సాక్షి,శేరిలింగంపల్లి(హైదరాబాద్): ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’అనే దాన్ని నిజం చేస్తోందీ చిన్నారి. ప్రాథమిక విద్యనభ్యసిస్తూనే జిల్లా, రాష్ట్ర స్థాయి దాటి జాతీయస్థాయిలో సత్తా చాటింది. నాలుగేళ్ల వయస్సులోనే చిన్నారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పించారు. ఆ చిన్నారి అద్వితీయ ప్రతిభతో జాతీయ స్థాయిలో జరిగిన అనేక పోటీల్లో పాల్గొని పలు పతాకాలను కైవసం చేసుకొని అప్రతిహతంగా ముందుకు సాగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది చిన్నారి సాయివర్షితా రెడ్డి.
► శేరిలింగంపల్లిలో నివాసముండే కిరణ్‌కుమార్ రెడ్డి, సంతోషి దంపతుల కుమార్తె ఎంచల సాయివర్షిత రెడ్డి. నాలుగేళ్ల వయస్సు నుంచే ఆమెకు స్కేటింగ్‌పై ఉన్న మక్కువను తల్లిదండ్రులు గమనించారు. అనంతరం స్కేట్–9 అకాడమిలో కోచ్ విఠలా ఉప్పలూరి ఆధ్వర్యంలో స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పించారు. మదీనాగూడలోని జెనిసిస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతూనే రాష్ట్ర, జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో పాల్గొంటూ అనేక విజయాలు సొంతం చేసుకొని పలువురి మన్ననలను పొందుతోంది.
సాధించిన పతకాలు
► 2017లో రోలర్ స్కేటింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పథకం
► 2018లో అండర్ 8 విభాగంలో రోలర్ స్కేటింగ్ రాష్ట్ర స్థాయిలో కాంస్య పథకం
► 2019లో అండర్ 9 విభాగంలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నోయిడాలో జరిగిన పోటీల్లో 500, 300 మీటర్ల విభాగాల్లో సిల్వర్ మెడల్స్
► 2019లో సీబీఎస్‌ఈ సౌత్ జోన్ బెల్గాంలో జరిగిన పోటీలో 300 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, 500 మీటర్స్ విభాగంలో సిల్వర్ మెడల్స్ సాధించింది.
► 2019లో ఇందిరాపార్కులో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో మూడు సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకుంది.
► 2020లో ఛంఢీగఢ్‌లో 57వ రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 300 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకొని 500 మీటర్ల విభాగంలో ఫైనల్‌లో పాల్గొంది.
మాకెంతో గర్వకారణం
అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో దేశం తరపున మా అమ్మాయి ప్రాతినిథ్యం వహించాలనేది మాకల. అందుకోసం అవసరమైన శిక్షణ ఇప్పిస్తున్నాం. మా అమ్మాయి సాయివర్షిత స్కేటింగ్‌లో పతకాలు పొందడం ఎంతో సంతోషంగా ఉంది. స్కేట్–9 కోచ్ విఠలా ఆధ్వర్యంలో శిక్షణతో మరింతగా రాణిస్తోంది.
– కిరణ్‌కుమార్ రెడ్డి
దేశానికి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యం
అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలలో దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్నది లక్ష్యం. మా అమ్మానాన్న, కోచ్ విఠలా, టీచర్ల ప్రోత్సాహం ఎంతో ఉంది. మొదట్లో ఎంతో సరదాగా స్కేటింగ్ నేర్చుకున్నా. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడం సంతోషంగా ఉంది.
– సాయివర్షితా రెడ్డి
చదవండి: పెళ్లైన నెలకే మెడ కోసి..
Comments
Please login to add a commentAdd a comment