నాబార్డు ‘సూక్ష్మ’ రుణం రూ.వెయ్యి కోట్లు
ఉద్యానశాఖపై సీఎస్ రాజీవ్‌శర్మ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉద్యానశాఖ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. అందులో భాగంగా ఇప్పటికే పాలీహౌస్, సూక్ష్మసేద్యం అమలు చేస్తోంది. త్వరలో ఉద్యాన కార్పొరేషన్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. కీలకమైన బిందుసేద్యానికి నాబార్డు నుంచి రూ.1,000 కోట్లు రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఉద్యానశాఖపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజీవ్‌శర్మ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి, ఉద్యాన కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సూక్ష్మ, బిందు సేద్యం పరికరాల కోసం రైతులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారని, నిర్దేశించిన కోటాకు మించి దరఖాస్తులు రావడంతో అవి వేలసంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. డిమాండ్‌కు తగినవిధంగా స్పందించేందుకుగాను నాబార్డు రుణం తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు వ్యవసాయశాఖకు ఉన్నట్లుగానే ప్రతి మండలానికి ఒక ఉద్యాన విస్తరణాధికారి(హెచ్‌ఈవో)ని నియమించాలని సీఎస్ ఆదేశించారు. అయితే ఎన్ని మండలాల్లో విస్తరణాధికారుల అవసరం ఏ మేరకు ఉందో చర్చించి నివేదిక సమర్పించాలని సీఎస్ ఆదేశించినట్లు తెలిసింది. పైస్థాయి కేడర్ పోస్టుల సంఖ్యపైనా కసరత్తు చేస్తున్నారు. గతంలో వెయ్యి ఉద్యాన పోస్టులకు ప్రతిపాదనలు పంపిన ఉద్యానశాఖ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా 500 పోస్టులకు ప్రతిపాదనలు తయారు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అన్ని పోస్టులను కూడా రెండు దశలుగా భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు.