Banana cultivation
-
అరటి చెట్టు సాగుతో లక్షల్లో ఆదాయం
-
అరటి తోట సాగుకు ముందే భూసార పరీక్షలు చేయాలి
-
అరటి పొలం నుండి పంట వరకు
-
‘సిగటోక’ చిత్తవ్వాలిక.. నివారణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ
సాక్షి, అమరావతి: అరటి పంటలో నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (సీడీపీ)ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్బీకే స్థాయిలో ఆగస్టు 2వ తేదీ నుంచి రైతులకు అవగాహన ఉద్యమం చేపట్టబోతోంది. రాష్టంలో 2.45 లక్షల ఎకరాల్లో అరటి పంట సాగవుతుండగా, అందులో సగానికి పైగా విస్తీర్ణం వైఎస్సార్, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం జిల్లాల పరిధిలోనే ఉంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో గ్రాండ్ నైన్ (జీ–9 పొట్టి పచ్చ అరటి), టిష్యూ కల్చర్ రకాలు సాగవుతుంటే.. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కర్పూరం, చక్కరకేళి వంటి రకాలు సాగవుతుంటాయి. రాయలసీమలో సాగయ్యే రకాలకే విదేశాల్లో డిమాండ్ ఎక్కువ. ఈ ఏడాది కనీసం 65 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది 48 వేల టన్నులు ఎగుమతి చేయగా.. ఈ ఏడాది 55 వేల టన్నుల అరటిని ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆందోళన కలిగిస్తున్న సిగటోక తెగులు గతంలో గోదావరి, కృష్ణా జిల్లాల్లో సాగయ్యే అరటి రకాలకు సోకే సిగటోక (ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, పొగాకు తెగులు) ఇప్పుడు రాయలసీమలోనూ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్లుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ తెగులు వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం మొక్క దశలో ఉన్న జీ–9, టిష్యూ కల్చర్ అరటి రకాలకు ఈ తెగులు సోకుతోంది. వాతావరణంలో తేమ 90 శాతం కన్నా అధికంగా ఉండి, ఉష్ణోగ్రత 25 నుంచి 26 డిగ్రీలు వరకు ఉన్నప్పుడు, అరటి ఆకులు 6 నుంచి 10 గంటల పాటు తడిగా ఉన్నప్పుడు ఈ తెగులు సోకుతుంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల సోకే ఈ తెగులు వల్ల ఆకులపై తొలుత పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రోజుల్లోనే అవి బూడిద రంగులోకి.. ఆ తర్వాత క్రమేపీ పెరుగుతూ గోధుమ రంగులోకి మారి ఒక దానితో ఒకటి కలిసిపోవడం వల్ల ఆకులు ఎండిపోతాయి. ఇలా జరగడం వల్ల కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన పచ్చదనం లేక కాయసైజు, నాణ్యత తగ్గిపోవడంతోపాటు గెలలు పక్వానికి రాకముందే పండిపోతాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఆగస్టు 2వ తేదీ నుంచి రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో నెల రోజుల పాటు అరటి పండించే ప్రతి గ్రామంలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ తెగులు సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సోకితే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఆర్బీకే పరిధిలోని ప్రతి రైతుకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తారు. పాటించాల్సిన జాగ్రత్తలివీ.. అరటి తోటలో కలుపు లేకుండా.. నీరు నిలబడకుండా చూసుకోవాలి. సిఫార్సు చేసిన దూరంలో అంటే జీ–9 రకాన్ని 1.8 ఇన్‌టూ 1.8 మీటర్ల దూరంలోనూ, తెల్ల చక్కెరకేళి, అమృతపాణి, కర్పూర చక్కెరకేళి వంటి రకాలను 2 ఇన్‌టూ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. తల్లి మొక్క చుట్టూ వచ్చే పిలకలను, మొక్క చుట్టూ ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేయాలి. ట్రైకోడెర్మావిరిడి లేదా సూడోమోనాస్ లేదా బాసిల్లస్ వంటి జీవ శిలీంధ్రాలను వేపనూనెతో కలిపి పాదులు, చెట్టు ఆకులు మొత్తం తడిసేలా 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. నివారణా చర్యలు సిగటోక తెగులు వ్యాప్తి మొదలైనప్పుడు ప్రొపికోనజోల్ (1 ఎంఎల్), మినరల్ ఆయిల్ (10 ఎంఎల్)ను లీటర్ నీటిలో కలిపి ఆకులు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. ఈ మందును 25 రోజుల వ్యవధిలో మూడు సార్లు, ఉధృతి అధికంగా ఉంటే 5–7 సార్లు చేయాలి. గెలలు కోయడానికి 45 రోజుల ముందుగా ఎలాంటి మందులను పిచికారీ చేయకూడదు. మొదటి పిచికారీలో ప్రోపికోనజోల్ (1ఎంఎల్–లీటర్ నీటికి)ను, రెండో పిచికారీలో కార్బండిజమ్, మాంకోజబ్ (1 గ్రాము/లీటర్ నీటికి), మూడో పిచికారిలో ట్రైప్లోక్సిస్ట్రోబిన్, టేబ్యుకోనజోల్ మిశ్రమ మందు (1.4 గ్రా./లీటర్ నీటికి), నాలుగో పిచికారీలో డైపాన్కొనజోల్ (1ఎం.ఎల్/లీటర్ నీటికి) కలిపి పిచికారీ చేయాలి. ఇదీ చదవండి: నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి -
అరటి సాగు.. రైతన్నలకు కాసుల వర్షం
రాజంపేట టౌన్: అరటి సాగు అనగానే రైతులకు, ప్రజలకు ఠక్కున గుర్తుకు వచ్చేది అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలు. అనాదిగా ఈ నియోజకవర్గాల్లోని రైతులు అధికంగా అరటి సాగుచేస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రస్తుతం ఉన్న ధరలు ఆనందంలో ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం టన్ను (బాక్సుల్లో ఎగుమతి చేసేవి ) 18వేల రూపాయలకు పైగా ధర పలుకుతుంది. ఈ విధానంలో ఎగుమతి చేసే రైతులు హెక్టారుకు ఖర్చులు పోను పది లక్షల రూపాయల వరకు లాభాలను అర్జిస్తున్నారు. అలాగే గెలలతో ఎగుమతి చేసే అరటి 16వేల రూపాయిలకు పైగా ధర పలుకుతోంది. ఈ విధానంలో అరటిని ఎగుమతి చేసే రైతులు హెక్టారుకు తొమ్మిది లక్షల రూపాయలకు పైగా లాభాన్ని పొందుతున్నారు. ఇదిలా ఉంటే 2017వ సంవత్సరంలో ఇలాంటి ధరలే పలికాయి. అనంతరం ఇంతటి ధర ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లేక పోవడంతో రైతులకు లాభాలు అంతంత మాత్రమే ఉండేవి. హెక్టారుకు డెబ్బై టన్నుల దిగుబడి ఈ ఏడాది అరటి దిగుబడి కూడా ఆశాజనకంగా ఉంది. హెక్టారుకు దాదాపు 70 టన్నుల దిగుబడి వచ్చింది. ఫలితంగా రైతులు ఘననీయంగానే ఆదాయం పొందుతున్నారు. ఒక హెక్టారు అరటి పంట సాగు చేసేందుకు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారు. ఇందువల్ల టన్ను 18 వేలకు విక్రయించే వారికి ఖర్చులు పోను పది లక్షలకు పైగా, 16వేలకు విక్రయించే రైతులకు తొమ్మిది లక్షలకు పైగా మిగులుతుంది. ప్రస్తుతం పచ్చఅరటి, అమృతపాణి, కర్పూర చక్కర కేలి, సుగంధాల రకాల అరటిని రైతులు కోస్తున్నారు. ధర పెరుగుదల ఎందుకంటే..... అరటి పిలకలను పూడ్చిన తర్వాత ఏడాదికి పంట చేతికి వస్తుంది. గత ఏడాది మే నెలలో వేసిన పంట ఇప్పుడు చేతికి వచ్చింది. అయితే గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో సంభవించిన భారీ వరదలకు అనేక మందికి చెందిన అరటి తోటలు వరల ధాటికి కొట్టుకు పోయాయి. ఫలితంగా పంట భారీగా తగ్గింది. ప్రస్తుతం అమాంతంగా పెరిగిన ధరలకు పంట తక్కువగా ఉండటమేనని రైతులు అంటున్నారు. అస్సలు ఊహించలేదు ప్రస్తుతం అరటి పంటకు ఉన్న ధరను అసలు ఊహించలేదు. నేను పదకొండు ఎకరాల్లో అరటి సాగుచేశాను. వరదలకు నా పంట దెబ్బతినలేదు. ప్రస్తుతం ఉన్న ధరకు నాకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఆదాయం వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. – ముక్కా చెంగల్‌రెడ్డి, రైతు, కొర్లకుంట, ఓబులవారిపల్లె మండలం ఐదు రాష్ట్రాలకు ఎగుమతి రాజంపేట, రైల్వేకోడూరు నియోజవర్గాల్లోని రైతులు పండించే అరటి నాణ్యత ఉంటుంది. అందువల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. వ్యాపారులు పంట కోతకు రావడానికి రెండు నెలల ముందు నుంచే రైతులకు అడ్వాన్సులు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపుతారు. ఈ నియోజకవర్గాలకు చెందిన రైతులు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తమ పంటను ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం చాలామంది రైతులకు చెందిన పంట కోతకు రావడంతో పల్లెసీమల నుంచి జోరుగా అరటి రవాణా సాగుతుంది. -
అంతర్జాతీయ బ్రాండ్ కానున్న అనంతపురం
వేరుశనగ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది అనంత. కానీ ఇప్పుడు నాణ్యమైన అరటితోనూ అనంత గుర్తింపు తెచ్చుకుంది. ‘హ్యాపీ బనానా’ పేరుతో ఇప్పటికే గల్ఫ్ లాంటి విదేశాలకు ఎగుమతి అవుతున్న ‘అనంత’ అరటి.. సమీప భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ కానుంది. సాక్షి, అనంతపురం అగ్రికల్చర్: నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) అనంతపురం జిల్లాను బనానా డెవలప్మెంట్ క్లస్టర్‌గా ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, వివిధ జిల్లాల్లో ఉద్యాన తోటలపై సర్వే నిర్వహించిన ఎన్‌హెచ్‌బీ... కొన్ని ప్రామాణికాల ఆధారంగా 12 జిల్లాల పరిధిలో 7 ఉద్యాన పంటలను గుర్తించింది. అందులో అరటికి సంబంధించి తమిళనాడులోని థేనీ జిల్లాతో పాటు ‘అనంత’కు స్థానం కల్పించడం విశేషం. మిగతా వాటి విషయానికి వస్తే... యాపిల్ క్లస్టర్లుగా షోపియాన్ (జమ్మూకాశ్మీర్), కిన్నౌర్ (హిమాచలప్రదేశ్), మామిడి క్లస్టర్లుగా లక్నో (ఉత్తరప్రదేశ్), కచ్ (గుజరాత్), మహబూబ్‌నగర్ జిల్లా (తెలంగాణా) ఉన్నాయి. అలాగే ద్రాక్ష క్లస్టర్‌గా నాసిక్ (మహారాష్ట్ర), ఫైనాపిల్ క్లస్టర్‌గా సిఫాహిజలా (త్రిపుర), దానిమ్మ క్లస్టర్లుగా షోలాపూర్ (మహారాష్ట్ర), చిత్రదుర్గ (కర్ణాటక) ఉండగా పసుపు క్లస్టర్‌గా పశ్చిమ జైంతియాహిల్స్ (మేఘాలయ)ను ప్రకటించారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అడిషనల్ డైరెక్టర్ పర్యటన తాజాగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన అడిషనల్ సెక్రటరీ డాక్టర్ అభిలాక్ష్ లిఖీ శుక్రవారం నార్పల మండలం కర్ణపుడికి గ్రామంలోని అరటి తోటలను పరిశీలించారు. రైతుల సమస్యలు, అనుభవాలు తెలుసుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ తదితరులు ఉన్నారు. అరటి దిగుబడి, లభిస్తున్న ధర, ఎగుమతులు, సాగు పద్ధతులను తెలుసుకున్నారు. నార్పల మండం కర్ణపుడికిలో అరటి తోట పరిశీలించి రైతులతో మాట్లాడుతున్న అభిలాక్ష్ లిఖీ అరటి రైతులకు మూడింతల ఆదాయం మెరుగైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడం ద్వారా దిగుబడి పెరగడంతో పాటు రైతులకు మూడింతల ఆదాయం వచ్చేలా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రూ.270 కోట్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన అడిషనల్ సెక్రటరీ డాక్టర్ అభిలాక్ష్ లిఖీ తెలిపినట్లు ఉద్యానశాఖ అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. అందులో ఉత్పత్తి పెంపునకు రూ.116.50 కోట్లు, పంట కోతల తర్వాత యాజమాన్యం, విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం రూ.74.75 కోట్లు, మార్కెటింగ్, బ్రాండింగ్, రవాణా వసతుల కోసం రూ.78.70 కోట్లు వెచ్చించడానికి ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. అరటి తోటలు ఎక్కువగా ఉన్న నార్పల, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, పెద్దపప్పూరు, యాడికి తదితర ప్రాంతాల్లో నాణ్యమైన దిగుబడులు, మార్కెటింగ్ వ్యవస్థ కల్పించడానికి రైపనింగ్ ఛాంబర్లు, కోల్ట్‌స్టోరేజీలు, ఎగుమతుల పెంపు కోసం ఇతరత్రా మౌలిక సదుపాయం కల్పించే అవకాశం మెండుగా ఉందని చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల పరిధిలో కూడా అరటి అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. దీంతో భవిష్యత్తులో అరటికి కేరాఫ్‌గా ‘అనంత’ మారుతుందని అంచనా వేస్తున్నారు. క్లస్టర్ ప్రకటనతో ఎన్‌హెచ్‌బీ అధ్యయనం అనంతను అరటి క్లస్టర్‌గా ప్రకటించిన నేపథ్యంలో.. నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ)కి చెందిన ఇరువురు అధికారులు బృందం గతేడాది రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించింది. అరటి తోటల సాగు, రైతుల స్థితిగతులపై అధ్యయనం చేసింది. జిల్లాలో వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, భూమి లక్షణాలు, రైతులు అవలంభిస్తున్న యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్, లభిస్తున్న ధర, నికర ఆదాయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితర వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. -
ఆంధ్రా అరటి.. చలో యూరప్
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రా అరటి’ తీపిని ప్రపంచ దేశాలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అరటి సాగు, దిగుబడి, ఎగుమతుల్లో ఇప్పటికే మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రం నుంచి రెండేళ్లుగా మధ్య తూర్పు దేశాలకు అరటి పండ్లు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఏడాది నుంచి యూరోపియన్ దేశాలతోపాటు లండన్‌కు సైతం ఎగుమతి చేయనున్నారు. కనీసం లక్ష టన్నుల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యాన శాఖ ఉపక్రమించింది. రాష్ట్రంలో ఈ ఏడాది 1,08,083 హెక్టార్లలో అరటి సాగు చేస్తుండగా.. 64,84,968 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. చక్కెరకేళి, గ్రాండ్–9, ఎర్ర చక్కెరకేళి, కర్పూర, అమృతపాణి, బుడిద చక్కెరకేళి, తేళ్ల చక్కెరకేళి, సుగంధ, రస్తోలి వంటి రకాలు సాగవుతున్నాయి. వైఎస్సార్, అనంతపురం, ఉభయ గోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో అరటి సాగు ఎక్కువగా విస్తరించింది. పచ్చ అరటికి భలే డిమాండ్ రాష్ట్రంలో వివిధ రకాల అరటి సాగవుతున్నా.. నిల్వ సామర్థ్యం, తీపి అధికంగా ఉండే గ్రాండ్–9 (పచ్చ అరటి) మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతోంది. 2016–17 సంవత్సరంలో ఇక్కడి నుంచి ఎగుమతులకు శ్రీకారం చుట్టగా.. ఆ ఏడాది 246 టన్నుల అరటి పండ్లు ఎగుమతి అయ్యాయి. 2017–18లో 4,300 టన్నులు, 2018–19లో 18,500 టన్నులను ఎగుమతి చేశారు. గతేడాది కరోనా విపత్కర పరిస్థితులు తలెత్తినా 38,520 టన్నులను ఎగుమతి చేయగలిగారు. ముంబై కేంద్రంగా ఎగుమతులు అరటి ఎగుమతులను పెంచే లక్ష్యంతో ఐఎన్ఐ, ఫార్మ్స్, దేశాయ్, మహీంద్ర అండ్ మహీంద్ర వంటి అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ కంపెనీలతో రాష్ట్ర ఉద్యాన శాఖ ఒప్పందాలు చేసుకుంది. వీటితో పాటు మరో 10 మేజర్ కార్పొరేట్ కంపెనీల ద్వారా కనీసం లక్ష టన్నులను విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఒక్కొక్కటి 45 వ్యాగన్ల సామర్థ్యం గల ఆరు ప్రత్యేక రైళ్ల ద్వారా అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ముంబై నౌకాశ్రయానికి అరటి పండ్లను రవాణా చేశారు. అక్కడ నుంచి విదేశాలకు 20 వేల టన్నులను ఎగుమతి చేశారు. మరో రైలు ఈ నెల 27వ తేదీన బయల్దేరబోతుంది. విత్తు నుంచి మార్కెట్ వరకు.. డ్రిప్ ఇరిగేషన్, టిష్యూ కల్చర్‌ను ప్రోత్సహించడంతో పాటు బడ్ ఇంజెక్షన్, బంచ్ స్ప్రే, బంచ్ స్లీవ్స్, రిబ్బన్ ట్యాగింగ్, ఫ్రూట్ కేరింగ్, ప్రీ కూలింగ్, వాషింగ్, గ్రేడింగ్ అండ్ ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ ఇలా అన్ని విభాగాల్లోనూ నాణ్యతను పెంపొందించడమే లక్ష్యంగా.. విత్తు నుంచి మార్కెట్ వరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 12 జిల్లాల్లో 46 క్లస్టర్స్‌ను గుర్తించి ఐఎన్ఐ ఫరŠమ్స్, దేశాయ్ కంపెనీల సహకారంతో కడప, అనంతపురం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వైఎస్సార్ తోట బడుల పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫ్రూట్ కేరింగ్ కార్యకలాపాలను రైతులకు చేరువ చేస్తున్నారు. ఆంధ్రా అరటే కావాలంటున్నారు ఒమన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల వ్యాపారులు ఆంధ్రా అరటి మాత్రమే కావాలంటున్నారని ఎక్స్‌పోర్టర్స్ చెబుతుంటే ఆశ్చర్యమేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మన అరటి కోసం ఎగుమతిదారులు పోటీపడుతున్నారు. ఇప్పటికే 10 మంది ఎక్స్‌పోర్టర్స్ ముందుకొచ్చారు. మరింత మంది రాబోతున్నారు. ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్‌తో పాటు ఆర్బీకేల ద్వారా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ తోటబడులు అరటి ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడంలో దోహదపడ్డాయి. ఈ ఏడాది హెక్టార్‌కు 65 నుంచి 70 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. – ఎం.వెంకటేశ్వర్లు, జాయింట్ డైరెక్టర్, ఉద్యాన శాఖ (పండ్ల విభాగం) -
ధర వెలవెల! రైతు విలవిల
