గ్రంథాలయ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం
వికారాబాద్: జిల్లాలోని గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం 47వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాల్లో తగినంత మంది సిబ్బందిని సమకూరుస్తామన్నారు.
గ్రంథాలయాల్లో తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. వికారాబాద్‌లోని జిల్లా గ్రంథాలయానికి నూతన భవనాన్ని మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడంతోపాటు సరైన వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రంథాలయాల్లో ఉద్యోగుల నియామకానికి సంబంధించిన ఫైలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వద్ద పెండింగ్‌లో ఉందని, వెంటనే అది ఆమోదం పొందేలా మహేందర్‌రెడ్డి చొరవచూపాలన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయాలను డిజిటల్ గ్రంథాలయాలుగా మార్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జెడ్పీటీసీ ముక్తర్‌షరీఫ్, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ భాగ్యలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ హాఫీజ్, కార్యదర్శి శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.