పెరుగులోని సూక్ష్మజీవులు పోషకాలను స్థిరీకరించగలవా? | Can microbes in yogurt stabilize nutrients? | Sakshi
Sakshi News home page

పెరుగులోని సూక్ష్మజీవులు పోషకాలను స్థిరీకరించగలవా?

Published Tue, Aug 8 2017 12:31 AM | Last Updated on Sun, Sep 17 2017 5:16 PM

పెరుగులోని సూక్ష్మజీవులు పోషకాలను స్థిరీకరించగలవా?

పెరుగులోని సూక్ష్మజీవులు పోషకాలను స్థిరీకరించగలవా?

‘వారెవా.. పులిసిన పెరుగు ద్రావణం’ కథనానికి విశేష స్పందన
నాన్‌బీటీ పత్తిలో ప్రయోగాత్మకంగా వాడుతున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం


‘వారెవా.. పులిసిన పెరుగు ద్రావణం’ శీర్షికన ఆగస్టు 1న ‘సాక్షి సాగుబడి’లో అచ్చయిన కథనం రైతుల్లో అమితాసక్తిని రేకెత్తించింది. ఈ అంశంపై రైతు లోకంలో విస్తృత చర్చ జరుగుతోంది. బిహార్‌లో కొందరు రైతులు 10–15 రోజులు పులియబెట్టిన పెరుగు ద్రావణాన్ని నీటిలో కలిపి పంటలకు ఎరువుగా, తెగుళ్లు, పురుగుల మందుగా సమర్థవంతంగా అనేక ఏళ్లుగా వాడుతున్నారని ఈ కథనం ద్వారా తెలుసుకొని ఆశ్చర్యచకితులయ్యారు. సోషల్‌ మీడియాలో ఈ కథనం హల్‌ చల్‌ చేసింది.

పంటలపై శిలీంధ్రమచ్చలు, తెగుళ్ల నివారణకు 3 రోజులు పులిసిన మజ్జిగను 100 లీటర్ల నీటికి 5 లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి / సేంద్రియ రైతులకు అలవాటున్న సంగతే. అయితే, పెరుగును 10–15 రోజులు పులియబెట్టి పంటలకు పోషకాహారంగానూ, చీడపీడల నివారణకు వినియోగిస్తుండటం ఆశ్చర్యకరం.

ఇలాఉండగా, కొందరు రైతులు పులిసిన పెరుగు ద్రావణం వినియోగంపై పలు సందేహాలు వెలిబుచ్చారు. పులియబెట్టిన పెరుగు ద్రావణాన్ని ఎంత మోతాదులో, ఎన్నాళ్లకోసారి పంటలకు వాడాలని.. రైతులు అడుగుతున్నారు. కొందరు రైతులు తమకు తెలిసిన పద్ధతుల్లో పెరుగు ద్రావణాన్ని బిహార్‌ రైతుల మాదిరిగా ప్రయోగాత్మకంగా వాడి చూస్తామని చెబుతున్నారు. అయితే, ఈ కథనాన్ని ఆంగ్లంలో తొలుత ప్రచురించిన ‘విలేజ్‌ స్క్వేర్‌’ సంస్థను సంప్రదించినప్పటికీ వివరాలు తెలియరాలేదు.

పులిసిన పెరుగు ద్రావణంపై అధ్యయనం: డా. రామాంజనేయులు
పెరుగులో లాక్టో బాసిల్లస్‌ రకం సూక్ష్మజీవులు పుష్కలంగా ఉంటాయని, పులియబెట్టిన పెరుగును నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తే తెగుళ్ల బెడద పోతుందని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌ డా. జీ వీ రామాంజనేయులు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పెరుగులోని బాక్టీరియా, శిలీంధ్రాలతోపాటు ఫాస్ఫరస్‌ ఉంటాయన్నారు.

అయితే, పెరుగులో చురుగ్గా పెరిగే సూక్ష్మజీవరాశి.. పంటలపై పిచికారీ చేసిన తర్వాత, నీటిలో కలిపి భూమిని తడిపిన తర్వాత ఎంతకాలం బతికి ఉండి ప్రభావం చూపుతుందో స్పష్టత లేదన్నారు. హానికారక సూక్ష్మక్రిములను చంపగలిగే లాక్టో బాసిల్లస్‌ సూక్ష్మజీవులు.. పోషకాలను భూమిలో స్థిరీకరించగలవా? అన్నదానిపై కచ్చితమైన సమాచారం కోసం అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.  అయితే, తెగుళ్ల నివారణకు ఇంగువ / పులిసిన మజ్జిగ చల్లిన తర్వాత పంటలు చక్కగా కళకళలాడుతూ ఉంటాయన్నారు.

దీనికి పుల్ల మజ్జిగలోని సూక్ష్మజీవుల వల్ల విడుదలయ్యే ఎంజైములే కారణమై ఉండవచ్చని డా. రామాంజనేయులు తెలిపారు. పులిసిన పెరుగు ద్రావణం వాడకంపై బిహార్‌ రైతుల అనుభవాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సూరజ్‌ నాన్‌ బీటీ పత్తి సేంద్రియ సాగులో పులిసిన పెరుగు ద్రావణాన్ని సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రయోగాత్మకంగా వివిధ మోతాదుల్లో పిచికారీ చేస్తున్నది. త్వరలో ఫలితాలను వెల్లడికానున్నాయి. (ప్రకృతి / సేంద్రియ వ్యవసాయంపై రైతులు తమ సందేహాల నివృత్తి కోసం సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలను 040–27017735 నంబరులో సంప్రదింవచ్చు).

వేరుకుళ్లు నివారణకు పెరుగు+పసుపు ద్రావణం!
బత్తాయి తదితర పండ్ల తోటలు తీవ్రనీటి ఎద్దడికి గురైనప్పుడు, కాపు నిలబెట్టడానికి ముందు ఎక్కువ రోజులు బెట్టకు ఉంచినప్పుడు ఆశించే వేరుకుళ్లు సమస్యను అధిగమించడానికి పుల్లమజ్జిగ, పసుపు ద్రావణం సమర్థవంతంగా పనిచేస్తున్నదని కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు రమణారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. 4 లీటర్ల పెరుగును 3 రోజులు పులియబెట్టి అర  కిలో పసుపు కలిపి.. 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో చెట్లకు పాదుల్లో పోయడం లేదా డ్రిప్‌ ద్వారా అందిస్తే వేరుకుళ్లు పోతుందన్నారు.
 
అదేమాదిరిగా, బెట్ట పరిస్థితుల్లో ఈ ద్రావణాన్ని చీనీ తదితర ఉద్యాన తోటలపై పిచికారీ చేస్తే.. ఆకులపై తెల్లటి పొర ఏర్పడి.. సూర్యకిరణాలను పరావర్తనం చెందిస్తాయని, ఫలితంగా నీటి ఎద్దడిని తోటలు సమర్థవంతంగా తట్టుకోగలుగుతాయని చెప్పారు. గత ఐదేళ్లుగా తమ ప్రాంతంలో ఉద్యాన తోటల రైతులు పుల్లమజ్జిగ, పసుపు ద్రావణంతో లబ్ధిపొందుతున్నారని రమణారెడ్డి వివరించారు.
బంకకు విరుగుడు.. పెరుగు+ పసుపు లేపనం!

పండ్ల తోటల మొదళ్లకు బంక కారే సమస్యను కూడా పెరుగులో పసుపు కలిపి పూస్తే చాలు.. బంక మాయమవుతుందని రమణారెడ్డి తెలిపారు. ఎకరానికి 4 లీటర్ల పెరుగులో అర కిలో పసుపును వేసి, బాగా కలిపి చెట్ల మొదళ్లకు పూయాలన్నారు. రసాయనాల లేపనంతో అదుపులోకి రాని బంక సమస్య పెరుగు, పసుపు కలిపి ఒక్కసారి పూస్తే చాలు మళ్లీ కనపడకుండా పోవడం తమ అనుభవమని ఆయన వివరించారు. రమణారెడ్డిని 94409 72504 నంబరులో సంప్రదించవచ్చు.

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement