సాక్షి, అమరావతి: అరటి పంటలో నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (సీడీపీ)ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్బీకే స్థాయిలో ఆగస్టు 2వ తేదీ నుంచి రైతులకు అవగాహన ఉద్యమం చేపట్టబోతోంది. రాష్టంలో 2.45 లక్షల ఎకరాల్లో అరటి పంట సాగవుతుండగా, అందులో సగానికి పైగా విస్తీర్ణం వైఎస్సార్, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం జిల్లాల పరిధిలోనే ఉంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో గ్రాండ్ నైన్ (జీ–9 పొట్టి పచ్చ అరటి), టిష్యూ కల్చర్ రకాలు సాగవుతుంటే.. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కర్పూరం, చక్కరకేళి వంటి రకాలు సాగవుతుంటాయి. రాయలసీమలో సాగయ్యే రకాలకే విదేశాల్లో డిమాండ్ ఎక్కువ. ఈ ఏడాది కనీసం 65 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది 48 వేల టన్నులు ఎగుమతి చేయగా.. ఈ ఏడాది 55 వేల టన్నుల అరటిని ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆందోళన కలిగిస్తున్న సిగటోక తెగులు
గతంలో గోదావరి, కృష్ణా జిల్లాల్లో సాగయ్యే అరటి రకాలకు సోకే సిగటోక (ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, పొగాకు తెగులు) ఇప్పుడు రాయలసీమలోనూ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్లుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ తెగులు వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం మొక్క దశలో ఉన్న జీ–9, టిష్యూ కల్చర్ అరటి రకాలకు ఈ తెగులు సోకుతోంది. వాతావరణంలో తేమ 90 శాతం కన్నా అధికంగా ఉండి, ఉష్ణోగ్రత 25 నుంచి 26 డిగ్రీలు వరకు ఉన్నప్పుడు, అరటి ఆకులు 6 నుంచి 10 గంటల పాటు తడిగా ఉన్నప్పుడు ఈ తెగులు సోకుతుంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల సోకే ఈ తెగులు వల్ల ఆకులపై తొలుత పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రోజుల్లోనే అవి బూడిద రంగులోకి.. ఆ తర్వాత క్రమేపీ పెరుగుతూ గోధుమ రంగులోకి మారి ఒక దానితో ఒకటి కలిసిపోవడం వల్ల ఆకులు ఎండిపోతాయి. ఇలా జరగడం వల్ల కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన పచ్చదనం లేక కాయసైజు, నాణ్యత తగ్గిపోవడంతోపాటు గెలలు పక్వానికి రాకముందే పండిపోతాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఆగస్టు 2వ తేదీ నుంచి రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో నెల రోజుల పాటు అరటి పండించే ప్రతి గ్రామంలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ తెగులు సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సోకితే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఆర్బీకే పరిధిలోని ప్రతి రైతుకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తారు.
పాటించాల్సిన జాగ్రత్తలివీ..
అరటి తోటలో కలుపు లేకుండా.. నీరు నిలబడకుండా చూసుకోవాలి. సిఫార్సు చేసిన దూరంలో అంటే జీ–9 రకాన్ని 1.8 ఇన్‌టూ 1.8 మీటర్ల దూరంలోనూ, తెల్ల చక్కెరకేళి, అమృతపాణి, కర్పూర చక్కెరకేళి వంటి రకాలను 2 ఇన్‌టూ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. తల్లి మొక్క చుట్టూ వచ్చే పిలకలను, మొక్క చుట్టూ ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేయాలి. ట్రైకోడెర్మావిరిడి లేదా సూడోమోనాస్ లేదా బాసిల్లస్ వంటి జీవ శిలీంధ్రాలను వేపనూనెతో కలిపి పాదులు, చెట్టు ఆకులు మొత్తం తడిసేలా 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.
నివారణా చర్యలు
సిగటోక తెగులు వ్యాప్తి మొదలైనప్పుడు ప్రొపికోనజోల్ (1 ఎంఎల్), మినరల్ ఆయిల్ (10 ఎంఎల్)ను లీటర్ నీటిలో కలిపి ఆకులు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. ఈ మందును 25 రోజుల వ్యవధిలో మూడు సార్లు, ఉధృతి అధికంగా ఉంటే 5–7 సార్లు చేయాలి. గెలలు కోయడానికి 45 రోజుల ముందుగా ఎలాంటి మందులను పిచికారీ చేయకూడదు. మొదటి పిచికారీలో ప్రోపికోనజోల్ (1ఎంఎల్–లీటర్ నీటికి)ను, రెండో పిచికారీలో కార్బండిజమ్, మాంకోజబ్ (1 గ్రాము/లీటర్ నీటికి), మూడో పిచికారిలో ట్రైప్లోక్సిస్ట్రోబిన్, టేబ్యుకోనజోల్ మిశ్రమ మందు (1.4 గ్రా./లీటర్ నీటికి), నాలుగో పిచికారీలో డైపాన్‌కొనజోల్ (1ఎం.ఎల్/లీటర్ నీటికి) కలిపి పిచికారీ చేయాలి.
ఇదీ చదవండి: నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి
Comments
Please login to add a commentAdd a comment