తెలంగాణ సాధనలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేశారని తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి అన్నారు.
అనంతగిరి, న్యూస్‌లైన్: తెలంగాణ సాధనలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేశారని తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంతగిరి గుట్ట శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో మంగళవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సీతారామచార్యులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న ఉసిరిచెట్టుకు, గతంలో కట్టిన ముడుపునకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ను తెలంగాణలోని 10 జిల్లాల ప్రజలు ఆశీర్వదించి పట్టం కట్టారన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ప్రజలు స్పష్టమైన మెజార్టీని ఇచ్చారన్నారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు పాటుపడ తానన్నారు. తాండూరులో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొత్త రాష్ట్రంలో చేవేళ్ల , వికారాబాద్, తాండూరులకు పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయన వెంట నాయకులు అమిత్‌శెట్టి, సురేందర్‌రెడ్డి, సాయన్నగౌడ్‌లున్నారు.