‘ప్రణాళిక’ పైనే దృష్టి
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ పాలకవర్గం ఏర్పాటైన అనంతరం గురువారం తొలిసారిగా సర్వసభ్య సమావేశం జరగబోతోంది. చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి మంత్రి పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరు కానున్నారు. దాదాపు వీరందరికీ ఇదే ప్రథమ సమావేశం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయాలని భావిస్తూ ప్రత్యేక ప్రణాళికలకు కార్యరూపం ఇస్తోంది. ఇందులో భాగంగా గ్రామ, మండల స్థాయి ప్రణాళికలు రూపొం దించిన యంత్రాంగం.. తాజాగా జిల్లా స్థాయి ప్రణాళికను తయారు చేసింది. గురువారం జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఈ ప్రణాళికకు ఆమోదం తెలుపనున్నారు.
రూ.1372 కోట్లతో ప్రణాళిక
ప్రభుత్వం చేపట్టిన మన ఊరు- మన ప్రణాళికలో భాగంగా ప్పటివరకు రూపొందించిన గ్రామ ప్రణాళికలను క్రోడీకరిస్తూ మండలస్థాయి ప్రణాళికలను తయారు చేశారు. వీటి ఆధారంగా తాజాగా జిల్లాస్థాయిలో ప్రణాళికను తయారు చేశారు. రూ.1372 కోట్లతో రూపొందించిన ఈ ప్రణాళికలో జిల్లాలోని 33 మండలాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో గ్రామస్థాయిలో అత్యంత ప్రాధాన్యమైన మూడు పనులు, అదేవిధంగా మండల స్థాయిలో ప్రాధాన్యమైన 10 పనులను పేర్కొంటూ ఈ ప్రణాళికను తయారు చేశారు.
రూ.40 కోట్లతో జెడ్పీ ప్రణాళిక
గ్రామ, మండల స్థాయిలో తయారు చేసిన ప్రణాళిక నమూనాలో జిల్లా పరిషత్ కూడా ప్రాధాన్యత పనులు పేర్కొంటూ ప్రణాళిక రూపొందిం చింది. ఇందులో మండలానికో పని చొప్పున 33 పనులు, జిల్లా పరిషత్ చైర్మన్, కలెక్టర్ తరపున అదనంగా మరో 7 పనులు తీసుకున్నారు. ఒక్కో పని దాదాపు రూ.కోటి వ్యయంతో ఉంది. మొత్తంగా జెడ్పీ ప్రణాళిక రూ.40 కోట్లతో తయారైంది. గురువారం జెడ్పీ సమావేశంలో ఈ ప్రణాళిక ఆమోదం పొందే అవకాశం ఉంది.