అంతర్జాతీయ సమాజం మద్దతుతోనే ఉగ్రవాదానికి ఉరి
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ
బెంగళూరు : ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాలకు పెను సవాలుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ పిలుపునిచ్చారు. సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పేందుకు గాను వివిధ మతాలకు చెందిన పెద్దలతో బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో గురువారం సాయంత్రం ఁస్నేహ మిలన* కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవిశంకర్ గురూజీ మాట్లాడుతూ.. ప్రపంచమంతటా సోదర భావాన్ని పెంపొందించడం, శాంతి స్థాపనలకు గాను మత పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు ఇలా అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అభద్రతా భావంతో ఎవరితోనూ కలవకుండా తమకు తామే కొన్ని పరిధులు గీసుకొని జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఇలా కాకుండా అందరమూ ఒకే కుటుంబమనే భావనతో ఒక్కటిగా చేరినప్పుడు ఈ అభద్రతా భావాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని తెలిపారు.
వివిధ పువ్వులను దండగా కూర్చేందుకు దారం ఉపయోగపడుతుందని, అదే విధంగా విభిన్న వర్గాలు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులను మానవత్వం అనే దారంతో కూర్చాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత వరకు ఇతరుల కన్నీళ్లు తుడిచి, వారి ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు శ్రమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మత పెద్దలను రవిశంకర్ గురూజీ సత్కరించారు. ఁస్నేహ మిలన* కార్యక్రమంలో క్రైస్ట్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ వి.ఎం.అబ్రహాం, ఇంటర్నేషనల్ సూఫీ సెంటర్ ప్రెసిడెంట్ సలీమ్ హజార్వీ, నెదర్లాండ్ మాజీ ప్రధాని రూద్‌లూబర్స్, జామియా మసీదు ప్రతినిధి అన్వర్ షరీఫ్, యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు లెనైన్ తదితరులు పాల్గొన్నారు.