సాక్షి, ఒంగోలు సిటీ: ఫోకల్ సీట్లంటే దండిగా డబ్బులొచ్చేవి. పై అధికారుల పలుకుబడి సంపాయించి పెట్టేవి. నాన్ ఫోకల్ సీట్లంటే ఎడతెరిపి లేకుండా.. మెండుగా పని ఉండేవి. క్షణం తీరిక లేకుండా దమ్మిడి ఆదాయం లేకుండా ఉండేవి. సహజంగా ఉద్యోగులు వీటిలో మొదటి సీటుకే ఓటు వేస్తారు. దీంతో ఫోకల్ సీట్లకు గిరాకీ బాగా పెరిగింది. జిల్లా పరిషత్తు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల్లో బదిలీల జాతర మొదలయినప్పటి నుంచి బలవంతుల గురి ఫోకల్ సీట్లపైనే. ఈ సీజన్‌లో మోతాదు మరికాస్త రెట్టించింది. ఎక్కువ మంది ఫోకల్ సీట్లలో ఉండేందుకే ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. దీంతో జిల్లా పరిషత్తు పరిధిలోని ఇంజినీరింగ్ విభాగాల్లో బదిలీల జాతర జరుగుతోంది.
జిల్లా పరిషత్తు, జిల్లా పరిషత్తు పరిధిలోని పాఠశాలలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లో బదిలీలకు దరఖాస్తుల గడువు ముగిసింది. అన్ని కేడర్లలో కలిపి 520 దరఖాస్తులు వచ్చాయి. తొలుత ఈ నెల 5వ తేదీ నాటికి బదిలీ ప్రక్రియ పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం పొడిగించడంతో ఈ నెల10వ తేదీలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలి. జెడ్పీ చైర్మన్ వ్యవస్థ ఉంటే వారి కనుసన్నల్లో బదిలీలు జరిగేవి. ఈ నెల 4వ తేదీతో చైర్మన్ల వ్యవస్థ రద్దయింది. జెడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పోలా భాస్కర్, జిల్లా పరిషత్తు ముఖ్యకార్యనిర్వహణాధికారిగా జాయింట్ కలెక్టర్ సగిలి షన్మోహన్ బాధ్యతలను స్వీకరించారు.
బదిలీల వంతు వీరి పర్యవేక్షణకు వచ్చింది. గతంలో జెడ్పీ పరిధిలోని ఉద్యోగులు, పీఆర్ ఇంజినీరింగ్ శాఖల్లోని ఉద్యోగులు బదిలీల వ్యవహారంలో బలాబలాలు చూపించేవారు. పెద్ద ఎత్తున సిఫార్సులు తెచ్చే వారు. గత ప్రభుత్వ హయాంలో మంచి ఫోకల్ సీట్లలో పని చేసిన వారు, గత ఐదేళ్లుగా ఫోకల్‌లోనే ఉన్న వారు తిరిగి ఈ ప్రభుత్వంలోనూ ఫోకల్ సీట్లను ఆశిస్తున్నారు. గట్టిగా పోటీ పడుతున్నారు. మరీ గట్టిగా సిఫార్సులు చేయిస్తున్నారు. దీంతో రాజకీయం అంతా ఫోకల్ సీట్ల చుట్టూనే గిరాగిరా మంటోంది.
వీరెక్కడికి పోరట..!
జిల్లా పరిషత్తు పరిధిలోని వివిధ విభాగాలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలోని పీఐయూ, క్వాలిటి కంట్రోల్ ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో బదిలీకి సీట్లు కోరుకుంటున్నారు. గతంలో ఇక్కడే పని చేసిన వారు తిరిగి ఇక్కడే ఉండేందుకు సిఫార్సులు పొందుతున్నారు. నిబంధనల మేరకు ఇప్పటి వరకు ఫోకల్ సీట్లలో పని చేసిన వారిని నాన్ ఫోకల్ సీట్లకు బదిలీ చేయాలి. జిల్లా పరిషత్తు పాఠశాలలు ఇతర విభాగాలకు అంతగా ప్రాధాన్యం లేని సీట్లకు వీరిని బదిలీ చేయాలి.
జెడ్పీలో వివిధ కేడర్లలో ఖాళీలు ఉన్నందున అర్హత అంతగా లేని వారిని కూడా అందలమెక్కిస్తున్నారు. కీలకమైన సీట్లలో రాజసం వెలగబెడుతున్నారు. వీరిని ఇక్కడి నుంచి బదిలీ చేయడానికి తగిన నిబంధనలు ఉన్నా నిబంధనలను పక్కన పెట్టండి. ఫోకల్ సీట్లకు బదిలీ చేయండని అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఏళ్ల నుంచి పాతుకుపోయిన వీరు తిరిగి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లరట.. అని జెడ్పీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి.
పెరుగుతున్న పోటీ..
బదిలీ ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో పూర్తి చేయాలి. బదిలీ పరిధిలో 520 మంది వివిధ హోదాల్లోని వారు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 260 మంది వరకు ఫోకల్ సీట్లే కావాలని పట్టుబడుతున్నట్లుగా సమాచారం. వీరు నేతల ద్వారా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకరి చూసి మరొకరు పోటీ పడుతున్నారు. బదిలీ నిబంధనలతో పని లేదంటున్నారు. అడిగిన సీట్లకు బదిలీ చేయమంటున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు కొందరి వ్యవహారాలు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయని సమాచారం.
గతంలో జరిగిన బదిలీల్లో నిబంధనలు అమలయినా లేకపోయినా నడిచిందంటున్నారు. ఇప్పుడలా కాదు.. జిల్లా అధికారులైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఉద్యోగుల బదిలీలను చూస్తున్నారు. నియమాలు, నిబంధనలు కచ్చితంగా పాటిస్తారని సిఫార్సులు తెచ్చుకోలేని వారు న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులపై బదిలీల వ్యవహారంలో విపరీతమైన ఒత్తిడి కొనసాగుతోంది.
ఎక్కువ మంది కోరుతుంది ఇక్కడికే..
ఎక్కువ మంది పీఆర్ ఇంజినీరింగ్ విభాగంలో ఉండేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరాలో ఉన్న వారు అక్కడికే మరో సబ్ డివిజన్, డివిజన్‌కు కోరుకుంటున్నారు. పంచాయతీరాజ్‌లో ఉన్న వారు క్వాలిటీ కంట్రోలు విభాగం, పంచాయతీరాజ్ ప్రాజెక్టు యూనిట్ ఇంజినీరింగ్ విభాగాల్లోనే కొన్ని విభాగాల్లో సీట్లకు కోరుకుంటున్నారు. మండలాల్లోని ఫోకల్ సీట్లకు కూడా ఇదే తరహాలో ఒత్తిడి పెరుగుతోంది. నాన్ ఫోకల్ సీట్లకు పోటీ లేకుండా పోయింది. ఒకే కేంద్రంలో ఐదేళ్లు నిండిన వారు సైతం ఫోకల్ సీట్లకు పోటీ పడుతున్నారు. జెడ్పీ రాజకీయం మొత్తం ఫోకల్ సీట్లపైనే తిరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment