
మోదీ ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో (Budget 2025-26) కొత్త లేబర్ కోడ్ (New Labor Code) నిబంధనల అమలును ప్రకటించవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రాబోయే బడ్జెట్‌లో లేబర్ కోడ్‌లను దశలవారీగా అమలు చేసే ప్రణాళికను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అధికార వర్గాల ప్రకారం.. ఈ కొత్త లేబర్ కోడ్‌లు మూడు దశల్లో అమల్లోకి రానున్నాయి. దీంతో ఉద్యోగులకు రోజువారీ పని గంటలు పెరుగుతాయి. అలాగే వారానికి 4 రోజులే పని చేసే అవకాశం ఉంటుంది. పీఎఫ్ కోసం కట్ చేసే డబ్బు పెరిగితే ప్రతి నెలా వచ్చే జీతం తగ్గవచ్చు.
మూడు దశల్లో కొత్త లేబర్ కోడ్
లేబర్ కోడ్ కొత్త కొత్త విధానాలను అమలు చేయడానికి ఆయా యాజమాన్యాలకు తగిన సమయం ఇచ్చేందుకు మూడు దశల్లో దీన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. 2025-26 బడ్జెట్‌లోనే ప్రభుత్వం ఈ కోడ్‌లను ప్రకటిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది అమలులోకి వస్తుంది. ఈ లేబర్ కోడ్‌లు అటు యాజమాన్యాలకు అనువుగా ఉండటమే కాకుండా ఇటు ఉద్యోగులకు కూడా మెరుగైన సామాజిక భద్రత కల్పిస్తాయని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: Budget 2025: కొత్త ట్యాక్స్ శ్లాబ్ రాబోతోందా?
మొదటి దశలో 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న పెద్ద కంపెనీలు ఈ కోడ్‌లను అనుసరించడం తప్పనిసరి. రెండో దశలో 100-500 మంది ఉద్యోగులున్న మీడియం కంపెనీలను దీని పరిధిలోకి తీసుకురానున్నారు. మూడో దశలో 100 మందిలోపు ఉద్యోగులున్న చిన్న కంపెనీలపై ఈ కోడ్‌లను అమలు చేయనున్నారు. లేబర్ కోడ్ కొత్త నియమాలు, పథకం ప్రకారం, ఈ నిబంధనలను అమలు చేయడానికి చిన్న సంస్థలకు సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. దేశ వ్యాపార నిర్మాణంలో 85 శాతం కంటే ఎక్కువ వాటా ఎంఎస్‌ఎంఈలు అంటే చిన్న పరిశ్రమలదే.
రాష్ట్రాలతో చర్చలు
ఈ కోడ్‌లను అమలు చేసేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలను ఖరారు చేసే పనిలో మంత్రిత్వ శాఖ బిజీగా ఉంది. మొదటి దశలో వేతనాలు, సామాజిక భద్రతా కోడ్‌పై కోడ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే మార్చి నాటికి అన్ని రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలు ఖరారు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఏమిటీ లేబర్ కోడ్‌లు?
భారత ప్రభుత్వం 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా ఏకీకృతం చేసింది. యాజమాన్యాలతోపాటు ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. నాలుగు కోడ్‌లు ఇవే.. వేతనాలపై కోడ్, సామాజిక భద్రతా కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, చివరిది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్ కోడ్.
4 రోజులు పని.. 3 రోజులు సెలవు
కొత్త లేబర్ కోడ్‌లలో వారంలో నాలుగు రోజుల పని, మూడు రోజుల విశ్రాంతి విధానం కూడా ఉండవచ్చు. ఉద్యోగుల పని, జీవితం మధ్య సమతుల్యతను ఏర్పరచడమే ఈ విధానం ఉద్దేశం. అయితే వారానికి నాలుగు రోజులే పని చేయాలనే నిబంధన వల్ల రోజువారీ పని గంటలు పెరుగుతాయి. మరోవైపు ప్రావిడెంట్ ఫండ్ కోసం మినహాయించే మొత్తం పెరిగే పరిస్థితిలో ఉద్యోగుల చేతికి అందే జీతం తగ్గవచ్చు.