పన్ను చెల్లింపుదారులకు ఉపశమనంగా రాబోయే యూనియన్ బడ్జెట్ 2025-26 (Union Budget 2025-26) కొత్త పన్ను విధానంలో గణనీయమైన మార్పులు చూడవచ్చు. రూ.10 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పన్ను రహితం చేయడంతోపాటు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య వార్షిక ఆదాయానికి కొత్తగా 25% పన్ను శ్లాబ్‌ను (new tax slab)ప్రవేశపెట్టడం వంటివి ఇందులో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2025-26ని ప్రకటించబోతున్నారు. రెండు పన్ను విధానాలలో రాయితీలు, పన్ను తగ్గింపుల కోసం వేతనజీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ. 7.75 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదు. ఇందులో రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా వర్తిస్తుంది. ఇక సంవత్సరానికి రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు అత్యధికంగా 30% పన్ను శ్లాబ్ కిందకు వస్తారు. వీటిలో మార్పులపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా నివేదిక పేర్కొంది.
"రెండు అవకాశాలనూ పరిశీలిస్తున్నాం. బడ్జెట్ అనుమతించినట్లయితే, రూ. 10 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పన్ను రహితం చేయడంతోపాటు రూ. 15 లక్షల నుండి రూ. 20 లక్షల మధ్య ఆదాయానికి 25 శాతం స్లాబ్‌ను ప్రవేశపెట్టవచ్చు" అని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లుగా నివేదిక ఉటంకించింది. ఈ ఆదాయపు పన్ను మినహాయింపు ప్రభావంతో రూ.50,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల ఆదాయ నష్టాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినట్లు వివరించింది.
కీలక ప్రతిపాదనలు
కేంద్ర బడ్జెట్ 2025-26 నేపథ్యంలో గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) కీలకమైన పన్ను సంస్కరణలను సిఫార్సు చేసింది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.5.7 లక్షలకు పెంచాలని సూచించింది. 2025 నాటికి పొదుపు సొమ్ముపై వచ్చే వడ్డీకి ఇస్తున్న రూ. 10,000 మినహాయింపును రూ. 19,450కి పెంచడం, బీమా ప్రీమియంలు, పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌కు సంబంధించి రూ. 1.5 లక్షల మినహాయింపును రూ. 2.6 లక్షలకు సర్దుబాటు చేయడం వంటి చర్యలను జీటీఆర్‌ఐ ప్రతిపాదించింది.
ఇదీ చదవండి: డబుల్ గుడ్‌న్యూస్! కొత్త బడ్జెట్‌లో రెండు పెద్ద ప్రకటనలు?
గత ఏడాది మాదిరిగా కాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను పెంచడంలో ఆశ్చర్యం కలిగించకపోవచ్చని చాలా మంది మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వృద్ధి దెబ్బ తిన్న సమయంలో వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం కొన్ని పన్ను చర్యలను ప్రకటించినప్పటికీ, వృద్ధి లేదా ఆదాయాలను పునరుద్ధరించడానికి ఉత్ప్రేరకంగా పనిచేసే విషయంలో బడ్జెట్ పరిమిత ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుందని వారు నమ్ముతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment