RTC bus fares
-
ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు యోచన
యశవంతపుర: ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచే యోచనలో ఉన్నట్లు వాయువ్య కేఎస్ ఆర్టీసీ అధ్యక్షుడు రాజు కాగె తెలిపారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన తరువాత బస్సు టికెట్ చార్జీలను పెంచడంపై ప్రభుత్వం యోచిస్తోందని రాజు కాగె చెప్పారు. నారీ శక్తి యోజనలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌలభ్యం కల్పించటం వల్ల సంస్థ నష్టాల్లో ఉందని చెప్పడం గమనార్హం. డీజిల్‌తో పాటు బస్సుల విడిభాగాల ధరలు, సంస్థ నిర్వహణ ఖర్చు పెరగడం వల్ల చార్జీలను పెంచాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గత 10 ఏళ్లు నుంచి బస్సు చార్జీలను పెంచలేదన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం భారంగా ఉన్నా కూడా సంస్థను నడుపుకొంటూ వెళుతున్నట్లు చెప్పారు. సంస్థకు చెందిన ఆస్తులను అమ్మడంతో పాటు పాత భవనాలను నవీకరణ చేసి బాడుగలకు ఇస్తామన్నారు. -
బస్సుచార్జీలు తెలంగాణలోనే తక్కువ
రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, మహా రాష్ట్రలతో పోలిస్తే తెలంగాణలోనే ఆర్టీసీ బస్సు చార్జీలు తక్కువని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత తమ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం పడకుండా 6.7 శాతమే బస్సు చార్జీలను పెంచిందన్నారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో కాంగ్రెస్ సభ్యులు టి.జీవన్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఆర్టీసీకి రోజూ రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు నష్టాలు వస్తుండటంతో సంస్థను కాపాడుకోవడానికి చార్జీలను పెంచాల్సి వచ్చిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్నెస్తో వేతనాలను పెంచారని మంత్రి గుర్తుచేశారు. గత ప్రభుత్వం 2010–13 మధ్య కాలంలో నాలుగుసార్లు బస్సు చార్జీలు పెంచిందన్నారు. పాత బస్సుల స్థానంలో రూ. 350 కోట్లతో కొత్తగా 1,400 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు. బస్సు సౌకర్యం లేని 1,300 గ్రామాలకు ఈ సర్వీసులను నడుపుతామని తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 2016–17లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 500 కోట్లు, జీహెచ్ఎంసీ రూ. 360 కోట్ల ఆర్థిక సాయం చేశాయన్నారు. సింగిల్ పర్మిట్‌పై అక్రమంగా తిరుగుతున్న బస్సులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, 2004–09 మధ్యకాలంలో చార్జీలు పెంచకుండానే ఆర్టీసీని లాభాలబాటలో నడిపించామని జీవన్‌రెడ్డి గుర్తుచేయగా ఆ కాలవ్యవధిలో ఆర్టీసీకి లాభాలేమీ రాలేదని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. -
వార్.. ఫైర్
♦ ‘మల్లన్న’ సాక్షిగా ఆందోళనలు ♦ అనుకూల, ప్రతికూల నిరసనల హోరు ♦ చార్జీల వడ్డనపై కస్సుబుస్సు ♦ ‘పునర్విభజన’లోనూ వెల్లువెత్తుతున్న వ్యతిరేకత ♦ మళ్లీ అట్టుడుకుతున్న మెతుకుసీమ చైతన్యస్ఫూర్తికి నిదర్శనం మెతుకుసీమ బిడ్డలు.. తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్లాడిన మెతుకుసీమలో మళ్లీ ఆందోళనలు పుంజుకున్నాయి. మల్లన్నసాగర్‌పై ప్రతికూల వార్ .. అనుకూల ఫైర్ నడుస్తోంది. విద్యుత్, బస్సుచార్జీల వడ్డనే అవకాశంగా ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. జిల్లాల పునర్విభజనలో తమ ఉనికిని పదిలపరుచుకునే క్రమంలో జనం గళం ఎత్తుతున్నారు. తెలంగాణ సిద్ధించిన రెండేళ్ల విరామం తరువాత మళ్లీ తిరగబడ్డ మెతుకుసీమ పోరుబాటపై సాక్షి ప్రత్యేక కథనం.. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘తెలంగాణ వచ్చుడో...కేసీఆర్ సచ్చుడో’ లాంటి మాటల తూటాలు నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళితే.. వీరులారా మీకు వందనమంటూ.. విప్లవ బీజాలు నాటి తెలంగాణ సాధించి పెట్టిన ఉద్యమ దివిటి కేసీఆర్ మెతుకుసీమ ముద్దుబిడ్డే. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన తరువాత మెదక్ గడ్డ ఓ యుద్ధ శిబిరంలా మారింది. కవులు, కళాకారులు, ముసలోళ్లు.. పోరగాళ్లు.. మహిళలు, పురుషులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అన్న తేడాలేకుండా గొంతులన్నీ ఏకమై పోరుబాట పట్టాయి. ప్రతి ఊరిలోనూ తెలంగాణ నినాదమే. ఏ చేతిలోనూ తెలంగాణ జెండాయే కదలాడింది. కళాకారుల పాట లు.. పల్లెల్లో ప్రతిధ్వనించాయి. ధూంధాంలు దుమ్మురేపాయి. ఊరు ఏరై...ఉద్యమ పోరై...పోటెత్తింది. ఆ మధ్యకాలంలో చల్లబడ్డ ఉద్యమాన్ని లక్ష్మినగర్‌లో రగిలిన జాగోబాగో నినాదం మళ్లీ వేడెక్కించింది. ఆత్మబలిదానాలకు సైతం వెనకడుగు వేయలేదు మెతుకుబి డ్డ. పోరుబాటలో అసువులు బాసి.. నింగిలోని సుక్క లై.. నేటి తెలంగాణకు వెలుగులై దారిచూపుతున్నారు. మల్లన్న సాగర్‌పై ప్రతికూలం.. అనుకూలం మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూసేకరణ అంశం మరో ఉద్యమానికి ఊపిరి పోసింది. బువ్వపెట్టిన భూమిని వదులుకోలేక, ఉన్న ఊరిని వదిలి వెళ్లలేక కడుపు మండిన కొంతమంది అన్నదాతలు ఆందోళనబాట పట్టారు. అయితే మరికొంతమంది మాత్రం త్యాగం లేనిదే అభివృద్ధి ఎలా సాధ్యమంటూ రిజర్వాయర్ అనుకూలంగా ఉద్యమిస్తున్నారు. ఈ రెండు వర్గాల ఆందోళనల మధ్య రాజకీయ జోక్యం పెరగటంతో కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూసేకరణ అంశం వివాదాస్పదంగా మారుతోంది. అందివచ్చిన అవకాశాన్ని ప్రతిపక్షాలు ఆసరాగా చేసుకొని తమ అస్త్రంగా మార్చుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే పలుమార్లు ముంపు గ్రామాల్లో పర్యటించారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మరో వైపు జేఏసీ చైర్మన్ కోదండరాం మల్లన్నసాగర్ ముంపు బాధితుల పక్షాన నిలబడుతామని, అవసరమైన జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని తీసుకవెళ్లేందుకు మేథాపాట్కార్ లాంటి ఉద్యమకారులను తీసుకువస్తామని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఎం బీజేపీలు కూడా ముంపు బాధితులకు అండగా నిలబడ్డాయి. మరో వైపు మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు అనుకూలంగా రైతు ఉద్యమాలు నడుస్తున్నాయి. సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టును పూర్తి చేసి రైతు ఆత్మహత్యలను ఆపాలని మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రైతులు అనుకూలంగా ఆందోళనలు చేశారు. అధికారులకు వినతి పత్రాలు అందించారు. విద్యుత్, బస్సుచార్జీల పెంపుపై భగ్గు విద్యుత్, బస్సుచార్జీలు పెంపుపై నిర్ణయం వెలువడిన నేపధ్యంలో ప్రజలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై భగ్గుమంటున్నాయి. పెంచిన బస్సు ఛార్జీలతో ప్రతి రోజూ ప్రయాణికుల మీద రూ. 6 లక్షల మేరకు భారం పడుతోంది. విద్యుత్తు చార్జీల పెంపుతో మొత్తం రూ. 15 కోట్ల భారం పడుతుంది. చార్జీల పెంపుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్న నేపధ్యంలో ప్రతిపక్షాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్శ్రేణులు జిల్లా అంతటా ఆందోళనలు, రాస్తారోకోలు చేపట్టాయి. ఆయా మండలకేంద్రాల్లో తహశీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించారు. విద్యుత్, బస్సుచార్జీల పెంచడంతో సామాన్యులపై భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ ఉద్యమ బాట పడుతున్నారు. జిల్లాల పునర్విభనలోనూ నర్సాపూర్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. నర్సాపూర్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని అక్కడి ప్రజలు రెండు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఆందోల్ నియోజకవర్గాన్ని మెదక్ జిల్లాలో కలపొద్దని, తమకు సంగారెడ్డి జిల్లానే సౌకర్యం వంతంగా ఉంటుందని ఆందోల్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రెండు బైక్ ర్యాలీలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నారాయణఖేడ్‌పై ఇంకా సందిగ్ధత వీడలేదు. తాము సంగారెడ్డి జిల్లాలోనే ఉంటామని అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. -
చార్జీలపై భగ్గు
♦ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ♦ పెంచిన చార్జీలు తగ్గించే వరకు ఉద్యమిస్తాం ♦ డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి హెచ్చరిక ♦ విద్యుత్, బస్సు చార్జీల పెంపుపై రాస్తారోకో నర్సాపూర్: పెంచిన విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించకపోతే ఉద్యమించి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి హెచ్చరించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్ బస్టాండ్ వద్ద చేపట్టిన రాస్తారోకోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ ధనిక రాష్ర్టమని చెప్పుకుంటూనే చార్జీలు పెంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బస్సు, విద్యుత్ చార్జీలు పెంచిన సర్కార్ సామాన్యులపై పెను భారాన్ని మోపిందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయినా రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క మెగావాట్ విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయలేకపోయిందని మండిపడ్డారు. పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రోడ్డుపై కందిలి, కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనలో పాల్గొన్న సునీతారెడ్డితోపాటు మిగతా నాయకులను పోలీసులు అరెస్టు చేసి వదిలిపెట్టారు. -
బస్సు చార్జీలకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు మినహా మిగతా అన్ని రకాల బస్సు టికెట్ ధరలను 10 శాతం పెంచారు. పేదలు ఎక్కువగా ఆధారపడే పల్లె వెలుగులో మాత్రం పెంపును 5 శాతానికి పరిమితం చేశారు. ఈ కొత్త ధరలు సోమవారం ఉదయం సర్వీసు నుంచి అమలులోకి వస్తాయి. టికెట్ ధరల పెరుగుదలతో ప్రయాణికులపై ఏటా రూ.286 కోట్ల భారం పడనుంది. టికెట్ ధరల పెంపునకు బుధవారమే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. గురువారం ఆర్టీసీ కొత్త ధరలను ప్రకటించింది. సచివాలయంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావుతో కలిసి రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి విలేకరులకు చార్జీల వివరాలు వెల్లడించారు. పల్లెవెలుగులో 30 కిలోమీటర్ల వరకు ఒక రూపాయి చొప్పున, 30 కి.మీ. దాటితే రూ.2 చొప్పున ధరలు పెరగనున్నాయి. ఎక్స్‌ప్రెస్‌లో కి.మీ.కు 8 పైసలు, డీలక్స్‌లో 9 పైసలు, సూపర్‌లగ్జరీలో 11 పైసలు, ఇంద్రలో 14 పైసలు, గరుడలో 16 పైసలు, గరుడ ప్లస్‌లో 17 పైసలు పెరిగాయి. సిటీ బస్సు చార్జీలూ పెరిగాయి.. హైదరాబాద్ సిటీ బస్సు టికెట్ల ధరలు కూడా 10 శాతానికి పెంచారు. సిటీ ఆర్డినరీ కనిష్ట టికెట్ ధరను రూ.6 నుంచి రూ.7కు, మెట్రో ఎక్స్‌ప్రెస్ ధర రూ.7 నుంచి రూ.8కి, మెట్రో డీలక్స్ ధర రూ.8 నుంచి రూ.9కి పెంచారు. స్టాపుల వారీగా కొత్త ధరలను శుక్రవారం ప్రకటించనున్నారు. ఇదే దామాషా ప్రకారం బస్ పాస్ ధరలు కూడా పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం స్టేజీ క్యారేజీ వాహనాలపై 6 శాతం సర్వీస్ ట్యాక్స్ విధించటంతో ఆర్టీసీ ఇటీవలే ఏసీ బస్సు టికెట్ ధరలను 6 శాతం మేర పెంచింది. అది అమల్లోకి వచ్చి రెండు వారాలు గడవకముందే మళ్లీ ఏసీ బస్సు టికెట్ ధరలు పెరిగాయి. ఆర్టీసీకి రోజుకు రూ.2 కోట్ల నష్టం.. గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి రూ.701 కోట్ల భారీ నష్టాలు వాటిల్లాయి. ఆర్టీసీ ఆవిర్భవించిన ఎనిమిది దశాబ్దాల్లో ఇదే రికార్డు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెలలో రూ.10.65 కోట్లు, మే నెలలో రూ.32.20 కోట్లు నష్టా లు వచ్చాయి. ప్రస్తుతం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్టీసీ రూ.2,275 కోట్ల అప్పు పడింది. ప్రతిరోజు బస్సుల నిర్వహణతో రూ.9కోట్ల ఆదా యం సమకూరుతుండగా.. ఖర్చుల పద్దులో రూ.11 కోట్లు చేరుతున్నాయి. అంటే రోజుకు నికర నష్టం రూ.2 కోట్లు. గత సంవత్సరం నిర్వహణ నష్టమే (ఆపరేషనల్ లాస్) రూ.257 కోట్లుగా తేలింది. ఎప్పుడెప్పుడు ఎంత పెంచారు? చివరిసారిగా 2013 నవంబర్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం బస్సు చార్జీలను పెంచింది. తెలంగాణ వచ్చిన తర్వాత చార్జీలు పెంచటం ఇదే తొలిసారి. వైఎస్ సీఎంగా ఉన్నంతకాలం బస్సు చార్జీలు పెంచలేదు. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఆర్టీసీ ఆదాయం పెంచుకోవటంపై వైఎస్ సర్కారు దృష్టి సారించింది. ఆయన మృతి చెందిన తర్వాత రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు వరుసగా నాలుగేళ్లపాటు చార్జీలు పెంచాయి. తప్పని స్థితిలోనే పెంచాం ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండటంతో తప్పని పరిస్థితిలోనే టికెట్ ధరలు పెంచాం. ప్రజలపై పెద్దగా భారం మోపద్దన్న ఉద్దేశంతో కేవలం 10 శాతానికే పెంపును పరిమితం చేశాం. ఈ రూపంలో ఆర్టీసీకి పెరిగే ఆదాయం కేవలం రూ.286 కోట్లే. కర్ణాటక, మహారాష్ట్రలాంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికీ తెలంగాణ ఆర్టీసీ చార్జీలే తక్కువగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రం ఏపీలో గత సంవత్సరమే చార్జీలు పెంచినా మనం ఆచితూచి వ్యవహరించాం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తేవాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే నష్టాలను అధిగమిస్తామన్న నమ్మకం ఉంది. పేదలు ఆధారపడే పల్లెవెలుగులో నామమాత్రంగా ధరలు పెంచాం. - మహేందర్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి