రుణమాఫీపై అనుమానాలొద్దు
తాండూరు, న్యూస్‌లైన్ : రుణాల మాఫీ విషయంలో రైతులు అనుమానపడాల్సిన అవసరం లేదని, ఆందోళన చెందరాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆదివారం ఆయన తాండూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్ రూ.లక్ష లోపు రుణాలను కచ్చితంగా మాఫీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. రుణాల మాఫీ విషయంలో ప్రతిపక్షాలు రైతులను అయోమయానికి గురి చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నాయని విమర్శించారు. రుణాల మాఫీ విషయంమై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్లతో ప్రభుత్వం చర్చించిందన్నారు. సీఎం కేసీఆర్ మాట తప్పరని, రైతులకు తప్పకుండా న్యాయం చేస్తారని అన్నారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా మారుస్తామని, పింఛన్ మొత్తాన్ని రూ.1500కి పెంచుతామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని, ప్రమాదాలకు బాధ్యులైన వారు ఎంత పెద్దవారైనా సరే కఠినచర్యలు తప్పవనీ, అధికారులను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
షాపింగ్ కాంప్లెక్స్‌లు...
తెలంగాణలోని పది జిల్లాల్లో ఆర్టీసీ డిపోలు శంకుస్థాపనలు జరిగి కొన్ని, సగంలోనే మరికొన్ని ఆగిపోయాయని మంత్రి చెప్పారు. వీటి నిర్మాణాలు పూర్తిచేస్తే తెలంగాణలో 50 ఆర్టీసీ డిపోలు అందుబాటులోకి వస్తాయన్నారు. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలు తక్కువగా ఉన్నాయని, అయినా బస్సు చార్జీలను పెంచే ఆలోచన లేదని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం కన్నా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఆదాయం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ సంస్థ నష్టాల్లో ఉందన్నారు. ఆదాయ వనరులను పెంపొందించుకోవడానికి పది జిల్లాల్లో ఆర్టీసి బస్టాండ్లు, డిపోల పరిధిలోని ఖాళీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. రహదారులను మెరుగుపరిచి తెలంగాణలోని 1200 గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నట్టు చెప్పారు.
మరింత పారదర్శకం...
రవాణా శాఖ కార్యక్రమాలన్నీ మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. తాండూరులో ఆర్టీఏ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలల బస్సుల తనిఖీలు, 16వ తేదీ నుంచి పెండింగ్ పైళ్ల క్లియరెన్స్‌తోపాటు ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల 1వతేదీన ఫేస్ టు ఫేస్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మంత్రి వివరించారు.
రెండు జిల్లాల్లో తెలంగాణవారికే పోస్టింగ్‌లు
రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్రకు చెందిన మూడు వేల మంది ఉపాధ్యాయులు, అలాగే 80శాతం మంది పోలీసు ఉద్యోగాల్లో నియుక్తులైనందున తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే ఈ రెండు జిల్లాలోని సీమాంధ్ర ఉపాధ్యాయులు, పోలీసులను నిబంధనల ప్రకారం వారి ప్రాంతానికి పంపిస్తామని, వారి స్థానంలో తెలంగాణ ప్రాంతం వారికి పోస్టింగ్ ఇస్తామని.. ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులు మావే..
తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల చైర్‌పర్సన్ పదవులను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తాండూరులో మద్దతు కోసం ఎంఐఎం పార్టీతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఇక్కడ చైర్‌పర్సన్ పదవి కోసం ఐదుగురు పోటీలో ఉన్నా అందరితో చర్చించి ఏకాభిప్రాయానికి వస్తామన్నారు. ఎన్నికల తేదీ ఖరారు కాగానే చైర్‌పర్సన్ల ఎంపిక వ్యవహారాన్ని కొలిక్కి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకుడు కరణం పురుషోత్తంరావు పాల్గొన్నారు.