తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు చైర్‌పర్సన్ సీటును దక్కించుకోవడానికి టీఆర్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. చైర్‌పర్సన్ పదవికి కావాల్సిన 16 కౌన్సిలర్లకుగాను టీఆర్‌ఎస్‌కు పదిమంది కౌన్సిలర్లే ఉన్నారు. ఈ క్రమంలో ఎంఐఎం మద్దతు కూడగట్టుకొని చైర్‌పర్సన్ పదవిని దక్కించుకోవడానికి టీఆర్‌ఎస్ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పది కౌన్సిలర్లను గెలుచుకున్న ఎంఐఎం నాయకులతో టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు మంతనాలు జరుపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి ఎంఐఎం పెద్దలతో మద్దతు కోసం చర్చలు కొనసాగిస్తున్నారు.
టీఆర్‌ఎస్, ఎంఐఎంలకు సమానంగా పది మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఈ రెండు పార్టీలు రెండున్నరేళ్లు చైర్‌పర్సన్ పదవిని పంచుకుంటాయా.. లేదా..? ఒక్క పార్టే పూర్తి స్థాయిలో ఐదేళ్లు చైర్‌పర్సన్ పదవిలో కొనసాగుతుందా? అన్నది తేలాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో ఎంఐఎంతో మద్దతు విషయమై టీఆర్‌ఎస్ చర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఈ వారంలోనే నిర్వహించేందుకు ఒక వైపు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నిక తేదీ ఖరారయ్యే లోపు చర్చలను ముగించి చైర్‌పర్సన్ వ్యవహారాన్ని క్లియర్ చేయాలని మంత్రి మహేందర్‌రెడ్డి యోచిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఎంఐఎం మద్దతు కూడగట్టుకునేందుకు మంత్రి ఒక వైపు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు చైర్‌పర్సన్ రేసులో ఉన్న అభ్యర్థుల మధ్య సమన్వయం కుదిర్చేందుకూ పావులు కదుపుతున్నారు. టీఆర్‌ఎస్‌లో కౌన్సిలర్లు కోట్రిక విజయలక్ష్మి, నర్కుల సింధూజ, నీరజ, శోభారాణి, పరిమళ, బిడ్కరి ఉషలు పోటీ పడుతున్నారు.
రేసులో ఉన్న కౌన్సిలర్లందరూ తమ సామాజిక వర్గాల నేపథ్యంతోపాటు పార్టీలో సీనియారిటీ తదితర అంశాలను మంత్రికి వివరించి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో కొంత సంకట పరిస్థితి నెలకోవడంతో ఆయన ఆచితూచి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రేసులో ఉన్న కౌన్సిలర్లలో చైర్‌పర్సన్‌గా ఎవరికి అవకాశం ఇస్తే వ్యతిరేకత రాదోననే అంశాలపై పార్టీ శ్రేణులతోపాటు సన్నిహితుల ద్వారా ఆరా తీసున్నట్టు తెలుస్తోంది.
ఆరు మందిలో ఒక్కరికే చైర్‌పర్సన్‌గా అవకాశం వస్తుంది. ఈ క్రమంలో మిగతా ఐదుమంది కౌన్సిలర్లు, వారి కుటుంబాలతో వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తమ్మీద రెండు మూడు రోజుల్లో చైర్‌పర్సన్ ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఎంఐఎంతో టీఆర్‌ఎస్ మంతనాలు
Published Sun, Jun 8 2014 11:26 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement