విభజన అన్నింటికీ పరిష్కారం కాదు
ఆధ్యాత్మిక గురువు పండిత్ రవిశంకర్ వ్యాఖ్య
తిరుపతి, న్యూస్‌లైన్: ఒక రాష్ర్టంలోని ప్రజలందరూ కలిసి ఉన్నప్పుడే ఆ రాష్ర్టం అభివృద్ధి సాధిస్తుందని ‘దఆర్ట్‌ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ తెలిపారు. కలసి ఉంటే ప్రగతి సాధ్యమని, విభజన అనేది పరిష్కారం కాదన్నారు. తన అనుగ్రహ యాత్ర లో భాగంగా రవిశంకర్ ఆదివారం రాత్రి ఎస్వీయూ క్రీడామైదానంలో దివ్యసత్సంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కురుక్షేత్రంగా తయారైందని, విభజన కోసం నాయకుల మధ్య, ప్రజల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. రాజకీయ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని తాను శ్రీవారిని కోరుకున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు గొప్ప సంస్కృతి ఉందని, దీనిని మనం గౌరవించాలని సూచిం చారు. ప్రత్యేకంగా వెళితే రాష్ట్ర ప్రగతి లేదని, కాశ్మీర్‌లో కూడా తాను 2001లో ఇదే అంశాన్ని చెప్పానన్నారు. దేశభక్తి, దైవభక్తి నాణేనికి రెండు ముఖాలని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి ఆలోచనలో స్పష్టత, పనిలో నిబద్ధత, హృదయంలో పవిత్రత అవసరమన్నారు. హృదయం పవిత్రత లేని వారు ప్రత్యేకం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. తిరుపతిలో ఐదేళ్ల కిందట ఒక కొత్త పార్టీ ఆవిష్కరణ అయిందని, అందరిలో ఆశలు కల్పించి, అనంతరం ద్రోహంచేసి ఎక్కడికో వెళ్లిపోయిందని చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
తిరుమలలో ఆర్ట్‌ఆఫ్ లివింగ్..
తిరుమలలోని ఆస్థాన మండపంలో ఆదివారం ఆర్ట్‌ఆఫ్‌లివింగ్ ప్రతినిధులు సుమారు వెయ్యిమంది సామూహిక ధ్యానం నిర్వహించారు. ఇందులో విదేశీయులు కూడా భారతీయ కట్టూబొట్టూ సంప్రదాయంతో హాజరయ్యారు. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, అధికారులు సైతం ధ్యానంలో పాల్గొన్నారు. అంతకు ముందు పండిత్ రవిశంకర్ శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ధర్మగిరిలోని వేద పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ఆయన ముచ్చటించారు.