- సీఎస్ ఆధ్వర్యంలో భేటీ.. ప్రతిపాదనల స్వీకరణ
- ఉద్యోగుల ప్రణాళిక తయారీకి సీసీఎల్‌ఏ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఈనెల 20న రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనుంది. సీఎస్ రాజీవ్‌శర్మ, సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా ఆధ్వర్యంలో సచివాలయంలోని సీ బ్లాక్‌లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల సీఎం అధ్యక్షతన జరిగిన రెండు రోజుల కలెక్టర్ల వర్క్‌షాపులో కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు రూట్ మ్యాప్‌ను ప్రకటించారు. ఈ షెడ్యూలులో భాగంగా జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో కొత్త జిల్లాలు, మండలాలకు సంబంధించిన ప్రతిపాదనలను 20లోగా సీసీఎల్‌ఏకు సమర్పించాలి.
ఈ నేపథ్యంలోనే సీఎస్ జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. కొత్త జిల్లాలు, మండలాలకు సంబంధించిన ప్రతిపాదనలు, నమూనాలు, జనాభా, విస్తీర్ణం, మ్యాప్‌లను తీసుకొని ఈ సమావేశానికి హాజరు కావాలని అన్ని జిల్లా కలెక్టర్లకు శుక్రవారం సమాచారం అందించారు. మరోవైపు కొత్త జిల్లాలకు అవసరమైన ఉద్యోగులు, సిబ్బంది వివరాలను పంపించాలని రేమండ్ పీటర్ అన్ని జిల్లా కలెక్టర్లను కోరారు. టెంటటీవ్ డిస్ట్రిక్స్ అలకేటివ్ ప్లాన్(కొత్త జిల్లాలకు ఉద్యోగుల ప్రణాళిక)ను తయారు చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా ప్రతి విభాగం పరిధిలో ఉద్యోగుల(స్టాఫ్ పాటర్న్)ను పంపించాలని కోరారు.
జిల్లా స్థాయి ఉద్యోగులు ఎందరు అవసరం.. డివిజన్ స్థాయి అవసరమెంత.. మండల స్థాయి సిబ్బంది ఎంతమంది కావాలి..? అనే వివరాలన్నీ నిర్దేశించిన నమూనాలో పంపించాలని సూచించారు. ఒక్కో విభాగం వారీగా కేడర్‌ను బట్టి ఆ జిల్లాలకు మంజూరీ చేసిన ఉద్యోగుల సంఖ్య ఎంత..? ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులెందరు..? కొత్తగా ఏర్పడే జిల్లాలో ప్రతిపాదించే ఉద్యోగుల సంఖ్య ఎంత..? అదనంగా మొత్తం ఎంత మంది అవసరం..? ఈ వివరాలను పొందుపరిచేలా పట్టికను సీసీఎల్‌ఏ నమూనాగా అన్ని జిల్లాలకు పంపించింది. ఈ వివరాలన్నింటినీ, సంబంధిత రిమార్కులతో 18వ తేదీలోగా పంపించాలని ఆదేశించింది.
20న కొత్త జిల్లాలపై కలెక్టర్ల సదస్సు
Published Sat, Jun 18 2016 2:54 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement