యేసు అంటేనే ప్రేమ
జీవన వికాసం
శ్రీశ్రీ రవిశంకర్
వ్యవస్థాపకులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్
యేసు అంటేనే ప్రేమ. ప్రేమ అని మీరు అంటే యేసు అని వేరే చెప్పనక్కర్లేదు. ఆలాగే మీరు యేసు అంటే దాని అర్థం ప్రేమే. యేసుక్రీస్తులో మీకు కనిపించే ప్రేమను ఒక లేశమాత్రం చూసినా సరే, అందులో పరిపూర్ణత, అనిర్వచనీయమైన దైవత్వపు ప్రకటన, జీవితం అనేది దైవత్వపు ఆవిష్కరణకు మానవుడు చేసే నిరంతర ప్రయత్నమే అనే సత్యమూ మనకు గోచరిస్తాయి.
యేసు ప్రేమ స్వరూపాన్ని గ్రహించకుండా ఉండటం ఎవరివల్లా కాలేదు. అయితే, ప్రేమ మిమ్మల్ని బలహీనంగా మార్చేసినపుడు భయం కూడా వేస్తుంది. కొన్ని వేలమంది జనాభాలో అతికొద్దిమంది మాత్రమే ఆనాడు అతనిని అనుసరించారు. విన్నది అనేకమంది, అనుసరించి వచ్చినవారు కొందరే. అందుకే అతడు అన్నాడు.. అతికొద్దిమంది మాత్రమే ఈ ఇరుకుదారిగుండా పోగలరు’. అన్ని మహిమలు చూపిన తరువాత కూడా అతికొద్దిమంది మాత్రమే అతనిని నిజంగా గుర్తించి అనుసరించారు. వారేమీ జ్ఞానులు కాదు. సామాన్యమైన, అమాయక ప్రజలు.
బుద్ధిని దాటి ఆత్మను, జీవన మూలాన్ని చేరుకోవటానికి మానవులకు చేయగలిగిన సహాయమంతా చేశాడు యేసు. నేను ఫలానా అని ఏదో ఒకదానితో ముడిపెట్టుకుని ఉండే మీ సంకుచిత భావాన్ని ఛేదించి, మీలోని దైవత్వాన్ని గుర్తించండి, మీరు పైకి కనిపించే ఈ మనుష్యరూపంకంటే చాలా ఉన్నతమైనవారని గుర్తించండి. మీరు దైవంలో భాగం. దైవరాజ్యానికి మీరే వారసులు. ఆ రాజ్యం ఇక్కడే, మీలోపలే ఉంది అని బోధించాడు.
ఒక సందర్భంలో అతడు అంటాడు - ‘(ఇస్కరియేత్) యూదా అసలు పుట్టకపోయి ఉంటే బాగుండేది’. ఆ మాటలు కోపంతోనో, అసహనంతోనో వచ్చినవి కావు. చాలాసార్లు ప్రజలు తమకు ఎవరైనా నచ్చనప్పుడు వాళ్ళు పుట్టకుండా ఉంటే బాగుండేది అనటం మనం చూస్తాం. ఇక్కడ యేసు యూదా.... అతడు ఎప్పుడూ పుట్టకూడదని కోరుకుంటాను అంటున్నాడు. యూదా పడుతున్న బాధలను యేసు ఊహింపగల్గాడు. జగన్నాటకంలో యూదాకు ఒక పాత్ర ఇవ్వబడింది. దానిని అతడు పోషించాడు అంతే. అతడు పడుతున్న బాధను యేసు గ్రహించాడు. అతనిపట్ల యేసుకు గల అపారమైన కరుణకు తార్కాణం... అతడు పుట్టకపోయి ఉంటే బాగుండేది. యూదాపట్ల అతనికి గల అపరిమితమైన ప్రేమ అది.
చివరిలో ఒకచోట యేసు అంటాడు - ‘నేను ఇంకా నా తండ్రితో కలసిపోలేదు, ఇంటి ముంగిట నిలిచి ఉన్నాను. మీరు వెళ్ళి, నేను ఇంటికి చేరానని ప్రపంచానికి చెప్పండి. ఇంటికి రావాలని కోరుకునే వారందరికీ స్వాగతం పలకటానికి నేను ద్వారంవద్దనే వేచి ఉంటాను’. మీరు ప్రాణశక్తితో సజీవంగా లేకుంటే యేసు వాక్యాలను అర్థంచేసుకోలేరు. విన్న జ్ఞానం అంతా ఒక అభిప్రాయంగా, ఒక భావంగా మీ తలలో ఉంటుంది. కాని హృదయం మాత్రమే ఆ హృదయపు భావాన్ని గ్రహించగలదు. అలా కానపుడు యేసు పేరిట, దైవం పేరిట, మతం పేరిట ప్రజలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. యుద్ధాలు జరిగాయి. శతాబ్దాల కాలంపాటు మనుషులు దేవుని పేరుతో పోట్లాడుకున్నారు. యేసు చెప్పిన మాటలకు అర్థం ఏమిటో వారికి అణుమాత్రం కూడా తెలియదు. అయితే ఇదంతా యేసు ముందే ఊహించాడు.
‘మిమ్మల్ని స్నేహితులుగా చూస్తాను, సేవకులుగా కాదు. ఎందుకంటే యజమాని ఏం చేస్తాడో సేవకులకు తెలియదు. నేను మీకు చెబుతాను, నా తండ్రి గురించి నేను విన్నదంతా మీతో పంచుకుంటాను’ అంటాడు యేసు. బోధించటానికి అతి చక్కని మార్గం ఇది. ప్రేమను పంచటానికి అతిచక్కని మార్గం ఇది. యజమాని పట్ల మీకు గౌరవం ఉంటుంది, కాని వ్యక్తిగతంగా ప్రేమ ఉండదు.
అదే స్నేహితుడైతే మీ మనసులోని వ్యక్తిగత భావాలను, ఆలోచనలను, రహస్యాలను పంచుకుంటారు. యేసు ‘నేను మీ స్నేహితుడిని’ అన్నాడు. ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండలేదు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అధికారానికి తావు లేదు. చేతులు సాచి యేసు పిలుస్తున్నాడు, రా, నీవు నా స్నేహితుడివి. భయం వద్దు. నన్ను సిలవపై పెట్టవద్దు. నీ హృదయంలో నాకు చోటు ఇయ్యి. నీ చుట్టుపక్కల కనిపించే ప్రతి ఒక్కరిలోనూ నన్నే చూడు. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నీవు ప్రతీ ఒక్కరినీ అంతలా ప్రేమించు... లేదా నన్నెంతగా ప్రేమిస్తున్నావో అంతలా ప్రేమించు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితోనూ ఈ విషయాన్ని పంచుకో.
అటువంటి ప్రేమైకమూర్తిని గుర్తించటానికి మీకు ఇంతకంటే ఏం కావాలి? అయినా, ప్రజలు సాక్ష్యాలు కోరారు. యేసు ఈరోజు వచ్చినా సరే, ప్రజలు ‘నీవు దేవుని కుమారుడవే అని నిరూపించుకో’ అంటారు. ఎందుకంటే బుద్ధి ఎప్పుడు సాక్ష్యాలపైనే ఆధారపడుతుంది. బుద్ధి యేసును అర్థంచేసుకోలేదు. కేవలం హృదయం మాత్రమే అతని ఉనికిని అనుభవించగలదు. మీరు నిజంగా యేసుతో ప్రేమలో ఉన్నపుడు, ప్రతీ పేరులోనూ, ప్రతీ ఆకారంలోనూ, ఈ భూమిపై, భూమికి ఆవల ఉన్న ప్రతీ ప్రదేశంలోనూ యేసును చూస్తారు. ఆ గురువు ఏ విలువలకు ప్రతినిధిగా నిలిచాడో ఆ విలువలలో జీవించండి. అలా జీవించినపుడు యేసు ఎప్పుడో గడచినకాలపు వ్యక్తిగా కాక, ఇప్పుడే, ఇక్కడే ఉంటాడు. భవిష్యత్తులో కూడా ఉంటాడు, ఎల్లప్పుడూ, ఎప్పటికీ ఉంటాడు.