సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో మళ్లీ ఎన్నికల సందడి నెల కొననుంది. మూడు నెలలుగా జోరుగా సాగిన మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల సందడి ఇటీవలే సద్దుమణిగింది. జిల్లాలో మాత్రం మళ్లీ ఎన్నికల వేడి రాజుకోనుంది. ఏడాదిగా ఖాళీ ఉన్న స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవికి ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వివరాలు పంపాలని జిల్లాలోని ఎన్నికల విభాగం అధికారులకు ఆదేశాలు అందాయి.
ఈ మేరకు ఇప్పటికే స్థానిక సంస్థ ఎమ్మెల్సీని ఎన్నుకోనున్న ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘానికి పంపారు. తాజాగా ఈ స్థానిక ప్రజాప్రతినిధుల ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసి మూడేళ్లయినా వాటికి ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఈ ఎమ్మెల్సీ పదవి ఏడాదిగా ఖాళీగా ఉంటోంది.
ఎట్టకేలకు వీటికి ఎన్నికలు జరగడం.. గురువారం నుంచి శనివారం వరకు వరుసగా మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలక మండళ్లపాలక వర్గం కొలువుదీరడం.. ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రజాప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఇటీవలే ప్రమాణ స్వీకారం చేయడం ముగిసింది. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్లెవరో తేలిపోవడంతో ఎన్నికల సంఘం ఖాళీగా ఉన్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి సారించింది.
జిల్లాలోని స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ పదవికి చివరిసారిగా 2007 ఏప్రిల్‌లో ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.ప్రేంసాగర్‌రావు టీఆర్‌ఎస్, బీజేపీ తదితర పార్టీల మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. లాటరీలో ఆయనకు ఆరేళ్ల పదవీ కాలం వచ్చింది. 2013 మేలో ఈ పదవీకాలం ముగిసింది. అయితే స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో ఏడాది కాలంగా ఈ పదవి ఖాళీగా ఉంటోంది. ఇప్పుడు అన్ని స్థానిక సంస్థలకు పాలకవర్గాలు కొలువుదీరడంతో ఈ ఎన్నికకు మార్గం సుగమమైంది.
ఇదీ టీఆర్‌ఎస్ ఖాతాలోకే..
జిల్లాలో 877 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్లుగా ఉంటారు. ఇందులో 52 మంది జెడ్పీటీసీలు, 636 మంది ఎంపీటీసీలు కాగా, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 189 మంది కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. వరుస ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌కే అత్యధిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీ, కౌన్సిలర్ స్థానాలు దక్కడంతో ఈ ఎమ్మెల్సీ పదవి టీఆర్‌ఎస్ ఖాతాలోనే పడటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ పదవి కోసం ఆ పార్టీ నేతలు ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు.
ఇప్పటికే ఈ పదవి కోసం నలుగురు ముఖ్యనేతల పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ.. ఈ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత బరిలో ఉండేది ఎవరో తేలనుంది. కాగా ‘స్థానిక’ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు రూ.లక్షలు ఖర్చు చేశారు. దీంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికపై స్థానిక ప్రజాప్రతినిధులు ‘ఎన్నో’ ఆశలు పెట్టుకున్నారు.
మళ్లీ ఎన్నికల సందడి
Published Wed, Jul 9 2014 1:26 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement