సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్‌లో నడుస్తున్న నాటకీయ పరిణామాలకు మంత్రి మహేందర్‌రెడ్డి దిగొ చ్చారు. జెడ్పీటీసీల డిమాండ్లను పరిశీలిస్తానని.. సీఎం వద్దకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అలకపాన్పు ఎక్కిన సభ్యులను బుజ్జ గించి.. ఇకపై మూడు నెలలకోసారి భేటీ అవుదామని నచ్చజెప్పి కథను సుఖాంతం చేసే ప్రయత్నం చేశారు. స్థానికసంస్థలకు రావాల్సి న సీనరేజీ, నిధులను ప్రభుత్వం దారి మళ్లించినా, నిధుల్లేక ప్రజలు నిలదీస్తున్నా పట్టించుకోవడం లేదని కినుక వహించిన అధికార పార్టీ జెడ్పీటీసీలతో ఆయన సోమవారం జెడ్పీలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో కొందరు సభ్యులు రాజీనామాలు చేస్తామని హెచ్చరించినట్లు పత్రికల్లో కథనాలు రావడంపై వాడివేడి చర్చ జరిగింది. కేవలం సమస్యలపైనే చర్చించామని, ఎవరిని తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయలేదనే అంశంపై సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ‘మా తీరు పూచిక పుల్లలా తయారైంది. నిధుల్లేవు. కనీసం మీతో బాధలు చెప్పుకుందామంటే సమయం ఇవ్వరు. మా ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదు. మేం జనాల్లోకి ఎలా వెళ్లాలి’ అని కొందరు సభ్యులు మంత్రికి ఏకరువు పెట్టారు. దీంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది.
మంత్రికి అనుకూలంగా కొందరు.. వ్యతిరేకంగా మరికొందరు సభ్యులు చీలిపోయారు. జిల్లా పరిషత్ వ్యవహారాలతో మంత్రికేం సంబంధం అంటూ తాండూరు జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్ ప్రశ్నించడం.. ఆయనకు వ్యతిరేకంగా రాజేంద్రనగర్, చేవెళ్ల, కీసర జెడ్పీటీసీ సబ్యులు గళం విప్పడంతో సమావేశం కాస్తా హాట్‌హాట్‌గా మారింది. తీవ్రస్వరంతో ఒకరిపై ఒకరు అరుచుకోవడం.. సమావేశం నుంచి వాకౌట్ చేద్దామనే ఆలోచన కూడా చేశారు.
ఈ దశలో జోక్యం చేసుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి మీటింగ్ పక్కదారి పడుతున్నట్లు గమనించి ఇరువర్గాలను శాంతింపజేశారు. కుటుంబంలాంటి పార్టీలో అభిప్రాయ బేధాలుండడం సహాజమేనని, కూర్చొని మాట్లాడుకుందాం అంటూ సముదాయించారు. కొందరు సభ్యుల వ్యవహారశైలిని మాత్రం మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. చీటికిమాటికి రాజీనామాలు చేస్తామని హెచ్చరించడం బాగాలేదని, సమస్యలుంటే చెప్పుకోవాలి గానీ, ఇలా బెదిరింపులకు పాల్పడడం మంచిదికాదని హితవు పలికారు.
ఎమ్మెల్యేలతో మాట్లాడుతా..
‘‘కొన్నిచోట్ల ఎమ్మెల్యేలతో జెడ్పీటీసీ సభ్యులకు పొసగడంలేదు. ఎమ్మెల్యేలతో కలిసి సాగేలా సమన్వయం పెంపొందిస్తా. తాజా పరిణామాలను వారి దృష్టికి తీసుకెళతా. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి మీతో భేటీ అవుతానని, ఎమ్మెల్యేల కోటాలో 25శాతం నిధులను మీ ద్వారా ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి మహేందర్ భరోసా ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తమకెలాంటి అసంతృప్తిలేదని, నిధుల గురించి చర్చించడానికి కలిస్తే.. రాజీనామా చేస్తామని పత్రికల్లో వార్తలు రావడం దురదృష్టకరమని అన్నారు. ఈ సమవేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫలించిన మంత్రాంగం!
Published Tue, Mar 14 2017 10:55 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement