చార్జీలపై భగ్గు
♦ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
♦ పెంచిన చార్జీలు తగ్గించే వరకు ఉద్యమిస్తాం
♦ డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి హెచ్చరిక
♦ విద్యుత్, బస్సు చార్జీల పెంపుపై రాస్తారోకో
నర్సాపూర్: పెంచిన విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించకపోతే ఉద్యమించి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి హెచ్చరించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్ బస్టాండ్ వద్ద చేపట్టిన రాస్తారోకోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ ధనిక రాష్ర్టమని చెప్పుకుంటూనే చార్జీలు పెంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
బస్సు, విద్యుత్ చార్జీలు పెంచిన సర్కార్ సామాన్యులపై పెను భారాన్ని మోపిందని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయినా రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క మెగావాట్ విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయలేకపోయిందని మండిపడ్డారు. పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రోడ్డుపై కందిలి, కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనలో పాల్గొన్న సునీతారెడ్డితోపాటు మిగతా నాయకులను పోలీసులు అరెస్టు చేసి వదిలిపెట్టారు.