దాదాపు మూడున్నరేళ్ల తర్వాత జిల్లా పరిషత్ పాలక మండలి శుక్రవారం భేటీ కానుంది. ఎన్నికల జాప్యంతో మూడేళ్లపాటు పాలకమండలి లేకపోవడంతో జిల్లా పరిషత్ ప్రత్యేక పాలనలో సాగింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దాదాపు మూడున్నరేళ్ల తర్వాత జిల్లా పరిషత్ పాలక మండలి శుక్రవారం భేటీ కానుంది. ఎన్నికల జాప్యంతో మూడేళ్లపాటు పాలకమండలి లేకపోవడంతో జిల్లా పరిషత్ ప్రత్యేక పాలనలో సాగింది. తాజాగా పాలకవర్గం ఏర్పాటైన తర్వాత శుక్రవారం తొలిసారిగా సమావేశం కానుంది. పాలకవర్గం ఎన్నికైన అనంతరం మన ఊరు-మన ప్రణాళిక నేపథ్యంలో ఓసారి సమావేశం జరిగినప్పటికీ.. స్థాయి సంఘాల ఏర్పాటు, వాటి సమావేశాల తర్వాత జరుగుతున్న భేటీ కానుండడంతో సమావేశానికి ప్రాముఖ్యత సంతరించుకుంది.
దరఖాస్తులు.. విద్యుత్ సమస్య
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11గంటలకు చైర్‌పర్సన్ సునీతారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు కలెక్టర్ ఎన్.శ్రీధర్, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సమావేశంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం జిల్లా రైతాంగం విద్యుత్ సమస్యనెదుర్కొంటోంది. ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తు అంశంపైనా వాడీవేడి చర్చ జరగనుంది.
దరఖాస్తు ప్రక్రియలో గ్రామాల్లో గంటల తరబడి వేచిచూడాల్సి రావడం.. దరఖాస్తు పత్రం తీసుకునే అంశంలో అధికారుల వైఖరి తదితర అంశాలు స్థానిక ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరంగా మారాయి. ఈ సమస్యలను తాజా సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ప్రస్తావించనున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్లు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. మరోవైపు నిధులు మంజూరైనా అధికారుల నిర్లక్ష్య వైఖరితో వాటి పనులు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఈ అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ముంది. కొత్త పాలకవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కొత్తవారే కావడంతో జెడ్పీలో సమావేశంలో దాదాపు అందరూ కూడా తమ ప్రాంత సమస్యలపై గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.