బస్సుచార్జీలు తెలంగాణలోనే తక్కువ
రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, మహా రాష్ట్రలతో పోలిస్తే తెలంగాణలోనే ఆర్టీసీ బస్సు చార్జీలు తక్కువని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత తమ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం పడకుండా 6.7 శాతమే బస్సు చార్జీలను పెంచిందన్నారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో కాంగ్రెస్ సభ్యులు టి.జీవన్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఆర్టీసీకి రోజూ రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు నష్టాలు వస్తుండటంతో సంస్థను కాపాడుకోవడానికి చార్జీలను పెంచాల్సి వచ్చిందన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్‌నెస్‌తో వేతనాలను పెంచారని మంత్రి గుర్తుచేశారు. గత ప్రభుత్వం 2010–13 మధ్య కాలంలో నాలుగుసార్లు బస్సు చార్జీలు పెంచిందన్నారు. పాత బస్సుల స్థానంలో రూ. 350 కోట్లతో కొత్తగా 1,400 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు. బస్సు సౌకర్యం లేని 1,300 గ్రామాలకు ఈ సర్వీసులను నడుపుతామని తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 2016–17లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 500 కోట్లు, జీహెచ్‌ఎంసీ రూ. 360 కోట్ల ఆర్థిక సాయం చేశాయన్నారు. సింగిల్ పర్మిట్‌పై అక్రమంగా తిరుగుతున్న బస్సులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, 2004–09 మధ్యకాలంలో చార్జీలు పెంచకుండానే ఆర్టీసీని లాభాలబాటలో నడిపించామని జీవన్‌రెడ్డి గుర్తుచేయగా ఆ కాలవ్యవధిలో ఆర్టీసీకి లాభాలేమీ రాలేదని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.