బస్సు చార్జీలకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు మినహా మిగతా అన్ని రకాల బస్సు టికెట్ ధరలను 10 శాతం పెంచారు. పేదలు ఎక్కువగా ఆధారపడే పల్లె వెలుగులో మాత్రం పెంపును 5 శాతానికి పరిమితం చేశారు. ఈ కొత్త ధరలు సోమవారం ఉదయం సర్వీసు నుంచి అమలులోకి వస్తాయి. టికెట్ ధరల పెరుగుదలతో ప్రయాణికులపై ఏటా రూ.286 కోట్ల భారం పడనుంది. టికెట్ ధరల పెంపునకు బుధవారమే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.
గురువారం ఆర్టీసీ కొత్త ధరలను ప్రకటించింది. సచివాలయంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావుతో కలిసి రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి విలేకరులకు చార్జీల వివరాలు వెల్లడించారు. పల్లెవెలుగులో 30 కిలోమీటర్ల వరకు ఒక రూపాయి చొప్పున, 30 కి.మీ. దాటితే రూ.2 చొప్పున ధరలు పెరగనున్నాయి. ఎక్స్‌ప్రెస్‌లో కి.మీ.కు 8 పైసలు, డీలక్స్‌లో 9 పైసలు, సూపర్‌లగ్జరీలో 11 పైసలు, ఇంద్రలో 14 పైసలు, గరుడలో 16 పైసలు, గరుడ ప్లస్‌లో 17 పైసలు పెరిగాయి.
సిటీ బస్సు చార్జీలూ పెరిగాయి..
హైదరాబాద్ సిటీ బస్సు టికెట్ల ధరలు కూడా 10 శాతానికి పెంచారు. సిటీ ఆర్డినరీ కనిష్ట టికెట్ ధరను రూ.6 నుంచి రూ.7కు, మెట్రో ఎక్స్‌ప్రెస్ ధర రూ.7 నుంచి రూ.8కి, మెట్రో డీలక్స్ ధర రూ.8 నుంచి రూ.9కి పెంచారు. స్టాపుల వారీగా కొత్త ధరలను శుక్రవారం ప్రకటించనున్నారు. ఇదే దామాషా ప్రకారం బస్ పాస్ ధరలు కూడా పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం స్టేజీ క్యారేజీ వాహనాలపై 6 శాతం సర్వీస్ ట్యాక్స్ విధించటంతో ఆర్టీసీ ఇటీవలే ఏసీ బస్సు టికెట్ ధరలను 6 శాతం మేర పెంచింది. అది అమల్లోకి వచ్చి రెండు వారాలు గడవకముందే మళ్లీ ఏసీ బస్సు టికెట్ ధరలు పెరిగాయి.
ఆర్టీసీకి రోజుకు రూ.2 కోట్ల నష్టం..
గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి రూ.701 కోట్ల భారీ నష్టాలు వాటిల్లాయి. ఆర్టీసీ ఆవిర్భవించిన ఎనిమిది దశాబ్దాల్లో ఇదే రికార్డు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెలలో రూ.10.65 కోట్లు, మే నెలలో రూ.32.20 కోట్లు నష్టా లు వచ్చాయి. ప్రస్తుతం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్టీసీ రూ.2,275 కోట్ల అప్పు పడింది.
ప్రతిరోజు బస్సుల నిర్వహణతో రూ.9కోట్ల ఆదా యం సమకూరుతుండగా.. ఖర్చుల పద్దులో రూ.11 కోట్లు చేరుతున్నాయి. అంటే రోజుకు నికర నష్టం రూ.2 కోట్లు. గత సంవత్సరం నిర్వహణ నష్టమే (ఆపరేషనల్ లాస్) రూ.257 కోట్లుగా తేలింది.
ఎప్పుడెప్పుడు ఎంత పెంచారు?
చివరిసారిగా 2013 నవంబర్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం బస్సు చార్జీలను పెంచింది. తెలంగాణ వచ్చిన తర్వాత చార్జీలు పెంచటం ఇదే తొలిసారి. వైఎస్ సీఎంగా ఉన్నంతకాలం బస్సు చార్జీలు పెంచలేదు. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఆర్టీసీ ఆదాయం పెంచుకోవటంపై వైఎస్ సర్కారు దృష్టి సారించింది. ఆయన మృతి చెందిన తర్వాత రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు వరుసగా నాలుగేళ్లపాటు చార్జీలు పెంచాయి.
తప్పని స్థితిలోనే పెంచాం
ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండటంతో తప్పని పరిస్థితిలోనే టికెట్ ధరలు పెంచాం. ప్రజలపై పెద్దగా భారం మోపద్దన్న ఉద్దేశంతో కేవలం 10 శాతానికే పెంపును పరిమితం చేశాం. ఈ రూపంలో ఆర్టీసీకి పెరిగే ఆదాయం కేవలం రూ.286 కోట్లే. కర్ణాటక, మహారాష్ట్రలాంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికీ తెలంగాణ ఆర్టీసీ చార్జీలే తక్కువగా ఉన్నాయి.
పొరుగు రాష్ట్రం ఏపీలో గత సంవత్సరమే చార్జీలు పెంచినా మనం ఆచితూచి వ్యవహరించాం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తేవాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే నష్టాలను అధిగమిస్తామన్న నమ్మకం ఉంది. పేదలు ఆధారపడే పల్లెవెలుగులో నామమాత్రంగా ధరలు పెంచాం.
- మహేందర్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి