pest control prevention
-
‘సిగటోక’ చిత్తవ్వాలిక.. నివారణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ
సాక్షి, అమరావతి: అరటి పంటలో నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (సీడీపీ)ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్బీకే స్థాయిలో ఆగస్టు 2వ తేదీ నుంచి రైతులకు అవగాహన ఉద్యమం చేపట్టబోతోంది. రాష్టంలో 2.45 లక్షల ఎకరాల్లో అరటి పంట సాగవుతుండగా, అందులో సగానికి పైగా విస్తీర్ణం వైఎస్సార్, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం జిల్లాల పరిధిలోనే ఉంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో గ్రాండ్ నైన్ (జీ–9 పొట్టి పచ్చ అరటి), టిష్యూ కల్చర్ రకాలు సాగవుతుంటే.. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కర్పూరం, చక్కరకేళి వంటి రకాలు సాగవుతుంటాయి. రాయలసీమలో సాగయ్యే రకాలకే విదేశాల్లో డిమాండ్ ఎక్కువ. ఈ ఏడాది కనీసం 65 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది 48 వేల టన్నులు ఎగుమతి చేయగా.. ఈ ఏడాది 55 వేల టన్నుల అరటిని ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆందోళన కలిగిస్తున్న సిగటోక తెగులు గతంలో గోదావరి, కృష్ణా జిల్లాల్లో సాగయ్యే అరటి రకాలకు సోకే సిగటోక (ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, పొగాకు తెగులు) ఇప్పుడు రాయలసీమలోనూ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్లుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ తెగులు వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం మొక్క దశలో ఉన్న జీ–9, టిష్యూ కల్చర్ అరటి రకాలకు ఈ తెగులు సోకుతోంది. వాతావరణంలో తేమ 90 శాతం కన్నా అధికంగా ఉండి, ఉష్ణోగ్రత 25 నుంచి 26 డిగ్రీలు వరకు ఉన్నప్పుడు, అరటి ఆకులు 6 నుంచి 10 గంటల పాటు తడిగా ఉన్నప్పుడు ఈ తెగులు సోకుతుంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల సోకే ఈ తెగులు వల్ల ఆకులపై తొలుత పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రోజుల్లోనే అవి బూడిద రంగులోకి.. ఆ తర్వాత క్రమేపీ పెరుగుతూ గోధుమ రంగులోకి మారి ఒక దానితో ఒకటి కలిసిపోవడం వల్ల ఆకులు ఎండిపోతాయి. ఇలా జరగడం వల్ల కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన పచ్చదనం లేక కాయసైజు, నాణ్యత తగ్గిపోవడంతోపాటు గెలలు పక్వానికి రాకముందే పండిపోతాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఆగస్టు 2వ తేదీ నుంచి రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో నెల రోజుల పాటు అరటి పండించే ప్రతి గ్రామంలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ తెగులు సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సోకితే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఆర్బీకే పరిధిలోని ప్రతి రైతుకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తారు. పాటించాల్సిన జాగ్రత్తలివీ.. అరటి తోటలో కలుపు లేకుండా.. నీరు నిలబడకుండా చూసుకోవాలి. సిఫార్సు చేసిన దూరంలో అంటే జీ–9 రకాన్ని 1.8 ఇన్టూ 1.8 మీటర్ల దూరంలోనూ, తెల్ల చక్కెరకేళి, అమృతపాణి, కర్పూర చక్కెరకేళి వంటి రకాలను 2 ఇన్టూ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. తల్లి మొక్క చుట్టూ వచ్చే పిలకలను, మొక్క చుట్టూ ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేయాలి. ట్రైకోడెర్మావిరిడి లేదా సూడోమోనాస్ లేదా బాసిల్లస్ వంటి జీవ శిలీంధ్రాలను వేపనూనెతో కలిపి పాదులు, చెట్టు ఆకులు మొత్తం తడిసేలా 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. నివారణా చర్యలు సిగటోక తెగులు వ్యాప్తి మొదలైనప్పుడు ప్రొపికోనజోల్ (1 ఎంఎల్), మినరల్ ఆయిల్ (10 ఎంఎల్)ను లీటర్ నీటిలో కలిపి ఆకులు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. ఈ మందును 25 రోజుల వ్యవధిలో మూడు సార్లు, ఉధృతి అధికంగా ఉంటే 5–7 సార్లు చేయాలి. గెలలు కోయడానికి 45 రోజుల ముందుగా ఎలాంటి మందులను పిచికారీ చేయకూడదు. మొదటి పిచికారీలో ప్రోపికోనజోల్ (1ఎంఎల్–లీటర్ నీటికి)ను, రెండో పిచికారీలో కార్బండిజమ్, మాంకోజబ్ (1 గ్రాము/లీటర్ నీటికి), మూడో పిచికారిలో ట్రైప్లోక్సిస్ట్రోబిన్, టేబ్యుకోనజోల్ మిశ్రమ మందు (1.4 గ్రా./లీటర్ నీటికి), నాలుగో పిచికారీలో డైపాన్కొనజోల్ (1ఎం.ఎల్/లీటర్ నీటికి) కలిపి పిచికారీ చేయాలి. ఇదీ చదవండి: నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి -
భూసారాన్ని బట్టే చీడపీడల బెడద!
రసాయనిక అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేసుకోవాలన్న ఆసక్తి గాఢంగా ఉండాలే గాని సొంతిల్లే అవసరం లేదు. క్వార్టర్లో నివాసం ఉంటున్నప్పటికీ ఎంచక్కా సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవచ్చని రుజువు చేస్తున్నారు డా. వి. శ్రీనివాసరావు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన తన కుటుంబంతో క్యాంపస్ క్వార్టర్లో నివాసం ఉంటూ.. పెరటి స్థలంలో ఇంటిపంటలు పండించుకుంటున్నారు. గతంలో క్వార్టర్ పై అంతస్తులో ఉండగా టెర్రస్ మీద ఐదేళ్లపాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సొంతంగా తయారు చేసుకున్న జీవామృతం, ఘన జీవామృతంతో ఇంటిపంటలు సాగు చేసిన అనుభవం ఉంది. గత ఏడాది నుంచి పెరట్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం నాటావుల మాగిన పేడ ఎరువు, మేకల ఎరువు సమపాళ్లలో కలిపి మొక్కలకు వేస్తున్నారు. వేసవిలోనే దగ్గర్లోని గ్రామానికి వెళ్లి రైతు నుంచే కొనుగోలు చేసి తెచ్చుకొని వాడుతున్నారు. అరటి గెల ఆయన పెరటి తోటకు దీపస్థంభంలా భాసిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన పెరటి తోటలో దొండ/బీర పాదులతోపాటు బెండ మొక్కలు, వంగ మొక్కలు, పుదీన ఉన్నాయి. వంగ మొక్కలకు వేసవికి ముందు 4–5 అంగుళాల ఎత్తున ప్రూనింగ్ చేశారు. కొత్త కొమ్మలకు ఇప్పుడు కాయలు వచ్చాయి. పుదీన, తోటకూర ఉంది. మృగశిర కార్తెతో పాటే రుతుపవనాలు పలుకరించిన తర్వాత వారం క్రితమే అనేక ఆకుకూరలు విత్తుకున్నారు.కూరగాయ మొక్కల విత్తనాల నారు పోసుకున్నారు. టెర్రస్ గార్డెన్లో కన్నా పెరటి తోటలో పంటలకు చీడపీడల బెడద తక్కువగా ఉన్నట్లు గమనించానని డా. శ్రీనివాసరావు తెలిపారు. భూమిలో సారం బాగుంటే చీడపీడల బెడద తక్కువగా ఉంటుందన్నారు. కట్టెల బొగ్గు పొడిని అప్పుడప్పుడూ మొక్కలపై చల్లుతుంటానన్నారు. వారానికోసారి లీటరు నీటికి 10–15 ఎం.ఎల్. నాటావు మూత్రాన్ని కలిపి పెరటి తోటలో పిచికారీ చేస్తున్నానని తెలిపారు. వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో తమ పెరటి తోట కూరగాయలు, ఆకుకూరలనే తింటామని డా. శ్రీనివాసరావు(94922 93299) సంతోషంగా చెప్పారు. కొత్తిమీర, ఎరువును చూపుతున్న డా. శ్రీనివాసరావు -
పెరుగులోని సూక్ష్మజీవులు పోషకాలను స్థిరీకరించగలవా?
♦ ‘వారెవా.. పులిసిన పెరుగు ద్రావణం’ కథనానికి విశేష స్పందన ♦ నాన్బీటీ పత్తిలో ప్రయోగాత్మకంగా వాడుతున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం ‘వారెవా.. పులిసిన పెరుగు ద్రావణం’ శీర్షికన ఆగస్టు 1న ‘సాక్షి సాగుబడి’లో అచ్చయిన కథనం రైతుల్లో అమితాసక్తిని రేకెత్తించింది. ఈ అంశంపై రైతు లోకంలో విస్తృత చర్చ జరుగుతోంది. బిహార్లో కొందరు రైతులు 10–15 రోజులు పులియబెట్టిన పెరుగు ద్రావణాన్ని నీటిలో కలిపి పంటలకు ఎరువుగా, తెగుళ్లు, పురుగుల మందుగా సమర్థవంతంగా అనేక ఏళ్లుగా వాడుతున్నారని ఈ కథనం ద్వారా తెలుసుకొని ఆశ్చర్యచకితులయ్యారు. సోషల్ మీడియాలో ఈ కథనం హల్ చల్ చేసింది. పంటలపై శిలీంధ్రమచ్చలు, తెగుళ్ల నివారణకు 3 రోజులు పులిసిన మజ్జిగను 100 లీటర్ల నీటికి 5 లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి / సేంద్రియ రైతులకు అలవాటున్న సంగతే. అయితే, పెరుగును 10–15 రోజులు పులియబెట్టి పంటలకు పోషకాహారంగానూ, చీడపీడల నివారణకు వినియోగిస్తుండటం ఆశ్చర్యకరం. ఇలాఉండగా, కొందరు రైతులు పులిసిన పెరుగు ద్రావణం వినియోగంపై పలు సందేహాలు వెలిబుచ్చారు. పులియబెట్టిన పెరుగు ద్రావణాన్ని ఎంత మోతాదులో, ఎన్నాళ్లకోసారి పంటలకు వాడాలని.. రైతులు అడుగుతున్నారు. కొందరు రైతులు తమకు తెలిసిన పద్ధతుల్లో పెరుగు ద్రావణాన్ని బిహార్ రైతుల మాదిరిగా ప్రయోగాత్మకంగా వాడి చూస్తామని చెబుతున్నారు. అయితే, ఈ కథనాన్ని ఆంగ్లంలో తొలుత ప్రచురించిన ‘విలేజ్ స్క్వేర్’ సంస్థను సంప్రదించినప్పటికీ వివరాలు తెలియరాలేదు. పులిసిన పెరుగు ద్రావణంపై అధ్యయనం: డా. రామాంజనేయులు పెరుగులో లాక్టో బాసిల్లస్ రకం సూక్ష్మజీవులు పుష్కలంగా ఉంటాయని, పులియబెట్టిన పెరుగును నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తే తెగుళ్ల బెడద పోతుందని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ జనరల్ డా. జీ వీ రామాంజనేయులు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పెరుగులోని బాక్టీరియా, శిలీంధ్రాలతోపాటు ఫాస్ఫరస్ ఉంటాయన్నారు. అయితే, పెరుగులో చురుగ్గా పెరిగే సూక్ష్మజీవరాశి.. పంటలపై పిచికారీ చేసిన తర్వాత, నీటిలో కలిపి భూమిని తడిపిన తర్వాత ఎంతకాలం బతికి ఉండి ప్రభావం చూపుతుందో స్పష్టత లేదన్నారు. హానికారక సూక్ష్మక్రిములను చంపగలిగే లాక్టో బాసిల్లస్ సూక్ష్మజీవులు.. పోషకాలను భూమిలో స్థిరీకరించగలవా? అన్నదానిపై కచ్చితమైన సమాచారం కోసం అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. అయితే, తెగుళ్ల నివారణకు ఇంగువ / పులిసిన మజ్జిగ చల్లిన తర్వాత పంటలు చక్కగా కళకళలాడుతూ ఉంటాయన్నారు. దీనికి పుల్ల మజ్జిగలోని సూక్ష్మజీవుల వల్ల విడుదలయ్యే ఎంజైములే కారణమై ఉండవచ్చని డా. రామాంజనేయులు తెలిపారు. పులిసిన పెరుగు ద్రావణం వాడకంపై బిహార్ రైతుల అనుభవాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సూరజ్ నాన్ బీటీ పత్తి సేంద్రియ సాగులో పులిసిన పెరుగు ద్రావణాన్ని సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రయోగాత్మకంగా వివిధ మోతాదుల్లో పిచికారీ చేస్తున్నది. త్వరలో ఫలితాలను వెల్లడికానున్నాయి. (ప్రకృతి / సేంద్రియ వ్యవసాయంపై రైతులు తమ సందేహాల నివృత్తి కోసం సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలను 040–27017735 నంబరులో సంప్రదింవచ్చు). వేరుకుళ్లు నివారణకు పెరుగు+పసుపు ద్రావణం! బత్తాయి తదితర పండ్ల తోటలు తీవ్రనీటి ఎద్దడికి గురైనప్పుడు, కాపు నిలబెట్టడానికి ముందు ఎక్కువ రోజులు బెట్టకు ఉంచినప్పుడు ఆశించే వేరుకుళ్లు సమస్యను అధిగమించడానికి పుల్లమజ్జిగ, పసుపు ద్రావణం సమర్థవంతంగా పనిచేస్తున్నదని కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు రమణారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. 4 లీటర్ల పెరుగును 3 రోజులు పులియబెట్టి అర కిలో పసుపు కలిపి.. 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో చెట్లకు పాదుల్లో పోయడం లేదా డ్రిప్ ద్వారా అందిస్తే వేరుకుళ్లు పోతుందన్నారు. అదేమాదిరిగా, బెట్ట పరిస్థితుల్లో ఈ ద్రావణాన్ని చీనీ తదితర ఉద్యాన తోటలపై పిచికారీ చేస్తే.. ఆకులపై తెల్లటి పొర ఏర్పడి.. సూర్యకిరణాలను పరావర్తనం చెందిస్తాయని, ఫలితంగా నీటి ఎద్దడిని తోటలు సమర్థవంతంగా తట్టుకోగలుగుతాయని చెప్పారు. గత ఐదేళ్లుగా తమ ప్రాంతంలో ఉద్యాన తోటల రైతులు పుల్లమజ్జిగ, పసుపు ద్రావణంతో లబ్ధిపొందుతున్నారని రమణారెడ్డి వివరించారు. బంకకు విరుగుడు.. పెరుగు+ పసుపు లేపనం! పండ్ల తోటల మొదళ్లకు బంక కారే సమస్యను కూడా పెరుగులో పసుపు కలిపి పూస్తే చాలు.. బంక మాయమవుతుందని రమణారెడ్డి తెలిపారు. ఎకరానికి 4 లీటర్ల పెరుగులో అర కిలో పసుపును వేసి, బాగా కలిపి చెట్ల మొదళ్లకు పూయాలన్నారు. రసాయనాల లేపనంతో అదుపులోకి రాని బంక సమస్య పెరుగు, పసుపు కలిపి ఒక్కసారి పూస్తే చాలు మళ్లీ కనపడకుండా పోవడం తమ అనుభవమని ఆయన వివరించారు. రమణారెడ్డిని 94409 72504 నంబరులో సంప్రదించవచ్చు.