P. Mahender reddy
-
బస్సుచార్జీలు తెలంగాణలోనే తక్కువ
రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, మహా రాష్ట్రలతో పోలిస్తే తెలంగాణలోనే ఆర్టీసీ బస్సు చార్జీలు తక్కువని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత తమ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం పడకుండా 6.7 శాతమే బస్సు చార్జీలను పెంచిందన్నారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో కాంగ్రెస్ సభ్యులు టి.జీవన్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఆర్టీసీకి రోజూ రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు నష్టాలు వస్తుండటంతో సంస్థను కాపాడుకోవడానికి చార్జీలను పెంచాల్సి వచ్చిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్నెస్తో వేతనాలను పెంచారని మంత్రి గుర్తుచేశారు. గత ప్రభుత్వం 2010–13 మధ్య కాలంలో నాలుగుసార్లు బస్సు చార్జీలు పెంచిందన్నారు. పాత బస్సుల స్థానంలో రూ. 350 కోట్లతో కొత్తగా 1,400 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు. బస్సు సౌకర్యం లేని 1,300 గ్రామాలకు ఈ సర్వీసులను నడుపుతామని తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 2016–17లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 500 కోట్లు, జీహెచ్ఎంసీ రూ. 360 కోట్ల ఆర్థిక సాయం చేశాయన్నారు. సింగిల్ పర్మిట్‌పై అక్రమంగా తిరుగుతున్న బస్సులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, 2004–09 మధ్యకాలంలో చార్జీలు పెంచకుండానే ఆర్టీసీని లాభాలబాటలో నడిపించామని జీవన్‌రెడ్డి గుర్తుచేయగా ఆ కాలవ్యవధిలో ఆర్టీసీకి లాభాలేమీ రాలేదని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఇంటింటికీ మంచినీటి సరఫరా
శేరిలింగంపల్లి: ఇంటింటికీ మంచినీటి సరఫరాకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలను కార్పొరేటర్ తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి డివిజన్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌లతో కలిసి సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో నీటి సరఫరా లైన్లు, రిజర్వాయర్లకు సుమారు రూ.1900 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి డివిజన్ కార్యాలయాలు దోహదపడతాయన్నారు. ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు రూ.600 కోట్లతో చేపట్టిన మంజీర పైప్‌లైన్, రిజర్వాయర్ల పనులు మార్చినాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెలే గాంధీలను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, కార్పొరేటర్లు వి.జగదీశ్వర్‌గౌడ్, కొమిరిశెట్టి సారుుబాబా, బొబ్బ నవతారెడ్డి, మేక రమేష్, డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్, ఎస్ఈ మోహన్‌సింగ్, ఈఈ మోహన్‌రెడ్డి, నాయకులు మిరియాల రాఘవరావు, వీరేశంగౌడ్, బొల్లంపల్లి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.350 కోట్లతో 1400 కొత్త బస్సులు
⇒ మరో 236 మినీ బస్సులు ⇒ ప్రతి జిల్లా కేంద్రంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ⇒ రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పరిగి: రాష్ట్రంలో రవాణా శాఖను పటిష్టం చేస్తామని ఆ శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో గురువారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. త్వరలో రూ. 350 కోట్లతో 1,400 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. మరో 236 మినీ బస్సులు.. వీటిలో 100 ఏసీ బస్సులు కొనుగోలు చేసి డిపోలకు అందజేస్తామన్నారు. రూ. 17 కోట్లతో సిరిసిల్లలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రూ.30 కోట్లతో రాష్ట్రంలో ఆర్టీఏ సొంతభవనాలు నిర్మిస్తామని రవాణ శాఖ రాష్ట్ర కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో ట్రాక్‌లు ఉండేలా చూస్తామన్నారు. గతంలో ఎక్కువ శాతం ఆర్టీఏ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగగా ప్రస్తుతం ముమ్మరంగా కొత్త భవనాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. -
'బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయింపులు ఉంటాయి'
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయింపులు ఉంటాయని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి వెల్లడించారు. కొత్త ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేసే ప్రసక్తి లేదని చెప్పారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో రోడ్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఆన్లైన్ ద్వారా సేవలు విస్తరిస్తున్నామని చెప్పారు. రవాణా శాఖలో ఖాళీలను కూడా భర్తీ చేస్తామని తెలిపారు. వాహనదారులకు హెల్మెట్ నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. రవాణా శాఖ ఆదాయ లక్ష్యం రెండు వేల కోట్ల రూపాయల్లో 90 శాతం పూర్తి చేసినట్టు పి. మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. -
వచ్చే ఏడాది జాతీయ పండగగా మేడారం జాతర
వరంగల్ : వరంగల్ జిల్లా జరుగుతున్న మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం 4 వేల బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రావాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. భక్తుల తిరుగు ప్రయాణం కోసం మరో 1500 బస్సులు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీని బట్టి ఆర్టీసీ సేవలందిస్తుందన్నారు. మేడారం జాతరను వచ్చే ఏడాది నుంచి జాతీయ పండుగగా నిర్వహిస్తామని రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. రేపటి రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయా శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు ఈ మంత్రుల ముగ్గురు మేడారంలోని సమ్మక, సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. -
రూ.35 కోట్లతో గోదాముల నిర్మాణం
మొయినాబాద్ (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో రూ.35 కోట్లతో 16 గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మొయినాబాద్ మండలంలోని సర్దార్‌నగర్ మార్కెట్ యార్డు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన గోదాముకు ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతులు పండించిన పంటలను నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ధాన్యాన్ని నిల్వ ఉంచుకునేందుకు గోదాములు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయం కుంటుపడుతున్న ప్రస్తుత తరుణంలో చెరువులను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తుందని చెప్పారు. రాజకీయలకు అతీతంగా గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. -
ఆర్టీసీ విభజనపై నేడు ఢిల్లీకి మంత్రి
తాండూరు: ఆర్టీసీ విభజన కోసం ఢిల్లీకి వెళ్లనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి తాండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు చెప్పారు. ఆర్టీసీ విభజనను త్వరితగతిన చేపట్టాలని ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రితో చర్చించనున్నట్టు తెలిపారు. కార్మిక బీమా ఆసుపత్రి(ఈఎస్ఐ) ఏర్పాటుకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కలువనున్నట్టు పేర్కొన్నారు. జేఎన్ఎన్యూఆర్ఓ కింద తెలంగాణకు అదనపు ఏసీ బస్సుల కొనుగోలుకు నిధుల మంజూరు కోసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కోరనున్నట్టు వివరించారు. ఇది వరకు రూ.150కోట్లతో 500 బస్సులు వచ్చాయని, ఇందులో 400 పల్లె వెలుగు బస్సులు కాగా మిగిలిన 100 ఏసీ బస్సులు ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లాకు 30, కరీంనగర్ జిల్లాకు 70, మహబూబ్‌నగర్ జిల్లాకు 30 ఏసీ బస్సులను నడపనున్నట్టు చెప్పారు. తెలంగాణలోని మిగితా ఏడు జిల్లాల్లో కూడా ఏసీ బస్సులు నడపనున్నట్టు, ఈ విషయమై మంత్రి వెంకయ్యనాయుడిని కలువనున్నట్టు మంత్రి చెప్పారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, ముంబయి తదితర ముఖ్య నగరాలకు బస్సులను నడపనున్నట్టు చెప్పారు. వికారాబాద్, తాండూరులలో రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాల కోసం కేంద్ర రైల్వే మంత్రిని కోరనున్నట్టు తెలిపారు. కొత్త ఏడాదిలో ఆర్టీసి కార్మికులకు తెలంగాణ గ్రాంట్ అమల్లోకి వస్తుందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణీకుల భద్రత కోసం క్యాబిన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వానికి నష్టం వస్తున్నా మహిళల భద్రత దృష్ట్యా క్యాబిన్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. సీసీ కెమెరాలను కూడా అమర్చినట్టు తెలిపారు. ఏసీ బస్సుల్లో చార్జీలు తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ తక్కువగానే ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్ పాల్గొన్నారు. రోడ్లకు నిధుల మంజూరు బషీరాబాద్: వికారాబాద్ -తాండూరు నాలుగు లైన్ల రోడ్డుకు రూ. 40 కోట్లు మంజూరయ్యాయని రావాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన రెడ్డిగణపూర్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు ఔటర్ రోడ్డు పనుల కోసం రూ.78 కోట్లు మంజూరయ్యాయయన్నారు. తాండూరు నియోజక వర్గంలో ఆర్అండ్బీ రోడ్డు పనులకోసం రూ.188 కోట్లు మంజూరు కాగా అందులో పంచాయతి రాజ్ శాఖ రోడ్ల కోసం 38 కోట్లు మంజూరయ్యాయన్నారు. బ్రిడ్జి నిర్మాణాల కోసం రూ.39 కోట్లు మంజూరయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2లక్షల 14 వేల మందికి రూ.42 కోట్ల ఆసరా పింఛన్లను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అజయ్‌ప్రసాద్, వెంకట్రాంరెడ్డి శంకర్‌రెడ్డి, సుధకర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులున్నారు. -
రహదారుల అభివృద్ధికి పెద్దపీట
రవాణా శాఖా మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రవాణాశాఖా మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మునుపెన్నడూ లేనివిధంగా రహదారుల నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు విడుదల చేసిందని అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మహేందర్‌రెడ్డి మాట్లాడారు. జిల్లాలో ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి రూ.802.10 కోట్లను కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణం, నియోజకవర్గ కేంద్రం నుంచి మండలాలను కలుపుతూ రహదారులను నిర్మించేందుకు ఈ నిధులను వ్యయం చేయనున్నట్లు చెప్పారు. ఇక నుంచి గ్రామీణ, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధితో వాహనదారులు ఇక్కట్లు తప్పనున్నాయన్నారు. దీర్ఘకాలికంగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు కలిపే మార్గాలకు రూ.147 కోట్లు, సింగిల్ లేన్ రోడ్లను డబుల్‌లేన్‌గా మార్చేందుకు రూ.435 కోట్లు, 13 వంతెనల నిర్మాణానికి రూ.220 కోట్లు కేటాయించినట్లు మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ రోడ్ల విస్తరణతో సురక్షిత ప్రయాణానికి వీలు కలుగుతుందన్నారు. విలేకర్ల సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ ఉషారాణి పాల్గొన్నారు. -
గ్రంథాలయ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం
వికారాబాద్: జిల్లాలోని గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం 47వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాల్లో తగినంత మంది సిబ్బందిని సమకూరుస్తామన్నారు. గ్రంథాలయాల్లో తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. వికారాబాద్‌లోని జిల్లా గ్రంథాలయానికి నూతన భవనాన్ని మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడంతోపాటు సరైన వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రంథాలయాల్లో ఉద్యోగుల నియామకానికి సంబంధించిన ఫైలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వద్ద పెండింగ్‌లో ఉందని, వెంటనే అది ఆమోదం పొందేలా మహేందర్‌రెడ్డి చొరవచూపాలన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయాలను డిజిటల్ గ్రంథాలయాలుగా మార్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జెడ్పీటీసీ ముక్తర్‌షరీఫ్, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ భాగ్యలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ హాఫీజ్, కార్యదర్శి శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పశ్చిమానికి’ విస్త్తారమైన రోడ్లు
తాండూరు: పశ్చిమ రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రధాన రహదారులు విస్తరణకు నోచుకోనున్నాయి. పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా డబుల్ రోడ్లను నాలుగులైన్ల రోడ్లుగా, సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రోడ్లను వెడల్పు చేయడంతోపాటు పటిష్టం చేసేందుకు రాష్ట్ర సర్కారు దృష్టిసారించింది. ప్రధాన రోడ్లతోపాటు మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. వికారాబాద్ నుంచి తాండూరు వరకు ప్రధాన ప్రధాన రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని సర్కారు భావిస్తున్నది. ప్రస్తుతం వికారాబాద్ నుంచి తాండూరు వరకు 5.5 మీటర్ల వెడల్పుతో 39 కిలో మీటర్ల రోడ్డు ఉంది. ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువైంది. ఈక్రమంలో ఒకేసారి నాలుగు వాహనాలు వెళ్లేందుకు ఈ రోడ్డును 10 మీటర్ల వెడల్పు చేసి నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల క్రితం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించారు. ఈ రోడ్డు విస్తరణకు రూ.40కోట్లు అవసరమవుతాయని ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. తాండూరు నుంచి తొర్మామిడి(బంట్వారం మండలం)వరకు 23 కిలో మీటర్లు, లక్ష్మీనారాయణపూర్ నుంచి యాలాల మండల కేంద్రం వరకు ఉన్న 7కి.మీ.ల సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చాలని కూడా అధికారులు యోచిస్తున్నారు. ఈ రెండు రోడ్ల విస్తరణకు రూ. 35 కోట్లు అవసరమవుతాయని ఆర్అండ్బీ అధికా రులు ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో పేర్కొన్నారు. అలాగే మొయినాబాద్ నుంచి మన్నెగుడ వరకు కూడా ఉన్న సుమారు 34 కి.మీ.డబుల్ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చేందుకు అధికారులు ప్రభుత్వానికి రూ.వంద కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి తాండూరు ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. సీఎం ఆమోద ముద్రపడగానే నిధులు మంజూరు అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్డు విస్తరణకు నోచుకుంటే ఈ రహదారిపై ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. -
రవాణా వ్యవస్థకు కొత్త మెరుగులు
మంత్రి మహేందర్‌రెడ్డి మంచాల:రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుట్లలో విలేకర్లతో మాట్లాడుతూ రవాణా వ్యవస్థలో నూతన పద్ధతులు తీసుకువచ్చి అభివృద్ధి పరుస్తామన్నారు. తెలంగాణలో 1300 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, ఆ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. రూ.150 కోట్లతో 500 బస్సులను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి బస్టాండ్‌లో తాగు నీటి వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తామని తెలపారు. హైదరాబాద్ నుండి తె లంగాణలోఅన్ని జిల్లాలకు ప్రత్యేకంగా ఏసీ బస్సులను ఏర్పాటు చే స్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేస్తామని తెలిపారు. కేజీ నుండి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తామని వివరించారు. విద్యరంగం అభివృద్ధికి రూ. 50కోట్లతో రాష్ట్రంలో 142 పాఠశాలల భవనాలు నిర్మిస్తామని తెలిపారు. గ్రామాల్లో చెరువుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తామన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కృష్ణా జలాలను సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు భూపతి గళ్ల మహిపాల్, ఎంపీపీ జయమ్మ, వైస్ ఎంపీపీ దన్నె భాషయ్య, మంచాల సహాకార సంఘం చైర్మన్ సికిందర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు,ఎంపీటీసీ సభ్యులు,మండల కోఆ ప్షన్ సభ్యుడు సలాం, ఎంపీడీఓ నాగమణి, తహసీల్దార్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇవే అభివృద్ధి కార్యక్రమాలు.... మంత్రి మహేందర్‌రెడ్డి శనివారం వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. మంచాలలో రూ.7.4 లక్షలతో నిర్మించిన బాలుర పాఠశాల భవ నాలు, దాద్‌పల్లిలో రూ.4.20 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే మంచాలలో రూ.11లక్షలతో చేపట్టిన బాలికల ఉన్నత పాఠశాల భవనాలు, కోటి70లక్షల రూపాయలతో రోడ్డు వెడల్పు పనులు, ఆరుట్లలో రూ.84లక్షలతో ఆరుట్ల -బండలేమూర్ రోడ్డు పనులు, రూ.7.4 లక్షలతో బాలుర పాఠశాల భవన నిర్మాణం పనులు, రూ.42లక్షలతో బాలికల ఉన్నత పాఠశాల భవనాల పనులను ఆయన ప్రారంభించారు. ఇంకా రంగాపూర్‌లో రూ.7.5 లక్షలతో గోపాల మిత్ర కార్యాలయం, రూ.5లక్షలతో అంగన్ వాడీ కేంద్రం నిర్మాణం పనులు, దాద్‌పల్లిలో రూ.7.44 లక్షలతో నీటి సరఫరా ట్యాంకు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. అర్హత సర్వేపై ఆందోళన వద్దు యాచారం: సంక్షేమ పథకాల అర్హత సర్వేతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులెన పేదలకు రేషన్‌కార్డులు, పింఛన్లు తప్పకుండా అందుతాయని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన రూ. కోటికి పైగా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గడ్డమల్లయ్యగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భవిష్యత్తులో నీటి ఎద్దడి తల్లెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి వనరులపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. ప్రతి గ్రామంలో చెరువులు నిర్మించడానికి, పాత చెరువులు, కుంటలు మరమ్మతుకు ఎన్ని రూ. కోట్ల నిధులైన ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. త్వరలో మరో 75 శాతం నగదును కూడ బ్యాంకుల్లో జమ చేస్తామని తెలిపారు. అర్హులైన పేదలకు రూ. 3.50 లక్షల నిధులతో ఇంటిని నిర్మించడానికి సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో 500 జనాభా దాటి న గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మారుస్తున్నట్లు తెలిపారు. తాం డూరు, పరిగి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కొత్త గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటవుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
భద్రతకు మాది భరోసా
నగర పోలీస్ కమిషనర్ పి.మహేందర్‌రెడ్డి ఘనంగా పోలీసుల ఓపెన్ హౌస్ ఆకట్టుకున్న మాక్‌డ్రిల్ రసూల్‌పురా: ప్రజలకు భద్రత కల్పించడం, వారు సమాజంలో శాంతియుత వాతావరణంలో జీవించేలా చూడడం పోలీసుల బాధ్యత అని నగర పోలీస్ కమిషనర్ పి.మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా సోమవారం సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో నగర పోలీసు విభాగం అధ్వర్యంలో ఓపెన్‌హౌస్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతేడాది సెప్టెంబర్ నుండి ఇప్పటివరకు 673 మంది పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాసారని చెప్పారు. సమాజంలో పోలీసులు ఎంతో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. పండుగలు, పర్వదినాల్లో ప్రజలు ఇంటి వద్ద ఉండి సంతోషంగా గుడుపుతారని...పోలీసులు మాత్రం వారి భద్రత కోసం వీధుల్లో...స్టేషన్లలో విధులు నిర్వహిస్తారన్నారు. ప్రజలు కూడా పోలీసులతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. అత్యవసర సమయాల్లో 100 నంబర్‌కు డయల్ చేస్తేపది నిమిషాల్లో పోలీస్ పెట్రోలింగ్ అందుబాటులో ఉంటుందని అన్నారు. డీఐజీ (క్రైమ్స్) స్వాతి లక్రా, ట్రాఫిక్ ఐజీ జితేంద్ర ఇతర పోలీస్ విభాగం అధికారులు ఈసందర్భంగా ప్రసంగించారు. అదనపు డీజీ అంజనీకుమార్, డీఐజీ మల్లారెడ్డి, ఐజీ సంజయ్‌జైన్, డీఐజీ శివప్రసాద్, వివిధ జోన్ల డీసీపీలు, ఏసీపీలు సీఐ,ఎస్సైలు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఓపెన్‌హౌస్‌లో పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శన...మాక్‌డ్రిల్ పోలీస్ వ్యవస్థ అంటే ఏమిటి, విధి నిర్వహణ ఎలా చేస్తారు, ఎలాంటి అయుధాలు ఉపయోగిస్తారు అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఓపెన్‌హౌస్, మాక్‌డ్రిల్ ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖలోని పలు విభాగాలు ఈ ప్రదర్శనలో పాలుపంచుకున్నాయి. పోలీసులు ఉపయోగించే రైఫిల్, పిస్టల్, ఎకే 47, లైట్ మిషన్‌గన్, క్లూస్ టీం ఉపయోగించే వివిధ వస్తువులు, బాంబ్‌స్క్వాడ్ తదితర స్టాల్స్‌ను విద్యార్థులు ఆసక్తిగా తిలకించి, పోలీస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక నగరంలో ఉద్రిక్తతలు, ఆందోళనల సమయంలో పోలీసు విభాగం ఎలా వ్యవరిస్తుందో మాక్‌డ్రిల్ ద్వారా ప్రదర్శించారు. -
‘ప్రణాళిక’ పైనే దృష్టి
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ పాలకవర్గం ఏర్పాటైన అనంతరం గురువారం తొలిసారిగా సర్వసభ్య సమావేశం జరగబోతోంది. చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి మంత్రి పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరు కానున్నారు. దాదాపు వీరందరికీ ఇదే ప్రథమ సమావేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయాలని భావిస్తూ ప్రత్యేక ప్రణాళికలకు కార్యరూపం ఇస్తోంది. ఇందులో భాగంగా గ్రామ, మండల స్థాయి ప్రణాళికలు రూపొం దించిన యంత్రాంగం.. తాజాగా జిల్లా స్థాయి ప్రణాళికను తయారు చేసింది. గురువారం జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఈ ప్రణాళికకు ఆమోదం తెలుపనున్నారు. రూ.1372 కోట్లతో ప్రణాళిక ప్రభుత్వం చేపట్టిన మన ఊరు- మన ప్రణాళికలో భాగంగా ప్పటివరకు రూపొందించిన గ్రామ ప్రణాళికలను క్రోడీకరిస్తూ మండలస్థాయి ప్రణాళికలను తయారు చేశారు. వీటి ఆధారంగా తాజాగా జిల్లాస్థాయిలో ప్రణాళికను తయారు చేశారు. రూ.1372 కోట్లతో రూపొందించిన ఈ ప్రణాళికలో జిల్లాలోని 33 మండలాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో గ్రామస్థాయిలో అత్యంత ప్రాధాన్యమైన మూడు పనులు, అదేవిధంగా మండల స్థాయిలో ప్రాధాన్యమైన 10 పనులను పేర్కొంటూ ఈ ప్రణాళికను తయారు చేశారు. రూ.40 కోట్లతో జెడ్పీ ప్రణాళిక గ్రామ, మండల స్థాయిలో తయారు చేసిన ప్రణాళిక నమూనాలో జిల్లా పరిషత్ కూడా ప్రాధాన్యత పనులు పేర్కొంటూ ప్రణాళిక రూపొందిం చింది. ఇందులో మండలానికో పని చొప్పున 33 పనులు, జిల్లా పరిషత్ చైర్మన్, కలెక్టర్ తరపున అదనంగా మరో 7 పనులు తీసుకున్నారు. ఒక్కో పని దాదాపు రూ.కోటి వ్యయంతో ఉంది. మొత్తంగా జెడ్పీ ప్రణాళిక రూ.40 కోట్లతో తయారైంది. గురువారం జెడ్పీ సమావేశంలో ఈ ప్రణాళిక ఆమోదం పొందే అవకాశం ఉంది. -
జీఓ111 నుంచి విముక్తికి చర్యలు
శంషాబాద్ రూరల్: జీఓ 111 నుంచి బాధిత గ్రామాల ప్రజలకు విముక్తి కల్పించడానికి చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం మండలంలోని పెద్దషాపూర్లో సర్పంచ్ సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ‘మన ఊరు-మన ప్రణాళిక’ గ్రామసభలో మంత్రి మాట్లాడారు. సభలో స్థానిక నాయకులు లేవనెత్తిన పలు సమస్యలపై ఆయన స్పందించారు. జీఓ 111 అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో రోడ్డు ఉన్న ప్రతీ గ్రామానికి బస్సు సౌకర్యం క ల్పిస్తామన్నారు. అసంపూర్తి బస్సు డిపోల పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. పేదవారికి పింఛన్ల పెంపు తప్పకుండా అమలు చేస్తామన్నారు. 500 జనాభా గల తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్ని జిల్లాల్లో కంపెనీలు, ఫ్యాక్టరీలు ఏర్పాటైతేనే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా అభివృద్ధికి మార్గం సుగమమవుతుందన్నారు. జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు, హైటెక్ సిటీ ఉన్నప్పటికీ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఇందుకోసం ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఆరు నెలల్లో కృష్ణా జలాల సరఫరాకు కృషి శంషాబాద్ పట్టణ వాసులకు ఆరు నెలలలోపు తాగునీటి సరఫరాకు చర్యలు చేపడతామన్నారు. మండలానికి కృష్ణా జలాలు సరఫరా చేయడానికి కావాల్సిన నిధుల కోసం కృషి చేస్తామన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాహకులతో చర్చించి ఈ ప్రాంతంలోని గ్రామాలకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. శంషాబాద్‌లో బస్టాండ్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. పెద్దషాపూర్లో సెప్టిక్ ట్యాంకు, పంచాయతీ భవనం, గ్రంథాలయం ఏర్పాటుతో పాటు బుర్జుగడ్డతండాకు బస్సు సర్వీసుల పెంపు కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. తక్కువ నిధులతోనే హిమాయత్ సాగర్ నుంచి శంషాబాద్‌కు తాగునీరు సరఫరా చేయడానికి అవకాశం ఉందన్నారు. ఈ దిశగా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కె.శ్రవణ్‌కుమార్ గౌడ్, ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, ఎంపీటీసీ సభ్యురాలు టి.ఇంద్రమ్మ, సొసైటీ డెరైక్టరు కె.నర్సింహ, వార్డు సభ్యులు రాము నాయక్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ డెరైక్టరు జి.కృష్ణయ్య గౌడ్, నాయకులు గాదె రాజశేఖర్, టి.రమేష్, మహేందర్‌రెడ్డి, కె.చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హామీలన్నీ నెరవేరుస్తాం
అత్తాపూర్ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక కళ్యాణ మండపంలో మంత్రిని పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకులు ఘనంగా సన్మానించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని మరో సింగపూర్ చేస్తాడో.. లేదో తెలియదు కానీ.. టీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ ప్రాంతాన్ని అంతకన్నా అభివృద్ధి చేస్తుందని మంత్రి తెలిపారు. రైతుల రుణమాఫీతో పాటు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తామని, ఏ రైతుకూ అన్యాయం జరుగకుండా చూస్తామన్నారు. కరెంట్ సమస్యను పరిష్కరిస్తామని, ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ్ర పతి కార్యకర్త పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలన్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 50 కార్పొరేటర్లను జిల్లాలో గెలిచే దిశగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. తనను ఇంతగా ఆదరించిన జిల్లా ప్రజలను ఎన్నటికీ మరిచిపోనన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, పురుషోత్తం, టి. అరుణ, నాయకులు ఎ. స్వర్ణలతా భీమార్జున్‌రెడ్డి, పోరెడ్డి ధర్మారెడ్డి, దామోదర్‌రెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, సత్యం, వేణుగోపాల్‌రెడ్డి, మహేష్, పరమేశ్, రేణుక, నరోత్తంరెడ్డి, అన్ని మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. పీవీ జయంత్యుత్సవంలో.. హైదర్‌గూడ చౌరస్తాలో నియోజకవర్గ పార్టీ నాయకుడు రావుల విశ్వనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పీవీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. -
ఇక టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్
హైదరాబాద్: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఇకపై తెలంగాణ స్టేట్ (TS) పేరుతో ఆరంభమైనట్లు రవాణాశాఖ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం వాహనాల రిజిస్ట్రేషన్ల అంశానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని భావించిన ప్రభుత్వం.. తర్వాత టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తాజాగా ప్రభుత్వం టీఎస్ పేరుతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభమైంది. అంతకుముందు ఏపీ పేరుపై ఉన్న పాత వాహనాల నంబర్‌ప్లేట్ మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం 4 నెలల గడువును ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని వివిధ జిల్లాలకు వాహనాల రిజిస్ట్రేషన్ల కోడ్ల వివరాలు.. ఆదిలాబాద్ TS - 01, కరీంనగర్ - 02 వరంగల్ - 03, ఖమ్మం - 04, నల్లగొండ - 05 మహబూబ్‌నగర్ - 06, రంగారెడ్డి - 07, 08 హైదరాబాద్ - 09, 10, 11, 12, 13, 14 మెదక్ - 15, నిజామాబాద్ -16 ఆర్టీసీ వెహికల్స్‌కు TS Z, పోలీసు వాహనాలకు TS P 09 రవాణా వాహనాలకు... T,U,VW,X,Y సిరీస్‌లు వాడుతూ రిజిస్ట్రేషన్ -
టీఎస్ తోనే వాహనాల రిజిస్టేషన్లు!
-
టీజీ కాదు.. టీఎస్ తోనే వాహనాల రిజిస్టేషన్లు!
హైదరాబాద్: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఇకపై తెలంగాణ స్టేట్ (TS) పేరుపై జరుగుతాయని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. టీజీ పేరుతో కాకుండా టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని మహేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, తెలంగాణలో ఏపీ పేరుపై ఉన్న పాత వాహనాల నంబర్‌ప్లేట్ మార్చడానికి 4 నెలల గడువు ఇస్తున్నట్టు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. మార్పు సమయంలో ప్రజలపై భారం పడకుండా చూస్తామని, తెలంగాణలో 70 లక్షలకు పైగా వాహనాలున్నాయని ఓ ప్రశ్నకు మహేందర్ రెడ్డి సమాధానమిచ్చారు. -
రుణమాఫీపై అనుమానాలొద్దు
తాండూరు, న్యూస్‌లైన్ : రుణాల మాఫీ విషయంలో రైతులు అనుమానపడాల్సిన అవసరం లేదని, ఆందోళన చెందరాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆదివారం ఆయన తాండూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్ రూ.లక్ష లోపు రుణాలను కచ్చితంగా మాఫీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. రుణాల మాఫీ విషయంలో ప్రతిపక్షాలు రైతులను అయోమయానికి గురి చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నాయని విమర్శించారు. రుణాల మాఫీ విషయంమై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్లతో ప్రభుత్వం చర్చించిందన్నారు. సీఎం కేసీఆర్ మాట తప్పరని, రైతులకు తప్పకుండా న్యాయం చేస్తారని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా మారుస్తామని, పింఛన్ మొత్తాన్ని రూ.1500కి పెంచుతామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని, ప్రమాదాలకు బాధ్యులైన వారు ఎంత పెద్దవారైనా సరే కఠినచర్యలు తప్పవనీ, అధికారులను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. షాపింగ్ కాంప్లెక్స్‌లు... తెలంగాణలోని పది జిల్లాల్లో ఆర్టీసీ డిపోలు శంకుస్థాపనలు జరిగి కొన్ని, సగంలోనే మరికొన్ని ఆగిపోయాయని మంత్రి చెప్పారు. వీటి నిర్మాణాలు పూర్తిచేస్తే తెలంగాణలో 50 ఆర్టీసీ డిపోలు అందుబాటులోకి వస్తాయన్నారు. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలు తక్కువగా ఉన్నాయని, అయినా బస్సు చార్జీలను పెంచే ఆలోచన లేదని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం కన్నా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఆదాయం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ సంస్థ నష్టాల్లో ఉందన్నారు. ఆదాయ వనరులను పెంపొందించుకోవడానికి పది జిల్లాల్లో ఆర్టీసి బస్టాండ్లు, డిపోల పరిధిలోని ఖాళీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. రహదారులను మెరుగుపరిచి తెలంగాణలోని 1200 గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. మరింత పారదర్శకం... రవాణా శాఖ కార్యక్రమాలన్నీ మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. తాండూరులో ఆర్టీఏ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలల బస్సుల తనిఖీలు, 16వ తేదీ నుంచి పెండింగ్ పైళ్ల క్లియరెన్స్‌తోపాటు ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల 1వతేదీన ఫేస్ టు ఫేస్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మంత్రి వివరించారు. రెండు జిల్లాల్లో తెలంగాణవారికే పోస్టింగ్‌లు రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్రకు చెందిన మూడు వేల మంది ఉపాధ్యాయులు, అలాగే 80శాతం మంది పోలీసు ఉద్యోగాల్లో నియుక్తులైనందున తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే ఈ రెండు జిల్లాలోని సీమాంధ్ర ఉపాధ్యాయులు, పోలీసులను నిబంధనల ప్రకారం వారి ప్రాంతానికి పంపిస్తామని, వారి స్థానంలో తెలంగాణ ప్రాంతం వారికి పోస్టింగ్ ఇస్తామని.. ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవులు మావే.. తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల చైర్పర్సన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తాండూరులో మద్దతు కోసం ఎంఐఎం పార్టీతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఇక్కడ చైర్పర్సన్ పదవి కోసం ఐదుగురు పోటీలో ఉన్నా అందరితో చర్చించి ఏకాభిప్రాయానికి వస్తామన్నారు. ఎన్నికల తేదీ ఖరారు కాగానే చైర్పర్సన్ల ఎంపిక వ్యవహారాన్ని కొలిక్కి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకుడు కరణం పురుషోత్తంరావు పాల్గొన్నారు. -
ఎంఐఎంతో టీఆర్ఎస్ మంతనాలు
తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు చైర్పర్సన్ సీటును దక్కించుకోవడానికి టీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. చైర్పర్సన్ పదవికి కావాల్సిన 16 కౌన్సిలర్లకుగాను టీఆర్ఎస్కు పదిమంది కౌన్సిలర్లే ఉన్నారు. ఈ క్రమంలో ఎంఐఎం మద్దతు కూడగట్టుకొని చైర్పర్సన్ పదవిని దక్కించుకోవడానికి టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పది కౌన్సిలర్లను గెలుచుకున్న ఎంఐఎం నాయకులతో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు మంతనాలు జరుపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి ఎంఐఎం పెద్దలతో మద్దతు కోసం చర్చలు కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంలకు సమానంగా పది మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఈ రెండు పార్టీలు రెండున్నరేళ్లు చైర్పర్సన్ పదవిని పంచుకుంటాయా.. లేదా..? ఒక్క పార్టే పూర్తి స్థాయిలో ఐదేళ్లు చైర్పర్సన్ పదవిలో కొనసాగుతుందా? అన్నది తేలాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో ఎంఐఎంతో మద్దతు విషయమై టీఆర్ఎస్ చర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఈ వారంలోనే నిర్వహించేందుకు ఒక వైపు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నిక తేదీ ఖరారయ్యే లోపు చర్చలను ముగించి చైర్పర్సన్ వ్యవహారాన్ని క్లియర్ చేయాలని మంత్రి మహేందర్‌రెడ్డి యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎంఐఎం మద్దతు కూడగట్టుకునేందుకు మంత్రి ఒక వైపు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు చైర్పర్సన్ రేసులో ఉన్న అభ్యర్థుల మధ్య సమన్వయం కుదిర్చేందుకూ పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్లో కౌన్సిలర్లు కోట్రిక విజయలక్ష్మి, నర్కుల సింధూజ, నీరజ, శోభారాణి, పరిమళ, బిడ్కరి ఉషలు పోటీ పడుతున్నారు. రేసులో ఉన్న కౌన్సిలర్లందరూ తమ సామాజిక వర్గాల నేపథ్యంతోపాటు పార్టీలో సీనియారిటీ తదితర అంశాలను మంత్రికి వివరించి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో కొంత సంకట పరిస్థితి నెలకోవడంతో ఆయన ఆచితూచి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రేసులో ఉన్న కౌన్సిలర్లలో చైర్‌పర్సన్‌గా ఎవరికి అవకాశం ఇస్తే వ్యతిరేకత రాదోననే అంశాలపై పార్టీ శ్రేణులతోపాటు సన్నిహితుల ద్వారా ఆరా తీసున్నట్టు తెలుస్తోంది. ఆరు మందిలో ఒక్కరికే చైర్‌పర్సన్‌గా అవకాశం వస్తుంది. ఈ క్రమంలో మిగతా ఐదుమంది కౌన్సిలర్లు, వారి కుటుంబాలతో వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తమ్మీద రెండు మూడు రోజుల్లో చైర్పర్సన్ ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. -
ముగ్గురు మంత్రుల బాధ్యతల స్వీకారం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా మమమూద్ అలీ బాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని డి-బ్లాక్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. పాతబస్తీ అన్నిరంగాల్లో వెనుకబడి ఉందని, తొలుత విద్యారంగాన్ని విస్తరింపజేసి ఈ ప్రాంతానికి తగిన గుర్తింపు తీసుకరావాల్సి ఉందని మహమూద్ అలీ అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతీఒక్కరికీ గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో రెవెన్యూ, పునరావాసం, యూఎల్సీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా మహమూద్ అలీ ఉన్నారు. నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా తన్నీరు హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టారు. రవాణా శాఖ పి. మహేందర్ రెడ్డి కూడా నేడు బాధ్యతలు చేపట్టారు. -
కేసీఆర్ పోరాట పటిమ ఎనలేనిది
అనంతగిరి, న్యూస్‌లైన్: తెలంగాణ సాధనలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేశారని తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంతగిరి గుట్ట శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో మంగళవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సీతారామచార్యులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న ఉసిరిచెట్టుకు, గతంలో కట్టిన ముడుపునకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ను తెలంగాణలోని 10 జిల్లాల ప్రజలు ఆశీర్వదించి పట్టం కట్టారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ప్రజలు స్పష్టమైన మెజార్టీని ఇచ్చారన్నారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు పాటుపడ తానన్నారు. తాండూరులో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొత్త రాష్ట్రంలో చేవేళ్ల , వికారాబాద్, తాండూరులకు పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయన వెంట నాయకులు అమిత్శెట్టి, సురేందర్‌రెడ్డి, సాయన్నగౌడ్లున్నారు. -
సీఎం కార్యదర్శిపై టీడీపీ ఎమ్మెల్యే వీరంగం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీధర్‌పై టీడీపీ ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ విరుచుకుపడ్డారు. వారిద్దరూ గట్టిగా అరుచుకోవడంతో అక్కడే ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. బుధవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్ సమీపంలోనే ఈ సంఘటన జరిగింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. మహేందర్‌రెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజీ ఫైలుపై శ్రీధర్ వ్యతిరేక నోట్ పొందుపరిచారు. దీంతో అది పెండింగ్‌లో పడింది. దీనిపై మాట్లాడేందుకు మహేందర్‌రెడ్డి అక్కడికి వచ్చారు. శ్రీధర్ వద్దకు వెళ్లి ఫైల్‌పై వ్యతిరేకంగా ఎందుకు రాశారని ఆవేశంగా ప్రశ్నించారు. అక్కడున్న పరిస్థితిపై తనకు అందిన నివే దికలను అనుసరించి అలా రాశానని శ్రీధర్ చెప్పారు. అలా ఎందుకు రాస్తావు.. ఇలా రాయాలి కదా అంటూ మహేందర్ ఒక నోట్‌ను ఆయనకు చూపించారు. మీరు చెప్పినట్లు రాయడానికి తాను ఇక్కడ లేనని, తనకు జీతం ఇస్తున్నది ప్రభుత్వం తప్ప మీరు కాద ని, కావాలంటే సీఎంకు ఫిర్యాదు చేసుకోవచ్చని శ్రీధర్ స్పష్టంచేశారు. కోపం పట్టలేని మహేందర్ తీవ్రపదాలతో శ్రీధర్‌పై విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటుండంతో అక్కడే ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు జవహర్‌రెడ్డి, రావత్‌లు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. మహేందర్ తీవ్రంగా హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనను శ్రీధర్, ఇతర అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మహేందర్‌రెడ్డి తీరుపై ఐఏఎస్ అధికారుల సంఘానికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. విధుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులకు ఆటంకం కలిగించిన, దాడులకు తెగబడిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను మళ్లీ పోటీ కి వీల్లేకుండా అనర్హులుగా ప్రకటించే అవకాశమున్నందున మహేందర్‌పై ఆ విధమైన చర్యలు తీసుకొనేలా ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తెలిపారు.