సాక్షి, అమరావతి: పేదోడి పండుగా పిలిచే అరటికి ఇప్పుడు గడ్డురోజులు వచ్చాయి. గిట్టుబాటు ధరలేక దానిని సాగు చేస్తున్న రైతులు విలవిల్లాడుతున్నారు. నెల కిందట రూ.17 వేలు పలికిన టన్ను కాయలు ప్రస్తుతం రూ.12 వేలకు పడిపోవడమే కారణం. కొన్ని ప్రాంతాలలో గెలకు రూ.50 కూడా రాకపోవడంతో మార్కెట్ యార్డుల్లోనే వాటిని వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలో అయితే కాయ కోయడం కూడా వృధా అని రైతులు వదిలేస్తున్నారు. శుభకార్యాలు లేకపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పులు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోనూ అరటిసాగు పెరగడం, బెంగాల్ నుంచి ఒడిశాకు అధిక మొత్తంలో దిగుమతులు పెరగడం ధరలు పడిపోవడానికి కారణంగా చెబుతున్నారు. అరటి సాగులో ఏపీది 4వ స్థానం దేశంలో అధికంగా అరటి సాగుచేసే రాష్ట్రాల్లో ఏపీది నాలుగో స్థానం. ఇక్కడ సుమారు 1,12,995 హెక్టార్లలో సాగవుతోంది. అరటి సాగుచేసే జిల్లాల్లో 35,620 హెక్టార్లతో వైఎస్సార్ కడప అగ్రస్థానంలో ఉంది. ఇక రాష్ట్రం నుంచి ఏటా 63,84,730 టన్నుల అరటి దిగుబడి వస్తుందని అంచనా. కాగా, మన రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లయిన రావులపాలెం, రాజంపేట, పులివెందుల, అనంతపురం, తెనాలి వంటి కేంద్రాల నుంచి బెంగళూరు, చెన్నై, కోల్‌కత, ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల మార్కెట్లకు అరటి ఎగుమతి అవుతుంది. మార్కెట్లలో పరిస్థితి ఎలా ఉందంటే.. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 16,400 హెక్టార్లలో అరటి సాగవుతోంది. హెక్టార్‌కు 62 టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. నెల కిందట మేలి రకం అరటి టన్ను రూ.17వేలు పలికింది. ఇప్పుడది రూ.13 వేలకు, రూ.12 వేలు పలికిన రెండో రకం ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. పులివెందులలో టన్ను ధర రూ.11, రూ.12 వేల మధ్య ఉంది. ఎగుమతులు తగ్గడానికి చలి తీవ్రతే కారణంగా చెబుతున్నారు. ఇక.. తెనాలి మార్కెట్లో పెద్ద గెల (పది అత్తాలు) రూ.50 నుంచి రూ.60 మధ్య ఉంది. చిన్న గెలయితే కేవలం రూ.25, మరీ చిన్నదైతే రూ.15లకు అమ్ముడవుతున్నాయి. కానీ, విడిగా అయితే డజను కాయలు సైజును బట్టి మార్కెట్లో రూ.30, రూ.50 పలుకుతున్నాయి. రావులపాలెం మార్కెట్లో ఇలా.. ఇదిలా ఉంటే.. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 32,418 హెక్టార్లలో అరటి సాగవుతోంది. ఇక్కడి రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో కూడా అరటి ధరలు దారుణంగా పతనమయ్యాయి. ముహూర్తాలు, శుభకార్యాలు లేకపోవడం, కర్పూర రకం అధికంగా సాగు చేయడంతో ధరలు తగ్గాయి. దీనికి తోడు విజయనగరం జిల్లా సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం అరటి పంట అందివచ్చింది. సీజన్లో ఈ యార్డుకు రోజుకు 35–40 వేల గెలలు వచ్చేవి. తమిళనాడు, ఒడిశా, బీహార్, తదితర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 40 లారీల సరుకు రవాణా అయ్యేది. కానీ, ప్రస్తుతం అది 20–25 లారీలకు పడిపోయింది. దీంతో కొనుగోళ్లు లేక రైతులు తాము తెచ్చిన గెలలను యార్డులోనే వదిలి వెళ్లాల్సిన దయనీయ స్థితి నెలకొంది. రూ.150 కూలీ చెల్లించి తీసుకువచ్చిన ఆరు గెలలకు (లోడు) రూ. 200 కూడా ధర పలకక రైతులు తీరని నష్టాలు ఎదుర్కొంటున్నారని అరటి వ్యాపారి కోనాల చంద్రశేఖరరెడ్డి అంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి మాది అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల. నాలుగు ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నా. కాయ బాగా వచ్చిన తర్వాత ధర లేదు. టన్నుకు కనీసం రూ.15 వేలు అయినా ఉంటే తప్ప గిట్టుబాటు కాదు. కానీ, రూ.13 వేలు కూడా రావడంలేదు. పోయిన నెలలో రూ.17 వేలకు అమ్మాం. ధరల స్థిరీకరణ నిధితో ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది. – టి. నారాయణస్వామి,అరటి రైతు -
రేపు అరటి సాగుపై శిక్షణ
అనంతపురం అగ్రికల్చర్ : అరటి సాగులో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో రైతులకు బుధవారం శిక్షణ ఉంటుందని ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ప్రిన్సిపాల్ ఎస్.చంద్రశేఖర్గుప్త సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు హాజరై అరటి సాగు పద్ధతులు, మార్కెటింగ్ సదుపాయం, ఇతర అంశాల గురించి అవగాహన కల్పిస్తారన్నారు. అరటి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 08554–270430, 81420 28268 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
అరటి సాగులో సస్యరక్షణ
నులి పురుగు బెడద వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు అరటికి నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. తేలికపాటి నేలల్లో ఉండే ఈ పురుగు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. వీటివల్ల వేర్లపై బుడిపెల వంటివి ఏర్పడుతాయి. ఉధృతి అధికంగా ఉంటే అరటి ఆకులు వాలిపోతాయి. అంచుల చివర్లు నల్లగా మారి మాడిపోతాయి. మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. పంటనాటే ముందు విత్తనశుద్ధి చేసుకుంటే పురుగును నివారించవచ్చు. నులి పురుగు ఆశించినట్లయితే 5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+ 2.5. మి.లీ మోనోక్రొటోఫాస్ లీటరు నీటిలో కలిపి మిశ్రమ ద్రావణం తయారు చేసుకోవాలి. మిశ్రమ ద్రావణంలో అరటి పిలకల దుంపలను ముంచి నాటుకోవాలి. అరటి పెరిగే దశలో పురుగుల నియంత్రణ కోసం కార్బోఫ్యురాన్ 3జీ గుళికలను మొక్కల దగ్గరగా వేయాలి. పంటల మార్పిడి వల్ల కూడా పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. ఆకుమచ్చ తెగులు దీని ప్రభావం వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. బూడిద రంగులో ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవిగా మారుతాయి. ఆకులు మాడిపోయి మొక్కలు గిడసబారుతాయి. తెగులు నియంత్రణ కోసం తోటల్లో నీరు నిల్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. తెగులు ఎక్కువగా ఉంటే 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల క్లోరోథలోనిల్ లీటరు నీటి చొప్పున కలపి పిచికారీ చేయాలి. అలాగే ఒక మి.లీ. ట్రైడిమార్ఫ్ లేదా ప్రొపికొనజోల్ లీటరు నీటి చొప్పున కలిపి రెండు మూడు సార్లు స్ప్రే చేయాలి. కాయముచ్చిక కుళ్లు అరటి కాయల చివర ముచ్చిక వద్ద నల్లగా మారి కుళ్లు మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించిన కాయలను గుర్తించి తొలగించి తగులబెట్టాలి. నివారణ చర్యగా ఒక గ్రామం కార్బండజిమ్ లీటరు నీటిలో కలిపి అరటి గెలలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేసి తెగులును అదుపు చేయవచ్చు. -
ఒక్కసారి నాటితే మూడేళ్ల పాటు దిగుబడి
సంప్రదాయ పంటలతో పోలిస్తే అరటి సాగు మేలని భావించిన రైతు సుభాష్‌రెడ్డి పదేళ్లుగా ఈ పంటను సాగు చేస్తున్నాడు. దీని ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. వరితో పోలిస్తే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో అరటిని పం డించవచ్చు. చెరుకు, మొక్కజొన్న వంటి పంటలకు అడవి పందుల బెడద, కూలీల కొరత ఉంటోంది. దీనికి తోడు ఎన్నో కష్టాలను భరించి పండించిన పంట ఉత్పత్తులను విక్రయిస్తే సకాలంలో డ బ్బులు అందక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సంప్రదాయ పంటలకు స్వస్థి చెప్పక తప్పదని పలువురు అన్నదాతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి నాటితే మూడేళ్ల పాటు కాత... ఒక్కసారి అరటి మొక్కను నాటితే 3 సంవత్సరాల పాటు కాత వస్తుంది. పంట సాగుచేశాక ఈ విషయాన్ని హార్టికల్చర్ అధికారులకు చెబితే హెక్టారుకు రూ.33 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. అరటి తోటలోకి అడవి పందులు రావు. మొదట్లో ఈ ప్రాంతంలోని రైతులు గడ్డలను పెట్టడం ద్వారా తోటలు పెంచేది. కానీ పద్ధతి వల్ల చేనంతా ఒకేసారి కాపునకు వచ్చేది కాదు. కొంత కోతకు వస్తే.. మరికొంత పూత దశలో ఉండేది. ఈ సమస్యను అధిగమించేందుకు రైతు సుభాష్‌రెడ్డి హైదరాబాద్‌లోని స్నేహ నర్సరీ నుంచి గ్రౌండ్ 9 వెరైటీ మొక్కలు తెప్పించి నాటాడు. వీటిని ఎకరాకు 1,540 చొప్పున ఏడెకరాల్లో 10,780 మొక్కలు పెట్టించాడు. పంట సాగుకు ముందు ఎకరం పొలంలో 5 ట్రాక్టర్ల ఎరువు(పశువుల)పేడను చల్లి బాగా కలియదున్నాడు. అనంతరం సబ్సిడీపై ప్రభుత్వం అందించిన డ్రిప్‌ను పొలంలో ఏర్పాటు చేయించాడు. తనకున్న రెండు బోర్ల సాయంతో తోటకు నీరందిస్తున్నాడు. దీనికోసం ఎకరాకు రూ.70 నుంచి రూ.80 వేల ఖర్చు వచ్చిందని చెప్పాడు. అనంతరం ఏడాదికి పంట చేతికి రాగా ఎకరానికి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చిందని తెలిపాడు. ఈ లెక్కన తను పెట్టిన పెట్టుబడితో పాటు మొదటి కాపులోనే రెండింతల ఆదాయం వచ్చింది. పంట చేతికందిన సమయంలో పండ్ల వ్యాపారులే తమ కూలీలతో పొలం వద్దకు వచ్చి అక్కడే డబ్బులు చెల్లించి గెలలు తీసుకెళ్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. హెక్టారుకు రూ.33 వేల చొప్పున హార్టికల్చర్ అధికారులు అందజేసిన ఆర్థిక సాయం మందుల ఖర్చులకు పనికొచ్చిందని చెప్పాడు. అరటి పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. అరటి సాగు వల్ల సాగు నీరు గణనీయంగా ఆదా అవుతోందన్నాడు. పంటను సాగు చేసిన మొదట్లో ఆకుతినే పురుగు, ఆకుమచ్చ తెగుళ్లు సోకే ప్రమాదం ఉందన్నాడు. దీని నివారణకు క్వినాల్ఫాస్ మందును స్ప్రే చేస్తే సరిపోతుందని తెలిపాడు. 7 ఎకరాల పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేస్తే రూ.1.20 లక్షల ఖర్చు వచ్చిందన్నాడు. దీంతో 7 ఎకరాల్లో సంవత్సరానికి ఖర్చులు పోను సుమారు రూ.4.5 లక్షల ఆదాయం వచ్చిందని వివరించాడు. మొక్కలు పెట్టిన మొదటి సంవత్సరం మాత్రమే ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేల ఖర్చు వచ్చిందన్నాడు. ఆ తరువాత రెండేళ్ల పాటు కేవలం ఎరువులు, రసాయన మందుల ఖర్చు ఉంటుందని పేర్కొన్నాడు. మూడేళ్లపాటు సాగయ్యే అరటితో మంచి లాభాలున్నాయని చెబుతున్నాడు.