుకుంటున్నారన్నారు. ఈ లక్ష్య సాధన కోసమే గత ఆర్నెల్లుగా ‘రుషి కృషి’ పేరుతో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ఇస్తు న్నామని చెప్పారు. మనిషి మారితేనే వ్యవసాయ పద్ధతి మారుతుందంటూ.. జీవన కళతో మేళవించిన వ్యవసాయ శిక్షణ సత్ఫలితాలనిస్తున్నదన్నారు. ఇలాఉండగా, హైదరాబాద్‌కు చెందిన చక్కిలం ఉమామహేశ్వరి(90004 08907) ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యకలాపాలను సమన్వయపరుస్తున్నారు. బ్యాంకులో ఉన్నతోద్యాగాన్ని పదేళ్లు ముందే వదిలేసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలకు ఆమె పూర్తికాలాన్ని వెచ్చిస్తున్నారు. చాలా గ్రామాల్లో ఆవుల జాడే లేదని, వయసులో ఉన్న వారు పొట్టచేతపట్టుకొని పట్నాలకు వలస పోగా వృద్ధులే గ్రామాల్లో మిగిలారన్నారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చే శక్తి ప్రకృతి సేద్యానికే ఉందని ఆమె విశ్వసిస్తున్నారు. వ్యవసాయ సంక్షోభానికి ప్రకృతి సేద్యమే పరిష్కారమా? అవును. యూరప్‌కు రెండు, మూడు వేల ఏళ్లు, అమెరికాకు రెండొందల ఏళ్లకు క్రితమే వ్యవసాయం తెలుసు. మనది పది వేల ఏళ్ల నాటి సుసంపన్నమైన వ్యవసాయ సంస్కృతి. మన దేశప్రజల డీఎన్ఏలోనే వ్యవసాయ సంస్కృతి ఉంది. హరిత విప్లవం పేరిట రసాయనిక వ్యవసాయం అలవాటు చేయడం వల్ల ఈ సంస్కృతి ధ్వంసమైంది. 30 శాతం సాగు భూమి నిస్సారమైపోవడమో, చౌడుదేలడమో అయ్యింది. ఇప్పుడు తిరిగి ప్రకృతి వ్యవసాయ సంస్కృతిని అలవరచుకోవడమే సంక్షోభానికి పరిష్కారం. {పకృతి సేద్యంపై శిక్షణ ఇచ్చే క్రమంలో అవరోధాలను ఎలా అధిగమిస్తున్నారు? మనిషి మారితేనే వ్యవసాయ పద్ధతి మారుతుంది. అలవాటు లేని ప్రకృతి సేద్య పద్ధతి గురించి తెలియజెప్పడానికి ముందు జీవన కళ గురించి పరిచయం చేస్తున్నాం. టన్నుల కొద్దీ పశువుల ఎరువు అవసరం లేని, దుక్కి అవసరంలేని, స్వల్ప ఖర్చుతో చేసుకునే పాలేకర్ పద్ధతిని తెలియజెపుతున్నాం. ఒక ఆవు ద్వారా 10-15 ఎకరాల్లో వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, పురుగుమందులు, శిలీంధ్రనాశనులు తయారు చేసుకునే పద్ధతులు నేర్పిస్తున్నాం. ఆవును కొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు.. ఆరు నెలల్లో ఆవు ఖరీదు తిరిగొచ్చేస్తోంది. రైతుల ఆర్థిక, పర్యావరణ, సాంఘిక సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నాం. ప్రభుత్వ సంస్థలు నిర్వహించే శిక్షణకు స్పందించని రైతులు సైతం మా శిక్షణకు స్పందిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులకు, సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పొందిన రైతులకు ఎటువంటి తోడ్పాటునందిస్తారు? ఒకసారి శిక్షణ పొందిన రైతు.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందంలో జీవిత సభ్యుడవుతాడు. ప్రకృతి వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలు, సందేహాల నివృత్తి కోసం ఉచిత కాల్‌సెంటర్‌ను రెండు నెలల్లో ఏర్పాటు చేస్తున్నాం. 24 మంది శాస్త్రవేత్తల బృందం నిరంతరం అన్ని భాషల్లోనూ రైతులకు సూచనలు సలహాలు ఇస్తారు. కరువు బారిన పడకుండా వ్యవసాయం చేసే మెలకువలతో కూడిన ‘ప్రకృతి వ్యవసాయ పంచాగం’ సిద్ధమవుతోంది. మారిన వాతావరణాన్ని బట్టి వ్యవసాయ పనులు 1 లేదా 2 కార్తెలు ముందుకు జరగాలన్నది మా అభిప్రాయం. వర్షాల తీరు మారింది. స్థానికంగా చెట్లు, అడవి ఎక్కువగా ఉన్న చోటే కురుస్తున్నాయి. శాస్త్రబద్ధమైన ఈ విషయ పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం ద్వారా.. వారిలో చెట్ల పెంపకం, చెట్ల జాతులతో కలిపి వార్షిక పంటలు పండించడంపై ఆసక్తిని పెంచుతున్నాం. భూసారం పెంపుదల, చౌడు భూమిని తిరిగి వినియోగంలోకి తెచ్చుకోవడం ప్రకృతి సేద్య పద్ధతుల ద్వారానే సాధ్యం.. వీటన్నిటినీ నిరంతరం సమన్వయం చేయడానికి శ్రీశ్రీ కిసాన్ సంఘాలను, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. రైతులందరికీ ప్రకృతి వ్యవసాయ శిక్షణ అందేదెలా? మా సంస్థకు విస్తృతమైన యంత్రాంగం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే నైపుణ్యం, దాతల మద్దతు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల రైతులందరికీ రెండేళ్లలో శిక్షణ ఇచ్చేదిశగా కదులుతున్నాం. జూన్ నుంచి వారానికో శిబిరం నిర్వహిస్తున్నాం. రాబోయే 6 నెలల్లో వెయ్యి మంది ప్రకృతి సేద్యం నేర్పించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే ఎందరో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనుభవం గడించారు. వీరి అనుభవాలు చెప్పించి రైతుల్లో పూర్తి భరోసా కలిగిస్తున్నాం. ప్రతి గ్రామంలో కొందరికి సరిగ్గా నేర్పితే చాలు.. వాళ్లను చూసి మిగతా వాళ్లు నేర్చుకుంటారు. విరాళాలు, ప్రభుత్వ తోడ్పాటుతో రైతులందరికీ రెండేళ్లలో శిక్షణ ఇస్తాం. ఏదేమైనా ఐదేళ్లలో 100% విష రసాయనాల అవశేషాల్లేని ఆహారోత్పత్తి జరిగేలా చూడాలన్నది మా లక్ష్యం. సహజాహారంపై చైతన్యం వినియోగదారుల్లోనూ పెరుగుతోంది. {పకృతి వ్యవసాయదారుల మార్కెటింగ్ సమస్యలపై మీ అభిప్రాయం? వేల సంఖ్యలో రైతులు ఇప్పటికే ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వారికి ఖర్చు తగ్గింది. ఆదాయం పెరిగింది. సరుకును మార్కెట్‌కు తీసుకెళ్లాల్సిన బాధే లేదు. మంచి ఆహారం కావాల్సిన వాళ్లు రైతుల ఇళ్లకొచ్చి కొనుక్కెళ్తున్నారు. రైతుల భాగస్వామ్యంతో విశ్వసనీయమైన మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. రైతులకు నిరంతరం అండగా ఉండి నడిపించేందుకు ఏ లోటూ లేకుండా చూస్తున్నాం. - సంభాషణ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
కట్టూ బొట్టూ.. అంతా భారతీయం
-
విభజన అన్నింటికీ పరిష్కారం కాదు
ఆధ్యాత్మిక గురువు పండిత్ రవిశంకర్ వ్యాఖ్య తిరుపతి, న్యూస్‌లైన్: ఒక రాష్ర్టంలోని ప్రజలందరూ కలిసి ఉన్నప్పుడే ఆ రాష్ర్టం అభివృద్ధి సాధిస్తుందని ‘దఆర్ట్ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ తెలిపారు. కలసి ఉంటే ప్రగతి సాధ్యమని, విభజన అనేది పరిష్కారం కాదన్నారు. తన అనుగ్రహ యాత్ర లో భాగంగా రవిశంకర్ ఆదివారం రాత్రి ఎస్వీయూ క్రీడామైదానంలో దివ్యసత్సంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కురుక్షేత్రంగా తయారైందని, విభజన కోసం నాయకుల మధ్య, ప్రజల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. రాజకీయ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని తాను శ్రీవారిని కోరుకున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు గొప్ప సంస్కృతి ఉందని, దీనిని మనం గౌరవించాలని సూచిం చారు. ప్రత్యేకంగా వెళితే రాష్ట్ర ప్రగతి లేదని, కాశ్మీర్లో కూడా తాను 2001లో ఇదే అంశాన్ని చెప్పానన్నారు. దేశభక్తి, దైవభక్తి నాణేనికి రెండు ముఖాలని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి ఆలోచనలో స్పష్టత, పనిలో నిబద్ధత, హృదయంలో పవిత్రత అవసరమన్నారు. హృదయం పవిత్రత లేని వారు ప్రత్యేకం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. తిరుపతిలో ఐదేళ్ల కిందట ఒక కొత్త పార్టీ ఆవిష్కరణ అయిందని, అందరిలో ఆశలు కల్పించి, అనంతరం ద్రోహంచేసి ఎక్కడికో వెళ్లిపోయిందని చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఆర్ట్‌ఆఫ్ లివింగ్.. తిరుమలలోని ఆస్థాన మండపంలో ఆదివారం ఆర్ట్ఆఫ్లివింగ్ ప్రతినిధులు సుమారు వెయ్యిమంది సామూహిక ధ్యానం నిర్వహించారు. ఇందులో విదేశీయులు కూడా భారతీయ కట్టూబొట్టూ సంప్రదాయంతో హాజరయ్యారు. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, అధికారులు సైతం ధ్యానంలో పాల్గొన్నారు. అంతకు ముందు పండిత్ రవిశంకర్ శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ధర్మగిరిలోని వేద పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ఆయన ముచ్చటించారు.