కరోనాతో మరో టీఆర్‌ఎస్‌ నేత‌ మృతి | Adilabad ZP Vice Chairman Deceased With Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనాతో ఆదిలాబాద్‌ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మృతి

Sep 8 2020 9:23 AM | Updated on Sep 8 2020 9:25 AM

Adilabad ZP Vice Chairman Deceased With Coronavirus - Sakshi

ఆరె రాజన్న (ఫైల్‌) 

సాక్షి, ఆదిలాబాద్‌: కరోనాతో ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్న(56) ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. గత నెల చివరి వారంలో రాజన్నకు కోవిడ్‌ నిర్ధారణ కావడంతో కొన్ని రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉన్న ఆయనను ఆదిలాబాద్‌ పట్టణంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. పది రోజులపాటు వైద్యానికి స్పందించిన ఆయన శరీరం గత రెండు రోజులుగా సహకరించలేదు.

స్వగ్రామంలో అంత్యక్రియలు..
ఆదిలాబాద్‌రూరల్‌ మండలంలోని చాందా(టి) గ్రామం రాజన్న స్వస్థలం. ఈయన గతంలో ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌రూరల్‌ జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈయన మృతిపై జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజన్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు. పలువురు నాయకులు బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. సోమవారం చాందా(టి)లో అంత్యక్రియలు నిర్వహించగా.. అదనపు కలెక్టర్‌ డేవిడ్,   జెడ్పీ సీఈవో కిషన్, కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, ఆదిలాబాద్‌ ఎంపీపీ సెవ్వ లక్ష్మీ, వైస్‌ ఎంపీపీ గండ్రత్‌ రమేశ్, మెట్టు ప్రహ్లాద్, పార్టీ నేతలు పాల్గొన్నారు.కుటుంబ సభ్యులు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

ఆర్టీసీ కండక్టర్‌ నుంచి జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వరకు..
ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వర్తించిన రాజన్న రాజకీయాల్లోకి ప్రవేశించి తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిçష్కరించేలా చొరవ చూపేవారని పలువురు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement