ఒక్కసారి నాటితే మూడేళ్ల పాటు దిగుబడి | Banana cultivation for three years | Sakshi
Sakshi News home page

ఒక్కసారి నాటితే మూడేళ్ల పాటు దిగుబడి

Published Mon, Sep 8 2014 11:34 PM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM

Banana cultivation for three years

సంప్రదాయ పంటలతో పోలిస్తే అరటి సాగు మేలని భావించిన రైతు సుభాష్‌రెడ్డి పదేళ్లుగా ఈ పంటను సాగు చేస్తున్నాడు. దీని ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. వరితో పోలిస్తే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో అరటిని పం డించవచ్చు. చెరుకు, మొక్కజొన్న వంటి పంటలకు అడవి పందుల బెడద, కూలీల కొరత ఉంటోంది. దీనికి తోడు ఎన్నో కష్టాలను భరించి పండించిన పంట ఉత్పత్తులను విక్రయిస్తే సకాలంలో డ బ్బులు అందక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సంప్రదాయ పంటలకు స్వస్థి చెప్పక తప్పదని పలువురు అన్నదాతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 ఒక్కసారి నాటితే మూడేళ్ల పాటు కాత...
 ఒక్కసారి అరటి మొక్కను నాటితే 3 సంవత్సరాల పాటు కాత వస్తుంది. పంట సాగుచేశాక ఈ విషయాన్ని హార్టికల్చర్ అధికారులకు చెబితే హెక్టారుకు రూ.33 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. అరటి తోటలోకి అడవి పందులు రావు. మొదట్లో ఈ ప్రాంతంలోని రైతులు గడ్డలను పెట్టడం ద్వారా తోటలు పెంచేది. కానీ పద్ధతి వల్ల చేనంతా ఒకేసారి కాపునకు వచ్చేది కాదు. కొంత కోతకు వస్తే.. మరికొంత పూత దశలో ఉండేది. ఈ సమస్యను అధిగమించేందుకు రైతు సుభాష్‌రెడ్డి హైదరాబాద్‌లోని స్నేహ నర్సరీ నుంచి గ్రౌండ్ 9 వెరైటీ మొక్కలు తెప్పించి నాటాడు. వీటిని ఎకరాకు 1,540 చొప్పున ఏడెకరాల్లో 10,780 మొక్కలు పెట్టించాడు.

పంట సాగుకు ముందు ఎకరం పొలంలో 5 ట్రాక్టర్ల ఎరువు(పశువుల)పేడను చల్లి బాగా కలియదున్నాడు. అనంతరం సబ్సిడీపై ప్రభుత్వం అందించిన డ్రిప్‌ను పొలంలో ఏర్పాటు చేయించాడు. తనకున్న రెండు బోర్ల సాయంతో తోటకు నీరందిస్తున్నాడు. దీనికోసం ఎకరాకు రూ.70 నుంచి రూ.80 వేల ఖర్చు వచ్చిందని చెప్పాడు. అనంతరం ఏడాదికి పంట చేతికి రాగా ఎకరానికి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చిందని తెలిపాడు. ఈ లెక్కన తను పెట్టిన పెట్టుబడితో పాటు మొదటి కాపులోనే రెండింతల ఆదాయం వచ్చింది.

 పంట చేతికందిన సమయంలో పండ్ల వ్యాపారులే తమ కూలీలతో పొలం వద్దకు వచ్చి అక్కడే డబ్బులు చెల్లించి గెలలు తీసుకెళ్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. హెక్టారుకు రూ.33 వేల చొప్పున హార్టికల్చర్ అధికారులు అందజేసిన ఆర్థిక సాయం మందుల ఖర్చులకు పనికొచ్చిందని చెప్పాడు. అరటి పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. అరటి సాగు వల్ల సాగు నీరు గణనీయంగా ఆదా అవుతోందన్నాడు. పంటను సాగు చేసిన మొదట్లో ఆకుతినే పురుగు, ఆకుమచ్చ తెగుళ్లు సోకే ప్రమాదం ఉందన్నాడు.

దీని నివారణకు క్వినాల్‌ఫాస్ మందును స్ప్రే చేస్తే సరిపోతుందని తెలిపాడు. 7 ఎకరాల పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేస్తే రూ.1.20 లక్షల ఖర్చు వచ్చిందన్నాడు. దీంతో 7 ఎకరాల్లో సంవత్సరానికి ఖర్చులు పోను సుమారు రూ.4.5 లక్షల ఆదాయం వచ్చిందని వివరించాడు. మొక్కలు పెట్టిన మొదటి సంవత్సరం మాత్రమే ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేల ఖర్చు వచ్చిందన్నాడు. ఆ తరువాత రెండేళ్ల పాటు కేవలం ఎరువులు, రసాయన మందుల ఖర్చు ఉంటుందని పేర్కొన్నాడు. మూడేళ్లపాటు సాగయ్యే అరటితో మంచి లాభాలున్నాయని చెబుతున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement