భీమదేవరపల్లి(హుస్నాబాద్)/కమలాపూర్ : వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్, కమలాపూర్ మండలం ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు(పీహెచ్‌సీ) జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలందిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పీహెచ్‌సీలుగా గుర్తింపు పొందిన ఈ రెండు పీహెచ్‌సీలకు తాజాగా జాతీయ నాణ్యతా ప్రమాణాల హామీ సంస్థ(ఎన్‌క్వాస్)గుర్తింపు లభిం చినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపా యి.
దీంతో ఆయా పీహెచ్‌సీ వైద్యసిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సేవలు రోగులకు సక్రమంగా అందేవి కావు. దీనికి తోడు ప్రభుత్వ ఆస్పత్రి, పీహెచ్‌సీలలో కనీస వసతులు లేకపోవడంతో ప్రభుత్వ దవాఖానా అంటేనే రోగులకు ఒకింత అసహనభావం ఏర్పడేది. కానీ మారుతున్న పరిస్థితులకనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు సైతం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తు ప్రజామన్ననలు పొందుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా జాతీయ స్థాయిలో పీహెచ్‌సీలు గుర్తింపును కైవసం చేసుకోవడంపై స్థానికంగా హర్షం వ్యక్తం అవుతుంది.
ప్రభుత్వ పథకాల అమలు తీరు భేష్..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకంతో పీహెచ్‌సీలు, ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. దీంతో పాటుగా జిల్లాలో ముల్కనూర్, ఉప్పల్ పీహెచ్‌సీలు ‘కాయకల్ప’ అవార్డులు సైతం లభించిన విషయం విధితమే. నెల రోజుల క్రితమే రెండు పీహెచ్‌సీలలో కేంద్ర బృందం తనిఖీ చేసింది. కాగా ఈ రెండు పీహెచ్‌సీలకు జాతీయ స్థాయి గుర్తింపు సర్టిఫికెట్‌తో పాటుగా మూడేళ్ల పాటుగా ఏడాదికి రూ. 3లక్షలు చొప్పున అభివృద్ధి నిధులు మంజూరు కానున్నాయి. కాగా ముల్కనూర్ వైద్యాధికారి కేశవరావు, ఉప్పల్ వైద్యాధికారి రాకేష్‌తో పాటు సిబ్బందిని జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment