Focal postings
-
TSSPDCL: ఒత్తిళ్లకు తలొగ్గి.. వివాదంలో ఇంజినీర్ల బదిలీలు
సాక్షి, సిటీబ్యరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో ఇంజినీర్ల బదిలీల అంశం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఫోకల్ పోస్టులో పనిచేస్తున్న వారిని నాన్ ఫోకల్‌కు కాకుండా మళ్లీ అదే ఫోకల్ పోస్టులకు బదిలీ చేయడమే ఇందుకు కారణం. అంతేకాదు ఏడు నెలల క్రితం ఏఈ నుంచి ఏడీఈగా పదోన్నతి పొంది.. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు స్వీకరించకుండా విధులకు దూరంగా ఉంటున్న ముగ్గురు ఇంజినీర్లకు కీలక ఫోకల్ పోస్టుల్లో ఏడీఈలుగా అధికారాలు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పరిపాలనలో పారదర్శకత కోసం ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రతి మూడేళ్లకోసారి ఒక చోట నుంచి మరో చోటికి బదిలీ చేస్తుంటారు. ఇందులో భాగంగా డిస్కం పరిధిలో 65 మంది సీనియర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు సహా 304 మంది ఏఈలు, 135 మంది ఏడీఈలు, 65 మంది డీఈలను బదిలీ చేసింది. ఆ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ బదిలీల్లో అనేక అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్ల పాటు ఫోకల్ (ఆపరేషన్ విభాగం)పోస్టులో పని చేసిన వారికి ఆ తర్వాత నాన్‌ఫోకల్ పోస్టులో పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. కానీ.. నేతలు, ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గిన యాజవన్యం ఒక్క గ్రేటర్‌లోనే 15 మంది డీఈలకు ఫోకల్ టు ఫోకల్ పోస్టులను కట్టబెట్టిందని తెలుస్తోంది. ఫోకల్ పోస్టుల కోసం పోటాపోటీ.. సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో ఫోకల్, నాన్ ఫోకల్ అంటూ ప్రత్యేక విభాగాలు అంటూ ఏమీ ఉండవు. కానీ విద్యుత్ శాఖలో కొత్త కనెక్షన్లు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భారీ భవన నిర్మాణాలు, సంస్థకు రెవిన్యూ ఎక్కువగా (ఆపరేషన్ విభాగం)వచ్చే ప్రాంతాలను ఫోకల్ పోస్టులుగా, నష్టాలు ఎక్కువగా ఉండే పాతబస్తీ సహా మారుమూల జిల్లాలను నాన్ ఫోకల్ పోస్టులుగా విభజించారు. గ్రేటర్ పరిధిలో తొమ్మిది సర్కిళ్లు, 22 డివిజన్లు ఉన్నాయి. వీటిలో శివారు ప్రాంతాల్లోని కొండాపూర్, గచ్చిబౌలి, మేడ్చల్, రాజేంద్రనగర్, చంపాపేట్, సరర్నగర్, హబ్సిగూడ, కూకట్పల్లి, సైబర్‌సిటీ, బంజారాహిల్స్, జీడిమెట్ల, శంషాబాద్, కీసర సహా శివారు ప్రాంతాల్లో సిటీకి ఆనుకుని ఉన్న చౌటుప్పల్, యాదాద్రి, షాద్‌నగర్ డివిజన్లను ఫోకల్ పోస్టులు భావిస్తారు. పాతబస్తీ సహా మారుమూల జిల్లాల్లోని డివిజన్లను నాన్‌ఫోకల్‌గా విభజించారు. వీటిలో కొత్తగా అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లు, బహుళ అంతస్తుల భవనాలు, ఐటీ అనుబంధ కంపెనీలు, పరిశ్రమలు, ఇతర పెట్టుబడి సంస్థలే కాదు కొత్త విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్లు ఎక్కువ. ఇవి ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్న ఇంజినీర్ల పాలిట కామధేనువుల్లా మారుతున్నాయి. పదోన్నతులు పొందినా విధుల్లో చేరని వైనం సంస్థ పరిధిలో పని చేస్తున్న పలువురు ఏఈలకు ఇటీవల సీనియార్టీ ప్రతిపాదికన పదోన్నతులు కల్పింంది. ఈ మేరకు జనవరి 10వ తేదీన 153 మంది ఏ ఈలకు ఏడీఈలుగా పదోన్నతి కల్పించడంతో పాటు పోస్టింగ్‌లు కూడా ఇ్చంది. 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ వారెవర కొత్త పోస్టుల్లో చేరలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఏడీఈగా బాధ్యతలు స్వీకరించని ముగ్గురు ఇంజనీర్లకు యాజవన్యం ప్రస్తుత బదిలీల్లో కీలకమైన ఫోకల్ పోస్టులను కట్టబెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై డిస్కం మానవ వనరుల విభాగం(హెచ్ఆర్) డైరెక్టర్ పర్వతంను వివరణ కోరగా..అంతా పారదర్శకంగానే జరిగినట్లు చెప్పడం విశేషం. ఉద్యోగుల బదిలీల్లో ఎలాంటి అక్రమాలు, అవినీతి చోటు చేసుకోలేదని, సీనియార్టీ ఆధారంగానే బదిలీల ప్రక్రియను పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. చదవండి: అమ్మాయివి నీకెందుకమ్మా? నన్ను చూసి నవ్వుకున్నారు.. -
వదల బొమ్మాళీ..!
సాక్షి, ఒంగోలు సిటీ: ఫోకల్ సీట్లంటే దండిగా డబ్బులొచ్చేవి. పై అధికారుల పలుకుబడి సంపాయించి పెట్టేవి. నాన్ ఫోకల్ సీట్లంటే ఎడతెరిపి లేకుండా.. మెండుగా పని ఉండేవి. క్షణం తీరిక లేకుండా దమ్మిడి ఆదాయం లేకుండా ఉండేవి. సహజంగా ఉద్యోగులు వీటిలో మొదటి సీటుకే ఓటు వేస్తారు. దీంతో ఫోకల్ సీట్లకు గిరాకీ బాగా పెరిగింది. జిల్లా పరిషత్తు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల్లో బదిలీల జాతర మొదలయినప్పటి నుంచి బలవంతుల గురి ఫోకల్ సీట్లపైనే. ఈ సీజన్లో మోతాదు మరికాస్త రెట్టించింది. ఎక్కువ మంది ఫోకల్ సీట్లలో ఉండేందుకే ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. దీంతో జిల్లా పరిషత్తు పరిధిలోని ఇంజినీరింగ్ విభాగాల్లో బదిలీల జాతర జరుగుతోంది. జిల్లా పరిషత్తు, జిల్లా పరిషత్తు పరిధిలోని పాఠశాలలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లో బదిలీలకు దరఖాస్తుల గడువు ముగిసింది. అన్ని కేడర్లలో కలిపి 520 దరఖాస్తులు వచ్చాయి. తొలుత ఈ నెల 5వ తేదీ నాటికి బదిలీ ప్రక్రియ పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం పొడిగించడంతో ఈ నెల10వ తేదీలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలి. జెడ్పీ చైర్మన్ వ్యవస్థ ఉంటే వారి కనుసన్నల్లో బదిలీలు జరిగేవి. ఈ నెల 4వ తేదీతో చైర్మన్ల వ్యవస్థ రద్దయింది. జెడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పోలా భాస్కర్, జిల్లా పరిషత్తు ముఖ్యకార్యనిర్వహణాధికారిగా జాయింట్ కలెక్టర్ సగిలి షన్మోహన్ బాధ్యతలను స్వీకరించారు. బదిలీల వంతు వీరి పర్యవేక్షణకు వచ్చింది. గతంలో జెడ్పీ పరిధిలోని ఉద్యోగులు, పీఆర్ ఇంజినీరింగ్ శాఖల్లోని ఉద్యోగులు బదిలీల వ్యవహారంలో బలాబలాలు చూపించేవారు. పెద్ద ఎత్తున సిఫార్సులు తెచ్చే వారు. గత ప్రభుత్వ హయాంలో మంచి ఫోకల్ సీట్లలో పని చేసిన వారు, గత ఐదేళ్లుగా ఫోకల్లోనే ఉన్న వారు తిరిగి ఈ ప్రభుత్వంలోనూ ఫోకల్ సీట్లను ఆశిస్తున్నారు. గట్టిగా పోటీ పడుతున్నారు. మరీ గట్టిగా సిఫార్సులు చేయిస్తున్నారు. దీంతో రాజకీయం అంతా ఫోకల్ సీట్ల చుట్టూనే గిరాగిరా మంటోంది. వీరెక్కడికి పోరట..! జిల్లా పరిషత్తు పరిధిలోని వివిధ విభాగాలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలోని పీఐయూ, క్వాలిటి కంట్రోల్ ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో బదిలీకి సీట్లు కోరుకుంటున్నారు. గతంలో ఇక్కడే పని చేసిన వారు తిరిగి ఇక్కడే ఉండేందుకు సిఫార్సులు పొందుతున్నారు. నిబంధనల మేరకు ఇప్పటి వరకు ఫోకల్ సీట్లలో పని చేసిన వారిని నాన్ ఫోకల్ సీట్లకు బదిలీ చేయాలి. జిల్లా పరిషత్తు పాఠశాలలు ఇతర విభాగాలకు అంతగా ప్రాధాన్యం లేని సీట్లకు వీరిని బదిలీ చేయాలి. జెడ్పీలో వివిధ కేడర్లలో ఖాళీలు ఉన్నందున అర్హత అంతగా లేని వారిని కూడా అందలమెక్కిస్తున్నారు. కీలకమైన సీట్లలో రాజసం వెలగబెడుతున్నారు. వీరిని ఇక్కడి నుంచి బదిలీ చేయడానికి తగిన నిబంధనలు ఉన్నా నిబంధనలను పక్కన పెట్టండి. ఫోకల్ సీట్లకు బదిలీ చేయండని అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఏళ్ల నుంచి పాతుకుపోయిన వీరు తిరిగి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లరట.. అని జెడ్పీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. పెరుగుతున్న పోటీ.. బదిలీ ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో పూర్తి చేయాలి. బదిలీ పరిధిలో 520 మంది వివిధ హోదాల్లోని వారు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 260 మంది వరకు ఫోకల్ సీట్లే కావాలని పట్టుబడుతున్నట్లుగా సమాచారం. వీరు నేతల ద్వారా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకరి చూసి మరొకరు పోటీ పడుతున్నారు. బదిలీ నిబంధనలతో పని లేదంటున్నారు. అడిగిన సీట్లకు బదిలీ చేయమంటున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు కొందరి వ్యవహారాలు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయని సమాచారం. గతంలో జరిగిన బదిలీల్లో నిబంధనలు అమలయినా లేకపోయినా నడిచిందంటున్నారు. ఇప్పుడలా కాదు.. జిల్లా అధికారులైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఉద్యోగుల బదిలీలను చూస్తున్నారు. నియమాలు, నిబంధనలు కచ్చితంగా పాటిస్తారని సిఫార్సులు తెచ్చుకోలేని వారు న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులపై బదిలీల వ్యవహారంలో విపరీతమైన ఒత్తిడి కొనసాగుతోంది. ఎక్కువ మంది కోరుతుంది ఇక్కడికే.. ఎక్కువ మంది పీఆర్ ఇంజినీరింగ్ విభాగంలో ఉండేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరాలో ఉన్న వారు అక్కడికే మరో సబ్ డివిజన్, డివిజన్‌కు కోరుకుంటున్నారు. పంచాయతీరాజ్‌లో ఉన్న వారు క్వాలిటీ కంట్రోలు విభాగం, పంచాయతీరాజ్ ప్రాజెక్టు యూనిట్ ఇంజినీరింగ్ విభాగాల్లోనే కొన్ని విభాగాల్లో సీట్లకు కోరుకుంటున్నారు. మండలాల్లోని ఫోకల్ సీట్లకు కూడా ఇదే తరహాలో ఒత్తిడి పెరుగుతోంది. నాన్ ఫోకల్ సీట్లకు పోటీ లేకుండా పోయింది. ఒకే కేంద్రంలో ఐదేళ్లు నిండిన వారు సైతం ఫోకల్ సీట్లకు పోటీ పడుతున్నారు. జెడ్పీ రాజకీయం మొత్తం ఫోకల్ సీట్లపైనే తిరుగుతోంది. -
ఫోకల్ పోస్టింగ్‌ల్లో మార్పులు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో భారీగా తహశీల్దార్ల బదిలీలు జరగనున్నాయి. ఈ నెల 26వ తేదీన గణతంత్ర సంబరాలు ముగిసిన తర్వాత తహశీల్దార్ల బదిలీలు కావచ్చని సమాచారం. ప్రధానంగా గతంలో భారీగా డబ్బులిచ్చినప్పటికీ ఫోకల్ పోస్టింగ్ (మంచి పోస్టింగ్) దక్కని తహశీల్దార్లు కోరిన చోట పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో కల్లూరు మండల పోస్టు కోసం వైఎస్సార్ జిల్లా నుంచి బదిలీపై జిల్లాకు వచ్చిన ఓ తహశీల్దార్ ఏకంగా రూ. 10 లక్షలు ఇచ్చారు. అయితే, చివరకు ఆయన పేరు.. ప్రస్తుతం ఉన్న తహశీల్దార్ పేరు ఒకటే కావడంతో ఆయన్ను ఆలూరు నియోజకవర్గ మండలానికి బదిలీ చేశారు. రూ.పది లక్షలు ఇచ్చినా తనకు మంచి పోస్టింగ్ రాదా అని ఆయన ప్రతి రోజూ అధికార పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో త్వరలో జరగబోయే బదిలీల్లో ఆయన కల్లూరు మండలానికి వస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాకుండా ముఖ్యమైన ఫోకల్ పోస్టింగులైన కర్నూలు, డోన్, ఓర్వకల్లు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని తహశీల్దార్లు కూడా మారనున్నారనే ప్రచారమూ ఇప్పటికే కలెక్టరేట్లో జోరుగా సాగుతోంది. దీంతో నచ్చిన పోస్టింగు కోసం అధికార పార్టీ నేతల చుట్టూ సూట్‌కేసులు పట్టుకుని పలువురు తహశీల్దార్లు తిరుగుతున్నారు. కర్నూలు ఆర్డీవోగా తిప్పేనాయక్! కర్నూలు ఆర్డీవో రఘుబాబు కూడా బదిలీ కానున్నారనే ప్రచారమూ జరుగుతోంది. ఈ స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా నెట్టెంపాడు ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న తిప్పేనాయక్ వస్తున్నారని జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే జరగాల్సిన ‘ప్రక్రియ’ మొత్తం పూర్తయిందన్న అభిప్రాయమూ ఉంది. మొత్తం మీద జిల్లాలో మరోసారి భారీగా తహశీల్దార్ల బదిలీలు జరగనున్నాయి. ‘గతంలో ఉన్న జాయింట్ కలెక్టర్ హయాంలో ఒక వెలుగు వెలిగిన తహశీల్దార్లు ఎవ్వరూ కూడా ఫోకల్ పోస్టుల్లో ఉండకూడదని ప్రస్తుత జాయింట్ కలెక్టర్ యోచిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన పలువురు తహశీల్దార్లు భారీగా డబ్బులు ముట్టజెప్పి ఫోకల్ పోస్టులలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు’ అని కలెక్టరేట్లోని ఓ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచండి: ఎస్పీ కర్నూలు : పాత నేరస్థుల కదలికలైపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ ఆకే రవికృష్ణ సబ్ డివిజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక కార్యాలయంలో సబ్ డివిజన్ అధికారులతో ఎస్పీ శుక్రవారం సమావేశమయ్యారు. కర్నూలులో జరుగుతున్న దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు, ఆటోడ్రైవర్ల ముసుగులో మహిళలపై జరిగే అఘాయిత్యాలు, నే రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, వి.వి.నాయుడు, మురళీధర్, వినోద్‌కుమార్, హుసేన్‌పీరా పాల్గొన్నారు.